– సుజాత గోపగోని, 6302164068
ఉత్తరాదిలో అతివేగంగా పుంజుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇపుడు దక్షిణాదిపై దృష్టిపెట్టింది. దక్షిణ భారతదేశంలోనూ ప్రభావాన్ని చూపేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంది. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో ఎటువంటి వ్యూహాలు అమలుచేయాలో ప్రణాళికలు వేసుకుంది. ఈ వ్యూహాలకు హైదరాబాద్ వేదికైంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జూలై 2, 3 తేదీల్లో తెలంగాణలో నిర్వహించింది పార్టీ అధిష్టానం. అంటే, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంటామన్న ధీమాను పరోక్షంగా వ్యక్తం చేసింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ సహా.. మిగతా రాజకీయ పార్టీలకు ఓ సంకేతాన్ని పంపింది. ఇకపై దూకుడే అని చెప్పకనే చెప్పింది. తెలంగాణ గడ్డమీద నుంచి పలు రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. కొన్ని రాజకీయ పార్టీలు ప్రాథమిక సూత్రాలను కూడా పక్కనబెట్టి అనుసరిస్తున్న దుందుడుకు చర్యలు, రాజకీయ విమర్శలకు బదులు.. నిజాయితీగా, నిష్పక్ష పాతంగా రాజకీయాలు చేస్తామన్న సందేశం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రతిధ్వనించింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జూలై 3న నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ అంచనాలకు మించి విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో బీజేపీ జాతీయస్థాయి అగ్రనేతలందరూ ఈ సభలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అందరు కేంద్రమంత్రులు తరలివచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా.. జాతీయ కార్యవర్గం మొత్తం సికింద్రాబాద్ సభలో పాల్గొంది. రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఈ బహిరంగ సభ ఓ రికార్డుగా మిగలనుంది. ఇక, సభలో నేతల ప్రసంగాలు చూసినా, రాష్ట్రస్థాయి నేతల ఆత్మవిశ్వాసం గమనించినా, తెలంగాణ నలుమూలల నుంచి తరలి వచ్చిన పార్టీ శ్రేణులను పలకరించినా నూతనోత్తేజం పొంగిపొర్లింది. కేసీఆర్ గడీని బద్దలు కొట్టే సమయం ఆసన్నమైందన్న అగ్రనేతల ప్రసంగపాఠం కార్యకర్తల్లోకి చొచ్చుకెళ్లింది.
బీజేపీ తెలంగాణ గడ్డపై నగారా మోగించింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని గొంతెత్తి నినదించింది. రాష్ట్రంలో సాగుతున్న నయా నిజాం పాలనకు చరమగీతం పాడటమే ఆశయంగా దూసుకెళ్తామని స్పష్టం చేసింది. ఎనిమిదేళ్లలో ఏనాడూ సచివాలయంలో అడుగుపెట్టని కేసీఆర్‌కు ఇక ఆ అవసరం ఉండదని, బీజేపీ ముఖ్యమంత్రే కొత్త సచివాలయంలో కాలు పెడతారని, సచివాలయం కేంద్రంగా రాష్ట్రపాలన సాగిస్తారని స్పష్టంచేసింది. ఇటు.. పార్టీ పరంగానూ, ముఖ్యనేతల మొదలు క్షేత్రస్థాయిలో కిందిస్థాయి కార్యకర్త దాకా స్పష్టమైన మార్గనిర్దేశనం చేసింది బీజేపీ అధిష్టానం.
ఎవరికీ అందని వ్యూహం
విజయ సంకల్పసభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ఎవరికీ అంతుచిక్కలేదు. అప్పటిదాకా మాట్లాడిన ముఖ్య నేతలందరూ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పైనా, కేసీఆర్‌పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు. కానీ, ప్రధాని ప్రసంగంలో మాత్రం టీఆర్‌ఎస్ గురించి గానీ, కేసీఆర్ గురించి గానీ ఎక్కడా ప్రస్తావన రాలేదు. వాస్తవానికి అంతకు ముందు రోజు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కేసీఆర్ మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. పలు ప్రశ్నలు సంధించారు. మరోవైపు.. రెండురోజుల ముందే కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ మోదీకి లేఖాస్త్రం సంధించారు. వీటికి సమాధానాలివ్వాలని డిమాండ్ చేశారు. కానీ, మోదీ మాత్రం కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు గానీ, కేటీఆర్ లేఖకు గానీ స్పందించలేదు. కనీసం రాజకీయ విమర్శల ఊసెత్తకుండా ప్రధాని ప్రసంగం సాగింది. అంటే, కేసీఆర్ విమర్శలకు సమాధానం చెప్పే స్థాయి తనది కాదన్న పరోక్ష సంకేతాలను నరేంద్రమోదీ జనంలోకి పంపించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, తన ప్రసంగంలో తెలంగాణలోని పుణ్యక్షేత్రాలు, ఇక్కడి చారిత్రక గొప్పదనాన్ని, జనం మనస్తత్వం గురించి మోదీ కొనియాడారు. దీంతో, హిందీలో మాట్లాడినప్పటికీ అందరికీ ఆయన ప్రసంగం అర్థమైందనే చెప్పాలి.
తెలంగాణ అంటేనే ధైర్యసాహసాల గడ్డ
మోదీ తన ప్రసంగంలో తెలంగాణ ప్రాభవాన్ని కొనియాడారు. చారిత్రక ఘటనలను, విభిన్న ప్రదేశాలను, వాటి గొప్పదనాన్ని పేరుపేరునా ప్రస్తావించారు. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని స్తుందన్నారు. ధైర్యసాహసాలు, కళలు, సంస్కృతికి తెలంగాణ ప్రతీక అన్నారు. హైదరాబాద్ ప్రతిభకు పట్టంకట్టే కేంద్రమని కొనియాడారు. దేశ ఆత్మనిర్భర్, ఆత్మ విశ్వాసానికి హైదరాబాద్ కేంద్రమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ సహకరిస్తుందన్నారు. కరోనా సమయంలోనూ, క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రాష్ట్రానికి సహకరించామని, ఉచిత రేషన్, వ్యాక్సిన్ అందించామని మోదీ చెప్పారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటు న్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటవుతుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రానికి ఏం చేశామంటే..
గత ఆరేళ్లలో లక్ష కోట్ల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందన్నారు మోదీ. కొత్త రైల్వే లైన్లు నిర్మించామని, రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. దేశ అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధిని కూడా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్‌లో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు, సైన్స్ సిటీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించా మన్నారు. తెలంగాణకు 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని గుర్తుచేశారు. 350 కోట్ల రూపాయలతో హైదరాబాద్ చుట్టూ మరో రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణ అంతటా కనెక్టివిటీ పెంచాలని చూస్తున్నామని, పట్టణాలనే కాకుండా.. గ్రామాలను కూడా కనెక్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మెగా టెక్స్ టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
విమోచన దినోత్సవం ఎందుకు జరపరు?: అమిత్ షా
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాన్ని సాధించామా? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యిందా? అని అడిగారు. ‘కేసీఆర్.. నా మాటలను గుర్తుంచుకో… నీది కాదు, నీ కొడుకుది కాదు. వచ్చేసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుంది’ అని ఆయన జోస్యం చెప్పారు. ఎనిమి దేళ్లలో కేసీఆర్ ఒకసారి కూడా సచివాలయానికి వెళ్లలేదని, ఇకపై వెళ్లే అవసరం కూడా రాదన్నారు. దేశం పురోగమిస్తుంటే తెలంగాణ తిరోగమిస్తోందని విమర్శించారు. బీజేపీకి ఒక్కసారి అవకాశమివ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము మద్దతిచ్చామని, గతంలో తాము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో భాగం అయ్యేదే కాదన్నారు. విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు అధికారికంగా జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే.. తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు.
అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు: సంజయ్
‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి మోదీ చేసిన సేవలను కొనియాడారు. ప్రధాని మోదీపై కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు భాషను వాడుతుంటే చూస్తూ కూర్చోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల మనిషి మోదీని టీఆర్‌ఎస్ వాళ్లు ఎందుకు తిడుతున్నారని నిలదీశారు. పేదలు ఆకలితో అలమంటిచొద్దని చెప్పి.. ఉచిత బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నారా ? 200 కోట్ల టీకా డోసులను దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చినందుకు తిడుతున్నారా? ఉక్రెయిన్‌లో భారతీయులు, తెలుగువాళ్లు చిక్కుకుంటే వారిని సురక్షితంగా తీసుకొచ్చినందుకు తిడుతున్నారా? అని సంజయ్ భావోద్వేగంగా ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీని బద్దలు కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. కేంద్రం నిధులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్‌కు రాష్ట్ర అభివృద్ధి పట్టదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తుందని.. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం మోదీని అప్రతిష్ట పాలు చేయాలని టీఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించేందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించామన్నారు. ‘బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యే వాడివా.. నీకు సీఎం పదవి బీజేపీ భిక్ష’ అంటూ కేసీఆర్‌పై సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
త్వరలోనే డబుల్ ఇంజన్ సర్కార్: యోగి
తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఉత్సాహం తమకు స్ఫూర్తిని ఇస్తోందన్నారు మరో ముఖ్య నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో యూపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. త్వరలోనే తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటో చూపించారని అన్నారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని.. రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందడం లేదని యోగి మండిపడ్డారు. కేంద్ర పథకాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ స్టాంప్ వేసుకుంటోందని ఆరోపించారు. యూపీలో 15 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని ఆయన గుర్తుచేశారు. రెండ్రోజులుగా హైదరాబాద్‌లో అనేక అంశాలపై మథనం చేశామని.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ భావనతో ముందుకు వెళ్తున్నామని యోగి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ కమలం వికసిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగింపు పలకడంతో పాటు బీజేపీపై జరుగుతున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, స్మృతిఇరానీ, ఇంకా పలువురు మంత్రులు తమ ప్రసంగాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ మార్గదర్శకత్వంలో తెలంగాణలోనూ భాజపా సర్కారు వస్తుందని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని బీజేపీ కాంక్షిస్తోందని అన్నారు.
—————
కమలం అంటేనే క్రమశిక్షణ
సాక్షాత్తూ ప్రధానమంత్రి సహా దేశంలో రాజకీయంగా అత్యున్నత ప్రొటోకాల్ కలిగిన ముఖ్యనేతలంతా తరలివచ్చినా బీజేపీ ఈ సభను పక్కా ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే ప్రారంభించి, అనుకున్న సమయానికే ముగించింది. సమయపాలన అందరినీ ముచ్చటగొలిపింది. సాధారణంగా రాజకీయ నాయకుల బహిరంగ సభలు అనుకున్న సమయానికి ప్రారంభం కాక జనం తీవ్రస్థాయిలో ఇక్కట్లు పడటం, మధ్యలోనే వెళ్లిపోవడం గమనిస్తాం. కానీ బీజేపీ విజయ సంకల్ప సభ పక్కాగా జరిగింది. సభకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లుచేశారు. ఏ ఒక్కరూ సభ మధ్యలో నుంచి వెళ్లిపోలేదు. బీజేపీ క్రమశిక్షణకు, సమయపాలనకు ఈ పరిణామం అద్దం పట్టింది. బహిరంగ సభకు అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం వచ్చినా సభకు ఆటంకం కలగకుండా 4 లక్షల చదరపు అడుగుల్లో 10 భారీ జర్మన్ టెంట్లు అమర్చారు. వేదిక వద్ద 100 ఏసీలు, 50 జనరేటర్లు, 100 సీసీ కెమేరాలు, టెంట్ల కింద 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 30 ఎల్‌ఈడీ స్క్రీన్లు, 2 కిలోమీటర్ల దూరం ప్రధాని ప్రసంగం వినిపించేలా స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో విధులు నిర్వర్తించారు.
—————–
దక్షిణాదికీ విస్తరిద్దాం…
హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణే లక్ష్యంగా ‘ఆపరేషన్ దక్షిణ్’కు పిలుపునిచ్చింది కమలం పార్టీ. పక్కా వ్యూహంతో పలు కీలక తీర్మానాలను ఆమోదిం చింది. రాజకీయ తీర్మానంపై చర్చల్లో పాల్గొన్న ప్రధాని మోదీ చాలా అంశాలకు మార్పులు, చేర్పులు సూచించారు. దేశానికి బీజేపీ అవసరం ఉందన్న ఆయన.. సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలు నిష్క్రమణ దారిలో ఉన్నాయన్నారు. బెంగాల్, కేరళలో బీజేపీ శ్రేణులపై దాడులు జరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని సూచించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము జీవితంపై ఓ చిత్రాన్ని కూడా తీయాలని సలహా ఇచ్చారు. కేరళ, తెలంగాణలో తమ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దక్షిణాదిలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూసుకెళ్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కార్యవర్గ సమా వేశంలో మోదీ ప్రసంగం గురించి మీడియాకు వివరించారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారని.. దేశ వ్యాప్తంగా భాజపా విస్తరిస్తోందన్నారు. దేశానికి బీజేపీ అవసరం గురించి ప్రధాని నరేంద్ర మోదీ సవివరంగా చెప్పారని తెలిపారు. సర్వజనహితం కాంక్షించి పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. సమావేశాలు విజయవంతం కావడంపై తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
కార్యవర్గం భేటీలో రాజకీయ తీర్మానంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టగా కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ బలపరిచారు. బీజేపీ ఏ ఒక్క రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూడదని, దేశంలోని అన్ని రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తుందని అమిత్ షా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఏపీ, కేరళలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్, తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు రాబోతుందన్నారు. ఇదే విషయాన్ని అసోం సీఎం బిశ్వశర్మ ప్రస్తావించారు. దేశంలో ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు మూలన కూర్చోబెట్టారన్న ఆయన.. వచ్చే 30-40 ఏళ్ల పాటు బీజేపీయే దేశంలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ తీర్మానం సందర్భంగా తెలంగాణలో పరిస్థితులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యవర్గ సభ్యులకు వివరించారు. అనంతరం ప్రకటన చేసిన పార్టీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని విమర్శిం చింది. 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఎన్నో నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. దక్షిణాదిలో బీజేపీ పుంజుకునేందుకు కీలక సూచనలు చేశారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. మైనారిటీ ఓట్లు బలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికారం సాధ్యమైనపుడు.. దక్షిణాదిలో అది పెద్ద కష్టమేం కాదన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు తెలంగాణలో ఎందుకు చేయలేమన్నారు. బలహీన వర్గాల ఓటుబ్యాంకును పెంచుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించింది బీజేపీ కార్యవర్గం.
తెలంగాణపై ప్రత్యేక ప్రటకన
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని కమలదళం విశ్వాసం వ్యక్తం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరేలా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రయత్నం చేస్తామని జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ ప్రత్యేక ప్రకటన చేసింది. మోదీ చరిష్మాను చూసి టీఆర్‌ఎస్ కాళ్ల కింద భూమి కదులు తోందని ఎద్దేవా చేసింది. అవినీతిలో కూరుకు పోయిన టీఆర్‌ఎస్ సర్కార్‌ను 2023లో ప్రజలే ఇంటికి పంపుతారని విశ్వాసం వ్యక్తంచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బడ్జెట్‌ను 40 వేల నుంచి లక్షా 30 వేల కోట్లకు పెంచడం నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని పేర్కొంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలు సహా జీహెచ్‌ఎంసీలో మంచి విజయాలు సాధించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
ఈటలకు అరుదైన అవకాశం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రసంగించేందుకు ఆయనకు ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఈటల 15 నిమిషాలు మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, కేసీఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిని ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీగా బీజేపీని ప్రజలు నమ్ముతున్నారన్న ఈటల, ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీనీ ఆదరిస్తారని వివరించారు. ఈటల ప్రసంగాన్ని మోదీతో పాటు నడ్డా అభినందించారు. అంతకు ముందు ఈటలను పిలిపించుకొని అమిత్ షా, నడ్డా ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇంటలిజెన్స్ సీఐ అత్యుత్సాహం
మీడియాను, బయటి వాళ్లను కూడా అనుమతించకుండా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసు రహస్యంగా వెళ్లడం కలకలం రేపింది. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాస్ లోపలికి వెళ్లి మీటింగ్ ఎజెండా, తీర్మానం కాపీలు ఫొటోలు తీశారు. అయితే, ఆ అధికారిని గుర్తించిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి..పట్టుకొని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏ నియోజకవర్గంలో చూసినా జాతీయ నేతలే
తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టిన బీజేపీ.. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆ పార్టీ అగ్రనేతల పర్యటనలు చేపట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన పలువురు అగ్రనేతలు, జాతీయ స్థాయి నేతలు.. రెండురోజుల ముందే నియోజకవర్గాల వారీగా పర్యటించారు. కార్యకర్తలు, నేతల ఇళ్లలో బస చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో పర్యటించారో.. అదే నియోజకవర్గాల్లో వాళ్లే మూడు నెలల తర్వాత మరోసారి పర్యటించనున్నారు. పార్టీ పరిస్థితిపై, పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక నేతలతో చర్చించనున్నారు. 2023 ఎన్నికల వరకు కూడా ఈ నేతలే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయమై దిశా నిర్దేశం చేయనున్నారు.
———-
‘శభాష్ సంజయ్’
ప్రధాని నరేంద్రమోదీ పరేడ్‌గ్రౌండ్ సభా వేదికపైకి రాగానే వేదిక అంతా కలియదిరుగుతూ జనానికి అభివాదం చేశారు. గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిన జనాన్ని చూసి ముగ్ధుడైపోయారు. ప్రజలకు అభివాదం చేసి కూర్చోగానే కుడివైపు కూర్చున్న నడ్డాను చూస్తూ జన సమీకరణ బాగా జరిగిందన్నట్లు కొనియాడారు. తనకు ఎడమ పక్కన కూర్చున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పలుసార్లు బండి సంజయ్ భుజం చరిచి మరీ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. సభ ఏర్పాట్లు బాగున్నాయని అభినందించారు. బండి సంజయ్ ఆవేశపూరితంగా, భావోద్వేగంగా చేసిన ప్రసంగం తర్వాత కూడా ప్రధాని మోదీ ఆయన్ను మరోసారి అభినందించారు.
—————
నోరూరించిన తెలంగాణ రుచులు
రెండు రోజుల పాటు హెచ్‌ఐసీసీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ సంప్రదాయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన బీజేపీ ముఖ్యనేతలందరినీ ఆకట్టుకునే మాదిరిగా వంటకాలను సిద్ధం చేయించారు. వాటిని ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా పరిశీలించారు. తెలంగాణ సంప్రదాయ వంటకాల గురించి రాష్ట్ర నేతలు ఆయనకు వివరించారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్