– డా।। గోపరాజు నారాయణరావు
అది తప్పించుకోవడానికే ఒకసారి చటుక్కున పక్కకి తప్పుకోబోయి అక్కడే ఉన్న వేపదుంగ మీద పడిపోయాడు పరదేశి. సరిగ్గా ఎడమ మోకాలు ఆ దుంగకు తగిలి డబ్ మని శబ్దం వచ్చింది. అక్కడ నుంచి కింద ఉన్న రాయి మీదకు బలంగా జారింది కాలు. దూరం నుంచి చూస్తున్న వాళ్లలో ఎవరో గట్టిగా అన్నారట, ‘కాలు ఇరిగిపోయినట్టుంది!’ ఆందోళనగా. బాస్టియన్ గట్టిగా అన్నాడట, దానికి సమాధానంగా ‘రోడ్డు పనికి రానప్పుడు ఇంక ఈడికి కాళ్లెందుకురా?’ అని. కొండసంత నుంచి మంచం సవారితో మోసుకువెళ్లారు అతడి ఇంటికి. మిగిలిన జీవిత కాలంలో అతడు ఏనాడూ అడుగు బలంగా వేయలేడని అనిపిస్తోంది నాకు. ఆఖరికి బాధ లేకుండా నడవడం కూడా సాధ్యం కాదు.
********************
వలసంపేట: 9-3-1921
డియర్ మన్యం డైరీ!
ఆయన పేరు మామిడి భీమయ్య. వలసంపేట గ్రామస్తుడు. 45 లేదా 50 ఏళ్ల పెద్ద మనిషి. ఈ ఊరికి మూడు మైళ్లలోనే ఉంది కృష్ణదేవిపేట. గ్రామంలో ఆయనంటే ఎంత విలువో. ఎంత గౌరవమో! గ్రామ మునసబు. పక్కనున్న మాకారం మునసబు కూడా ఆయనే. ప్రజలు ఇస్తున్న ఆ గౌరవానికి అదొక కారణమైనా, వాస్తవంగా ఆ మనిషి ఎంత సాత్వికుడో! ఎంత మెత్తనివాడో! ఇవాళ నేనూ, నా ఇద్దరు సహాయకులు ఆ ఊరే వెళ్లాం. వ్యాక్సినేషన్ వేయాలి. రోజంతా మాతోనే ఉన్నాడాయన. భీమయ్య గారి గాథ విన్నాక ఇది రాస్తున్నాను. అన్నట్టు ఈ కథకో మలుపు కూడా ఉంది. అందుకే ఇంత ఇరికించి రాశాను. బారికను పిలిచి వలసంపేటలో టముకు వేయించాడాయన. టముకు సంగతి నాకు చెప్పి ఉంటే కచ్చితంగా వద్దనేవాడిని. టీకాలు వేస్తారు, అంతా రచ్చబండ దగ్గరకి రావాలంటూ బారిక అరిచిన అరుపుతో తల్లులు పిల్లలందరినీ దాచేశారు. మునసబు స్వయంగా మమ్మల్ని ఇంటింటికీ తీసుకువెళ్లి పిలిచినా వాళ్లు రాలేదు. వచ్చినా పిల్ల లేదా పిల్లడు ‘ఇక్కడ లేరు మునసబు’ అంటూ తెగేసి చెప్పేశారు. కొందరు ‘దిగువ వైద్యాలు మన్నెపు రోగాలకి చాలవు’ అన్న సామెతని విని పిస్తున్నారు సున్నితంగా. ఎంతో అమాయకమైన ఆయన ముఖం ఆ క్షణంలో చూసినప్పుడు నాకే జాలేసింది. ఇలాంటి అనుభవాలను చూసే కాబోలు, మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం జననాల నమోదు తప్పని చేసింది. కానీ అమలు చేయడం సులభం కాదు. ఏమైనా ఇవాళ వ్యాక్సినేషన్ కార్యక్రమం లేదు. ఇక అంతా ఖాళీ. దీనితో రోడ్డు పని మీదకు మళ్లింది మా సంభాషణ. లంబసింగి-గడమర్రి, గడమర్రి-డవునూరు రోడ్ల పనికి ఈ ఊరు నుంచి కూలీలు వెళ్లారట ‘భీమయ్య గారూ…!’ అన్నాన్నేను, ఏదో అడుగుదామని! ఉలిక్కిపడ్డాడాయన.
కానీ ముఖం నిండా ఆనందం. అంతలోనే కళ్లలో కొద్దిగా తడి. ‘తమరు చదూకున్నారు. మమ్మల్ని గారు అనకండి బాబూ! నాకు బాగోలేదు.’ అన్నా డాయన. ‘మీరు గ్రామపెద్దలు. ఏ ప్రభుత్వోద్యోగి అయినా మిమ్మల్ని గౌరవించాలి. పైగా వయసులో నా కంటే పెద్దవారు మీరు. గౌరవించడం నా విధి!’ అన్నాను మనస్ఫూర్తిగా. అతని మంచితనం, అమాయకత్వం నన్ను అంతగా కదిలించాయి.
బగత కులస్థుడు. తమ తాతముత్తాతలంతా సైనికులని చెప్పుకుంటారు వీళ్లు. అంటే యుద్ధవీరుల జాతి అన్నమాట. గుబురు మీసం, పంచె, పైన కండువా, అలంకారం కోసం పెట్టుకునే టెంకి గొడ్డలితో ప్రత్యేకంగా ఉంటాడీయన. నా మాటకి బ్రహ్మానందపడిపోయాడాయన. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు, ‘ఈ కొండల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు బాబూ!’ అన్నారు మళ్లీ భీమయ్య. ‘పోనీలెండి గానీ, రోడ్డు పని ఎలా జరుగుతోంది?’ అన్నాను. ‘చాలా బాగా జరుగుతంది. రెండేళ్ల నుంచి నేనూ, మా ఊరోళ్లు కూడా పోతన్నాం.’ అన్నాడు భీమయ్య. ‘ఎందరు?’ అన్నాన్నేను. ‘పది మందిని పంపాలి బాబూ! నేనూ ఉండాలి. మొన్న ఇరవై గొలుసుల రోడ్డు మాకు అప్పగించారు. అంటే రెండు ఫర్లాంగులు.’ ‘కూలిడబ్బుల మాటే మిటి? ఏవేవో వింటున్నాం!’ అన్నాను. ‘అప్పుడప్పుడు ఆలీసెం చేసినా బాగానే ఇస్తన్నారు…’ నామాట పూర్తి కాకుండానే చెప్పాడు భీమయ్య. అప్పుడే మాకూడా వస్తున్న మరో గ్రామ యువకుడు మామిడి చిన్నయ్య చురుగ్గా చూశాడు భీమయ్య కేసి. ఏదో విసురుగా అనబోయాడు గానీ, అగిపోయాడు ఎందుకో. అతడి పక్కనే ఉన్న ఆ గ్రామవాసి పొత్తూరి బాగయ్య మాత్రం జాలిగా చూశాడు భీమయ్య కేసి. అవేం పట్టనట్టు చెప్పుకుపోతున్నాడు భీమయ్య. ‘కబురు చేసినప్పుడల్లా పది మందిని తీసుకుపోతాను. బేస్టీన్ దొర మంచోడు బాబూ! మా అందరికీ పని చూపెట్టాడు. అక్కడే ఉంటాం కాబట్టి మనిషికి 14 కుంచాల బియ్యం కొలుస్తారు.. ఇంకా..’ ఏదో చెప్పబోయాడు భీమయ్య. బొమ్మరిల్లుల్లా ఉన్నాయి గుడిసెలు. వెదురు తడికల మీద పేడ కలిపిన మట్టి అలికారు.
దాని మీద జేగురు రంగు చారలు వేశారు. సున్నంబొట్లు పెట్టారు. పరిశుభ్రంగా ఉన్నాయి ఇళ్లు, పరిసరాలు. ప్రతి ఇంటి మీద రెల్లు గడ్డి కప్పు, దానిని ఆవరిస్తూ ఏదో ఒక పాదు. ‘మునసబు! మంచినీళ్లు కావాలా?’ ఎవరో వృద్ధ మహిళ అరుస్తోంది ఆ పక్క. ఆ పిలుపుతో భీమయ్య ఛాతీ ఉప్పొంగిపోయింది. ‘అడగాలా! లోటా బాగా కడిగి తీసుకురాయే! బాబుగారు పుచ్చుకుంటారు.’ అన్నాడు భీమయ్య. తెల్లగా తోమిన ఇత్తడి చెంబు, గ్లాసులతో నీళ్లు పట్టు కొచ్చిందామె. అంతా మన్యం కట్టు బొట్టు. కుండలో నుంచి తెచ్చింది కాబోలు చల్లగా, రుచిగా ఉన్నాయి నీళ్లు. ‘వచ్చావు కదా, ముసలోణ్ణి ఓసారి చూసి పోరాదూ! ఎప్పుడూ నీ ఊసే ఆడికి.’ అందామె. భీమయ్య మొహమాట పడుతూ ఉంటే నేనే అన్నాను. ‘వెళ్లండి’ అని. ఆమె వెనుకే గుడిసెలోకి వెళ్లాడు భీమయ్య. రెండు నిమిషాల తరువాత చిన్నయ్యతో మాటలు మొదలుపెట్టాను.
‘ఏం చిన్నయ్యా! నీవూ వెళతావా, రోడ్డు పనికి?’ ‘వెళతాను దొర!’ అన్నాడతడు. ‘ఎలా ఉంది!’ అడి గాను నేను. ‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడతది దొర!’ చిన్నయ్య అన్నాడు డగుత్తికతో. చుట్టూ చూసి నెమ్మదిగా చెప్పాడతడు. ‘అక్కడ మమ్మల్ని మనుషులు గానే చూడరు దొర. ఎవర్నీ వదలు. ఈ భీమయ్యని చూడు దొర. ఆడు దేవుడు. మునసబయినా మాయా మర్మం తెలీదు. మా అందరికి ఆడు మునసబు.
కానీ ఆళ్ల దృష్టిలో-మునసబంటే ఆళ్ల బంట్రోతు లకి కూడా ముడ్డి కడిగేవోడు. ఆణ్ణి కూడా కొట్టారు దొర. కిందపడేసి దొల్లించి దొల్లించి కొట్టారు. పాపం, ఆ మాట చెప్పుకోలేడు. కూలీలని అంపకపోతే ఈ ఊరే వచ్చి నలుగురు ముందు బాస్టీన్ దొర చేయి చేసుకుంటాడని బయం ఆడికి. అందుకే మమ్మల్నం దర్ని బతిమాలో, బామాలో కూలికి తీసుకుపోతాడు. చాలాసార్లు మా దెబ్బలు ఆడు తిన్నాడు. ఆళ్లు కూల్డబ్బులు ఇవ్వకపోతే షావుకారు కాడ తెచ్చి మాకు ఇస్తాడు. ఈడికి ఆనక బాస్టీన్ ఇస్తే ఇస్తాడు. లేదా, ఇవ్వడు. ఈడు ఎప్పుడూ బాస్టీన్ దొర కొట్టలేదనే చెబుతూ ఉంటాడు. కొట్టాడని చెబితే, సిగ్గులేదా పనికెళ్లడానికి అని ఊరోళ్లంతా ఊస్తారని సిగ్గు. నిజమే బాస్టీను కొట్టలేదు. ఈడంటే బాస్టీను దొరకి మర్యాదేం కాదు. ఎందుకో ఇంతవరకు చేయెత్తలేదు, అంతే.
కానీ బాస్టీను దొర బంట్రోతు ఉన్నాడు, కిష్టయ్య అని. ఆడు దొర, ఆడు మా మునసబు మీద, మా ఊరి పెద్ద మీద చేయి చేసుకున్నాడు. ఏ తప్పూ లేక పోయినా కొట్టాడు దొర. పాపం. మా అందరి ముందు ఏరా పోరా అంటాడు. అది తన ఊళ్లో జరిగితే ఈడు పొడుచుకు చచ్చిపోతాడు దొర. అంత అభిమానం ఈడికి. ఇదిగో, దొర.. భీమయ్య వస్తున్నాడు. ఇంక చెప్పను, ఆడు తట్టుకోలేడు.’ అన్నాడు చిన్నయ్య.
గ్రామ మునసబు భీమయ్య ఠీవిగా, నవ్వుకుంటూ వస్తున్నాడు. ‘మీ మీద కూడా చెయ్యి చేసుకున్నాడా?’ అన్నాను నేను. అనవసరమైన ప్రశ్న కాబోలు. ‘అదీ జరిగింది.కానీ బాబూ! మా మునసబును కొడితే, మా ఊరోళ్లందరినీ కొట్టినట్టే కదా!’ దానికే పొత్తూరి బాగయ్య గొణుగుతున్నట్టుగా అన్నాడు. ‘మళ్లీ ఎప్పుడు రోడ్డు పని?’ అడిగారు డాక్టర్ మూర్తి. ‘ఇంకో ఆరేడు మాసాలకి మళ్లీ మొదలవుతాయి. అంతా ఎల్లాల్సిందే!’ అన్నాడు భీమయ్య. ‘మళ్లీ మా భీమయ్య షావుకారు కాడ డబ్బులు తెచ్చి ఇవ్వాల్సిందే.’ వినిపించీ వినపించకుండా గొణిగాడు బాగయ్య. అన్నట్టుగానే ఏడు మాసాలకి చిట్రాళ్లగొప్పు దగ్గర మొదలైంది రోడ్డు పని. ఎండవేడి పెరగడంతో మరింత వేగంగా పని జరుగుతోంది. సందేహిస్తూ, బెరుకుగానే అడుగులో అడుగు వేసుకుంటూ అప్పుడే వచ్చాడు మామిడి భీమయ్య. చూడగానే తిట్లు లంఘించుకున్నాడు బాస్టియన్. ‘ఏరా భీమయ్యా! రోడ్డు పనికి మనుషుల్ని పంపమంటే, మీరేంట్రా కాటికి కాళ్లు చాచుకున్నవాళ్లని పంపుతున్నారు? మా ప్రాణాలెందుకురా తింటారు? చూడు ఈ రెండు రోజుల నుంచీ ఏమైనా పని జరిగినట్టుందా?’
‘అదేంటి దొరా! ఒంచిన నడుం ఎత్తడం లేదు. నాలుగు గొలుసుల మేర పని సాగిందికదా దొర!’ నసుగుతూ చెప్పాడు భీమయ్య. ‘అంటే నాకు కళ్లు లేవంటావా?’ కళ్లెర్రచేస్తూ అన్నాడు బాస్టియన్. ‘తప్పుతప్పు దొర. అంత మాటనలగల్నా? ఏదో కొండోళ్లం. మాటా మర్యాద తెలీనోళ్లం. మన్నిం చాలి.’ అంటూ కూలీల వైపు తిరిగి అన్నాడు గట్టిగా. ‘ఏరా బుద్ధి లేదా? ఎందుకురా దొరగారికి కోపం తెప్పిస్తారు? కొంచెం చురుగ్గా ఉండడ్రా!’ అన్నాడు భీమయ్య ‘అలా చెప్పు. నాకు చిర్రెత్తుకొచ్చిందంటే… తెలుసుకదా!’ అన్నాడు బాస్టియన్.
నిజానికి శరవేగంతో జరిగిపోతోంది పని. అందుకు వాళ్లలో కనిపిస్తున్న ఆయాసమే నిదర్శనం. ఆ శబ్దాలన్నీ కలసిపోయి ఒక వింత శబ్దాన్ని సృష్టిస్తు న్నాయి. ఆరుగురు వంతున విభజించారు కూలీలని. కొన్ని జట్లు నేలని తవ్వుతూ ఒంపు గునపాలతో రాళ్లని తొలగిస్తున్నాయి. కొండనేల నిండా చిన్నవీ పెద్దవీ రాళ్లే. ఆ రాళ్లను తట్టల్లో పెట్టుకుని దూరంగా పట్టుకువెళుతున్నారు ఇంకొందరు. ఓవర్సియర్ సంతానం పిళ్లై • పెట్టిన గుర్తు మేరకు కొట్టిపడేసిన చెట్లను పక్కకు లాగి రోడ్డు పనికి ఆటంకాలు తప్పిస్తున్నారు. ఇంకొందరు పార లతో మట్టిని సరిచేసి, గోతులు పూడ్చి రహదారికి ఒక రూపం తెస్తున్నారు. మరికొందరు దానిని మొదటి దఫా చదును చేసే పనిలో ఉన్నారు. కొన్ని జట్లు తట్లతో ఎర్ర కంకర మోసుకొచ్చి రోడ్డు మీద పరుస్తున్నాయి. దాని మీద కొందరు బుంగలతో నీళ్లు చల్లుతున్నారు బాగా తడిసేటట్టు. ఆపై ఇంకొందరు బలంగా చెక్క దిమ్మెసాలతో మోదుతున్నారు. అంతా ఎవరో తరుముకు వస్తున్నట్టే పని చేస్తున్నారు, భయం భయంగా. ఎర్ర కంకర దుమ్ము నిరంతరంగా లేస్తూనే ఉంది. ఆ ప్రాంతమంతా అదే. పది నిమిషాల తరువాత మళ్లీ పిలిచాడు భీమయ్య, వినయంగా, ‘దొరా!’ ఏమిటన్నట్టు చూశాడు బాస్టియన్. ‘తర్వాత లెక్క చూసుకుందామంటే, మా ఊరి నుంచి తీసుకొచ్చిన పదిమందికి నేనే కూలీ చెల్లించాను. షావుకారు కాడ అప్పు తెచ్చి ఇచ్చాను దొరా! వంద రూపాయలు..ఆరు మాసాలైపోతాంది. అది తిరిగి ఇచ్చేయాల! తమరు ఈరోజు దయచూడాలి!’ అన్నాడు భీమయ్య. చాలా తీవ్రంగా చూశాడు బాస్టియన్. ‘ఇది ఎవరింట్లో పనిరా? నా సొంత పనా? నా ఇంట్లో పెళ్లా? నా మావ ఇంట్లో పెళ్లా? పోనీ మీ ఇంట్లో పెళ్లా? కాదు కదా! ఇది ఘనత వహించిన బ్రిటిష్ చక్రవర్తి పని. లార్డ్ సేవ్ ది కింగ్. ఎవరి కోసం పెడతావురా డబ్బు? ప్రభుత్వం పని ఇది. నువ్వు ఎంత డబ్బు పెట్టినా, వాళ్లు ఎంతకాలం పనికొచ్చినా చక్రవర్తి కోసం అందతా. నా కోసం కాదు. ఇప్పుడేం కుదరదు. మాట్లాకుండా పో!’ అన్నాడు పెద్ద గొంతుతో. ఖిన్నుడైపోయాడు భీమయ్య. ‘చిత్తం…!’ ఏం మాట్లాడాలో తెలియక బెదురు చూపులతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
********************
కృష్ణదేవిపేట: 27-2-1921
డియర్ మన్యం డైరీ!
చక్కని ఊరు. అందమైన పేరు. కృష్ణుడి దేవేరు లలో ఏ దేవి పేరు మీద ఊరు పుట్టిందో! దీని గురించి ఇక్కడ ఎవరూ చెప్పలేకపోయారు. ఊరి పెద్ద చిటికెల భాస్కరనాయుడు గారు అద్భుతమైన మనిషి. బ్రాహ్మల ఇంటిలో పురమాయించి చక్కని భోజనం ఏర్పాటు చేశారు. నేనూ, మా సహాయకులు చాలా ఆనందించాం. కాబట్టి ఇవాళ నీవు ఫుడ్ డైరీగా మారావన్నమాట. భాస్కర నాయుడి గారి ఆతిథ్యంతో పాటు, వలసంపేటలో చిన్నయ్య, బాగయ్య చెప్పిన మాటలలో నేను రాయకుండా వదిలేసిన విషయాలు ఉన్నాయి- స్థలాభావం వల్ల. అన్నట్టు అవి కూడా ఫుడ్‌కి సంబంధించినవే. ఎటొచ్చీ గూడెం డిప్యూటీ తహసీల్దార్ బాస్టియన్ తిండి గురించి. ఇక్కడ కొంత నయం. వ్యాక్సినేషన్‌కి కొందరైనా ఒప్పుకున్నారు. భాస్కరనాయుడుగారి ఆతిథ్యం ఏనాటికీ మరచి పోలేనిది. ఆయన చాలా భక్తిపరుడు కూడా. ఇక బాస్టియన్ ఫుడ్ గురించి! ఇది రంప డివిజన్‌లోనే ఉన్నా కీర్తి ఇక్కడికి కూడా వ్యాపించింది. గడమర్రి- డవునూరు రోడ్డు పనికి మొదటిసారి ఐదు రూపా యలు ఇచ్చారట- పది మందికి. మరోసారి ఎనిమిది రూపాయలు ఇచ్చారట గానీ, వెంటనే పక్కకి పిలిచి నాలుగు రూపాయలు తిరిగి తీసుకున్నాడట కిష్టయ్య. బాస్టియన్ దొరకి ధాన్యం కొనాలనీ, అందరి దగ్గరా తీసుకుంటున్నామని చెప్పాడట. ఇంకోసారి ఓవర్సీర్ సంతానం పిళ్లై • 12 రూపాయలు కూలి ఇచ్చాడట. వెంటనే గద్దలా వాలిపోయాడట కిష్టయ్య. ఒక రూపాయి బొడ్లో చేయిపెట్టి తీసుకుని, తన మామూలు అని చెప్పాడట. ఆరు అణాలు కూలి అని చెబుతారు గానీ, రెండు అణాలే ఇస్తారట. ఇది చాలామంది చెబుతున్నారు. ఇక్కడ కృష్ణదేవిపేట-కాట్రగడ్డ రోడ్డు పని జరుగుతోంది.
కానీ దారుణాలేమీ లేవు. ఆ మధ్యాహ్నం పనైపోయింది. అక్కడ నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని మంప గ్రామానికి వెళదామంటే డాక్టర్ మూర్తి సహాయకులు భయపడ్డారు. వెదురు పొదలలో సాయంత్రం వేళ ప్రయాణించవద్దన్నారు. వెనక్కి తిరిగి వెళ్లిపోవడం లేదా ఆ రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే గూడెం బయలుదేరడం ఏదో ఒకటి చేయాలని, బారికను తీసుకురమ్మని సహాయకుడిని పంపారాయన. ఆ సమయంలో ఆ సంఘటన జరిగింది. దానినే రాసుకున్నారాయన. డాక్టర్ మూర్తి సహాయకుడు ఒకరు దీపం వెలిగించి పక్కనే ముక్కాలి పీట వేసి పెట్టారు. ఒక్క క్షణం ఆగి మళ్లీ చదవడం ఆరంభించారాయన.
కొయ్యూరు, 3-3-1921
డియర్ మన్యం డైరీ!
అన్ని రామచిలుకలని జీవితంలో ఒకే చోట ఎప్పుడూ చూడలేదు. మళ్లీ చూడగలనా? అనుమా నమే. ఆ మామిడిచెట్టు మీద నుంచి ఒక్కసారిగా ఆకాశంలోకి లేచాయి, ఆకుపచ్చ రంగే ఉన్నా ఇంధ్ర ధనుస్సులా అనిపించింది. అడవంటే ఎన్ని ఆకుపచ్చ అరలో! లోయల నుంచి సూర్యకాంతి తమ సొంత మన్నట్టు అన్ని చెట్ల కంటే పైకి ఎదిగినట్టు కనిపిస్తాయి మద్ది, వేగిస, మామిడి, నేరేడు, బండారు చెట్లు. సరే, మీరే పైన ఉండండి అన్నట్టు ఒక ఎత్తులో ఆగిపోయి ఉంటాయి- ఉసిరి, మారేడు, దేవదారు, ముషిణి, రేల, తడ, వెదురు. వీటిని అల్లుకుని ఉంటాయి అడ్డాకులు, మోదుగ, గిల్లు తీగలు. మళ్లీ నేలంతా పచ్చదనమే. అడవి చేమంతి, పపిడి, చిట్టిజాన, కొండవెంపలి, కరివేప, సుగంధిపాల పొదలు, కన్నెజీలుగులు, పుట్టువెదురులు, చెంగలి పొదలు పరుచుకుని ఉన్నాయి. కొయ్యూరు ఎలా వచ్చానో చెబితే మా ప్రాంతం వాళ్లు నమ్మక పోవచ్చు. అచ్చంగా దడి కట్టినట్టు ఆ చిన్న కాలిబాటకు అటూ ఇటూ వెదురు పొదలు, దట్టంగా. అటు పక్క పొదలు, ఇటు పక్క పొదలు రహస్యం మాట్లాడుకుంటున్నట్టు అంటిపెట్టుకుపోయి ఉన్నాయి పైన ఆకుపచ్చ ఆకులు. ఇలాంటి ప్రదేశాలకి కూకినలోవ గొంది అని పేరు పెట్టుకున్నారు ఇక్కడ. ఈ ఊరే ఓ కూకిన లోవగొంది. సూర్యుడిని కూడా చొరబడనీయడం లేదు. పైన పందిరేసినట్టే ఉంది. పచ్చి వెదురులోనూ ఎంత అందం!
(ఇంకా ఉంది)