ఒకే వర్గం వారు నివసించే ప్రాంతం మీద అల్లరిమూకలు దాడి చేసి 69 మందిని చంపేసి, ఒక బావిలో పడేశారన్న మాట వింటే గుండె మండుతుంది.

నవమాసాలు నిండిన పూర్ణ గర్భిణి ఉదరం చీల్చి, పసికందును ఖండఖండాలుగా చీల్చి, మంటలలోకి విసిరివేశారన్న వార్త వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది.

కానీ ఇందులో పూర్తి వాస్తవం లేదనీ, వండివార్చిన కథనాలనీ తెలిస్తే! ఆ సంగతి సాక్షాత్తు భారత అత్యున్నత న్యాయస్థానమే వెల్లడిస్తే! ఇక వాస్తవాలేమిటో తెలుసుకోక తప్పదు. 2002, ఫిబ్రవరి నాటి గుజరాత్‌ అల్లర్ల గురించి ఇప్పుడు జరుగుతున్నది అదే. నాటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్ర మోదీపై జరిగిన విషప్రచారం వెనుక ఉన్నదంతా కుట్రేనని తేలిపోయింది. గడచిన కొన్నేళ్లుగా ఈ వివాదాన్ని రావణ కాష్టంలా ఉంచడానికే కొందరు పనిగట్టుకుని పని చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 18 సంవత్సరాలుగా అసత్యాలనే చెబుతూ, అర్ధ సత్యాలనే వల్లిస్తూ దేశ ప్రతిష్టను మసకబార్చిన సంఘ విద్రోహుల అసలు కుట్ర బయటపడింది. దీనికి మూలం  తీస్తా సెతల్వాడ్‌.

‌హక్కుల కార్యకర్త పేరుతో దేశాన్ని మోసం చేస్తున్న వనిత. మైనారిటీల హక్కుల రక్షణ పేరుతో దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా మంటగలిపే ప్రయత్నం చేసిన సంఘ విద్రోహి. ఈమె నిర్వాకం మీద, ఈమె నాయకత్వంలోని హక్కుల సంస్థ సిటిజన్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ అం‌డ్‌ ‌పీస్‌ (‌సీజేపీ) దారుణాల మీద దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే నియమించబోతున్నారు.

స్వతంత్ర భారత చరిత్రలోనే భయానకమైన గుజరాత్‌ అల్లర్ల ఉదంతానికి ఫిబ్రవరి 27, 2002 ఉదయం జరిగిన మరొక బీభత్సమే మూలం. అదే గోధ్రా స్టేషన్‌లో ఉదయం ఏడున్నర ప్రాంతంలో జరిగిన రైలు బోగీ దహనం. అయోధ్యలో కరసేవ ముగించుకుని స్వరాష్ట్రానికి వస్తున్న రామభక్తులు ప్రయాణిస్తున్న సబర్మతి రైలు బోగీ అది. దానికి నిప్పు పెట్టారు. 59 మంది మరణించారు. వెంటనే రాష్ట్రమంతటా మతకల్లోలాలు చెలరేగాయి. 31 మంది ఉన్న ముస్లిం మతోన్మాదమూక ఆ బోగీని తగలబెట్టిందని గుజరాత్‌ ‌హైకోర్టు కూడా ధ్రువీకరించింది. కానీ వేయి నుంచి రెండువేల మంది ముస్లిం మతోన్మాదులు ఆ బోగీ మీద దాడి చేశారన్న ఆరోపణ కూడా ఉంది. గుజరాత్‌ అల్లర్లలో వాస్తవాలను, ఆధారాలను దాచిపెట్టినట్టే, 59 మంది అమాయక హిందువులను పొట్టన పెట్టుకున్న ఈ బోగీ దహనం ఉదంతాన్ని కూడా హిందూ వ్యతి రేకులు, మోదీ, బీజేపీ శత్రువులు సౌకర్యంగా దాచి పెడుతూనే ఉన్నారు. గుజరాత్‌ అల్లర్ల మీద ఎంత అలజడి జరిగినా, అందులో సబర్మతి బోగీ ఉదంతా నికి అసలు చోటు ఉండదు. హిందువులు, సంఘ పరివార్‌ ఆధిక్య భావనతో (మెజారిటేరియనిజం), ముస్లింల మీద ద్వేషంతోనే ఇంతటి రక్తపాతానికి ఒడిగట్టారన్న అభిప్రాయాన్ని కల్పించడానికే ముందునుంచి ప్రయత్నం జరిగింది. ఆ దుర్ఘటనలో దాదాపు 1200 మంది చనిపోయారు.

పద్దెనిమిదేళ్ల నాటి దుర్ఘటన

 పద్దెనిమిదేళ్ల నాటి ఈ అంశం తాజాగా చర్చకు రావడానికి కారణం- జూన్‌ 24, 2022‌న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కే రాఘవన్‌ ‌నేతృత్వంలో ఆ అల్లర్ల మీద దర్యాప్తు జరిపిన బృదం నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్ధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పైగా వివాదాన్ని నిరంతరం మండించడానికి పిటిషన్‌దారులు ప్రయత్నిస్తున్నారని, వారి మీద చర్యలు అవసరమని కూడా అభిప్రాయపడింది. ఆ వెంటనే గుజరాత్‌ ‌యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ‌తీస్తాను ముంబైలో అరెస్టు చేసి, అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లింది.

2002, ఫిబ్రవరి నాటి గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, మరో 62 మంది మీద క్రిమినల్‌ ‌విచారణ జరిపించాలని కోరుతూ జాకియా జఫ్రీ-సిటిజన్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ అం‌డ్‌ ‌పీస్‌ (‌సీజేపీ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జాకియా భర్త, కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీ ఎహసాన్‌ ‌జఫ్రీ ఆ అల్లర్లలో భాగంగా జరిగిన గుల్బర్గా సొసైటీ హింసాకాండలో చనిపోయారు. సబర్మతి రైలు బోగీ దహనం (చనిపోయిన 59 మందిలో 25 మంది మహిళలు, 15 మంది చిన్నారులు) ఉదంతం తరువాత ముఖ్యమంత్రి మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 27, 2002న ఉన్నత స్థాయి సమావేశం జరిగిందనీ, ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి, ‘హిందువులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కే అవకాశం ఇవ్వాలి’ అని అన్నారని వీరి ఆరోపణ. నిజానికి ఈ ఒక్క అంశంతోనే మోదీ చుట్టూ ఉచ్చు బిగించాలని మొదటి నుంచి తీస్తా, కాంగ్రెస్‌, ఇతర హిందూ వ్యతిరేక సంస్థలు పనిచేశాయి. ఇదే కాకుండా అల్లర్లతో సంబంధం ఉన్న దాదాపు 30 ఆరోపణలు కూడా తీస్తా పిటిషన్‌లో ఉదాహరించారు.

–       ఆగ్రహావేశాలను రెచ్చగొట్టడానికి గోధ్రా మృతుల భౌతికకాయాలను ఊరేగించారు.

–       పోలీస్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌లు మంత్రుల చేతులలోకి పోయాయి.

–      పోలీస్‌ ‌దర్యాప్తు గందరగోళంగా ఉంది.

–      పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్లుగా వీహెచ్‌పీ వారిని నియమించారు.

–    తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంకే టండన్‌, ‌పీబీ గోండియా వంటి పోలీసు ఉన్నతాధికారుల వలన గుల్బర్గా సోసైటీలో 200 మంది ముస్లింలు చనిపోయారు. వీరిని శిక్షించాలి.

–       నిఘా సంస్థల హెచ్చరికలను పట్టించుకోలేదు.

–       ఆధారాలను ధ్వంసం చేశారు.

సిట్‌, ‌క్లీన్‌చిట్‌

ఈ ‌పిటిషన్‌ ‌మేరకు సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 27, 2009‌న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనికి ఆర్కే రాఘవన్‌ ‌నాయకుడు. అంతకు ముందు కూడా ఆయనే గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి మొత్తం తొమ్మిది కేసుల మీద దర్యాప్తు సాగించారు. సిట్‌ ‌మే, 2010లో తాత్కాలిక నివేదికను సమర్పించింది. నవంబర్‌లో మరొక నివేదిక ఇచ్చింది. అప్పుడే ఈ దర్యాప్తులో సహకరించేందుకు రాజు రామచంద్రన్‌ను అమికస్‌ ‌క్యూరీగా సుప్రీంకోర్టు నియమించింది. ఈయన తన నివేదికను జనవరి 20, 2011న సమర్పించారు. తరువాత జరిగిన వాదోపవాదాలలో జాకియా తరఫున వాదించిన ప్రశాంత భూషణ్‌, ‌సిట్‌ ‌కొన్ని విషయాలను దాచి పెడుతున్నదని ఆరోపించారు. ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ ‌భట్‌ ‌నుంచి తనకొక అఫిడవిట్‌ అం‌దిందని, ఫిబ్రవరి 27, 2002 నాటి సమావేశానికి తాను హాజరయ్యానని, ఆ సమావేశం లోనే ముఖ్యమంత్రి మోదీ ముస్లింలకు ఒక గుణపాఠం చెప్పే అవకాశం ఇవ్వాలని చెప్పారని భట్‌ ‌పేర్కొన్నారని రాజు రామచంద్రన్‌ ‌చెప్పారు. ఆ అఫిడవిట్‌నే సిట్‌కు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అమికస్‌ ‌క్యూరీ సమర్పించిన తుది నివేదికలో నిజం బయటకు రావాలంటే మోదీని విచారణకు పిలవాలని అందులో సూచించారు. అయితే అమికస్‌ ‌క్యూరీ అభిప్రాయంతో సిట్‌ ఏకీభవించలేదు. మోదీని ప్రాసిక్యూట్‌ ‌చేయడానికి అవసరమైన ఆధారాలు లేవని, అందుకే దర్యాప్తును నిలిపి•వేయాలని ఫిబ్రవరి 8, 2012న సిట్‌ ‌నివేదిక ఇచ్చింది. మోదీపై గాని, ఇతర అధికారులపై గాని నేరాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. దీనిపై నిరసన ఫిర్యాదు ఇవ్వవచ్చునని జాకియాకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. అన్ని పత్రాలు పిటిషనర్లకు ఇవ్వడానికి సిట్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా, చివరికి ఫిబ్రవరి 7, 2013న సుప్రీం ఆదేశంతో అన్ని నివేదికలు ఇచ్చింది. ఏప్రిల్‌ 15, 2013‌న నిరసన పిటిషన్‌ ‌దాఖలైంది. ఈ పిటిషన్‌ను వ్యతిరేకించిన సిట్‌, ‌ముఖ్యమంత్రి ఏనాడూ ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్టు తీస్తా సెతల్వాడ్‌, ఇతరులు కోర్టులను నమ్మించాలని చూస్తున్నారని కూడా పేర్కొ న్నది. అల్లర్లు సృష్టిస్తున్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి చెప్పారనడం తీస్తా కల్పనేనని మోదీ తరఫు న్యాయవాది వాదించారు.

సుప్రీం కోర్టు మొట్టికాయలు

నరేంద్రమోదీకి సిట్‌ ‌క్లీన్‌చిట్‌ ఇవ్వడం సమర్థ నీయమేనని జూన్‌ 24‌న జస్టిస్‌ ఏఎం ‌ఖాన్విల్కర్‌, ‌జస్టిస్‌ ‌దినేశ్‌ ‌మహేశ్వరి, జస్టిస్‌ ‌సీటీ రవికుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. గుజరాత్‌ అల్లర్లు ఒక వర్గం మీద కక్షతో, కుట్ర పూరితంగా చేసిన దాడులని చెప్పడానికి సాక్ష్యా ధారాలు లేవని చెప్పింది. అంతవరకే సుప్రీంకోర్టు ఉద్దేశమైతే సరే. కానీ అంతకు మించి అత్యున్నత స్థానం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ‘ఆ ఘటన మీద నిత్యం వివాదం రగులుతూనే ఉండేలా 2006 నుంచి దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసినట్లు స్పష్టమవు తున్నది. విచారణ పక్రియ దుర్వినియోగంలో భాగస్వాములందరిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని కూడా తన 452 పేజీల తీర్పులో ఆదేశించింది. నిజానికి నరేంద్ర మోదీ వ్యతిరేక వాదనలు, ఆరోపణలు ఏ కోర్టులోను నిలవలేదు. సిట్‌ ‌నివేదికను సవాలు చేస్తూ తీస్తా ఫిబ్రవరి 9, 2012న మెట్రోపాలిటన్‌ ‌కోర్టుకు వెళ్లారు. కానీ ఆ కోర్టు సిట్‌ ‌నివేదికను సమర్ధించింది. తరువాత గుజరాత్‌ ‌హైకోర్టుకు వెళ్లగా, అక్టోబర్‌ 5, 2017‌న కొట్టి వేశారు. దీనిపైనే సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది. ఇంతకాలం పాటు పిటిషన్లతో సమయం వృథా చేసినందుకు బాధ్యులను శిక్షించాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘గుజరాత్‌ ‌లోని కొందరు అసంతృప్త ప్రభుత్వ అధికారులు ఇతరులతో కలసి రాజకీయంగా సంచలనం సృష్టించేందుకే అసత్యాలను వ్యాపింప చేశారు. ఆ కుట్రను సిట్‌ ‌బహిర్గతం చేసింది’ అని సుప్రీం కోర్టు అభిప్రాయ పడడం అసాధారణమే అనిపిస్తుంది. ఈ ఉదంతంలో ఇంటిదొంగల పాత్ర తక్కువదేమీ కాదు. నాటి ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ ‌భట్‌, ‌మాజీ హోంమంత్రి హరేన్‌ ‌పాండ్యా కూడా అల్లరకు ముఖ్యమంత్రి సమక్షంలో వ్యూహరచన జరిగిందని, ఆ సమావేశానికి తాము హాజరయ్యామని తప్పుడు ప్రకటనలు ఇచ్చారని కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రకటించడం కొసమెరుపు. వీటన్నిటి పరాకాష్ట తీస్తా అరెస్టు.

అల్లర్లు జరిగిన నాలుగేళ్లకే తీస్తా అసలు బండారం బయటపడింది. ఆమె మీద కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇతర మతాల వారి మనోభావాలను గాయపరిచిన ఆరోపణ, దొంగ సాక్ష్యాల సృష్టి, శ్మశానవాటికలలోకి చొరబడడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సాక్షులను లోబరుచుకోవడం, దొంగపత్రాల తయారీ, వీటినే గుజరాత్‌ అల్లర్ల మీద దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ ‌నానావతి కమిషన్‌ ‌ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక నరేంద్ర మోదీ మీద ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఆమె మీద పరువు నష్టం కేసు వేసింది. ఇప్పుడు తీస్తా మీద నేరపూరిత కుట్ర, దొంగ సంతకాలు, అమాయకు లను ఇరికించేందుకు కోర్టుకు దొంగ పత్రాలు సమర్పించడం వంటి అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలైంది. వెంటనే అరెస్టు కూడా జరిగింది. ఈమెతో పాటు మాజీ ఐపీఎస్‌లు ఆర్‌బీ శ్రీకుమార్‌, ‌సంజీవ్‌ ‌భట్‌ల మీద కూడా దొంగ సంతకాలు, నేరపూరిత కుట్రలు ఇతర నేరాల అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదైంది. ఈ ఇద్దరు తీస్తాకు సహకరించిన వారే.

ఎవరీ తీస్తా?

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, మైనారిటీ హక్కుల పోరాట యోధురాలు తీస్తా సెతల్వాడ్‌ ‌కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ‌బ్రిటిష్‌ ‌కొలంబియా ఇచ్చే గౌరవ డాక్టరేట్‌కు ఎంపికయ్యారు. 2020 సంవత్సరానికి గాను ఈ పురస్కారం కోసం ఎంపిక చేసిన పది మందిలో ఆమె ఉన్నారు. ‘పౌర హక్కుల కార్యకర్త. రచయిత్రి, పురస్కారాలు అందుకున్న పత్రికా రచయిత తీస్తా సెతల్వాడ్‌ 2002 ‌సంవత్సరంలో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో నష్టపోయిన లక్షలాది మంది మైనారిటీలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర వహించారు. ఈ సెక్యులరిస్టు మానవ హక్కుల రంగంలో పనిచేసి మెజారిటేరియనిజం మతోన్మా దాన్ని ఎండగట్టడంలో దేశంలోను, అంతర్జాతీయం గాను కూడా పనిచేశారు… (నేషనల్‌ ‌హెరాల్డ్ ‌జూన్‌ 22,2020) ఆమె పట్ల ఇలాంటి అభిప్రాయం ప్రపంచానికి ఉంది. నిజానికి కల్పించారు. 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం ఈమెకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఆది నుంచి మోదీ మీద బురద చల్లడానికి ఈమెను కాంగ్రెస్‌ ‌విశేషంగా ఉపయోగించుకుంది. జర్నలిస్టుగా జీవితం ఆరంభించిన తీస్తా, జావెద్‌ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్న తరువాత హక్కుల కార్యకర్త. అసలు గుజరాత్‌ అల్లర్ల బాధితులకు ‘న్యాయం’ అందించడం కోసమే ఆమె సీజేపీని నెలకొల్పారు.


కౌసర్‌ ‌బానో కేసు, వాస్తవాలు

గుజరాత్‌ అల్లర్ల సమయంలో మేధావులూ, ఒక వర్గం మీడియా, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేసిన అబద్ధాలకు పరాకాష్ట కౌసర్‌ ‌బానో అనే ముస్లిం మహిళ మరణోదంతం. రెచ్చిపోయిన దుండగులు (వాళ్లకి హిందువులని ముద్ర వేశారు) తొమ్మిది మాసాల గర్భవతి కౌసర్‌పైన లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డారు. ఆమె ఉదరం చీల్చి, పసికందును మంటలలోకి విసిరివేశారు. అలా కాకుండా కత్తితో ముక్కలు చేసి, చివర మంటల్లో పడేశారని మరొక వాదన. మీడియా సైరా బానో అనే ఆమె చెప్పిన మాటలను విశ్వసించి దీనికి ప్రచారం ఇచ్చింది. కౌసర్‌కూ, సైరాకూ బంధం ఏమిటి? సైరా వదినకు కౌసర్‌ ‌చెల్లెలు. సైరా కథనం ఏమిటి? ‘ఆమెను (కౌసర్‌), ‌మా వదిన చెల్లెలిని ఏం చేశారంటే, అది చాలా భయానకం. ఆమె తొమ్మిది మాసాల గర్భిణి. వాళ్లు ఆమె కడుపును కోశారు. లోపలి నుంచి ఆ పసికందును ఒక కత్తితో లాగి, మంటలలోకి విసిరారు. తరువాత కౌసర్‌ని కూడా అలాగే మంటల్లో పడేశారు.’ ఆనాటి కౌసర్‌ ఉదంతం ఇప్పటికీ సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉంటుంది.

కానీ వాస్తవం వేరు. పోస్ట్‌మార్టమ్‌ ‌నివేదిక నిజమేమిటో చెప్పింది.

మార్చి 1,2002లో కౌసర్‌ ‌భౌతికకాయానికి శవపరీక్ష జరిగింది. డాక్టర్‌ ‌జేఎస్‌ ‌కానోరియా చేశారు. ఇందుకు సంబంధించిన నివేదిక 2010లోగాని ప్రత్యేక కోర్టుకు చేరలేదు. అందులో ఉన్నదేమిటంటే- గర్భస్థ శిశువు యథాతథంగానే ఉంది. బరువు 2500 గ్రాములు, పొడువు 45 సెంటీమీటర్లు. తరువాత కొందరు సాక్ష్యులు చెప్పినదానిని బట్టి కౌసర్‌ ‌భయం, దిగ్భ్రాంతితో ఊపిరాడక చనిపోయింది. ఆమె శరీరం పైన గాని, లోపలి భాగాల మీద గాని ఎలాంటి గాయాలు లేవు. అసలు కత్తి గాటే లేదని డాక్టర్‌ ‌కానోరియా తేల్చారు.


ఎలా వంచించారు?

మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం, తీస్తా అరెస్టులను ఖండిస్తున్న కాంగ్రెస్‌, ‌కొందరు న్యాయవాదులకు తీస్తా అసలు వ్యవహారం తెలియక కాదు. తీస్తా హక్కుల పోరాటం, న్యాయ పోరాటం నకిలీవేనని 2009 నాటికే దేశం గ్రహించడం మొదలుపెట్టింది. ‘తమకు న్యాయాన్ని నిరాకరిస్తున్నారన్న ఆరోపణతో గుజరాత్‌ అల్లర్ల బాధితుల చేత సుప్రీం కోర్టు ముందు ప్రదర్శన చేయించిన ఘనత వహించిన హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ ‌కంగు తిన్నారు. ఆమె నాయకత్వంలో పని చేస్తున్న సిటిజన్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ అం‌డ్‌ ‌పీస్‌ అల్లర్లకు సంబంధించి చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, వాటికి విశ్వసనీయత కూడా లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టుకు తెలియచేసింది.’ ఇది ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది పయోనీర్‌’‌లో ఏప్రిల్‌ 14,2009‌న వెలువడిన వార్త. ఎంత దగా అంటే, గుజరాత్‌ అల్లర్ల పేరుతో నరేంద్ర మోదీని రాక్షసునిగా చిత్రించడానికి ఉపయోగించిన కౌసర్‌ ‌బానో అనే మహిళ ఉదంతంలోను నిజం లేదని కూడా సిట్‌ ‌బయటపెట్టింది. కౌసర్‌ను అడ్డం పెట్టుకుని అత్యంత హేయమైన, నీచమైన ఆరోపణ గుప్పించారు తీస్తా. నిండు గర్భిణి కౌసర్‌ ఉదరం చీల్చి, శిశువును ముక్కలుగా నరికారని, ఆపై మంటలలో వేశారని తీస్తా కోర్టుకు చెప్పారు. విశ్వహిందూ పరిషత్‌ ‌బంద్‌ ‌పిలుపు సందర్భంగా నరోదా పటియా అనే చోట ముస్లింలను చంపి, వారి మృతదేహాలను ఒక బావిలో పడేశారన్న తీస్తా ఆరోపణ కూడా నిజం కాదని తేలింది. ఒక బ్రిటిష్‌ అధికారిని చంపేసిన దుండగులను పోలీసులు కాపాడుతున్నారన్న ఆమె ఆరోపణ కూడా అవాస్తమేనని సిట్‌ ‌వెల్లడించింది. కౌసర్‌ ‌నకిలీ అత్యాచారం, హత్య గురించి సిట్‌ ‌జస్టిస్‌ అరిజిత్‌ ‌పశాయత్‌, ‌జస్టిస్‌ ‌పి. సదాశివం, జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలంలతో కూడా ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. బాబూ బజరంగి అనే అతడి మీద ఈ కేసు మోపారు. చివరికి, కౌసర్‌ ‌శవపరీక్ష సరిగా జరగలేదని, ఆమె గర్భసంచిని తొలగించారని ఆమె భర్త ఆరోపించాడు. ఇక్కడితో ఆగలేదు. కౌసర్‌ ‌పోస్టుమార్టమ్‌ ‌నివేదిక సిట్‌ ఇచ్చినది కాదని, అది ప్రభుత్వం ఇచ్చినదని తీస్తా సంస్థ సీజేపీ ఒక ప్రకటన విడుదల చేసి, దేశాన్ని మభ్య పెట్టాలని చూసింది. అయితే ఆ నివేదిక తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా, సిట్‌ ‌నుంచే అందిందని ‘టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’ విలేకరి తెలియచేశారు.

అల్లర్లన్నీ బీజేపీ, సంఘ పరివార్‌వేనని నిరూపించడానికి తీస్తా గుజరాత్‌లో కొందరి చేత అబద్ధాలు చెప్పించారు. కోర్టును మోసగించారు. మార్చి 1, 2002న వడోదర లోని హనుమాన్‌ ‌టేక్డీ దగ్గర జరిగిన బెస్ట్ ‌బేకరీ దగ్ధం ఉదంతం ఘోరమైనదిగా ప్రసిద్ధికెక్కింది. దీనితో దేశంలో పెద్ద చర్చ చెలరేగింది. షేక్‌ ‌కుటుంబీకులు దీని అధిపతులు. అవాస్తవాలతో కూడిన కొన్ని ప్రకటనలు ఇవ్వవలసిందని ఆ కుటుంబానికి చెందిన జహీరా షేక్‌పై తీస్తా ఒత్తిడి తెచ్చారు. జహీరా ఆ కేసులో ప్రధాన సాక్షి. తరువాత ఈమె మాట మార్చింది. ఆ అల్లర్లలో ఐదు కీలక ఘటనల మీద తీస్తా సాక్ష్యాలను తారుమారు చేసిందని, ఆమె గతంలో పనిచేసిన రాయిస్‌ ‌ఖాన్‌ ‌పఠాన్‌ ‌సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ ‌దాఖలు చేశారు (ఇలా కోర్టులను మోసం చేయడం మీద తనకున్న అనుభవాన్ని ఫిబ్రవరి 27, 2020న షాహిన్‌బాగ్‌ ‌శిబిరాన్ని సందర్శించినప్పుడు కూడా తీస్తా ఉపయోగించుకున్నారు. అప్పటికే కోర్టు నియమించిన మధ్యవర్తులతో బాగ్‌లోని వారు ఏం మాట్లాడాలో తీస్తాయే శిక్షణ ఇచ్చారు).

‘ది పయోనీర్‌’‌తో పాటు మరొక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’ కూడా 2009లోనే తీస్తా నిజం రూపం ఏమిటో బయటపెట్టింది. అక్కడ జరిగినట్టు చెబుతున్న హింసాత్మక ఘటనలకు మరింత మసాలా దట్టించి తీస్తా కోర్టుకు సమర్పించిం దని గుజరాత్‌ అల్లర్ల నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొన్నది. తీస్తా, ఆమె స్వచ్ఛంద సంస్థ సాక్షులకు తర్ఫీదు ఇచ్చి కట్టు కథలను కోర్టు ముందు వల్లె వేయించిందని సిట్‌ ‌పేర్కొన్నది. హత్యల గురించి కథనాలను ఆమె వండి వార్చిందని తెలియ చేసింది. 22 మంది సాక్షులు వివిధ కోర్టులకు ఒకే రకమైన అఫిడవిట్లను సమర్పించడం గురించి సిట్‌ ‌నిలదీసింది. సిట్‌ ‌దర్యాప్తులో తేలినదేమిటీ అంటే, ఆ 22 మంది దొంగ సాక్షులే. ఘటనాస్థలిలో వారిలో ఎవరూ లేరు. ఎలాంటి సాక్ష్యం చెప్పాలో తీస్తా, ఆమె స్వచ్ఛంద సంస్థ తర్ఫీదు ఇచ్చాయి. ఆ ఆఫిడవిట్లు కూడా ఒకేచోట తయారు చేయించారు.

బాధితులకూ టోపీ

గుల్బర్గా సొసైటీ అనే ప్రాంతం కూడా గుజరాత్‌ అల్లర్లలో నష్టపోయింది. కానీ ఇక్కడి బాధితులను తీస్తా దారుణంగా వంచించారు. ఈ మేరకు వారు పోలీసు కేసు పెట్టారు. బాధితులకు సాయం కోసం అంటూ తీస్తా తమ వద్ద డబ్బు వసూలు చేశారని, అ మొత్తాన్ని అందుకు వినియోగించలేదని ఆరోపిస్తూ ఆమెకు లీగల్‌ ‌నోటీసు పంపారు. ఈ నిధులను ఆమె దేశంలోనే కాదు, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా సేకరించారు. ఇళ్ల పునర్నిర్మాణం, ఒక వస్తు ప్రదర్శనశాల ఏర్పాటు పేరుతో ఈ నిధులు వసూలు చేశారు. ఈ కేసును ప్రస్తుతం అహ్మదాబాద్‌ ‌క్రైం బ్రాంచ్‌ ‌దర్యాప్తు చేస్తున్నది. ఇది 2013 నాటి మాట. విదేశాల నుంచి నిధులను తీసుకోవడం దగ్గర కూడా తీస్తా అన్ని నిబంధనలను వదిలేశారు. అలా ఒక సంస్థ విదేశాల నుంచి నిధులు సేకరించాలంటే ఫారిన్‌ ‌కంట్రిబ్యూషన్‌ ‌రెగ్యులేషన్‌ ఆక్ట్ ‌కింద రిజిస్టర్‌ ‌చేయించాలి. తీస్తాకూ, ఆమె భర్త జావెద్‌ ఆనంద్‌కూ చెందిన సబ్రంగ్‌ ‌కమ్యూనికేషన్స్ అం‌డ్‌ ‌పబ్లిషింగ్‌ ‌సంస్థ నిబంధనలను ఉల్లంఘించి ఫోర్డ్ ‌ఫౌండేషన్‌ ‌నుంచి 2,90,000 డాలర్లు నిధులు తీసుకుంది. దీనితో భారత్‌కూ, అమెరికాకూ కూడా విభేదాలు వచ్చాయి. ఇలా నిధులు ఇవ్వడం మా దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని గుజరాత్‌ ‌ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

రెండు దశాబ్దాల పాటు వాస్తవాలకు మసిపూసి ఈ దుష్టశక్తులన్నీ కోర్టులను కూడా మోసం చేశాయి. వాస్తవాలు వెల్లడైన తరువాత కూడా అసలుసిసలు న్యాయం చేయకపోతే న్యాయ వ్యవస్థకు విలువేది? మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం గురించి చొప్పదొండ ప్రశ్నలు సంధిస్తున్న కాంగ్రెస్‌, ఇతర సంస్థలు, వ్యక్తులు తెలుసుకోవాలి. అయినా తీస్తానే సమర్ధిస్తా మని, సుప్రీంకోర్టు అభిప్రాయాలతో నిమిత్తం లేదని వీళ్లు చెప్పడం వెనుక ఉద్దేశాలు ఏమిటి?

About Author

By editor

Twitter
YOUTUBE