బ్రిటన్‌ ‌ప్రధాని బరిలో భారత సంతతి నేత!

రెండు వందల సంవత్సరాలు రవి అస్తమించని బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం పాలనలో మగ్గింది భారత్‌. ఇప్పుడు భారత సంతతి వ్యక్తే బ్రిటన్‌ ‌ప్రధాని అయితే! ఎవరూ ఊహించని అద్భుతం! ఈ పరిణామం ప్రతి భారతీయుడిని పులకింపజేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన దేశాన్ని శాసించే స్థానంలో భారత సంతతి నేత ఉంటే, మనదేశ గౌరవం పడిలేచిన కెరటం వలె ఆకాశపుటంచులను మరోసారి చుంబిస్తుంది. ప్రస్తుత బ్రిటన్‌ ‌రాజకీయాలు ఆ దిశగానే ముందుకెళుతున్నాయి. బోరిస్‌ ‌జాన్సన్‌ ‌కన్జర్వేటివ్‌ ‌పార్టీ నాయకత్వ పదవికి రాజీనామా చేయడంతో, అప్పటికే ఆర్థికమంత్రి పదవినుంచి తప్పుకున్న రిషి శౌనక్‌ ‌కన్సర్వేటివ్‌ ‌పార్టీ నాయకుడిగా బిడ్‌ ‌దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో ‘ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. అందువల్ల కన్జర్వేటివ్‌ ‌పార్టీ నేతగా, ప్రధానిగా ఉండాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.


రిషి శౌనక్‌ ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే, వరుసగా మంత్రివర్గ సభ్యులు రాజీనామాలు చేయడంతో బోరిస్‌ ‌జాన్సన్‌ ‌పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోక తప్పలేదు. ఒకవేళ రిషి శౌనక్‌ ‌కన్జర్వేటివ్‌ ‌పార్టీ నేతగా ఎన్నికైతే బ్రిటన్‌ ‌ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. 42 సంవత్సరాల రిషి తాతలు బ్రిటన్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తి ఈయన భార్య. వీరికి ఇద్దరు సంతానం. 2020లో బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా బోరిస్‌ ‌జాన్సన్‌ ‌మంత్రివర్గంలో చేరిన రిషి, కొవిడ్‌తో సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాట్లో పెట్టిన సమర్థుడిగా పేరుతెచ్చు కున్నారు. ముఖ్యంగా వ్యాపార, కార్మికుల అనుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేశం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా అడ్డుకున్నారు. అంతేకాదు, ఎవరూ ఉద్యోగాలు కోల్పోకుండా 410 బిలియన్‌ ‌పౌండ్ల కార్యక్రమాన్ని ప్రకటించడం ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు దన్ను చేకూర్చడం ద్వారా తెచ్చుకున్న మంచి పేరుతో పాటు కొన్ని వివాదాలు కూడా ఆయనపై ఉన్నాయి. లాక్‌డౌన్‌ ‌సమయంలో డౌన్‌టౌన్‌ ‌స్ట్రీట్‌లో పుట్టినరోజు వేడుకలో పాల్గొనే సమయంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై శౌనక్‌, ‌జాన్సన్‌లకు పోలీసులు జరిమానా విధించారు. 2021లో టాక్స్-అం‌డ్‌-‌స్పెండ్‌ ‌బడ్జెట్‌ను అమలు జరపడంవల్ల ఖర్చులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న విమర్శలున్నాయి. విదేశాల నుంచి వచ్చే ఆదాయంపై ఆయన భార్య అక్షతామూర్తి పన్ను సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు బ్రిటిష్‌ ‌ప్రభుత్వంలో పనిచేస్తున్న సమయంలో ఆయన తన యూఎస్‌ ‌గ్రీన్‌కార్డును సరండర్‌ ‌చేయలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.

టోరీ (కన్జర్వేటివ్‌) ఎం‌పీ ప్రధాని రేసులో నిలవాలంటే ఎనిమిదిమంది సహచరులు అతడిని నామినేట్‌ ‌చేయాలి. ఒకవేళ ఒకరికంటే ఎక్కువమంది ఎంపీలు ఈవిధంగా ముందుకు వస్తే, రహస్య ఓటింగ్‌ ‌నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌ ‌కొన్ని రౌండ్లలో జరుగుతుంది. ప్రతి రౌండ్‌లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిపేరు తొలగించి మళ్లీ ఎన్నిక నిర్వహించే పక్రియ కొనసాగుతుంది. ఆ విధంగా చివరిగా ఇద్దరు అభ్యర్థులు మిగులుతారు. వీరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పోలైతే వారే పార్టీ నాయకుడు అవుతారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారంగా జరుగుతుంది. అంతేకాని బ్రిటన్‌లో మధ్యంతర ఎన్నికలు జరగవు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే పక్రియ కాదు. కొన్ని వారాలు పడుతుంది. 1922 కమిటీ, దీనికి సంబంధించిన టైమ్‌లైన్‌ను నిర్ణయించి అమలుచేస్తుంది. వాలెస్‌ (‌మాజీ రక్షణ మంత్రి) 13 శాతం, పెన్నీ మోర్డాంట్‌ (‌మాజీ మినిస్టర్‌ ఆఫ్‌ ‌స్టేట్‌ ‌ఫర్‌ ‌ట్రేడ్‌ ‌పాలసీ) 12 శాతం, రిషి శౌనక్‌ (‌మాజీ ఆర్థికమంత్రి) 10 శాతం మద్దతుతో ప్రధాని బరిలో ఉన్నట్టు ‘యూగౌ’ మార్కెట్‌ ‌నిపుణుల సంస్థ జరిపిన సర్వే పేర్కొంది. ఎన్నిక జరిగే సమయానికి ఈ సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు.

పతనాన్ని కోరితెచ్చుకున్న బోరిస్‌ ‌జాన్సన్‌

‌యూకే ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌ ‌కన్జర్వేటివ్‌ ‌పార్టీ నాయకుడిగా రాజీనామాకు తక్షణ ప్రధాన కారణం, అతని అత్యంత సన్నిహితుడు క్రిస్టొఫర్‌ ‌ఫిన్‌ఛర్‌ను డిప్యూటీ విప్‌గా నియమించడం. నిజానికి ఇతడిపై ‘సెక్సువల్‌ ‌ప్రెడెటర్‌’‌గా తీవ్ర ఆరోపణలున్నప్పటికీ ఈ పదవిలో నియమించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇతని ప్రవర్తన విషయం తమకు తెలియదని మొదట్లో జాన్సన్‌ ‌ప్రతినిధి కొట్టిపారేసి నప్పటికీ, దీన్ని ఎవరూ ఆమోదించలేదు. చివరకు గత జూన్‌ 30‌న కార్ల్‌టన్‌ ‌క్లబ్‌లో తప్పతాగిన స్థితిలో ఇద్దరు పురుషులపైనే లైంగిక దాడి చేయడానికి యత్నించగా వారు భయపడి పారిపోయారన్నది తీవ్ర ఆరోపణ. కన్జర్వేటివ్‌ ‌పార్టీ మాజీ ఎంపీ నెయిల్‌ ‌పరిష్‌ ‌గతంలో దిగువసభలో పోర్నోగ్రఫీ చూస్తూ పట్టుబడిన సంఘటన కంటే ఇది తీవ్రమని విపక్షం నుంచి దాడులు అధికమయ్యాయి. ఏకంగా కొందరు ఎంపీలు ఫిన్‌ఛర్‌ ‌సీటుకు ఉపఎన్నిక జరపాలని డిమాండ్‌ ‌చేయడం వరకూ పరిస్థితి వెళ్లింది. క్రిస్టొఫర్‌ ‘‌ప్రెడెటర్‌’ ‌జీవితం గురించి గతంలో ఫారెన్‌ ‌సెక్రటరీగా పనిచేసేటప్పుడే జాన్సన్‌కు తెలుసునంటూ లార్డ్ ‌సైమన్‌ ‌మెక్‌డొనాల్డ్ అనే ఒక మాజీ దౌత్యవేత్త ‘కమిటీ ఆన్‌ ‌స్టాండర్డస్ ఇన్‌ ‌పబ్లిక్‌లైఫ్‌’ ‌కమిటీకి బహిరంగలేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల ప్రభావంతో జాన్సన్‌ ‌కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ముఖ్యంగా ప్రధాని తర్వాతి స్థాయి గల ఛాన్స్‌లర్‌ ‌కూడా వీరిలో ఒకరు కావడం విశేషం. వీరి తర్వాత జూనియర్‌ ‌మంత్రులు, పార్లమెంటరీ ప్రైవేటు సెక్రటరీల రాజీనామాల పరంపర కొనసాగింది. జూలై 6న ప్రతిపక్ష లేబర్‌ ‌పార్టీ నేత కెయిర్‌ ‌స్టార్మర్‌ ‘‌ప్రైమ్‌ ‌మినిస్టర్స్ ‌క్వశ్చన్స్’ ‌కార్యక్రమం సందర్భంగా ఇదే అంశాన్ని లేవనెత్తి నప్పుడు జాన్సన్‌ ఇబ్బంది పడినా, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొత్త ఛాన్స్‌లర్‌తో సహా ఆయన మంత్రివర్గ సహచరులు రాజీనామా చేయాలని కోరినా పదవి వదలడానికి సిద్ధపడలేదు.

పార్టీ గేట్‌ ‌వివాదం

అంతకుముందు లాక్‌డౌన్‌ ‌సమయంలో నెం.10 డౌనింగ్‌ ‌స్ట్రీట్‌లో జరుపుకున్న పార్టీల విషయంలో కూడా పార్లమెంట్‌కు అబద్ధాలు చెప్పారన్న ఆరోపణలపై కన్జర్వేటివ్‌ ‌పార్లమెంటరీ పార్టీలో నిర్వహించిన ఓటింగ్‌లో 40 శాతానికి పైగా ఆయనకు వ్యతిరేకంగా ఓటుచేశారు. ఈ అసమ్మతిని తృటిలో తప్పించుకున్నప్పటికీ, ఒకవైపు లాక్‌డౌన్‌ ‌వల్ల తమ సన్నిహితులను, ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్న తమవారిని కలుసుకోవడానికి వీల్లేని దుస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్న సమయంలో, పార్టీలు చేసుకోవడం జాన్సన్‌ ఇమేజ్‌ను దెబ్బతీసింది. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందమే అయింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన రెండు ఉపఎన్నికల్లో కన్జర్వేటివ్‌ ‌పార్టీ ఘోరంగా ఓటమిపాలు కావడం మరో కారణం. ఉత్తర ఇంగ్లండ్‌లో లేబర్‌ ‌పార్టీ, దక్షిణ ఇంగ్లండ్‌లో లిబరల్‌ ‌డెమోక్రాట్లు విజయం సాధించారు. వీటికి తోడు ఒక క్రిమినల్‌ ‌కేసులో లండన్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌పోలీసులు జాన్సన్‌కు జరిమానా విధించారు. ఆ విధంగా జరిమానా చెల్లించిన తొలి ప్రధానిగా జాన్సన్‌ అపప్రథను మూటకట్టుకున్నారు.

బోరిస్‌ ‌జాన్సన్‌ ‌నేపథ్యం

2001లో పార్లమెంట్‌కు ఎన్నికవడానికి ముందు, తర్వాత కొంతకాలం బోరిస్‌ ‌జాన్సన్‌ ‌జర్నలిస్ట్‌గా పనిచేశారు. 1989లో బ్రెసెల్స్ ‌కరస్పాండెంట్‌గా పనిచేసి తర్వాత డైలీ టెలిగ్రాఫ్‌లో పొలిటికల్‌ ‌కాలమిస్ట్‌గా కొనసాగారు. 1999-2005 వరకు ది స్పెక్టేటర్‌ ‌మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. 2001లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తర్వాత మంత్రులు మైఖేల్‌ ‌హావర్డ్, ‌డేవిడ్‌ ‌కామెరాన్‌లకు షాడో మినిస్టర్‌గా కొనసాగారు. దిగువసభకు రాజీనామా చేసి 2008, 2012ల్లో రెండుసార్లు లండన్‌ ‌మేయర్‌గా పనిచేశారు. 2015లో ఉక్స్‌బ్రిడ్జ్ అం‌డ్‌ ‌సౌత్‌ ‌రుస్లిప్‌ ‌స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత ‘బ్రిగ్జిట్‌ ఉద్యమం’ (యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌నుంచి బయటకు రావడం) నేపథ్యంలో మంచి ప్రజాదరణ సంపా దించుకున్నారు. అప్పుడు జరిగిన రెఫరెండమ్‌లో బ్రిగ్జిట్‌కే సానుకూలత వ్యక్తం కావడంతో, అప్పటి ప్రధాని థెరిస్సా మే ఆయన్ను ఫారెన్‌ ‌సెక్రటరీగా నియమించారు. అయితే రెండేళ్ల తర్వాత ఆమె ఈయూతో ‘చెక్కర్స్ ఒప్పందం’ ఒప్పందం కుదుర్చుకోవాలనుకోవడాన్ని నిరసిస్తూ జాన్సన్‌ ‌తన పదవికి రాజీనామా చేశారు. 2019లో ఆయన కన్జర్వేటివ్‌ ‌పార్టీ నాయకుడిగా ఎన్నికై ‘బ్రెగ్జిట్‌’ ‌చర్చలను తిరిగి ప్రారంభించారు. అయితే ఈ ఒప్పందానికి పార్లమెంట్‌ ‌మద్దతు లభించక పోవడంతో, 2019, డిసెంబర్‌లో పార్లమెంట్‌ ఎన్నికలకు సిఫారసు చేసి 43.6శాతం ఓట్లతో కన్జర్వేటివ్‌ ‌పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టారు. 1987 తర్వాత పార్టీకి ఇంతపెద్ద మొత్తంలో సీట్లు, ఓట్లు రావడం ఇదే ప్రథమం.

విదేశాల స్పందన

ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధంలో బోరిస్‌ ‌జాన్సన్‌ ‌మొదట్నుంచీ రష్యాపై నిప్పులు చెరుగుతున్నారు. వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న జాన్సన్‌ ‌రాజీనామా సహజంగానే రష్యాకు ఆనందం కలిగించగా, ఉక్రెయిన్‌ను మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. నిజానికి తనపై విధించిన ఆంక్షల నేపథ్యంలో బోరిస్‌ ‌జాన్సన్‌ను తమ దేశానికి రాకుండా రష్యా నిషేధించింది. ఇప్పుడు బ్రిటన్‌కు కొత్త నాయకత్వం రాబోతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధంపై అనుసరించే విధానంలో ఏవిధమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నది వేచి చూడాల్సిందే. అయితే తమ పట్ల బ్రిటన్‌ ‌వైఖరిలో పెద్దగా మార్పేమీ ఉండబోదని రష్యా అంచనా వేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ ‌నేతలు తమ దేశాన్ని యూఎస్‌కు తోకగా మార్చిన నేపథ్యంలో, ఎవరు కొత్త ప్రధాని అయినా యూఎస్‌కు వచ్చే నష్టమేంలేదు. బ్రిగ్జిట్‌కు పూర్తి మద్దతుదారుగా ఉన్న జాన్సన్‌ ‌రాజీనామా వల్ల కొత్త ప్రధాని యూరోపియన్‌ ‌యూనియన్‌తో మరింత సన్నిహితం కావడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా జాన్సన్‌ ‌ప్రభుత్వం, ఈయూ నుంచి బయటకు వచ్చినప్పుడు కుదిరిన వాణిజ్య ఒప్పందంలో మార్పులు చేయడానికి యత్నిస్తోంది. దీనికి ఆగ్రహించిన ఈయూ, బ్రిటన్‌పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం జాన్సన్‌ ‌రాజీనామా నేపథ్యంలో కొత్త నాయకత్వ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందేమో ఈయూ వేచిచూడవచ్చు. ఇక భారత్‌ ‌విషయానికి వస్తే, ప్రస్తుతం భారత్‌-‌యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చలు జరుగుతున్నాయి. బోరిస్‌ ‌జాన్సన్‌ ‌రాజీనామా ప్రభావం వీటిపై పడే అవకాశం లేదు. కొత్త నాయకత్వం కూడా ఇదే పంథాను అనుసరించక తప్పదు. గత ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌లు సమావేశమైనప్పుడు, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఒక అంగీకారానికి రావడానికి, వచ్చే దీపావళి పండుగను గడువుగా నిర్దేశించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 24‌న దీపావళి పండుగ. నూతన ప్రభుత్వం ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తే ఇరు దేశాల మధ్య ఈ దిశగా ఒక అంగీకారం కుదరవచ్చు. ఉక్రెయిన్‌ ‌యుద్ధంలో రష్యాకు పూర్తి మద్దతు ప్రకటించిన చైనాపై బ్రిటన్‌ ‌సహజంగానే వ్యతిరేకత కొనసాగుతుంది. అదీ కాకుండా హాంకాంగ్‌, ‌తైవాన్‌, ‌టిబెట్‌ ‌వ్యవహారాల్లో చైనా వైఖరిని యూకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విధానంలో పెద్దగా మార్పు ఉండదనే చెప్పాలి.

ఎవరి వ్యక్తిగత జీవితం వారిదైనప్పటికీ, ఉన్నత స్థాయిలో ఉన్నవారి వ్యక్తిగత జీవితాలు కూడా ప్రజాక్షేత్రంలో వార్తలుగానే ఉంటాయి. ఉత్తములైన వారిని ఎంతగా ప్రజలు ఆదరిస్తారో, గాడితప్పిన వారిని అంతే వ్యతిరేకిస్తారు. ప్రస్తుత బ్రిటన్‌ ‌రాజకీయాలు ఇందుకు గొప్ప ఉదాహరణ. ఏ తప్పునైతే ప్రజలను చేయవద్దంటూ ప్రభుత్వం నిర్దేశిస్తుందో, అదే తప్పును ప్రభుత్వంలో ఉన్నత స్థాయిల్లో ఉన్నవారు చేస్తే ప్రజలు ఎంతమాత్రం క్షమించరు. సమర్థించుకోవడానికి అవకాశం కూడా ఉండదు. బోరిస్‌ ‌జాన్సన్‌ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన అనుసరించిన విదేశాంగ విధానం లోపభూయిష్టమని కాలమే స్పష్టం చేసింది. రష్యాపై ఆంక్షలు విధించడం తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కోవడమన్న అవగాహన బ్రిటన్‌ ‌సహా యూరోపియన్‌ ‌దేశాలకు లేకపోవడం ఆయా దేశాల నాయకత్వాల మూర్ఖత్వానికి గొప్ప నిదర్శనం.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE