– పాండ్రంకి సుబ్రమణి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
వేణుగోపాల్ సర్కారువారి కార్యాలయంలో అడుగుపెట్టీ పెట్టడంతోనే ఓ బరువైన నిశ్వాసం విడిచిపెట్టాడు. అరమోడ్పు కళ్లతో అసహనంగా బెరుకు బెరుకుగా పరకాయించి చూసాడు, నక్క ముందు బిత్తర చూపులతో నిల్చున్న కుందేలులా. అతడక్కడికి రావడం అది ఆరవ సారేమో! అక్కడి వాతావరణం ఎప్పటిలాగే ఉంది. తేమగాలితో నిండిన వర్షాకాలపు సాయంత్రంలా. ఈసురోమని మనుషులుంటే దేశం గతి ఎలాగుంటుంది మరి! కానీ, అతణ్ణి చూసిన వెంటనే అక్కడ పనిచేసుకుంటున్న కొంతమంది ముఖాల్లో వెలుగు నిప్పురవ్వలా ఫెళ్లుమంది.
ఏదో ఒక ఆరాటం. వెర్రిముఖం వేసుకుని, భుజాలు వేలాడదీసుకుని వస్తూన్న పార్టీని చూస్తే, అక్కడి వాళ్లకు పుట్టెడు హుషారు పుట్టుకువచ్చే తీరుతుందిగా! ఇప్పటి లోకం తీరు అదేగా! అయితే అక్కడ కానవస్తూన్న వ్యవస్థలో గుర్తించదగ్గ అంశమొకటుంది. తలనుండి తోక వరకూ అందరిదీ ఒకే ధోరణి-ఆబగా అందిపుచ్చుకోవడం. సణుగుడికి తావివ్వని విధంగా బోడిగుండు చేసి పంపించడం. ఒకరివైపు మరొకరు ఎట్టి పరిస్థితిలోనూ చేయెత్తి చూపించకుండా చూసీ చూడనట్లు ఉండటం. ఇది కాదా ఐక్యత. కట్టడిగా ఒక్కుమ్మడిగా దోపిడీ చేయడం. అతడికి ఎప్పుడో చూసిన సినిమా కళ్లముందు గిర్రున తిరిగింది. ఆలీబాబా-నలభై చోరులు. ఇదంతా ఓ విధమైన రాజకీయ తతంగం. మంత్రాంగం.
ఒకసారి వేణుగోపాల్ ఆక్రోశం ఆపుకోలేక, అరికాలి మంటనెత్తికి సోకి అడిగేసాడు హెడ్ గుమాస్తాను- ఒక సెటిల్మెంటు కేసు పూర్తి చేయడం కోసం కనిపించిన వారందరికీ పేలాల్లా రాల్చుకుంటూ పోతే మా గతేమి కాను సార్? మరీ నిర్దయగా ఉంటే మాబోటి సగటు జీవులు బ్రతికి బట్టకట్టవద్దూ!’ దానికతను ముఖం చిన్నబుచ్చుకోలేదు సరికదా, కస్సుమని లేచిన పాములా బదులిచ్చాడు, రవంత తడబాటుకి కూడా లోనుకాకుండా- ‘ఊరికే ఇస్తున్నావా మహానుభావా! ఎన్ని చిక్కులు విడదీస్తూ ఇక్ష్వాకుల కాలం నాటి ఎన్ని పేపర్లు ప్రోగుచేసుకుంటూ సాగాలి! అయినా తెలియక అడుగుతాను నువ్వు నాకు మాత్రమే బంధుప్రీతితో ఇస్తున్నావా? అలాగాని అనుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. మాపైనున్న అధికారుల నుండి క్రింది స్థాయి పేషీ వరకూ పంచుకుంటూ వెళ్లాలి. లేకపోతే పుట్ట పగిలిపోద్ది’ నిబ్బరంతో కూడిన ఆ అధికార పూర్వకమైన వివరణ విని వేణుగోపాల్ నిజంగానే ముఖం వేళ్లాడేశాడు. అడిగేది భిక్షే-కాని అది అధికార భిక్ష. తరచి ఆలోచించి లోతుగా చూస్తుంటే వాళ్ల డిమాండ్ పూర్తిగా శాసనబద్ధమైన వ్యవహారంలా తోచడం లేదూ! అంతేకాదు. ఆ హెడ్ గుమాస్తా చేసిన వ్యాఖ్యానంలో మరొకటి కూడా దాగి ఉంది. పరమనీచమైన వ్యాఖ్య. ‘సెటిల్మెంటు ద్వారా రాబోయే సొమ్మంతా నీవు కష్టించి కూడబెట్టినదా! కారాక్సిడెంటులో నూరేళ్లు నిండిపోయిన నీ కొడుకుదేగా! అతడికి గాని పెళ్లయి ఉంటే
ఈ పాటికి సొమ్మంతా మీ కోడలు పిల్లేగా తన్నుకుపోయేది!’ ఇవీ అక్కడి వాళ్ల టోన్‌లో ఫిరంగిలా ధ్వనించే అపభ్రంశపు ఆలోచనలు. తండ్రిది కొడుక్కి చెందుతున్నప్పుడు కొడుకుది తండ్రికి చెందకూడదన్న నియమం ఎక్కడైనా ఉందా ఏమిటి? నానాటికీ పెట్రేగిపోతూన్న ఇటువంటి కాలుష్య కల్మష వాతావరణం వల్ల తనబోటి రాజకీయ ప•రపతి లేని అర్భకులు అతలాకుతలమైపోతున్నారన్న వాస్తవాన్ని గౌరవనీయ సర్కారు వారు ఎప్పుడు గుర్తిస్తారో కదా! అతడు మెట్లెక్కి ముందుకు సాగడానికి ఉద్యుక్తుడయ్యేటప్పటికి ఇద్దరు భారీ శరీర దారుఢ్యం గల మగరాయళ్లు ఎదురు వచ్చారు, ‘ఏం కావాలో చెప్పండి. చిటికెలో పనులు ముగించుకొని రావడానికి మేమున్నాంగా!’ అంటూ. వేణుగోపాల్ వాళ్లను ఎగాదిగా చూశాడు. వీళ్లందరూ ఇసుమంత కూడా పాపభీతి లేని అంతర్జాతీయ ఆయుధ వ్యాపార దళారుల వంటివారు. రాత్రీపగలూ అన్న తేడా లేకుండా వీళ్లు చేసే పని ఇదొక్కటే. ఇక విషయానికి వస్తే ఇటువంటి కపట సన్యాసుల చేతుల్ని అతను అంతకుముందే పావనం చేశాడు. ఫలితం మాత్రం శూన్యం. అతడికి విపరీతమైన ఏవగింపు కలిగింది. కానీ ఆపుకున్నాడు. ఎందుకంటే, ఇటువంటి వాళ్లు మంచి చేయగలరో లేదో దేవుడెరుగు. చెడు మాత్రం కచ్చితంగా చేయగలరు, దస్త్రాలను తారుమారు చేసి. అప్పుడతనికి ఇంటి ఇల్లాలు తాయారు అన్న మాటలు చప్పున గుర్తుకు వచ్చాయి. ‘మాట జారకుండా ముఖం ముడుచుకోకుండా నడుచుకోండి. ఇప్పటికైనా కీలెరిగి వాత పెట్టడం నేర్చుకోండి. ఇంతవరకూ విదిల్చింది చాలు. ఇకపైన మధ్యవర్తుల మాట మరిచిపొండి. తిన్నగా అటూ ఇటూ చూడకుండా సరాసరి తిమింగలం నోటి వద్దకు వెళ్లి నిల్చోండి. దానికి కావలసిన మేతను దానికి పడవేసి మీకు కావలసిన దానిని అందిపుచ్చుకుని తిన్నగా ఇంటికి వచ్చేయండి, అటూ ఇటూ చూపులు చూడకుండా.. ఈ ప్రపంచంలో కావాలన్నా వద్దన్నా చాలానే దొరకవచ్చు, చాలానే చూడవచ్చు. ఒకటి తప్ప. తోటివారి పట్ల దయ చూపించే స్వభావం. దీనిని చిటికెడంత కూడా ఎక్కడా ఎవ్వరి వద్దా ఎదురు చూడకండి. చెట్టంత కొడుకు పోయాడని మనం ఏడుస్తుంటే వీళ్ల వికటాట్టహాసాలు చూడండి. అందుకే అంటున్నాను, సాక్షి కాళ్లపైన పడే బదులు తిన్నగా వెళ్లి కక్షి కాళ్లపైన పడటం ఎంతో మేలు కదా!’ అవన్నీ గుర్తుకి వచ్చి వెనక్కి తగ్గాడు వేణుగోపాల్. ఎదురొచ్చిన దళారుల వైపు ప్రసన్నంగా చూస్తూ మళ్లీ వస్తానని సౌమ్యంగా బదులిచ్చి మేడ మెట్లెక్కి డీలింగ్ సెక్షన్ వైపు నడిచాడు. అతడిని చూసిన తోడనే అక్కడి స్టాఫ్ కళ్లు పెద్దవయ్యాయి. ఆశతో మెరిశాయి. గొర్రెపిల్లను చూసిన తోడేలు కళ్లు రక్తచారలతో మెరవవా! వేణుగోపాల్‌కి మరొకమారు కోపం ముంచుకు వచ్చింది.
ఈ దేశంలో ఏదైనా తక్కువ కావచ్చు గాని, ఆశకు మాత్రం అంతుండదు. తాయారు మాటల్ని మరొక మారు గుర్తుకి తెచ్చుకుంటూ వెనక్కి తగ్గి తను సీనియర్ ఆఫీసరు గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఆ మాట విన్నంతనే వాళ్లకు గతుక్కుమంది. ఒక్కుమ్మడిగా అన్నారు. కాదు రాగాలాపన చేశారు. ‘ఎంతమాట! ఎంతమాట! మేమిక్కడ కంచు విగ్రహాల్లా కూర్చుని ఉండగా మీరు వెళ్లి ఆఫీసరు గారికి అంతరాయం కలిగించడమా! అందులో ఇప్పుడొచ్చిన ఆఫీసరు గారు యమ స్ట్రిక్ట్’ ఈసారి వేణుగోపాల్ నవ్వకుండా ఉండలేకపోయాడు. కొందరు సర్కారు ఉద్యోగులకు ఒక విధమైన పరిభాష ఉంటుంది. అదేమంటే- స్ట్ట్రి అంటే తీసుకుంటాడని. యమ స్ట్ట్రి అంటే తప్పకుండా బరువైన కవరు కోసమే ఎదురు చూస్తాడని. వీళ్ల వల్ల తను ఒకటా రెండా-ఎన్ని ఢక్కా మొక్కీలు తిన్నాడని. రాటుదేలిన తన బుర్రకు ఆపాటి తెలియదా!
అతడు వాళ్ల మాటల్ని సావధాన చిత్తుడై విన్నట్టు ‘అలాగా!’ అన్నట్టు తలూపుతూనే చటుక్కున ప్రాణమొచ్చిన రొబాటిక్‌లా కదిలి ఆఫీసరు గారి గదిలోకి దూసుకుపోయాడు. లాల్చీనుండి రూపాయి నోట్ల కట్టను తీసి ఆఫీసరు బల్లపై ఉంచుతూ చేతులు జోడించి ‘అయ్యా మహాప్రభూ! ఈ చిరు నైవేద్యాన్ని స్వీకరించి నన్ను కరుణించండి మహాప్రభో!’ అన్న వేణుగోపాల్ కేసి ఆ యువ ఆఫీసరు ఎగాదిగా చూసి కన్నెర్ర చేశాడు. ‘వట వృక్షమంతటి వయసుంది. మీకు కొంచెమైనా జ్ఞానమన్నది ఉందా! మీకు కొడుకంతటి వాణ్ణి. నన్ను యేదో చిరుతను చూసినట్టు గజగజ వణుకుతూ పదేపదే నమస్కరిస్తూ నా ఆయుష్షుని హరింపచేస్తారా! ఇకపోతే మీరివ్వబోయే లంచం గురించి.. లంచం తీసుకోవడమే కాదు. ఇవ్వజూపడమూ నేరమే. ఇప్పుడు గాని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ గతేమవుతుందో ఆలోచించండి. ఆపైన మీ ఆవిడ పిల్లలూ మీ చుట్టూ, జైలు బ్యారక్స్ చుట్టూ తిరుగుతుండాలి. మీబోటి వారు ఇలా బేలగా ఫీలవుతూ అక్రమార్కులు అడిగినప్పుడల్లా కవరులో పెట్టి ఇస్తుండ బట్టే తీసుకునేవాళ్లు ఎక్కువవుతున్నారు. మీది సెటిల్మెంటు ఫండ్. అది మీకు స్వంతం. దానికి మీరెందుకు ఎదురువచ్చిన వాళ్లనందర్నీ చేతులు కట్టుకుని అడుక్కోవాలి? మనిషన్నవాడికి ఆత్మాభిమానమన్నది కొంచెమైనా ఉండొద్దూ!’.. వేణుగోపాల్ బిత్తరపోయాడు. తల తిరిగినంత పనైంది. ప్రభుత్వ కార్యాలయంలో ఇటువంటి వారు కూడా ఉంటారేమిటి! అతడిక జాప్యం చేయలేదు. మరు నిమిషం తేరుకుంటూ ముందుకు వెళ్లి ఆఫీసరుగారి చేతుల్ని అందిపుచ్చుకున్నాడు.‘‘బాబ్బాబు! ఇవి చేతులు కావనుకోండి. దయచేసి ఈ ఒక్కసారీ క్షమించి పోలీసు రిపోర్టు ఇవ్వకండి. నేను గాని కటకటాల వెనక్కిపోతే, ఆ తరవాత మా అబ్బాయి సొమ్ము కోసం ఆఫీసు చుట్టూ తిరగడానికి మా ఆవిడకు ఓపికుండదు. అసలే జబ్బుమనిషి.’’ డిప్యూటీ కమిషనర్ ముకుందం వేణుగోపాల్ చేతుల్ని విదిలించేసాడు. ‘‘మీకెన్ని సార్లు చెప్పినా వినిపించుకోరా! మీ పనికిమాలిన నమస్కారాలతో నా ఆయుష్షు తగ్గించకండని చెప్పలేదూ! మీకు చెప్పగలిగే వయసు కాకపోయినా ధైర్యంచేసి చెప్తాను. వినండి. అందరూ ఒక్కలా ఉండరు. అందరూ చెడ్డవారయి ఉండరు. అలా అందరూ చెడ్డవారిలా మిగిలిపోతే మీరు బ్రతకలేరు. నేనూ బ్రతకలేను. ముందు రూపాయి నోట్లు జేబులో ఉంచుకుని కంప్లెయింట్ స్లిప్పు నాకిచ్చి నా ముందు కూర్చోండి’’ అని కాలింగ్ బెల్ మ్రోగించి ప్యూన్‌ని పిలిపించి సెక్షన్ ఆఫీసరుని పంపించమని చెప్పి వేణుగోపాల్‌కి మంచి నీళ్లవ్వమని ఆదేశిస్తూ స్లిప్పుపైన రిమార్కులు రాసాడు.
మరికొద్ది సేపట్లో సెక్షన్ ఆఫీసరూ సెక్షన్ హెడ్ క్లర్కూ పరుగున వచ్చారు, చంకన దస్త్రాలు ఉంచుకుని. వాళ్లిద్దరినీ వేణుగోపాల్ పక్కన కూర్చోమని సంజ్ఞ చేస్తూ వాళ్లందించ్చిన దస్త్రాన్ని సాంతమూ చదివాడు. చదివి సెక్షన్ ఆఫీసరుని ఉద్దేశించి చర్చకు ఉపక్రమించాడు. ‘‘చూడండి మిస్టర్ విమల్‌రావ్. ప్రతి సమస్యకూ రూల్ బుక్‌లో పరిష్కార మార్గం ఉండదు. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎదురుచూడని పరిస్థితుల వల్ల ఉత్పన్నం కావచ్చు. కాబట్టి మనం వాటిని కొత్త కోణంలో నుంచి పాజిటివ్‌గా చూడాలి. ఆ రీతిన సాధ్యమైనంత మేర, పౌర సమాజానికి కష్టం కలగకుండా చూడాలి. అలా కాకుండా స్టాఫ్ రాసిన ప్రతి క్వెరీకీ బుర్రూపుతూ టిక్కులు పెట్టేస్తే మనమెందుకు? డిపార్టుమెంటు మనకిచ్చిన విచక్షణాధికారాలు ఎందుకూ! పాముల్ని బుట్టలో పెట్టుకున్నట్టు ఊరూరా తిరగడానికా!’’ అని ఇటు తిరిగాడు వేణుగోపాల్ వైపు. చప్పున లేచి నిల్చోడానికి ఉద్యుక్తుడైన వేణుగోపాల్‌ని కదలకుండా అలాగే కూర్చుండమని సంజ్ఞ చేస్తూ చెప్పసాగాడు- ‘‘చూడండి వేణుగోపాల్ గారూ! దివంగతుడైన మీ అబ్బాయి మీ పేర నామినేషన్ ఇచ్చిన మాట వాస్తవమో కాని అందులో ఆయన మిమ్మల్ని డిపెండెంట్ ఫాదర్‌గా పేర్కొనడం మరచిపోయినట్టున్నారు. కాని మా రూల్స్ ప్రకారం ముఖ్యంగా పెళ్లికాని చందాదారుల విషయంలో డిపెండెంట్ తండ్రి లేక డిపెండెంట్ తల్లి మాత్రమే ఫ్యామిలీ పరిధిలోకి వస్తారు. కాని ఇదేమీ పెద్ద లిటిగేషన్ పాయింటేమీ కాదు. ఇప్పుడు దీనికి బదులివ్వండి. గ్రాడ్యుటీ ఎవరు తీసుకున్నారు? పిమ్మట ఇన్స్యూరెన్స్ సొమ్ము ఎవరు తీసుకున్నారు?’’
దానికి వేణుగోపాల్ నోరు విప్పకుండా తన ఫైలు నుండి రెండు పేపర్లు తీసిచ్చాడు. వాటిని చూసిన తరవాత తెలుసుకున్నాడు ముకుందం- అవి రెండూ తండ్రికే ఇచ్చినట్టు. ‘‘అంటే, ఆ రెండు డిపార్టుమెంట్‌ల నిర్ణయం ప్రకారం మీరేనన్నమాట నిజమైన వారసులు. ఇంకేం ఇప్పటి సెటిల్మెంట్ ఫండ్ సొమ్ము కూడా మీకే చెందుతుంది. తథాస్తు!’’ అంటూ నోట్ ఫైల్‌పైన అవసరమైన సానుకూల రిమార్కస్ రాసి అక్కడున్న సిబ్బందితో ‘‘ఈరోజే కేసు సెటిల్ చేసి చెక్కుని స్వయంగా వేణుగోపాల్ గారికి అందివ్వండి, భోజనం వేళ కంటే ముందే’’ అంతవరకూ మన్ను తిన్న పాములా కూర్చున్న హెడ్ క్లర్క్ చప్పున లేచి నిల్చున్నాడు- ‘‘సార్! ఇలా అంటున్నందుకు మన్నించాలి. ఇప్పటి రూల్స్ ప్రకారం చెక్కుని రిజస్టర్ పోస్టు ద్వారానే పంపించాలండి. మీరు సూచిస్తే ఈ రోజే చెక్కుని పోస్టు చేద్దాం’’
‘‘ఔను, వాస్తవమే! కాని ప్రతి రూల్‌కీ ఒక మినహాయింపు ఉంటుంది. దానిని తగిన కారణాలతో పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించ డంలో తప్పు లేదు. అయినా నేను వ్రిటెన్ ఆర్డ్రర్స్ ఇస్తున్నప్పుడు మీకెందుకు కంగారు?’’ అప్పుడు సెక్షన్ ఆఫీసరు క్షమాపూర్వకంగా లేచి నిల్చుని ‘‘సారీ సార్! నేనంత లోతుగా ఆలోచించలేక పోయాను’’ అన్నాడు.
ముకుందం ఏమీ అనలేదు. లేచి నిల్చున్న వాళ్ల వైపు నిదానంగా చూసాడు. చూపులతో నఖశిఖ పర్యంతం పరీక్షిస్తూ జీవితంలో ఎదురు వచ్చే కొన్ని సమస్యల్ని పరిష్కరించాలంటే రెండు గూణాంశాలుండాలి. మొదటిది- అనుభవం ప్లస్ నిరంతర అధ్యయనం. అంతకంటే ముఖ్యమైనది, సున్నితమైన ఆలోచనా పథం ఉండాలి. వాళ్లనలా పరకాయించి చూస్తూ చూపులతో సంజ్ఞ చేసాడు డిప్యూటీ కమిషనర్- ‘‘మీరిక వెళ్లవచ్చు’’ అన్న రీతిన. అతడి సంజ్ఞ అందుకుని వాళ్లందరూ నిష్క్రమించిన తరవాత వేణుగోపాల్ వైపు తిరిగాడతను- ‘‘మీరు నాకింకేమైనా చెప్పాలనుకుంటున్నారా?’’ వేణుగోపాల్ చెప్పడానికి మరేమీ లేదన్నట్టు తల అడ్డంగా తిప్పుతూ కుర్చీనుండి లేవబోయాడు. అప్పుడు ముకుందం ఆగమని సంజ్ఞ చేసాడు, ‘‘నేనొకటి అడుగుతాను. నిక్కచ్చిగా చెప్తారా!’’ అన్నాడు. భవ్యంగా తలూపాడు వేణుగోపాల్. ‘‘తిన్నగా నా పీఏ పర్మిషన్ కూడా తీసుకోకుండా నా గదిలోకి దూసుకు వెళ్లమని మీకెవరు చెప్పారు?’’
‘‘మా ఇంటావిడ తాయారు. అప్పుడు గాని నేనెదుర్కొంటూన్న సమస్య ఒక కొలిక్కి రాదని హెచ్చరించి పంపించింది.’’
ముకుందం సాభిప్రాయంగా తలూపుతూ పక్కనున్న దస్త్రాలను చేతిలోకి తీసుకున్నాడు. వేణుగోపాల్ మరొకసారి చేతులు జోడించి లేస్తూ అసంకల్పితంగా ఆఫీసరు గారి వెనుక రాసి ఉన్న ప్లకార్డుని చూసాడు- ‘‘తనలో ఇతరులను, ఇతరుల్లో తనను చూసుకోగలవాడే ఆత్మజ్ఞాని’’ అష్టావక్ర గీత.