– డా।। గోపరాజు నారాయణరావు
ఎన్ని వేణువులు జన్మించబోతున్నాయోనని పించింది, ఆ పొదలలో. మధ్య మధ్య నీటి చెలమలు దాటుకుంటూ ఐదారు మైళ్లు నడిస్తే అప్పుడు కనిపించింది కొయ్యూరు. వీటికంటే ఎంతో ఎత్తులో ఉన్న చింతచెట్లు ఈ వెదురుపొదల ముచ్చట్లు విస్తుపోయి చూస్తున్నట్టు ఉన్నాయి. ఊరంతా చింతలతోపులే. ఎంత దట్టంగా ఉన్నాయో. చింతల తోపులు, వెదురు పొదలు, అక్కడక్కడ జొన్న చేలు, వాటిలో మంచెలు ఎంత అందంగా ఉన్నాయో! ఇక్కడ నుంచి ఈ వెదురు పొదల గుండా వెళితే మంప గ్రామం. కొయ్యూరు ప్రభుత్వ బంగ్లా వెనక్కు వెళ్లి ఆ దృశ్యాలను చూస్తున్నాను. అప్పుడే మా సహాయకుడు పిలిచాడు బంగ్లా బయట నుంచి. ఒక కొండవాడు వచ్చాడు నన్ను చూడడానికి. ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి ఒక అడవిబిడ్డ రావడం అద్భుతమే.
కానీ అతడిని చూశాక మనసు ద్రవించి పోయింది. ఎంత బాధ భరిస్తున్నాడో! కుడికన్ను, ఆ చుట్టూ ఉన్న ప్రదేశం భయానకంగా వాచి ఉన్నాయి. పెద్ద బోదురు కప్ప ఎగిరి అక్కడ కూర్చున్నదేమో ననిపిస్తోంది, ఆ భాగం. కనుబొమ్మ స్థానంలో గట్టిగా తగిలిన గాయం ఇంకా భయం గొలుపుతోంది. ఏదో పసరు పూశారు గానీ చీము వల్ల తెరుచుకుని ఉంది. నరకయాతన అనుభవిస్తున్నాడు. ‘ఎప్పుడు తగిలింది?’ కూడా వచ్చిన ఆడమనిషిని అడిగాను. ‘పది రోజులైంది బాబు!’ ఆమె చెప్పింది ధైర్యం కూడదీసుకుని. ‘ఎలా తగిలింది?’ మళ్లీ అడిగాను. సమాధానం లేదు. నేను చెప్పగానే నా సహాయకులలో ఒకడు వెంటనే దూది, ఓ రెండు నిమిషాలకి వేడి నీళ్లు పట్టుకొచ్చాడు. ఆమెను బయట కూర్చోమ న్నాను. వచ్చే ఏడుపు ఆపుకోవడానికి నోట్లో కొంగు కుక్కుకుని వెళ్లబోయింది. ‘ఇదిగో అమ్మా! అలా ఏడవకు. ఏం భయం లేదు. తగ్గిపోతుంది.’ అన్నాను ఒక డాక్టర్ గా. తలూపి దణ్ణం పెట్టి వెళ్లింది. నిమ్మకా యంత దూది తీసి, వేడినీళ్లలో ముంచి గాయానికి తగిలించాను. కెవ్వుమన్నాడతడు. ‘కొంచెం తట్టుకోవాలి. ముందు పుండు కడగాలయ్యా! కంగారు పడకు’ అన్నాను గట్టిగా. చాలా సున్నితంగా గాయం కడుగుతున్నాను. మాటకి బెదిరినట్టున్నాడు, బాధను అణుచుకుంటూ సహకరిస్తున్నాడు. జాలేసింది. మాటల్లోకి దింపాలనిపించింది. ‘ఏ ఊరు నీది!’ ‘ఉస్….. కిటుముల దొర’. ‘కిటుముల సరే..! ఎలా తగిలింది దెబ్బ?’ ‘అబ్బ… ఉస్స్… చిరత.. అబ్బ… అబ్బ… ఉస్…. రక్కేసింది!’ నా అనుమానం నిజమైంది. ‘నీ ముఖం ఒక్కటే దానికి బాగా నచ్చినట్టుంది. అక్కడే రక్కింది కదా!..సర్లే. ‘నీ పేరు’. ‘ఒనుము కిదొర’. చూడబోతే ఎక్కడో ఒక్కసారైనా ఇంగ్లిష్ వైద్యం చేయించుకున్నాడనిపిస్తోంది. గాయం శుభ్రం చేశాను. మూడు దూది ఉండలు అయ్యాయి. చీము బాగా వచ్చింది. కొంచెం స్థిమితపడ్డాడు . ‘ఇదిగో కర్రిదొర! మీ మూలికా వైద్యం చాలా మంచిది. గొప్పది కూడా. మీ తాతలు, మా తాతలు కూడా అదే తీసుకున్నారు. ఇప్పుడు నేనిచ్చే మందు వేరే రకం. ఇది వేసుకుంటే తొందరగా తగ్గుతుంది. ఆ గాయంలో ఇన్‌ఫెక్షన్ రాకూడదు. ఇన్‌ఫెక్షన్ అంటే, ఇంకా చీము పట్టి, ఇంకా పాడైపోవడం. అప్పుడు ఇంకా బాధపడాలి. కాబట్టి ఇప్పటికి వేసుకో. ముందు ఈ గాయం తగ్గాలి. ఔనా?’ అన్నాను. ఒక నిమిషం ఆలోచించి ‘ఔనన్న’ట్టు తలూపాడు.
బోరిక్ పౌడర్ వేసి కట్టు వేశాను. తరువాత కనుసైగ చేశాను.
మా సహాయకుడు యాంటీబైటిక్ మాత్రలు పొడుం చేసి, మూడు పొట్లాలు కట్టి తెచ్చాడు, ఒక గంట తరువాత. ‘ఇదిగో కర్రిదొర. ఇదీ మూలికల చూర్ణమే. ఇంటికెళ్లి తేనెలో కలుపుకుని మూడు రోజుల పాటు లోపలికి తీసుకో. ఆ గంటలోనే మొగుడు, పెళ్లాం చెప్పారు అసలు సంగతి. రోడ్డు పనికి రాలేదని బాస్టియన్, కిష్టయ్య కిటుముల వచ్చి కర్రిదొరను కేకేశారట. వచ్చీ రావడంతోనే కిష్టయ్య రెండు చేతులూ వెనక్కి విరిచి పట్టుకున్నాడట. బాస్టియన్ ఒక కర్ర తీసుకుని తగిలేదీ తప్పేదీ కూడా చూడకుండా కొట్టాడట. అప్పుడే తల మీద కొట్టబోతుంటే పక్కకి వంగడంతో ఆ దెబ్బ వచ్చి కంటి మీద తగిలిందిట. ఆ తరువాతే కిటుముల నుంచి పారిపోయి వచ్చి కొయ్యూరులో పెదతల్లి ఇంట్లో తలదాచుకున్నాడట. ఆ గాయం తగ్గడానికి కనీసం ఇంకో నెలరోజులు పడుతుంది. మనసుకు తగిలిన గాయం మాట నేను చెప్పలేను. ఇన్‌ఫెక్షన్ రాకపోతే బావుండును. ఆ క్షణంలో చూసిన ఒక దృశ్యం కదలించి వేసింది డాక్టర్ మూర్తి గారిని. అదే డైరీలో రాసుకున్నారు.
లంబసింగి, 7-3-1921
డియర్ మన్యం డైరీ!
పావుగంట క్రితమే వచ్చాను. కాళ్లు పీకుతున్నాయి.
నేను రాగానే చూసిన దృశ్యమే నన్ను క్షణాల మీద ఈ పేజీని నింపేటట్టు చేసింది. నడవడం అంటే నాకు ఇష్టం. మన్యమంతా దాదాపు నడిచే తిరిగాను. మన్యంలో జెట్టీలు ఉన్నాయని తెలుసు. నిజానికి కొన్ని కీకారణ్యంలో ఉండే గ్రామాలకు వెళ్లాలంటే వాళ్లే జెట్టీల మీద తీసుకువెళ్లాలి. అలాంటి ఊళ్లకి నేను వెళ్లలేదు. జెట్టీలు ఎక్కడం కూడా ఇష్టం లేదు. ఆయా గ్రామాల వాళ్లనే సమీపంలో జరిగే సంతలకు రమ్మనిమని టముకు వేయించాను. అబ్బ! కాళ్లు పీకుతున్నాయి. అందుకే గెస్ట్‌హౌస్ మెట్ల మీదే చతికిల పడ్డాను చాలా సేపటి నుంచి. నిజానికి ఈ పేజీ నిన్ననే నింపి ఉండాల్సింది.
కానీ కలంలో సిరా అయి పోయింది. ఇది చూడాలని నాకు రాసిపెట్టి ఉంది. నేను కాళ్లీడ్చు కుంటూ వస్తున్నాను. ఎదురుగా కనిపిస్తోంది గెస్ట్‌హౌస్. ఆ మెట్లన్నీ ఎక్కగలనా? అనిపిస్తుండగా కనిపించింది నాకా దృశ్యం. కొందరు గిరిజనులు జెట్టీ మోసుకువస్తూ కనిపించారు దూరంగా. బలమైన వెదురు బొంగులను కుర్చీ కింద నుంచి కట్టి ఉత్సవ విగ్రహాన్ని మోసినట్టు మోస్తారు.
జట్టీ అంటే అదే. నెమ్మదిగా చేరువైంది జెట్టీ. ఆ జెట్టీ మీద వస్తున్నవాడు విలియం. గెస్ట్‌హౌస్‌కి చేరగానే కొండవాళ్లు ఎక్కడ పడేస్తారేమోనన్న భయంతో అతడి సహాయకులు ఇద్దరూ జాగ్రత్తగా దింపించారు. వాళ్లంతా రోడ్డు కూలీలు. ఎప్పుడో తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు డాక్టర్ మూర్తి. డైరీ దొర్లి కిందపడింది.
*************
‘కొమ్మ ఒక్కటే. కానీ దానికే ఎన్ని పువ్వులున్నా ఒక్కలాగే ఉంటాయి కదా! అలాగే, ఒకే కొమ్మ మీద మరోచోట పూసిన పువ్వులా రంపదేశంలో గొడవల్లాగే గూడెం కొండల గొడవలు కూడా ఉంటాయి.’ నిలబడి చెబుతున్నాడు రామన్న. పువ్వులు, కొమ్మలు, వాటి మధ్య పోలిక ఇవన్నీ చేతి వేళ్లతో తమాషాగా సంకేతి స్తున్నాడు. అప్పుడే దూరంగా కొండగొర్రె అరుపు. అది కొండలలో ప్రతిధ్వనిం చింది.
ఒక నిమిషం మౌనం తరువాత ఆరంభించాడు రామన్న. ‘రంపదేశంలో మాదిరిగానే, గూడెం కొండలలో కూడా ఆడదానికి అధికారం అప్ప గించడం దగ్గరే గొడవ రేగింది. పైగా ఇంట్లో ఒకళ్ల తర్వాత ఒకళ్లకి జెరాలు వచ్చినట్టు, రంపలో రాంభూపతిదేవ్ మరణించిన ఒక్క సంవత్సరం తరువాతే, గూడెంలో గొడవలు మొదలయ్యాయి. గూడెం కొండలంటే గొలుగొండ జమిందారీలోవి. గొలుగొండ పదిహేడో జమిందారు అనంతభూపతి. ఈయన్ని తెల్లోళ్లు నీకు పదవొద్దని చెప్పి ఇంటికి పంపేశారు.
‘ఎందుకూ?’ అనడిగితే ‘నీకు కొంచెం పిచ్చి ఉంది. అందుకే జమిందారీని గాలికి వదిలేశావ్’ అన్నారు. అనంతభూపతికి బదులుగా జమ్మదేవమ్మ అనే ఆవిణ్ణి గద్దెనెక్కించారు. ఈ యమ్మ ఎవరంటే- పదిహేనో జమిందారు భార్య. ఈవిడకి పసుపు కుంకాలు లేవు. సరిగ్గా రంప ముఠాదారులూ, మన్సబ్‌దారుల మాదిరిగానే ఆడదానిని సింహాసనం ఎక్కించినందుకు గూడెం ముఠాదారులూ, మొఖా సాదారులూ మండిపడ్డారు. ‘ఈ మన్యం కొండలను గతంలో ఎప్పుడూ ఒక ఆడది ఏలలేదు.ఇప్పుడేంటి?’ అని ధిక్కరించారు. ఆ యమ్మ మీద కక్ష కట్టారు. ఒకసారి ఆమె పల్లకీలో వస్తుండగా అడవిదారిలో చంపేశారు. దీనితో కలెక్టరు జమీని జప్తు చేశాడు. పనిలో పనిగా అనంతభూపతిని తీసుకెళ్లి గుత్తి కోట అనీ… అక్కడి కొట్లో ఏయించారు. పరిస్థితులు చక్కబడితే భూపతుల కుటుంబానికే జమీని ఇస్తానని మాట మాత్రం ఇచ్చాడు కలెక్టర్. ఒకప్పుడు జమిందారుగా ఏలిన శాంతభూపతిగారి కొడుకు వీరభూపతిని గద్దెనెక్కించాలని తెల్లోళ్ల అభిప్రాయం.
కానీ ఇక్కడున్న కలెట్టు కంటే పైపాలకుడెవడో ఉన్నాడంట. ఆడికి వీరభూపతి అంటే ఇష్టం లేదు.పైగా ఏం చేసిందనుకున్నారూ? ఈ గొడవలు ఇలా ఉండగానే, కంపెనీకి గూడెం బకాయి పడిందంటూ జమీని కంపెనీ ఏలం వేసింది. ఆ వేలంలో వంద రూపాయలకు కంపెనీ సర్కారే సొంతం చేసుకుంది. అంటే ఏంటి? గూడెం కొండలలో కలెట్టు ఏలుబడే మళ్లీ. ‘కలెట్టు ఏలుబడి అంటే కుదరదు. భూపతి వంశీయులకే గద్దె ఇవ్వాల’ని మునసబులంతా తిరుగుబాటు చేశారు. ముందు తహసీల్దారుతో ముఠాదారులు యుద్ధానికి దిగారు. అక్కడే ఉంటాడు కదా! మొత్తానికి రాజీకి వచ్చి చిన్నభూపతినీ, ఆయన తోడబుట్టినోళ్లని మొఖాసుదారులని చేయడానికి తెల్లోళ్లు ఒప్పుకున్నారు. కానీ చిన్నభూపతి కోరికేంటి? ఆయన జమిందారు కావాలనుకున్నాడు.
మొఖాసుదారులంటే నాలుగైదు గ్రామాల మీద అధికారం. సరిపెట్టుకోలేక పోయాడు. చిన్నభూపతి కుటుంబం ప్రతీకారం కోసం ఎదురు చూస్తూనే ఉంది. అప్పుడే కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో పెద్ద గొడవ జరిగింది. చాలామంది తెల్లోళ్లని చంపేశారు. తెల్లోళ్లు కూడా మనోళ్లని చంపేశారు. దాన్నే సిపాయీ కలహం అంటారు. భూపతుల కుటుంబంలోనే సన్యాసి భూపతి అని ఒకాయన ఉండేవాడు. ఆయన తిరుగుబాటు లేవదీశాడు. సన్యాసిభూపతి చిన్నభూపతి అన్న కొడుకు. అందుకే చిన్నభూపతి కూడా చేయి కలిపాడు. ఈ తిరుగుబాటును తెల్లోళ్లు ముఠాదారుల సాయంతోనే అణగొట్టేశారు. భూపతి కుటుంబీకుల మొఖాసాలన్నీ జప్తయినాయి. సన్యాసి, చిన్న భూపతులను కొండల నుంచి బహిష్కరించాడు. తరువాత విశాఖపట్నం జైలులో ఏశారు. మొత్తం అందరి మొఖాసాలను జప్తు చేసింది ప్రభుత్వం. తరువాత చిన్నభూపతి కొడుకు శాంతభూపతి, రంప ప్రాంతం వాడైన మడకం చిన్నిగాడు అనే కోయవాడితో కలసి తిరుగుబాటు లేవదీశాడు. ఇదెప్పుడో తెలుసా? అక్కడ చిన్న కారం తమ్మన, ద్వారబంధాల చంద్రయ్య తిరుగుబాటు చేసినప్పుడే జరిగింది. శాంతభూపతి, మడకం చిన్నిగాడు ఏం చేశారో తెలుసా? కలసి కృష్ణదేవిపేట పోలీట్టేషను తగలబెట్టారు. కానీ అదేం శాపమో పాపం..గొడవ మంచి ఊపులో ఉన్నప్పుడు శాంతభూపతి జ్వరంతో హఠాత్తుగా చనిపోయాడు. చిన్నిగాడు పోలీసులకి దొరికిపోయాడు.
ఇది జరిగిన కొన్ని వారాలకే గూడెం పాతవీధిలో తిరుగుబాటు మొదలయింది. గూడెం పాతవీధి ముఠాదారే ఈ తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఆయనే తగ్గి వీరయ్య దొరగారు. ఆయన అప్పటి దాకా పితూరీకి నేరుగా ఆసరా ఇవ్వలేదు. అప్పుడు మాత్రం ముందుకొచ్చాడు. గొడవల మీద గొడవలు కదా! వెంటనే గూడెం పాతవీధి ముఠాను జప్తు చేసేశారు తెల్లోళ్లు. కొండకంటేరు పోలీట్టేషన్‌ని కొడతానని ఒట్టు పెట్టాడాయన.
దానికి ముందు ఐదుగురు బందీలను బలి ఇస్తానని ఒట్టేశాడు. కారం తమ్మనదొర లాంటి వాళ్లని చూశారు కదా! అందుకే వెతికి వెతికిపట్టి, తగ్గి వీరయ్యదొర ఒట్టు పెట్టుకున్న ఆరు మాసాలల్లోనే గుండేసి పేల్చేశారు. ఇవి జరిగిన ఐదారేళ్లకి ఇప్పుడు సడక గ్రామంలో పెద్ద తిరుగుబాటుకు సన్నాహం మొదలైంది. ఇదెవరిదో తెలుసా? మన శివసారులు లేవదీశారు.’ అంటూ ఆ రాత్రికి ముగించాడు రామన్న.
*************
గాంధారి వేళ…అర్థరాత్రి రెండు గంటల వేళకి మన్యం పెట్టుకున్న పేరు. ఆ గొప్ప నిశ్శబ్దాన్ని భరించడం ఈ లోకం వల్ల కాదన్నట్టుంది కీచురాళ్ల శబ్దం. అడపాదడపా కొండగొర్రెల అరుపులు దూరంగా. చుట్టూ వెలుగుతున్న నెగళ్లు జంతువులనే కాదు, చలిని కూడా నిరోధిస్తున్నాయి. వణికిపోకుండా చేయగలుగుతున్నాయి. అయినా గూళ్లలో పిల్లలు తల్లుల్ని కరిచి పెట్టుకుని పడుకుని ఉన్నారు. పగలంతా బండపని. నడుస్తున్నా నిద్ర ఆగడం లేదు. తుమ్మజిగురు పులిమినట్టు గుడ్డు మీద నుంచి రెప్ప అతి భారంగా కదులుతోంది. ఒకరి వెనుక ఒకరు నెగళ్ల వెంబడి నడుస్తూ, ఆ చుట్టుపక్కల అంతా పరికించి చూస్తున్నారు. ఆ రాత్రి కాపలా బాధ్యత మోస్తున్న ఇద్దరు యువకులు వాళ్లే. గంగపూజారి సోమినాయుడు, కిముడు కంటం దొర. ఊరు శనోరం. వన్య మృగాలు దాడి చేయకుండా రోజుకు ఇద్దరు యువకులు కాపలా కాస్తు న్నారు. ఎలుగొడ్లు, పులులు, చిరతలు వస్తే హెచ్చరించడం వాళ్ల పని. ఒకవేళ అవే వస్తే అందర్నీ లేపుతారు. ఆ ఇద్దరే అటుగా వచ్చారు. సంకురాత్రి వెళ్లి రెండు మాసాలు గడుస్తున్నా బుగ్గిమంచు ప్రభావం తగ్గలేదు. ఆకుల కొసల నుంచి చిన్నగా రాలుతోంది మంచు. గొంగడిని చెవుల మీదకు లాక్కుంటూ అటు చూశాడు సోమినాయుడు. చుట్టూ మండుతున్న నెగళ్లలో రెండింటి మధ్యన కనిపించింది, ఆ ఈతాకుల చాప. మధ్యకి మడత పెట్టి ఉన్న ఆ చాప ఎత్తుగా ఉంది. లోపల ఏదో ఉందనే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఎత్తు చిన్నగా కంపిస్తున్నట్టే ఉంది, తేరపారి చూస్తే…మనిషైతే చాప సమంగా పరుచుకుని పడు కుంటాడు. నిజమే, ఏదో జంతువు. బహుశా కొండచిలువ.
చాప మధ్యకు చేరి చుట్టుకుని పడుకున్నట్టుంది. ‘అటు చూడ్రా!’ నెమ్మదిగా అన్నాడు ఒక సోమినాయుడు. అటు చూసి విస్తుపోయాడు కంటందొర.
ఎత్తుగా ఉందనీ, చిన్నగా కంపిస్తోందనీ అతడూ నిర్ధారించాడు. అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్లారిద్దరూ, చాలా ధైర్యంగా. ఇద్దరూ ఎవరేం చేయాలో సైగలతోనే చెప్పుకున్నారు. కంటందొర తన బాణాకర్ర ఎత్తి పట్టుకున్నాడు కొట్టడానికి సిద్ధంగా. రెండో యువకుడు తన కర్ర అవతలి కొసను లాఘవంగా ఆ చాప మడతలోకి కొద్దిగా జొనిపి చటుక్కున వెనక్కి తీశాడు. కానీ లోపల ఒక మనిషి. ముదురు నీలం రంగు చీర ముక్క ఒకటి గోచీగా పెట్టుకుని ఉన్నాడు. పంచె తీసి, తల మీద నుంచి గుండెల వరకు చుట్టు కున్నాడు. దాని మీద అదే రంగు చీర ముక్క చుట్టాడు.
దాని పైన ఒక గోనె గుడ్డ కప్పుకుని, మోకాళ్లు డొక్కల్లోకి లాక్కుని పడుకుని ఉన్నాడు. ఉలిక్కిపడ్డాడు ఈ పరిణామానికి. ఆ మనిషి మూగయ్య. ‘మూగయ్యా! నువ్వా! గూడుంది కదా! అందులో పడుకో.’ అన్నాడు ఒక యువకుడు. ‘లోపల మంట లేదురా. చలికి ఆగలేక..’ అన్నాడు చిన్నగా వణుకుతూ. ‘ఏంటి! ఆ కిష్టయ్య గొంగడి ఇవ్వలేదా?’ అడిగాడు అతడే. ‘లేదురా ! అడిగితే కొట్టే దాకా వచ్చాడు.’ తీవ్ర నిరాశతో అన్నాడు మూగయ్య. చాలా బాధనిపించింది ఆ ఇద్దరికీ. కంటందొర చొరవ చేసి అన్నాడు. ‘నా గూడులోనే ఇద్దరం నా గొంగడి కప్పుకుని తొంగుందాం, నడు. ఇంకో జామే కదా ! ఈడుంటాడ్లే !’ అన్నాడతడు, గట్టిగా ఆవలిస్తూ. మహదానందంగా లేచాడు చాప తీసుకుని మూగయ్య. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అదే.
*************
ఆ రోడ్ రోలర్ దగ్గరగా ఉండి పనిచేయడమంటే పిచ్చెక్కిపోతోంది వాళ్లకి. అంత శబ్దం. చెవులు చిల్లులు పడిపోతున్నాయి. అక్కడి ప్రకృతి అంతా అలజడిగా ఉంది. స్వామినాయుడు గంపలో ఎర్రకంకర అక్కడ పోశాడు. ఇంకో గంప కూడా పోశాడు. వెంటనే అక్కడికొచ్చిన బాస్టియన్ సాచి దవడ మీద కొట్టాడు. ‘ఇక్కడే ఇంత పోస్తే, కంకర ఎలా సరిపోద్ది? బుద్ధిలేదా? తీసెయ్!’ అన్నాడు. రోలర్‌ని ఒక్క నిమిషం ఆపాడు విలియం. పార తీసుకుని అక్కడ పోసినది కొంచెం తట్టలోకి ఎత్తాడు స్వామినాయుడు. ఇంకా తియ్యి అని సైగ చేశాడు బాస్టియన్. గట్టిగా హారన్ కొట్టాడు విలియం. హడలిపోయి అటు చూశాడు స్వామినాయుడు.
‘ఆ మాత్రం ఉండకపోతే ఎలా?’ అని సైగ చేస్తున్నాడు విలియం. బాస్టియన్ కొట్టినంత పనిచేసి ‘ఎత్తు’ అని సైగ చేస్తున్నాడు. స్వామినాయుడు చాలావరకు కంకర తట్టలోకి ఎత్తి అక్కడ నుంచి నిష్క్రమించాడు. బాస్టియన్‌కేసి చంపేసేటట్టు చూస్తున్నాడు విలియం.
మిగతా వచ్చేవారం