వీహెచ్‌పీ జాతీయ సంయుక్త సహ కార్యదర్శి స్థానములై
దేశంలో కొనసాగుతున్న మతమార్పిడులను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ సంయుక్త సహ కార్యదర్శి స్థానములై అన్నారు. మతం మారిన వారు వెంటనే రిజర్వేషన్లు వదులుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వారి రిజర్వేషన్లు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చట్టానికి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా మతమార్పిడులను అడ్డుకొని హిందుత్వాన్ని కాపాడుకుంటామని అన్నారు. వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జూన్ 2,3వ తేదీలలో గుజరాత్ సేవా మండలి (సికింద్రాబాద్) భవనంలో జరిగాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశాలలో భాగంగా ఈ సమావే శాలు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం రాష్ట్ర పదాధి కారుల సమావేశం నిర్వహించారు. మతమార్పిడి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్రామ గ్రామం తిరిగి మత మార్పిడి విషయంపై చైతన్యం తీసుకువస్తామన్నారు. ప్రతి గ్రామంలో బజరంగ్ దళ్.. సురక్ష.. దుర్గా వాహిని.. గోరక్ష.. మఠ మందిర్.. గ్రామ వికాస్ కమిటీలు ఉంటాయని చెప్పారు. ప్రలోభాల కారణంగా ధర్మం వీడిన వారిని తిరిగి ఘర్‌వాపసి పేరుతో స్వధర్మంలోకి తీసుకు వస్తున్నామన్నారు. సమావేశంలో వీహెచ్‌పీ జాతీయ కార్యకారిణి సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి, సహకార్య దర్శులు రాజేశ్వర్ రెడ్డి, భానుప్రకాష్, శశిధర్, ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్ రెడ్డి, డా।। రాంసింగ్, భాస్కరరావు, జగదీశ్వర్, లక్ష్మీశేఖర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ దళ్ ప్రాంత కన్వీనర్ శివరాములు, దుర్గా వాహిని ప్రముఖ్ వాణి సక్కుబాయి, సుభాష్ చందర్, కుమార స్వామి, వాసు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
హిందువుల సహనాన్ని పరీక్షించకండి
గోహత్యల విషయంలో ప్రభుత్వం హిందువుల సహనాన్ని పరీక్షిస్తోందనీ, హిందువులు సహనం కోల్పోతే గోద్రా ఘటనలు పునరావృతం అవుతాయని వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీరన్నగారి సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. గోవును తల్లిగా పూజించే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం గోహత్యలు అరికట్టడంలో విఫలమవు తోందని ఆరోపించారు. వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందు పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోహత్య చట్టం కఠినంగా అమలు చేయాల్సింది పోయి, గోహంతకులకు సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ముక్కోటి దేవతలకు నిలయమైన ఆవును తాము ఆరాధ్య దైవంగా భావిస్తామని.. తమ మనోభావాలను గౌరవిస్తూ ముస్లింలు కూడా గోహత్యను మానివేయాలని సూచించారు. ‘‘గంగా జమున తహసీబ్’’ అనే నినాదం పేరుకు మాత్రమే ఉందని, దాని అమలుకు ముస్లింలు ముందుకు రావడం లేదన్నారు.
వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్నారు. రాజస్థాన్లో జరిగిన కన్నయ్యాలాల్ హత్య కేసులో కూడా హైదరాబాద్ నగరానికి లింకు ఉందని ఎన్‌ఐఏ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు నిజామాబాద్ కేంద్రంగా హిందువులను హతమార్చేందుకు పిఎఫ్‌ఐ పేరుతో ఖాదర్ అనే వ్యక్తి ముస్లిం యువతకు శిక్షణ ఇస్తున్న విషయం రాష్ట్ర పోలీసులకు సవాల్ చేస్తోందన్నారు.
వీహెచ్‌పీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పల్లె పల్లెకు విశ్వహిందూ పరిషత్ విస్తరిస్తోందన్నారు. ప్రతి గ్రామంలో బజరంగదళ్, దుర్గావాహిని కమిటీలు ఏర్పాటు చేసి మతమార్పిడులు అడ్డుకుంటామని, గోహత్యలను నిలువరిస్తామని చెప్పారు. బజరంగదళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం గోవును హత్య చేస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
– పగుడాకుల బాలస్వామి