జూలై, 4, 2022న భాగ్యనగరంలోని జాగృతి భవనంలో నవయుగభారతి, జాగృతి వారపత్రిక సంయుక్తంగా నిర్వహించిన ‘విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు 125వ జయంత్యుత్సవం’ ఘనంగా జరిగింది. చేంబోలు శ్రీరామశాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభలో డా।। అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రాంత సహకార్యవాహ, ముఖ్య అతిథిగా, జాగృతి సంపాదకులు డా।। గోపరాజు నారాయణరావు ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
చరిత్ర అవగాహన పట్ల దృష్టినిలుపని కారణాన అది వక్రీకరణకు గురైందని, వాస్తవ చరిత్ర బోధించడం లేదని, విద్యావంతులు ఈ అంశంపై దృష్టి సారించాలని శ్రీరామశాస్త్రి అన్నారు.
ప్రధానవక్త డా।। గోపరాజు నారాయణరావు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అల్లూరి శతజయంతి సందర్భంగా తాను వెలువరించిన ‘విప్లవాగ్ని అల్లూరి’ గ్రంథ రచనకై మన్యంలోని వివిధ గ్రామాలను సందర్శించి, సమాచారం సేకరించిన అనుభవాలను వివరించారు. కేవలం స్థానికమైన, పరిమితమైన సమస్యలపై జరిగిన తిరుగుబాట్లను పితూరీ అంటారని, అల్లూరి నాయకత్వంలో జరిగినది జాతీయోద్యమమే అని పేర్కొన్నారు. మైదానప్రాంత ఉద్యమానికి, గిరిజనుల సమస్యల పరిష్కార ఉద్యమానికీ అనుసంధానం చేయటమే అల్లూరి సాగించిన స్వాతంత్య్రోద్యమంలోని విశిష్టత అని వివరించారు.
కరుణశ్రీ రచించిన ‘ఉదయశ్రీ’ పద్యకావ్యంలో అల్లూరి సీతారామరాజు గురించిన పద్యాలను నవయుగ భారతి ప్రచురణల సంపాదకులు డా।। వడ్డి విజయసారథి పాడి వినిపించారు. ప్రముఖ పాత్రికేయులు జి. వల్లీశ్వర్, వేదుల నరసింహం, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ, గొట్టుముక్కల భాస్కర్, ఆకుతోట రామారావు, సువీర్, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ డా।। అమరనాథరెడ్డి, బి. నరసింహమూర్తి, భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు కె.లక్ష్మారెడ్డి, సుంకర నరసింహం, జాగృతి బృందం తదితరులు పాల్గొన్నారు.