‘స్వామ్యం’ అంటే అధికారం అనుకుం టున్నాం. అది బాధ్యత అని కూడా తెలుసుకోవాలి మనం. హక్కు, అజమాయిషీ, ఆధిపత్యం, సొంతం – ఇవి మాత్రమే కాదు; జవాబుదారీ, భరోసా, పూచీ వంటివీ ప్రజాస్వామ్యంలో భాగాలే! మన దేశంలో జనస్వామ్యం అనేది ఒక రాజకీయ భావనగా కనిపిస్తుంది. నిజానికి ఇందులోనే పౌరుల హక్కులూ, బాధ్యతలూ రెండూ ఇమిడి ఉన్నాయి. దేశవిదేశ అనుభవాల్ని బట్టి చూస్తే, పౌరస్వామ్య వ్యవస్థకు రెండు ప్రధాన లక్షణాలు గోచరిస్తాయి. అవి ఒకటి సంఘంలోని ప్రతి ఒక్కరికీ సమత్వం సహజ గుణం. మరొకటి ఎవరి స్వతంత్రతను వారు నిలబెట్టుకునే హక్కు, బాధ్యతా ఉన్నాయి. ఆ రీత్యా చూసినప్పుడు, ప్రత్యేకించి భారత్‌లో రాష్ట్రపతి పదవి అన్నది ఏ ఒక్కరికో సొంతమైంది కాదు. దేశానికి అధినేత అయ్యే అవకాశం ఏ కొందరికో ప్రత్యేకించిందీ లేదు. కుల, మత, వర్గ, వర్ణ, భాష, ప్రాంతీయాలకు అతీతమైనది. ఎటువంటి అంతరాలకు తావు లేకుండా, ఆ రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టే వీలు ఎవరికైనా ఉంటుంది. జూలై 18న మన దేశానికి రాష్ట్రపతి ఎన్నిక. పదహారో రాష్ట్రపతిని ఎన్నుకుంటామన్న మాట.
ఇదే సందర్భంలో నాటి, నేటి పరిణామాలను విశ్లేషించుకుంటే; మహిళా నేతృత్వ అనుభవాలు బారులు తీరతాయి. ఇక్కడైనా, మరెక్కడైనా వనితా నాయకత్వ నిదర్శనాలు ప్రత్యక్షమవుతాయి. ప్రథమ పౌరత్వం, సర్వసేనాధిపత్యం, కార్యనిర్వాహకత్వం, వీటన్నింటినీ మించిన పరమోన్నతత్వం అతివకు చేకూరడమే ప్రజాస్వామిక వ్యవస్థకు ఘనాతిఘనం. పౌరులు తమకు తామే తమ కోసమే తమ మేలు గురించే పౌరస్వామ్యాన్ని అనుసరిస్తారు. ఎవరు ఏ విధంగా పరిపాలించాలన్నది నిర్ణయిస్తారు. సమర్థ ప్రభుత్వం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం, సమానత్వా నికి సమాదరణం, జనచేతన నిండిననాడే ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది. ఇదంతా సుసాధ్యం కావాలంటే దేశంలోని ఎవరికైనా, ఎక్కడ ఉన్నా, ఎటువంటి నేపథ్యమున్నా ప్రమాణాల నడుమ అధికారం పొందే సావకాశమంటూ ఉండాలి. ఒకరిది హక్కు అయితే దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సాటివారిది. ప్రజాస్వామ్యంలో పాల్గొనా లన్నా, నిర్వహించుకోవాలన్నా, పర్యవేక్షణ చేసుకోవా లన్నా ఇది తప్పనిసరి. ఇదంతా అలంకారంగా ఉండరాదు. ఆభరణప్రాయంగా మారకూడదు. ప్రజలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి, ఆ పరిష్కార అధికారం వారిలోని ఎవరికైనా లభించాలి. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. వేటి రాజకీయ వ్యవస్థలు వాటికి ఉంటూ వస్తున్నాయి. అందుకే అన్నింటినీ ఒకే విధంగా కొలవలేం. పంచుకునే ఉమ్మడి విలువ కనుక, పద్ధతులంటూ ఉండనే ఉంటాయి. అయిన ప్పటికీ సార్వకాలిన, సార్వజనీన విధివిధానాలు ఎంతైనా కీలకం. వాటి రీత్యా, రాష్ట్రపతి పదవి లేదా హోదా ఏ కొందరికో కేటాయించింది కాదు. అది ఎవరి ప్రత్యేక హక్కు కాలేదు, కాబోదు. ఆ మాటకొస్తే దేశాధ్యక్షత, ప్రధాన మంత్రిత్వం, పాలనా నేతృత్వం ఏవైనా. ఒక వనితగా సిరిమావో బండారు నాయకే శ్రీలంక ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు. ఒకసారి కాదు.. మూడుసార్లు ప్రధాని అయిన ఖ్యాతిని అదీ ప్రథమంగా తన సొంతం చేసుకున్నారు. ఆమె ముగ్గురు పిల్లల పేర్లూ (చంద్రిక, సునేత్ర, అనుర) భారతీయతనే గుర్తుకు తెస్తాయి. ఆ వనితా నేతకు ఎంతెంతో అరుదైన గౌరవం లభించింది. తన దేశానికి ఆమే ఏడో, తొమ్మిదో, పదిహేనో అధినాయకురాలు. తొట్ట తొలి ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీకి అంత చారిత్రక ముఖ్యం, ప్రశస్తి. ప్రత్యేకత.
ఉదాహరణలనేకం
సుదీర్ఘకాలం పదవిని నిర్వహించిన ‘ఐరన్‌లేడీ’ మార్గరెట్ థాచర్. బ్రిటిష్ ప్రధానిగా తనదైన శైలిలో వ్యవహరించిన రాజకీయ నేత. ఒకదానికొకటి సంబంధం లేని న్యాయవాద, రసాయన శాస్త్రాలు రెండింటినీ సమగ్ర అధ్యయనం చేసిన ప్రతిభాశీలి. రాజ్యాంగ పరిశీలక హోదాలోనూ దీక్షాదక్షతలు చాటుకున్నారు. ప్రధానమంత్రిగా పనిచేసిన అనుభవంతో వ్యవస్థల తీరుతెన్నులను ఎంతగానో విశ్లేషించారు. దాదాపు 90 సంవత్సరాల జీవితకాలం ఎన్నో పాఠాలను నేర్పింది. స్థితిగతులెన్నింటినో అనుభవానికి తెచ్చింది. విధి నిర్వహణ వేళ పలు విధాల పరిణామాలను ఎదుర్కొన్నారు. దేశానికి మొదటి మహిళా ప్రధానిగా భారత్‌కి ఇందిరాగాంధీ. వరసగా పలు పర్యాయాలు ఆ పదవిలో ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్‌హసీనా పొందిన అనుభవాలు, ఎదుర్కొన్న స్థితులు అనేకం. ఆ దేశానికి తాను చిరకాల ప్రధాని. అక్కడి జాతీయ విశ్వవిద్యా లయంలో విద్యాభ్యాసం చేసి, విభిన్న రాజకీయ పరిణామక్రమాన్ని చవిచూసి, కాలానుగతంగా జరిగిన మార్పుచేర్పులకు ప్రత్యక్ష సాక్షులై నిలిచిన ముదిత. ఇటీవలనే నిర్మాణం పూర్తి చేసుకున్న పద్మా వంతెనను ప్రారంభించి, ప్రజల పాతికేళ్ల స్వప్నాన్ని సాకారం చేయగలిగారు. భారత మూలాలున్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ మునుపటి చరిత్రలోనే తొలిసారిగా రికార్డు సృష్టించడం విదితమే. రాజకీయంతో పాటు న్యాయవాద వృత్తిలోనూ మేటి. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆరోగ్య పరీక్షలు జరిగిన సమయంలో, కొన్ని గంటల పాటు ఆయన బాధ్యతలనూ నిర్వహించిన ఘనత ఆమెది. ‘నా పేరును ‘కమలా’ అనే పిలవండి’ అంటూ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆ పేరుకు కమలం అనే అర్థం సహజంగానే ఉంది. భారతీయ సంస్కృతిలో కమలానికి ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే. తన సోదరి పేరు ‘మాయా’. తల్లి శ్యామలా గోపాలన్ వైద్య నిపుణురాలు. ఇంతగా భారతీయత నెలకొన్న కమలాహారిస్ అమెరికా రాజకీయరంగాన శిఖరాగ్ర స్థాయిలో నిలిచి గెలవడం అన్ని విధాలా హర్షణీయమే.
అతివల శక్తీ యుక్తీ
అర్జెంటీనా అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఇసబెల్ పెరోన్ సృష్టించిన రికార్డులూ కొన్ని ఉన్నాయి. రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు జరిపారు. ప్రపంచంలో ఆ రిపబ్లికన్ దేశానికి తొలి మహిళా అధినేత తానే. ఉపాధ్యక్షురాలిగానూ పనిచేసిన అనుభవశాలి, ప్రయోగశీలి. రెండు పర్యాయాలు పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు బెనజీర్ భుట్టో, ఘనత వహించిన హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యా లయాల్లో అభ్యసించారు. విద్యార్థి సంఘ నాయకు రాలిగా కూడా ఉద్యమాలను ముందుండి నడిపించారు. అనుకోని పరిస్థితుల ప్రాబల్యంతో గృహనిర్బంధ కాండనీ చవిచూడాల్సి వచ్చింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎటువంటి కష్టనష్టాలు సంభవించినా, ఆ వనితానేత వాటన్నింటినీ భరించారు. ఐర్లండ్‌లో మేరీ రాబిన్సన్, హైతీలో ఎర్తా పాస్కల్, నికరాగువాలో వియోలెటా, చమోరో, లిథువేనియాకు సంబంధించి కజిమిర చరిత్రలను గమనిస్తే… వనితా స్వాతంత్య్ర పాలక రీతులు తేటతెల్లమవుతాయి. ఉత్తర అట్లాంటాలోని రిపబ్లిక్ ప్రాంతం ఐర్లండ్. కరీబియన్ ప్రదేశం లోనిది హైతీ. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ హైటీగా పరిగణన. జన సాంద్రత ఎక్కువ. మరో రిపబ్లిక్ దేశం నికరాగువా. పర్యాటక ప్రసిద్ధ ప్రాంతం. వైవిధ్యాలు లెక్కలేనన్ని. విర్నియస్ రాజధానిగా ఉన్నదే లిథువేనియా. ప్రాచీన, ఆధునికతల కలనేత. వాతావరణంతో పాటు రాజకీయంగానూ మార్పులు అధికం. ఈ దేశాల్లో కూడా వనితా నేతృత్వం చోటు చేసుకుంది.
అంతా కాల నిర్ణయం
ప్రస్తుతం మనదేశం రాష్ట్రపతి పదవికి ఒక అభ్యర్థి ద్రౌపది ముర్ము. ఝార్ఖండ్‌కు గవర్నర్‌గా రాజకీయ నేపథ్యం. అంతకుముందు ఒడిశాలో స్వతంత్ర రీతిన బాధ్యతల నిర్వహణ. అక్కడి శాసనసభలో చిరకాల అనుభవ ప్రజ్ఞ. విద్యార్ధి దశలో రమాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో జాగృత కార్యక్రమాలెన్నో నిర్వహించినవారు. ఉపాధ్యాయినిగా, ప్రభుత్వ ఉద్యోగినిగా బోధన, పాలనానుభవాలు. భారత్‌లో తొలిసారిగా జార్ఖాండ్ రాష్ట్రానికి గవర్నర్ అయిన గిరిజన వనితా నేత. రాష్ట్రపతి ఎన్నికల దరిమిలా ఫలితమే భారత మహిళా నాయకత్వ పేరును నిర్ణయిస్తుంది. ఎదురు చూద్దాం అందరం.
వెల్లివిరిసిన పరిపూర్ణత
సమానహక్కులు, సకాల న్యాయం, పలురంగాల వారీగా సముచిత ప్రాతినిధ్యం-ఇవీ స్త్రీల అంతరంగ తరంగాలు. సమ సాధికారత అనే సరికి, ఇప్పుడు ప్రపంచదేశాల పాలనాధినేతలుగా వారు పటిమ చూపుతున్నారు. కొందరు అధ్యక్షులైతే, ఇంకొందరు ప్రధానమంత్రులు. అధికార కాలంలో హెచ్చు తగ్గులున్నా, ఎన్నికలా? వారసత్వ ఫలితాలా? అనే ప్రశ్నలొస్తున్నా.. ఇక్కడ మహిళాశక్తే ప్రధానాంశం. నవభారతంలో రాష్ట్రపతి హోదా అందుకున్న తొలి వనిత ప్రతిభాపాటిల్. న్యాయంతో పాటు ఆర్థిక, రాజనీతి శాస్త్రాలు చదువుకున్నారు. ఇజ్రాయెల్ వ్యవస్థాపక ప్రముఖురాలైన గోల్డా మీర్ ఉద్యమ దశ నుంచి ప్రధానిగా పాలన స్థాయికి 70వ పడిలో చేరుకున్నారు! బంగ్లాలోనైతే ప్రధాని కుర్చీని అలంకరించిన ప్రబల అతివ బేగం ఖలీదా. వరసబెట్టి మూడు పర్యాయాలు న్యూజిలాండ్‌లో ప్రధాని అయిన విలక్షణత హెలెణ్ ఎలిజబెత్‌ది. అలాగే మొజాంబిక్‌లో ప్రథమంగా నేతృత్వ స్థానం తాయిసా డయాగోను వరించింది. ఎంజెలా మెర్కెల్ జర్మనీ పరిపాలనకురాలిగా సుప్రసిద్ధ. ట్రినిడాడ్ ప్రధాని బాధ్యతలకు పేరు తెచ్చారు కమలా పర్సాద్. ఆస్ట్రేలియాలో ప్రధానిగా, ఉప ప్రధానిగా కూడా పదవులు రెండూ జాలియాకు లభించాయి. ఇలా ఒకరా! ఇద్దరా? ఎందరెందరో మహిళామణులు ఆయా దేశాల పాలన పగ్గాలు చేపట్టి, నారీశక్తిని మరింత ప్రస్ఫుటంచేశారు. అవకాశాలొస్తే ప్రతిభా పాటవాలు కనబరుస్తామని నిరూపిస్తున్నారు వారంతా.
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్