వైఎస్‌ఆర్‌సీపీ రెండురోజులపాటు నిర్వహించిన ప్లీనరీలో ఏ మాత్రమూ ఆత్మపరిశీలన లేదు. అధికార పార్టీ ప్లీనరీ అనగానే రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి పలు ప్రకటనలు చేస్తారని అంతా ఆశించారు. కాని ప్లీనరీ మొత్తం ఆత్మస్తుతి, పరనిందలా సాగింది.
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడంలో వైసీపీ ప్లీనరీ వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు 95 శాతం అమలు జరిపామన్న ముఖ్యమంత్రి.. ఈ కాలంలో పడిన అదనపు భారాలు, వాగ్దాన భంగం గురించి మాట్లాడకపోవడం దారుణం. ప్రజల ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తా రేమో అని ఎదురుచూస్తే నిరాశే మిగిలింది. 2019 నాటి వాగ్దానాల గురించి మాట్లాడిన సీఎం 2022 నాటి సమస్యలను గుర్తించలేదు. గ్యాస్, విద్యుత్, పెట్రోలు ధరలు, చెత్త, ఆస్తిపన్నుల పెంపుతో ప్రజలపై ఆర్థిక భారాలు మోపారు. ఆ భారాలు ఎలా తగ్గించా లనే అంశంపై చర్చ జరగలేదు సరికదా కనీసం ప్రస్తావించలేదు. సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులు, మున్సిపల్ కార్మికుల వేతనాలు, ఆరోగ్యశ్రీ, స్థానిక సంస్థల హక్కులు, నిధులు, భూపంపిణీ వంటి సమస్య లకు పరిష్కారం చూపలేదు. రైతుల సమస్యలను ప్రస్తావించలేదు. వారికి తొలగించిన సబ్సిడీల గురించి ఒక్కరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో నిరు ద్యోగం తీవ్రంగా ఉంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై, రాబోతున్న నోటిఫికేషన్లపై ప్రకటన లేదు. యువత ముంబయి, బెంగళూరు, పుణె, చెన్నై వైపు ఉపాధి కోసం వెళుతున్నారు. మహిళల భద్రత, రక్షణపై ఎవరికీ నోరు రాలేదు. అభివృద్ధి మాట ఎత్తలేదు. పోలవరం పూర్తిచేయడంపై హామీ ఇవ్వలేదు.. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు గుర్తించకుండా మిషన్ 2024, టార్గెట్ 175 అంటూ ఎన్నికల నగారా మోగించడం ఎంతవరకు సబబు? ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకపోతే వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. వైసీపీ ప్లీనరీని చూసి.. ఇతరుల్ని తిట్టుడం కోసం సభలు జరపడం, కోట్లాది రూపాయలు వెచ్చించి జనాన్ని సమీకరిం చడం అవసరమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధి వైకాపా డిక్షనరీలోనే లేదు
అభివృద్ధి అనే పదం వైకాపా డిక్షనరీలోనే లేదు. ఈ మూడేళ్లుగా ఒక్క అభివృద్ధి పని ప్రారంభించలేదు. గతంలో ప్రారంభించినవి పూర్తిచేయలేదు. ఏ ప్రభుత్వ మైనా ప్రతి ఏడాది కొత్త రోడ్లు వేస్తుంది. ఈ ప్రభుత్వం కొత్త రోడ్లు వేయలేదు సరికదా ధ్వంసమైన రోడ్లకు కనీసం మరమ్మతులు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లకు బిల్లులు చెల్లించక పోవడంతో కొత్త రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వంతెనలు, బ్రిడ్జిలు నిర్మించలేదు. నిర్మాణంలో ఉన్నవి ఆగిపోయాయి. కొత్త రైల్వే లైన్లు వేస్తామని కేంద్రం ముందుకు వచ్చినా తన వాటా ఇచ్చేందుకు రాష్ట్రం ముందుకు రాకపోవ డంతో రాష్ట్రంలో రైల్వేల ప్రాజెక్టులు ముందుకు నడవడం లేదు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నిధులు సుమారు రూ. 600 కోట్ల పైన రాష్టప్రభుత్వం బకాయి ఉండటంతో విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాల్లో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన ప్రాజెక్టులు కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద స్థానిక సంస్థలకు మంజూరుచేసిన నిధుల్లోనూ ప్రభుత్వం కోత పెట్టింది. విశాఖ, విజయవాడ నగరాల్లో సబ్ ప్లాన్ కింద చేపట్టిన సుమారు రూ.140 కోట్ల విలువ గల పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఆ భారాన్ని ఈ సంస్థలే భరించాలని జీవో జారీ చేసింది. విజయవాడ నగరానికి ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల కింద మంజూరు చేసిన రూ.140 కోట్లను కూడా నేటికీ విడుదల చేయలేదు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి రూ.7 వేల కోట్లు ఖర్చుచేసి భూ సేకరణ చేశారు. అందులో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉన్న రేటుకు రెండు రెట్లు అదనంగా వాటిని అమ్మేలా చేసి యజమానులతో కలసి అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కనీసం ప్రభుత్వంలో స్పందన లేదు. తాము ఇచ్చిన స్థలం విలువ రూ.2 లక్షలుగా ముఖ్యమంత్రి ప్లీనరీలో పేర్కొన్నారు. అంటే 30 లక్షల ఇళ్లకు 60 వేల కోట్ల విలువైన భూములిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రకంగా ఆలోచించినా 60 వేల కోట్లలో సగం, అంటే 30 వేల కోట్లు అవినీతి జరిగి నట్లుగానే భావించాలి. ఇక ఇచ్చిన ఇళ్లు కూడా ఊరికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటికి ఎలాంటి మౌలిక సదుపాయాలు నిర్మించకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1.80 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుం దని చెప్పి అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. ఇళ్ల స్థలాలిచ్చి ఏడాది గడచినా ఇంతవరకు ఒక్క ఇంటిని నిర్మించలేదు. అంతెందుకు పులివెందులకు 18,700 పక్కా గృహాలిస్తే 700 కూడా పూర్తి చేయ లేని దుస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యం కూడా ఈ ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కేంద్రం ఆదేశించినా ఉలుకూ పలుకూ లేదు. సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లి నివాసం చుట్టూ శత్రుదేశ సరిహద్దుల్లో పెట్టినట్లు ఇనుప బారికేడ్లు పెట్టుకోవడం ముఖ్యమంత్రి దుస్థితికి నిదర్శనం.
స్థానిక సంస్థల నిర్వీర్యం
73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ లకు దఖలుపడిన 29, పట్టణ సంస్థలకు వచ్చిన 18 అధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిగా బదలీచేయలేదు. ఉన్న అధికారాలను స్వేచ్ఛగా వినియోగించు కోనీయడం లేదు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు ఎక్కువ భాగం కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ నిధుల మీద ఆధారపడి ప్రజలకు సేవలందిస్తున్నాయి. పారి శుద్ధ్యం, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ వంటివన్నీ కేంద్ర, రాష్ట్ర నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నిధులు బదలీ చేయకపోగా, పన్ను, పన్నేతర ఆదాయాలనూ రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంటోంది. పారిశుద్ధ్య నిర్వహణ నిర్వీర్యమైపోయింది. స్థానిక అభివృద్ధి పూర్తిగా కుంటు పడిపోయింది. పారిశుద్ధ్యంపై అత్యవసరంగా చేయా ల్సిన ఖర్చులు చేయకపోవడంతో అనేక పట్టణాలు, నగరాల్లో ప్రజలు డయేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు.
నిధుల దారి మళ్లింపు
పంచాయతీలకు కేంద్రం నిధులిస్తే దారి మళ్లిం చిన వైకాపా గ్రామ స్వరాజ్యం గురించి ప్లీనరీలో మాట్లాడటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన నిధులు చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. మూడేళ్లలో 14, 15వ ఆర్థిక సంఘాల నుంచి గ్రామ పంచాయతీలకు విడుదలైన రూ.7,659 కోట్లను దారిమళ్లించి ప్రభుత్వం విని యోగించుకుంది. పంచాయతీ సంస్థల అకౌంట్లలో జమైన రూ. 1,350 కోట్లనూ ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్ బకాయిల పేర డిస్కమ్ అకౌంట్లకు బదలీ చేసింది. సీఎస్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) స్థానిక సంస్థలకు శరాఘాతంగా మారింది. ఆర్థిక స్వేచ్ఛను, స్వతంత్రతను హరించి వేస్తోంది. పన్ను, పన్నేతర ఆదాయాలైన ఆస్తి పన్ను, బిల్డింగ్ ప్లాన్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ప్రొఫెషనల్ టాక్స్, స్టాంపు డ్యూటీ ఆదాయాలను నేరుగా సీఎస్ ఎంఎస్ ఖాతాలోకి జమ చేసుకుంటూ, తిరిగి ఆ సొమ్మును స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదలీ చేయడం లేదు. ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా వినియోగించుకుంటోంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. స్థానిక సంస్థల అధికారాలను, సార్వ భౌమత్వాన్ని దెబ్బతీయడమే. రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తన పరిధిలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా చేయడం లేదు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కొళాయి కనెక్షన్లు ఇస్తే రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. బాలింతలకు కేంద్రం ఇచ్చిన మాతృవందన్ నిధులు ఇవ్వడం లేదు. అన్నింటా విఫలమైన వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన పత్రికలు, మీడియాపై ప్లీనరీలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత మీడియాపై ఉందని, వాటి ప్రాథమిక లక్ష్యం అదేనన్న అంశాన్ని ముఖ్యమంత్రి గ్రహించలేకపోతున్నారు. మీడియా మొత్తాన్ని తాము చెప్పినట్లే నడుచుకోమనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది.
ఉద్యోగుల పట్ల అణచివేత ధోరణి
ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సాచివేత ధోరణి అనుసరిస్తోంది. ఎన్నికల ముందు సీపీఎస్ తొలగించి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. కాని మూడేళ్లయినా హామీని నెరవేర్చలేదు. ఉద్యోగులు చేసిన ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయులపై కేసులు పెట్టి నిర్బంధించారు.
జీవితకాల అధ్యక్షుడిగా నియామకం చట్ట విరుద్ధం
జగన్‌ను వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా తీర్మా నిస్తూ, పార్టీ నిబంధనావళిని మార్చడం ప్రజాప్రాతి నిధ్య చట్టానికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తు న్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్ 29 ఏ ప్రకారం ఈ నిర్ణయం చెల్లుబాటుకాదని అంటున్నాయి. చట్ట ప్రకారం భారత ఎన్నికల సంఘం గుర్తింపున్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం.. ఎన్నికల పక్రియ ఉండాలనే నిబంధన ఉంది. రెండు, మూడేళ్లకు ఓసారి పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడు సహా కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. గతంలో కాంగ్రెస్ ఇలా వ్యవహరించకపోవడంతో ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. తెదేపా, వైకాపాల్లో ఇలాంటి బానిసత్వ ధోరణి కనిపిస్తుంది. వారసులే అధ్యక్షులుగా ఉంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కాలపరిమితి అయిదేళ్లు ఉంటే పార్టీ నాయకులు మాత్రం శాశ్వతంగా ఉండాలా? పార్టీ నాయకులను ఎన్నుకునే అధికారం పార్టీ క్యాడర్‌కు ఉండాలి. కుటుంబ పాలన దేశానికి ముప్పు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్