‌మేధా పాట్కర్‌.. ‌పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం కనిపించే, వినిపించే పేరు. ‘నర్మదా బచావో’ పేరుతోనో, గిరిజనుల హక్కుల పేరుతోనో, పునరావాస బాధితుల పేరుతోనో, ప్రాజెక్టుల ముంపు బాధితుల పేరుతోనో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే నాయకురాలు. పర్యావరణం పేరుతో నీటి పారుదల ప్రాజెక్టులను, పరిశ్రమల స్థాపనను అడ్డుకునే సామాజిక విధ్వంసకురాలు. అమాయక గిరిజనులను, గిరిజనులను ఏదో ఒక పేరుతో ప్రభుత్వంపై ఉసిగొల్పే వినాశకారి. దేశ ప్రగతిని, ప్రజల జీవితాల్లో ప్రగతిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే నయా మేధావి. తనను తాను మేధావి అని ప్రకటించుకోవడం ద్వారా, హక్కుల ఉద్యమకారిణినని చెప్పుకోవడం ద్వారా, ప్రజల తరఫున పనిచేసే నాయకురాలినని పేర్కొనడం ద్వారా పరోక్షంగా వారికి హాని కలిగిస్తున్నారన్నది చేదు నిజం. ఇప్పటివరకు ఉద్యమకారిణిగా పేరున్న ఆమెలోని చీకటికోణం తాజాగా వెలుగుచూసింది. ఇప్పుడు ఆమె నిజస్వరూపం ఏమిటో అందరికీ అర్థమవుతోంది. ఆమె పేదల తరఫున పనిచేస్తున్నారా? లేక వారి పేరుతో విరాళాలు సేకరించి దుర్వినియోగం చేస్తున్నారా? అన్న అనుమానం కలగక మానదు.

మేధా పాట్కర్‌పై మధ్యప్రదేశ్‌ ‌పోలీసులు తాజాగా నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌- ‌ఫస్ట్ ఇన్ఫర్మేషన్‌ ‌రిపోర్టు)ను విశ్లేషించి నప్పుడు ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె నిజస్వరూపం ఏమిటో బాహ్య ప్రపంచానికి తెలియవచ్చింది. ఇంతకాలం ప్రజాఉద్యమం పేరుతో ఆమె చేస్తున్న బాగోతం బట్టబయలైంది. నర్మదా స్వచ్ఛంద సంస్థ పేరుతో మేధా పాట్కర్‌ ‌సేకరించిన విరాళాలు పక్కదారి పట్టాయంటూ మధ్యప్రదేశ్‌లోని బర్వాన్‌ ‌పోలీసులు ఆమెపై ఎఫ్‌.ఐ.ఆర్‌. ‌నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె అభిమానులనూ ఆందోళనకు గురిచేసిన మాట వాస్తవం. ఇప్పటిదాకా సమాజ అభ్యున్నతి పేరుతో ఆమె చేస్తున్నదంతా నాటకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్మదా నవనిర్మాణ్‌ అభియాన్‌ ‌ఫౌండేషన్‌ ‌పేరుతో రూ.13 కోట్లు ఆమె వివిధ వర్గాల నుంచి సేకరించారు. గిరిజనుల పిల్లల చదువుల పేరుతో సేకరించిన ఈ నిధులు దుర్వినియోగ మయ్యాయని, పక్కదారి పట్టాయని పేర్కొంటూ ప్రీతంరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మేధా పాట్కర్‌ను అరెస్టు చేశారు. అంతేకాక ఈ కేసుకు సంబంధించి పర్విన్‌ ‌రోము జహంగీర్‌, ‌విజయ్‌ ‌చౌహాన్‌, ‌కైలాస్‌ అవస్య, మోహన్‌ ‌పాటిదార్‌, ఆశిష్‌ ‌మాండ్లోమ్‌, ‌సంజయ్‌ ‌జోషిలను నిందితులుగా పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌.‌లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం తమ ట్రస్టుకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ పాట్కర్‌ ‌ప్రజలను ప్రభావితం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరి నుంచి విరాళాలు వచ్చాయి, ఎంత మొత్తంలో వచ్చాయి, వాటిని ఏ పనులకు వినియోగించారు. ఎక్కడ నిధులు దుర్వినియోగమయ్యాయి, ఇందులో ఎవరి పాత్ర ఎంత.. తదితర అంశాలపై లోతుగా విచారిస్తున్నారు. ఈ నిధులతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ‌ప్లాంటుకు సంబంధించి ప్రజలను రెచ్చగొట్టారన్న కేసులో ఒడిశాలో కూడా మేధా పాట్కర్‌పై ఎఫ్‌.ఐ.ఆర్‌. ‌నమోదైంది. నిన్న మొన్నటి వరకు ఏదో ఒక పేరుతో నిత్యం ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోసే ఈ హక్కుల నాయకురాలు ప్రస్తుతం జైల్లో తీరిగ్గా ఊచలు లెక్కపెడుతున్నారు. పాట్కర్‌ అరెస్టుపై మాట్లాడుతున్న మేధావులు, హక్కుల సంఘాల నాయకులు నిధుల దర్వినియోగం విషయంపై మౌనం వహించడం గమనార్హం. ప్రజల నుంచి సేకరించే సొమ్ముకు జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలకు వారి నుంచి సమాధానం కరవవుతోంది. ఇంతకుమించిన బాధ్యతారాహిత్యం మరొకటి ఉంటుందా?

అదే పనిగా కేంద్ర, రాఫ్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం, వాటిపై ఆధారరహిత ఆరోపణలు చేయడం మేధా పాట్కర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అభివృద్ధి పేరుతో, పర్యావరణం పేరుతో, ప్రాజెక్టుల పేరుతో దేశ ప్రగతిని అడ్డుకోవడం ఆమె విధానంగా మారింది. కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమాక్రటిక్‌ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పక్రియను మరింత తీవ్రతరం చేశారు ఆమె. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యారు. అప్పట్లో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)‌లో చేరిన మేధా పాట్కర్‌ ‌నార్త్ ఈస్ట్ ‌ముంబయి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో భాజపా నాయకుడు కిరీటి సోమయ్య విజయం సాధించగా పాట్కర్‌ ‌మూడో స్థానంలో నిలవడం ఆమెకు గల ప్రజాదరణ ఏపాటిదో చెప్పడానికి నిదర్శనం. నిత్యం ప్రజల హక్కుల పేరుతో ఉద్యమాలు సాగించే నాయకురాలు ఎందుకు ఓడిపోయారో ఒక్కసారి విశ్లేషించుకుంటే తాను ప్రయాణిస్తున్న మార్గం సరైనదో కాదో తెలుస్తుంది. కానీ ఆపాటి వివేచన కొరవడటమే అసలు సమస్య.

మహారాష్ట్రకు చెందిన మేధా పాట్కర్‌ ఆషామాషీ నాయకురాలు కాదు. ఉన్నత విద్యావంతురాలు. ముంబయిలోని ప్రతిష్టాత్మకమైన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సోషల్‌ ‌సైన్సెస్‌లో ఎం.ఏ. చదివారు. చదివిన కోర్సుకు అనుగుణంగా ప్రజల మేలు కోసం, వారి బాగోగుల కోసం పనిచేస్తే బాగుండేది. ప్రజల అభిమానం చూరగొనేవారు. కానీ ప్రతి విషయాన్ని ప్రతికూల ధోరణిలో చూడటం, ప్రభుత్వాలను, వాటి కార్యకలాపాలను అడ్డుకోవడం, అమాయక ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తూ వచ్చారు. గిరిజనులకు ప్రగతి ఫలాలను అందనీయకుండా అడ్డుపడుతూ వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రగతి కోసం, సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, పథకాలను నిర్వీర్యపరుస్తూ వచ్చారు. తద్వారా ప్రగతి నిరోధకురాలుగా మారారు.

1985లో నర్మదా బచావో ఉద్యమం పేరుతో మేధా పాట్కర్‌ ‌వెలుగులోకి వచ్చారు. నర్మదా నది ద్వారా మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, గుజరాత్‌ ‌రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుంది. వేలాది గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుంది. లక్షలాది ఎకరాలు పచ్చని పంటలతో కళకళలాడతాయి. తద్వారా ప్రత్యక్షంగా రైతులకు, పరోక్షంగా రైతు కూలీలకు మేలు కలుగుతుంది. గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఈ నదిపై నిర్మించిన ప్రాజెక్టు వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఫలితంగా బోర్లు వేసుకుని పంటలు పండించడానికి అవకాశం కలుగుతుంది.

ప్రపంచ చరిత్రను ఒక్కసారి పరికిస్తే నదీతీర ప్రాంతాలే అభివృద్ధి చెందాయన్న విషయం అర్థమవుతుంది. నదీ తీర ప్రాంతాల్లోనే నాగరికత వెల్లివిరిసిందన్న విషయం సోదాహరణగా తెలుస్తుంది. తనను తాను మేధావిగా ప్రకటించుకునే మేధా పాట్కర్‌కు ఈ విషయాలు ఏవీ తెలియవని అనుకోలేం. కానీ అన్నీ తెలిసి కూడా ప్రభుత్వాలకు, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అమాయక గిరిజనులను ఆమె రెచ్చగొడుతున్నారు.

భాక్రానంగల్‌, ‌నాగార్జునసాగర్‌ ‌వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణంతో ఆయా ప్రాంతాలు పచ్చదనంతో విలసిల్లుతున్నాయన్న వాస్తవాన్ని విస్మరించరాదు. కేవలం భారీ ప్రాజ్టెకులే కాకుండా మధ్యతరహా, చిన్నతరహా ప్రాజక్టులు సైతం దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్న సంగతి హక్కుల ఉద్యమకారులకు తెలియదని అనుకోలేం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర కర్మాగారాల స్థాపనకు భూమి అవసరం. ఆ భూమిని ఎవరో ఒకరు ఇవ్వక తప్పదు. వారికి మార్కెట్‌ ‌ధర చెల్లించి తీసుకోవడంలో తప్పు లేదు. సాగునీటి ప్రాజెక్టులను ప్రైవేట్‌ ‌వ్యక్తులు ఏమీ నిర్మించరు. ప్రభుత్వాలే నిర్మిస్తాయి. ముంపు బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కట్టివ్వడం, వేరే చోట భూములివ్వడం కొత్తేమీ కాదు. దీనిని అడ్డుకోవడం అంటే ప్రగతిని అడ్డుకోవడం కిందకే వస్తుంది. ప్రభుత్వ రంగంలో అయినా, ప్రైవేట్‌ ‌రంగంలో అయినా పరిశ్రమల స్థాపనకు భూమి అవసరం. ఆయా ప్రాంతాల రైతుల నుంచి సేకరించిన భూమికి చట్టబద్ధంగా పరిహారం చెల్లిస్తారు. ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే చక్కదిద్దడానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఈ విషయాన్ని మేధా పాట్కర్‌ ‌వంటి స్వయం ప్రకటిత మేధావులు ఎప్పటికి గుర్తిస్తారు?

  • గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE