జూలై 26 కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌

‌కార్గిల్‌… ఈ ‌పేరు వినగానే భారతీయుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక చేత్తో స్నేహహస్తాన్ని అందిస్తూనే, మరో చేత్తో వెన్నుపోటు పొడిచిన పాకిస్తాన్‌ను మనం ఎప్పటికీ క్షమించలేం. పాకిస్తాన్‌ ‌సైన్యానికి చుక్కలు చూపించిన భారత సైనికులు 1999, జూలై 26న ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’‌ని పూర్తిచేశారు. ఈ యుద్ధంలో ఎందరో సైనికులు అమరులయ్యారు. వారి త్యాగాలకు, కార్గిల్‌ ‌యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న మనం ‘కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌’ ‌జరుపుకుంటున్నాం.

కార్గిల్‌ ‌గుండా వెళ్లే శ్రీనగర్‌-‌లేహ్‌ ‌జాతీయ రహదారిని ధ్వంసంచేస్తే కశ్మీర్‌కు, లద్ధాఖ్‌కు సంబంధాలు తెగిపోతాయి. భారత సైన్యానికి ఆయుధాలు సరఫరా చేసే ప్రధాన మార్గం లేకుండా పోతుంది. అప్పుడు సియాచిన్‌ ‌ప్రాంతాన్ని ఆక్ర మించుకోవచ్చు అని పాకిస్తాన్‌ ‌సైన్యం కుట్ర పన్నింది. హిమాలయాలలోని కారకోరం శ్రేణిలో భారత్‌, ‌చైనా, పాకిస్తాన్‌ల సరిహద్దు ప్రాంతం- సియాచిన్‌. ఇది ఎవరి అధీనంలో ఉంటే వారికి యుద్ధం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బ్రిటిష్‌ ‌వారు దీనిని ఏ దేశానికి చెందుతుందో స్పష్టం చేయకుండా వెళ్లిపోయారు. 1947-1948 ఇండో, పాక్‌ ‌యుద్ధం తరువాత ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కరాచిలో భారత్‌, ‌పాక్‌ ‌మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కశ్మీర్‌ను మహారాజు హరిసింగ్‌ ‌బేషరతుగా భారతదేశంలో కలుపుతూ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని పాకిస్తాన్‌ ఒప్పుకుంది. అతిశీతల ప్రాంతమైన దీనిని పాకిస్తాన్‌ ఆ‌క్రమించుకుంటోందని భావించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ‘ఆపరేషన్‌ ‌మేఘదూత్‌’ ‌ద్వారా 1984 ఏప్రిల్‌ 13‌న భారతదేశ పరం చేసింది. 1987లో పాకిస్తాన్‌ ‌సియాచిన్‌ ఆ‌క్రమణకు విఫలయత్నం చేసింది.

ఆపరేషన్‌ ‘‌శక్తి’ పేరుతో వాజపేయి ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానంతో పోఖ్రాన్‌లో 1998 మే 11, 13 తేదీల్లో అణుపరీక్షలు జరిపింది. ఇందులో భారత క్షిపణి పితామహుడుగా పేరొందిన అబ్దుల్‌కలాం ప్రముఖ పాత్ర పోషించారు. ఆరవ అణుసామర్థ్యం కలిగిన దేశంగా భారత్‌ ‌నిలిచింది. ఈ పరిణామం పాకిస్తాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఏడవ అణుసామర్థ్యం గల దేశంగా నిలవాలని హడావిడిగా పాకిస్తాన్‌.. ‌చైనా నుంచి అరువు తెచ్చుకొని 1998 మే 28, 30 తేదీల్లో బలూచిస్తాన్‌లోని రాస్‌ఖో కొండల్లో చాగల్‌ ‌ప్రాంతంలో రెండు అణు పరీక్షలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో దక్షిణాసియాలో శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ‌ప్రయత్నించారు. భారత్‌, ‌పాక్‌ ‌మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని సలహా ఇచ్చారు. శాంతిని కోరుకొనే అప్పటి భారతదేశ ప్రధాని వాజపేయి లాహోర్‌కు బస్సుయాత్రను కూడా ప్రారంభించారు. కానీ ఆ దేశ అప్పటి సైన్యాధ్యక్షుడు జనరల్‌ ‌పర్వేజ్‌ ‌ముషారఫ్‌కి లాహోర్‌ ఒప్పందం నచ్చలేదు. ‘గ్యాంగ్‌ ఆఫ్‌ ‌ఫోర్‌’‌గా పిలిచే ముషారఫ్‌, ‌చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ‌జనరల్‌ అజీజ్‌ ‌ఖాన్‌, ‌కోర్‌ ‌కమాండర్‌ ‌జనరల్‌ ‌మెహమూద్‌, ‌నార్తర్న్ ఇన్ఫాంట్రీ కమాండర్‌ ‌జావెద్‌ ‌హసన్‌ ‌కలిసి కార్గిల్‌ ‌యుద్ధానికి వ్యూహం రచించారు. దీనికి ‘ఆపరేషన్‌ ‌బ్ర’ అని పేరు పెట్టారు. ద్రాస్‌, ‌ముస్కో, తుర్తుక్‌, ‌బతాలిక్‌, ‌కార్గిల్‌ ‌ప్రాంతాల్లో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ ‌డిగ్రీలకు పడిపోతాయి. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్‌, ‌పాకిస్తాన్‌లు చలికాలంలో ఆయా ప్రాంతాల్లో తమ సైన్యాన్ని ఉపసంహరించు కుంటాయి. కానీ భారత సైన్యం లేని సమయంలో పాకిస్తాన్‌ ‌సైన్యం ఈ ప్రాంతాలను ఆక్రమించు కోవడం ప్రారంభించింది.

గార్కల్‌ ‌గ్రామానికి చెందిన తాషీనామ్‌ ‌గ్యాల్‌ అనే పశువుల కాపరి గేదె ఒకటి తప్పిపోయింది. దానిని వెతుకుతూ ఆయన సరిహద్దు ప్రాంతాలకు 1999, మే 2న వెళ్లాడు. తన బైనాక్యులర్‌ ‌ద్వారా గేదెను ఎవరో చంపి, తిన్నారని గ్రహించాడు. అక్కడ కొందరు భారతీయ సైనికుల మృతదేహాలను కూడా గమనించాడు. కొన్ని బంకర్లు కనిపించాయి. ఈ విషయాలను వెంటనే భారత సైన్యానికి చెప్పాడు. కెప్టెన్‌ ‌సౌరబ్‌ ‌కాలియా నాయకత్వంలో ఐదుగురు గస్తీ సైనికులు అక్కడికి వెళ్లారు. వారిపై పాక్‌ ‌సైన్యం దాడిచేసి చంపేసింది. ఇదంతా తీవ్రవాదుల పని అన్నట్లుగా పాక్‌ ‌నమ్మించే ప్రయత్నం చేసింది. ముషారఫ్‌, అజీజ్‌లు కార్గిల్‌ ‌ప్రాంతంలోని సైనికుల గురించి మాట్లాడుకున్న ఆడియో టేపులను భారతసైన్యం ఛేదించింది. దీంతో కార్గిల్‌ ‌ప్రాంతాన్ని ఆక్రమించింది పాకిస్తాన్‌ ‌సైన్యమేనని స్పష్టమైంది. ప్రధాని వాజపేయి.. నవాజ్‌ ‌షరీఫ్‌కి ఫోన్‌ ‌చేసి అడిగితే, తనకు ఈ విషయం తెలియదని తప్పించు కున్నాడు. వెంటనే వాజపేయి, అప్పటి రక్షణశాఖ మంత్రి జార్జ్ ‌ఫెర్నాండేజ్‌, ‌భారత సైన్యాధ్యక్షుడు వేద్‌‌ప్రకాష్‌ ‌మాలిక్‌తో సమావేశమై సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంచేశారు.

మే 3, 1999న ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’ ‌ప్రారంభం

మొదట్లో భారతసైన్యం ఎదురుదెబ్బలు చవిచూసింది. వందల కొద్దీ సైనికులను, రెండు మిగ్‌ ‌విమానాలను, ఒక హెలికాప్టర్‌ను కోల్పోవలసి వచ్చింది. ఇజ్రాయిల్‌ ‌మిరాజ్‌ 2000 ‌ఫైటర్‌ ‌జెట్‌ల సహాయంతో ‘ఆపరేషన్‌ ‌సఫేద్‌ ‌సాగర్‌’ ‌పేరిట భారత వైమానికదళం శత్రుసైన్యంపై బాంబుల వర్షం కురిపించి కొన్ని స్థావరాలను నేలమట్టం చేసింది. తర్వాత 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్‌ ‌పర్వత శిఖరాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం – 110 డిగ్రీల చలిగాలుల మధ్య పోరాటం సాగించాల్సి వచ్చింది. కర్నల్‌ ‌రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో సైన్యాన్ని అర్జున్‌, ‌భీమ, అభిమన్యు అని మూడు భాగాలుగా చేసి త్రిముఖ వ్యూహం పన్ని 1999, జూన్‌ 14‌న టోలోలింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధంలో మేజర్‌ ‌వివేక్‌ ‌గుప్తాతో పాటు మరికొంత మంది సైనికులను కోల్పోవలసి వచ్చింది.

టైగర్‌ ‌హిల్‌ ‌ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం చాలా కష్టపడింది. నిట్టనిలువుగా ఉన్న కొండను ఎక్కి సుబేదార్‌ ‌యోగేంద్ర సింగ్‌ ‌యాదవ్‌ ‌ప్రాణాలకు తెగించి శత్రు స్థావరాలపై గ్రెనైడ్‌ ‌విసిరి ధ్వంసం చేశాడు. శరీరంలో బుల్లెట్లు దిగుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా లెక్కచేయక ఆ యుద్ధవీరుడు శత్రు సైనికులకు చుక్కలు చూపించాడు. గాయాల పాలైన యోగేంద్రసింగ్‌ ‌యాదవ్‌ను తోటి సైనికులు కాపాడి మిలటరీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధంలోనే తెలుగు వ్యక్తి మేజర్‌ ‌పద్మఫణి ఆచార్య శత్రువులతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడు.

17 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాయింట్‌ 5140 ‌ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగిన యుద్ధానికి లెఫ్టినెంట్‌ ‌కర్నల్‌ ‌యోగేష్‌ ‌కుమార్‌ ‌జోషి నాయకత్వం వహించారు. సైన్యాన్ని రెండు భాగాలుగా చేసి ఒక దానికి లెఫ్టినెంట్‌ ‌సంజీవ్‌ ‌సింగ్‌, ‌మరొక దానికి లెఫ్టినెంట్‌ ‌విక్రం బాత్ర నాయకత్వం వహించారు. ఇద్దరూ విజయం సాధించి పాయింట్‌ 5140‌ని స్వాధీన పరచుకున్నారు. విక్రం బత్రా సాహసానికి మెచ్చి కెప్టెన్‌గా ప్రమోషన్‌ ‌కూడా ఇచ్చారు.

కెప్టెన్‌ ‌విక్రం బత్రా, కెప్టెన్‌ అనుజ్‌ ‌నయ్యర్‌ ఆధ్వర్యంలో సైన్యం పాయింట్‌ 4875 ‌స్వాధీనానికై జూలై 8న బయల్దేరింది. మూడు రోజుల భీకర యుద్ధం అనంతరం జూలై 11న ఆ ప్రాంతం మన వశమైంది. గాయపడిన భారత సైనికుడికి సహాయం చేస్తున్న సమయంలో కెప్టెన్‌ ‌విక్రం బత్రాను పాకిస్తాన్‌ ‌సైనికుడు వెనక నుంచి తుపాకీతో కాల్చడంతో ‘భారత్‌ ‌మాతాకీ జై’ అంటూ ఆ యుద్ధవీరుడు నేలకొరిగాడు. పాయింట్‌ 4875 ‌శిఖరాని ‘బత్రా టాప్‌’ అని పేరు పెట్టారు.

వాజపేయి యుద్ధ నీతి

ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ అనిల్‌ ‌యశ్వంత్‌ ‌వాజపేయికి ఫోన్‌ ‌చేసి ‘ఆపరేషన్‌ ‌సఫేద్‌ ‌సాగర్‌’ ‌విజయవంతంగా సాగుతోందని, ఎల్‌ఓసీని దాటి పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరాడు. కానీ వాజపేయి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎల్‌ఓసీని దాటవద్దని చెప్పారు. ఈ నిర్ణయం భారత దౌత్య విజయానికి కీలకమైనదిగా విశ్లేషకులు భావించారు. వాజపేయి యద్ధనీతిని ఆసియన్‌ ‌దేశాలు, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాలే కాకుండా అమెరికా, చైనా కూడా స్వాగతించాయి. అప్పటి అమెరికన్‌ అధ్యక్షుడు బిల్‌ ‌క్లింటన్‌ ‌నవాజ్‌ ‌షరీఫ్‌కు ఫోన్‌ ‌చేసి తక్షణం యుద్ధం విరమించా ల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. జూలై 14, 1999న వాజపేయి ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’ ‌సఫలం అయ్యిందని ప్రకటించారు. కార్గిల్‌ ‌యుద్ధం ముగిసిందని జూలై 26న భారత ప్రభుత్వం ప్రకటించింది. కార్గిల్‌ ‌యుద్ధ ఫలితంగా 1999 అక్టోబర్‌లో పాకిస్తాన్‌ ‌ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌తన పదవిని కోల్పోయారు.

ఎందరో వీరుల త్యాగఫలం

ఈ యుద్ధంలో భారత సైన్యం దాదాపు 130 స్థావరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. భారత సైనికులు 527 మంది అమరులయ్యారు. 1365 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా టోలోలింగ్‌ ‌పర్వతం వద్ద ద్రాస్‌ ‌వార్‌ ‌మెమోరియల్‌ను నిర్మించారు. దీనిని ‘విజయ్‌ ‌పథ్‌’ అని పిలుస్తారు. యుద్ధంలో పాకిస్తాన్‌ ‌సైనికులు దాదాపు 4000 మంది మరణించి ఉంటారని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రకటించారు.

శత్రుసైన్యాన్ని మట్టుపెట్టడంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడిన కెప్టెన్‌ ‌విక్రం బత్రా, లెఫ్టినెంట్‌ ‌మనోజ్‌ ‌కుమార్‌ ‌పాండే, రైఫిల్‌ ‌మ్యాన్‌ ‌సంజయ్‌ ‌కుమార్‌, ‌గ్రెనేడియర్‌ ‌యోగేంద్రసింగ్‌ ‌యాదవ్‌లకు భారత అత్యున్నత సైనిక పురస్కారమైన ‘పరమ వీరచక్ర’ను మన ప్రభుత్వం ప్రకటించింది.

– కె. హరిమధుసూదనరావు,  సహాయ ఉపాధ్యాయుడు, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, మైలవరం, కడప జిల్లా

About Author

By editor

Twitter
YOUTUBE