శ్రీలంక… స్వర్ణ లంక. అందాల దేశం. చిన్న దేశం. అందాల సముద్ర తీరాలతో, చక్కని పర్యాటక ప్రదేశాలతో అలరారే దేశం. సాంస్కృతికంగా, నాగరికతాపరంగా భారత్‌తో తాదాత్మ్యం చెందగల దేశం. 2500 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వెళ్లిపోయిన వారే సింహళీయులు. రావణుని లంక ఇదేనని నమ్మేవారూ ఉన్నారు. అలాగే ఉత్తర భారతదేశ మూలాలు ఉన్న ప్రజలు కూడా ఎక్కువే. తరువాత తమిళులు. 65 శాతం బౌద్ధులతో, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. అలాంటి దేశంలో ముసలం తెచ్చింది చైనా డ్రాగన్. దేశం అల్లకల్లోలమైంది. కుటుంబ పాలన, అవినీతి నేతలకు తోడు చైనా జోక్యంతో కుదేలైంది. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. ఈ పరిణా మాలను దగ్గర నుంచి పరిశీలించిన వారు స్వామి విజ్ఞానంద. ఈయన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సంయుక్త ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ సమన్వయ విభాగ అధిపతి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యతో పాటు పదేళ్లు సంస్కృతాన్ని అభ్యసించారు. వీహెచ్‌పీ తరఫున శ్రీలంకలో కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో జాగృతి జరిపిన ముఖాముఖీ.
శ్రీలంక తాజా సంక్షోభానికి కారణం ప్రధానంగా ఆర్థిక సమస్య. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం. ఈ దృష్టితో ఆ సంక్షోభం రూపురేఖలు ఏమిటి?
శ్రీలంకను ముంచెత్తిన తాజా సంక్షోభానికి వెనుక ఉన్న సమస్యలలో మొదటిది- గడచిన 15 ఏళ్లుగా ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేక పోవడం. నిజం మాట్లాడుకోవాలంటే అది అభివృద్ధి చెందుతున్న దేశమే. అభివృద్ధి చెందిన దేశంగా చెప్పు కోవడానికి వీలుగా అక్కడ ప్రజల ఆయుర్దాయం బావుంది. అక్షరాస్యత శాతం బాగుంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన సజావుగానే ఉంది. సగటు ఆదాయమూ మెరుగ్గానే ఉంది. ఎల్‌టీటీఇ సమస్యతో మూడు దశాబ్దాలు సంక్షోభం ఎదుర్కొన్న సంగతి కూడా ఉంది. మహింద రాజపక్స అధ్యక్షునిగా ఉన్నప్పుడు (2005-2014) ఆయన చిన్న సోదరుడు గోటబాయ రక్షణశాఖ కార్యదర్శి. అసలు సైన్యంతో పాటు పారా మిలటరీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వంటివన్నీ కలుపుకుని అప్పుడు 5 లక్షల వరకు సైన్యం ఉండేది. బడ్జెట్‌లో రక్షణ శాఖ పద్దు దాదాపు 24 నుంచి 25 శాతం. దేశ ఆదాయం కంటే, వ్యయం ఎక్కువ అన్న ధోరణే ఇటీవలి కాలమంతా కనిపిస్తుంది.
విదేశీ మారక నిల్వలకు ఆ దేశానికి ఉన్నవి మూడు మార్గాలు. ఒకటి తేయాకు ఎగుమతి. నవరత్నాల ఎగుమతి, విదేశాలలో ఉండే లంకేయుల ద్వారా సమకూడే విదేశీ మారకం రెండోది. మూడు- పర్యాటకం ద్వారా లభించేది. ఏ పేరు పెట్టినా మొత్తంగా శ్రీలంకకు ఆదాయ వనరులు ఇవే. కానీ మహింద రాజపక్స వ్యవహార సరళి, జీవితం ఒక చక్రవర్తిని పోలి ఉండేవి. అలా జీవించేవాడాయన. ఈయన దక్షిణ శ్రీలంకలో హమ్మన్‌టోటా అనే ప్రాంతానికి చెందినవాడు.
రుణభారం తడిసి మోపెడయిన తీరు ఎలాంటిది?
ఇదంతా చైనా చలవ. మహింద రాజపక్స హమ్మన్‌టోటా దగ్గరే ఒక వాణిజ్య నౌకాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదన దేశానికి ఆర్థికంగా ఏమాత్రం లాభదాయకం కాదని భారత్ సహా కొన్ని దేశాలు సూచించాయి. కానీ మహింద చైనాను ఆశ్రయించాడు. వాళ్ల దగ్గర బోలెడు డబ్బుంది. ఆధిపత్యం కోసం చైనా మిగిలిన ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తున్నదో అందరికీ తెలుసు. ఆ నౌకాశ్రయం కట్టుకోమని, రుణం కూడా ఇస్తామని చెప్పారు. కానీ వడ్డీయే దారుణం. అది 6.5 శాతం. దేశాల మధ్య రుణాలపై వడ్డీ ఒక శాతం వరకు ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 1 లేదా 2 శాతం వడ్డీ వసూలు చేయవచ్చు. కొన్ని ప్రత్యేక రుణాల మీద 3 శాతం వడ్డీ ఉంటుంది. ఏ విధంగా చూసినా చైనా వడ్డీ దారుణం. ఆ రుణంతోనే మొత్తానికి నౌకాశ్రయం నిర్మించారు. తేలిందేమిటంటే దాని ఆస్తుల విలువ కంటే చెల్లింపులు ఎక్కువ య్యాయి. ఎలాంటి ఆదాయం లేనపుడు జరిగేది ఇదే. ఆస్తుల విలువ కంటే చెల్లింపులు ఎక్కువుగా ఉంటాయి. ఫలితం దేశం మీద ఒక తెల్లఏనుగు స్వారీ మొదలయింది. కానీ అక్కడితో ఆగకుండా మహింద ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని కూడా తలపెట్టాడు. అదొక చిన్న దేశం. దానికి అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అనవసరం. అయినా రుణం తెచ్చి నిర్మించారు. అది సామర్థ్యానికి తగ్గట్టు పనిచేయడం లేదు. ఇవి రెండూ చాలవన్నట్టు తన పేరుతో ఒక క్రికెట్ స్టేడియం కూడా నిర్మించాడు. దీని నిర్వహణ కూడా అసాధ్యమైన రీతిలో ఉంది. మరొక రెండు రుణాలు తెచ్చి ఒక భారీ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారు. నిజానికి మిగిలిన వాటి కంటే దీనితో కొంత ప్రయోజనం ఉంది. కానీ టోల్‌టాక్స్ వసూలు చేయక పోవడం వల్ల దీని నిర్వహణ కూడా తడిసి మోపెడయింది. వీటన్నిటికి కలిపి ఒక్క చైనా నుంచి తీసుకున్న రుణమే 10 బిలియన్ యూఎస్ డాలర్లు. ఆ చిన్న దేశం మొత్తం విదేశీ రుణం 51 బిలియన్ యూఎస్ డాలర్లు. పరిస్థితి ఏమిటంటే, ఆదాయం లేదు. మరోపక్క భారీ రుణాలకు భారీ వడ్డీలు. రూ 100 ఆదాయం ఉన్నప్పుడు రూ. 150 వ్యయం చేస్తే కొంత వరకు ప్రమాదం లేదు. కానీ రూ. 200 వ్యయం చేస్తూ, అందులో సగం వడ్డీలకు చెల్లిస్తే ఏమౌంతుంది? ఆదాయం ఎంతో వడ్డీలకు చెల్లించేది కూడా అంతే.
గొటబాయ రాజపక్స, అంటే ఇప్పుడు సింగ పూర్‌లో తలదాచుకున్న అధ్యక్షుడి కాలంలోనే ఈ సంక్షోభం తలెత్తడానికి కారణం ఏమిటి?
నందసేన గొటబాయ రాజపక్స 2019లో అధ్యక్షుడయ్యాడు. ఈ (2022) జూలై 14న దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రజాకర్షక పథకాలు వెదజల్లే ఇతడు అధ్యక్ష పదవిలోకి వచ్చాడు. ఇతడికి ముందు దేశాధ్యక్షునిగా ఉన్న రణిల్ విక్రమ్ సింఘే ప్రధాని అయ్యారు. ఇదంతా క్రోనీ డెమాక్రసీ. అధ్యక్షుడు, ప్రధాని, ఆర్థిక మంత్రి, రక్షణమంత్రి, పార్లమెంట్ స్పీకర్, ఇతర మంత్రులు అంతా ఒకే కుటుంబం నుంచి వచ్చారు. గొ•బాయ పన్నులు సగానికి తగ్గించాడు. ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర వత్తిడి ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న వంద రూపాయల ఆదాయం యాభయ్‌కి పడిపోయింది. ఇది మొదటి తప్పు. దీనికి తోడు కరోనా సమస్య. విదేశాలలో పనిచేస్తున్న శ్రీలంకవాసులు కూడా స్వదేశం చేరుకోవడంతో విదేశీ మారకం పోయింది. అలాగే పర్యాటకం దారుణంగా పడిపోయింది. వీటికి తోడు తేయాకు ఎగుమతులు లేవు. ఇవన్నీ కలసి విదేశీ మారక నిల్వలను ఆవిరి చేసేశాయి. విదేశీ మారకం లేకుండా దిగుమతులు ఎలా సాధ్యం? శ్రీలంక చమురు, ఆహారధాన్యాలు, నిత్యావసరాలు దిగుమతి చేసుకునే దేశం. అవన్నీ ఆగిపోయాయి. ఈ మార్చి నెలకి ధరలు ఆకాశాన్నంటడం మొదలైంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడానికి ఉపకరించే పని ప్రభుత్వం చేసింది. నోట్లు ముద్రించి పంచింది. గడచిన మూడు నాలుగు మాసాలుగా పెట్రోలు లేదు, వంట గ్యాస్ లేదు. ఇలాంటి మూడు నెలల తీవ్ర సంక్షోభం తరువాత ఆ దేశ ప్రజల మీద సానుభూతితో భారత్ మూడు బిలియన్ డాలర్లు రుణం ఇచ్చింది. నిజానికి ఇది మరణశయ్య మీద ఉన్న రోగికి ఆక్సిజన్ అందించడమే. నిజం చెప్పాలంటే శ్రీలంక మీద భారత్ పెద్ద మనసుతో వ్యవహరించింది. శ్రీలంక తన చైనా అనుకూల విధానంతో మన దేశాన్ని చాలాసార్లు ఇరకాటంలోకి నెట్టింది. చైనా అనుకూల విధానం అంటే, భారత్ వ్యతిరేక విధానమే.
అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగానే చూడవచ్చా? కుట్రకోణం ఏమీ లేదనే చెప్పు కోవచ్చునా?
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యంతో తలెత్తిన పరిణామమే. కుట్ర లేదు. ఆర్థిక వ్యవస్థలోని సంక్లిష్టతను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫల మైంది. విదేశీ మారక నిల్వలు ఉండాలంటే ఎగుమ తులు చేయాలి. కానీ కరెన్సీ విలువ తగ్గించారు. మామూలుగా ఒక డాలర్‌కు రెండు వందల శ్రీలంక రూపీలతో సమానం. కానీ ఇప్పుడు నాలుగు, ఐదు వందలకు చేరుకుంది. దీనితో దిగుమతుల చెల్లింపులు కూడా అనూహ్యంగా పెరిగాయి. అసలు ప్రభుత్వమే ఒక విఫల విధానం అనుసరించింది. దానికి తోడు విఫల నిర్వహణ. అలాగే అహంకార పూరిత వ్యవహారశైలి. అసలు పన్నులు సగానికి తగ్గించవలసిన అవసరం ఏముంది? ఇలా చేయమని ఎవరు చెప్పారు? ఎవరు కోరారు? రాత్రికి రాత్రి సేంద్రియ సేద్యానికి మళ్లమని ఎవరు చెప్పారు? ఒక్కసారి మార్పు సంభవించడానికి ఇదేమీ మంత్రదండంతో చేసే మాయ కాదు కదా! శ్రీలంక అనుభవిస్తున్నది పూర్తిగా మానవ నిర్మిత సంక్షోభం. అది కూడా ఉన్నత పదవులలో ఉన్నవాళ్లు తెచ్చిపెట్టిన సంక్షోభం.
కుటుంబ పాలన, అవినీతి ఈ స్థితికి దేశాన్ని తెచ్చాయా?
స్వాతంత్య్రం వచ్చిన నాటికి ఆ దేశంలో కుటుంబ పాలన లేదు. ఒక వ్యవస్థగా శ్రీలంక ప్రజా స్వామికంగానే ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అక్కడ ఏర్పడినది ప్రజాస్వామిక ప్రభుత్వమే. అయితే కొందరు చదువుకున్న వాళ్లు, డబ్బున్నవాళ్లు దాని పంథా మార్చారు. 1952 ఎన్నికల తరువాత డబ్ల్యుఆర్ భండారు నాయకే అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారం కోసం సింహళం భాష మాత్రమే ఉండాలన్న ఉద్యమం మొదలు పెట్టాడు. ఇది తమిళాన్ని అణచి వేయడానికే. ఆయనని ఆయన నివాసంలోనే ఒక బౌద్ధ సాధవు చంపాడు. ఆయన హత్య తరువాత ఆయన భార్య సిరిమావో అధికారం లోకి వచ్చారు. వీరి కుమార్తె చంద్రికా కుమారతుంగ కూడా వచ్చారు. అంటే ఒక కుటుంబ పాలన తరువాత మరొక కుటుంబ పాలన. ఈ రెండు కుటుంబాలు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందినవే కావడం ఇంకో విశేషం. భండారు నాయకె వలెనే, రాజపక్సలు కూడా అన్నదమ్ములతో, బంధుగణంతో ప్రభుత్వాన్నీ, పాలనా యంత్రాంగాన్నీ నింపేశారు. జేఆర్ జయవర్ధనే చేసింది కూడా ఇదే.
ఉద్యమం ఎలా ప్రారంభమైంది?
అది పూర్తిగా విద్యార్థుల చొరవతోనే ఆరంభ మైంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలలో శాంతియుత ప్రదర్శనలే జరిగాయి. విద్యార్థులు అంతరాష్ట్ర విశ్వవిద్యాలయ సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. తరువాత జిల్లా స్థాయిలో విద్యా సంస్థలు జతగా వచ్చాయి. ఆపై కార్మిక సంఘాలు ముందుకొచ్చాయి. ఇది పూర్తిగా ప్రజా ఉద్యమం. యువత, విద్యార్థులు నడిపినది. వీళ్లే దేశమంతటా నిరసనలు ఆరంభిం చారు. కొలంబో అధ్యక్ష భవనం దగ్గర ఉద్యమాలు చేసినది కూడా వీరే.
అంటే దీనిని ఆకస్మాత్తుగా, ఎలాంటి వ్యూహాల ప్రశ్న లేకుండా తలెత్తిన ఉద్యమమని అనుకోవచ్చా?
ప్రజలే అకస్మాత్తుగా ఉద్యమం లేవదీశారు. అయితే దీని వెనుక ఉన్న ఆగ్రహం, అసమ్మతి ఒక రోజులో తలెత్తినవి మాత్రం కావు. మే నెల 9న గొటబాయ పార్టీ మనుషులు ఉద్యమకారుల మీద దాడులు చేశారు. అది మరిన్ని ఉద్రిక్తతలను పెంచింది. దాదాపు నెల తరువాత మళ్లీ ఆందోళన లను ఉధృతం చేశారు.
రాజకీయ పార్టీల ప్రమేయం ఏమిటి?
కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి వెనుక నిలిచాయి. కానీ ప్రధాన పాత్ర మాత్రం వాటిది కాదు. ఉద్యమకారులు తమ ఉద్యమాన్ని రాజకీయేతర ఉద్యమంగానే నిర్వహించదలిచారు.
ఏదో ఒక క్షణంలో ఈ ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నించే అవకాశం ఉందా?
దానికి ఉన్న ప్రజా ఉద్యమ కోణం నుంచి చూస్తే అలా అనిపించదు. ఏ సంస్థా అందుకు ముందడుగు వేయకపోవచ్చు కూడా. ఒకవేళ జనతా విముక్తి పెరమున వంటి సంస్థల గురించి అనుకుంటే, వాళ్లకీ అవకాశం లేదు. అది వచ్చే ఎన్నికలలో కొన్ని స్థానాలు గెలవవచ్చు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత బలం లేదు.
ఇప్పుడు జనతా విముక్తి పెరమున పరిస్థితి ఏమిటి?
ఇక్కడ (భారత్‌లో) నక్సలైట్ ఉద్యమం మొదలైన కాలంలోనే శ్రీలంకలో జనతా విముక్తి పెరమున (జేవీపీ) పెద్ద ఎత్తున సాయుధ పోరాటం చేసింది. 1970కి బాగా బలపడింది. పశ్చిమ బెంగాల్‌లో సిద్ధార్థ శంకర్ రే ఏ విధంగా నక్సల్ ఉద్యమాన్ని అణచివేశారో, అక్కడ జేవీపీ తిరుగుబాటును సిరిమావో అణచివేశారు. ఇప్పుడు పార్లమెంటరీ రాజకీయాలలో ఆ సంస్థ పనిచేస్తున్నది. వీళ్లకి అప్పుడు చైనా ఆయుధాలు పంపింది. సిరిమావోకు కొరియా పంపింది. కానీ జేవీపీ అధికారంలోకి రావడం చైనా ఉద్దేశం కాదు. చైనాకు కావలసింది అవినీతిపరులు, లంచగొండులు అధికారంలో ఉండడం.
అడపా దడపా లంక తమిళుల మీద డీఎంకే ప్రేమ ఒలకబోస్తూ ఉంటుంది. ఎల్‌టీటీఈ నాయకత్వంలో అక్కడ అంత వేర్పాటువాద ఉద్యమం నడిపిన తమిళ వర్గాల మీద ద్రవిడ ఉద్యమం ప్రభావం ఉందా?
అంత గట్టిగా ఏమీలేదు. నిజానికి శ్రీలంక భారత్‌ను మించి మత విశ్వాసాలను ఆచరించే దేశం. మన కంటే వారి మత భావన బలమైనది కూడా. డీఎంకే అడపా దడపా మాట్లాడడం అక్కడి తమిళుల మీద ప్రేమతో కాదు. ఇక్కడి తమిళ ఓటర్ల మీద ఆశతో. ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అది ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ పట్టుబడిన తరువాత, డీఎంకే నాయకుడు కరుణానిధి చెప్పిన మాటే అంటారు. అప్పుడు ఎన్నికలు. అందుకే ఇప్పుడేమీ చేయవద్దు. కావాలంటే తరువాత చంపవచ్చు అని ఆయన చెప్పాడని వినికిడి.
భారత్ స్పందన ఏమిటి?
ప్రస్తుతం చైనాకి అక్కడ గౌరవం లేదు. ఇది మనకి శుభ పరిణామం. సంక్షోభ సమమంలో మూడు బిలియన్ డాలర్ల విలువైన మందులు, ఆహార పదార్థాలు, పెట్రోలు ఆ దేశానికి మనం పంపాం. అయినా మన పాత్ర తటస్థం. ప్రజలకు సాయం అందించడం వరకే. నేరుగా రాజకీయాలలో జోక్యం చేసుకోలేం. శ్రీలంక సమాజం వాస్తవాల దగ్గరకు వస్తున్నది. ఎవరు నిజమైన స్నేహితుడు అన్న విషయం అర్ధం చేసుకునే ప్రయత్నంలోనే ఉంది. క్రికెటర్ సనత్ జయసూర్య ఏమన్నారు? భారత్ ఎప్పటికీ మంచి పొరుగు దేశమే అన్నారు. ఈ కష్టకాలంలో చైనా మాత్రం ఏమీ కలగచేసుకోలేదు.
శ్రీలంక పరిణామాలను దగ్గర నుంచి చూసిన వారిగా మీ సొంత అభిప్రాయం ఏమిటి?
ఇరుగు పొరుగును మార్చలేం. శ్రీలంకలో పరిస్థి తులు చక్కబడితే అది మనకి కూడా ప్రయోజనమే. అక్కడి ఆర్థిక పరిస్థితి చక్కబడాలి. బలపడాలి. మంచి పాలన రావాలి. ఆ దేశం చైనా ప్రభావం నుంచి బయటపడాలి.
ఇంత సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక భవిష్యత్తు ఏమిటి?
అది ఇప్పుడే చెప్పలేం. కానీ దానికి స్వర్ణ లంక అని కదా పేరు! ఆ దేశానికి ఉత్తములైన పౌరులు ఉన్నారు. చిన్నదేశం. సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. సారవంతమైన భూములు ఉన్నాయి. కొత్త నాయకత్వం వచ్చి సక్రమ పాలన అందిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఈ ఉద్యమం నేపథ్యంలో శ్రీలంక ప్రజలు చైనా పట్ల ఏర్పరుచుకున్న వైఖరి ఏమిటి?
చైనాను వదిలించుకోవాలన్న ధోరణి అక్కడ ఎప్పటి నుంచో ఉంది. మీరిచ్చిన రుణాలు, మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇచ్చే ప్రశ్నే లేదని వారు చైనాకి చెబుతున్నారు. ఎందుకంటే, మీరు పెట్టిన దంతా అవినీతి సొమ్మే కదా అని సమాధానం. చైనా తమ దేశాన్ని నాశనం చేసిందనే వారు నమ్ముతు న్నారు. తమ నాయకులను లంచగొండులను చేసిందనే చెబుతున్నారు. చైనా డబ్బు ఎందుకు ఇచ్చింది? వడ్డీ కోసం, ఆధిపత్యం కోసం. ఇప్పుడు శ్రీలంక చేతులెత్తేసింది. చైనాకే కాదు, అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ కూడా కట్టలేని స్థితిలో, దివాలా స్థితిలో ఉంది. చైనా నుంచి రుణం తీసుకోకుంటే దేశంలో ఇవాళ ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కావనే చాలామంది నమ్మకం. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయేది కాదని చెబుతున్నారు.