జూలై 22 జయంతి
‘గాయం లలితకళా సృష్టికి సాయం. కవికి గాయకుడికి, చిత్రకారుడికి అదే ధ్యేయం. పరిస్థితులు గుండెను,శరీరాన్ని గాయపరుస్తాయి. అలా గాయపడిన గుండె కళావిర్భావానికి మూలం. కవిత్వం అమృతం వంటిది. దీనిని పుచ్చుకున్నవాళ్లు ఎవ్వరూ మరణించలేదు. మతాలు, రాజకీయాలు మనలను విడగొడతాయి. కవిత్వం మనసులను అతుకుతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘మధ్య యుగాల రాచరిక జులుమే నా కవితకు ప్రేరణ. నిజాం తాబేదార్ల హింసాకాండ పెచ్చు పెరిగింది. ఎటు చూచినా దోపిడీలు, గృహదహనాలు, మానభంగాలు. నా హృదయం స్పందించింది. చైతన్యం పెల్లుబికింది’ అని ఒక ముఖాముఖీలో చెప్పారు దాశరథి. కవిత్వాన్ని కాలక్షేపం కోసం కాకుండా ఉద్యమానికి, సామాజిక వికాసానికి సాధనంగా ఉపయోగించుకున్న అరుదైన కవి.
ఆయన ఉద్యమశీలి. పీడిత జనం కోసం అహరహం తపించారు. ఉద్యమాలను ముద్దాడారు. తనను ఆరాటపెట్టే సమస్య ఏదో ఒకటి ఇతివృత్తంగా ఉండేది. అయితే అది పది మందికీ పనికి వచ్చేదే తప్ప వ్యక్తిగతం కాకూడదని భావించేవారని ఆయన అంతేవాసులు, సహచరులు గుర్తు చేసుకుంటారు. ఆయనే దాశరథి కృష్ణమాచార్యులు. పోరాటం నుంచి కళ పుడుతుందని నమ్మిన వారు. జీవితమే పోరాటమని భావించారు. ఎన్నెన్నో ప్రతికూల శక్తులు, పరిస్థితులపై ఆశావాదంతో పోరాడారు. కాళోజీ నారాయణరావు ‘పుట్టుకనీది/చావునీది/బతుకంతా దేశానిది’ అని లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ గురించి అన్న మాటలు తన మిత్రుడు దాశరథి పట్ల అక్షర సత్యం అంటారు విశ్లేషకులు.
‘సమాజం నీకేం ఇచ్చిందనేకంటే సమాజానికి నీవేం ఇచ్చావు’ అని ప్రశ్నించు కోవలసివస్తే దాశరథి రెండవ కోవలోకి వస్తారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ విలువైన జీవితాన్ని, జీవనాన్ని త్యాగం చేశారు. ఆయన దృష్టిలో సంసారం కంటే సమాజమే మిన్న. పదిహేనవ ఏటనే 1940లో నల్లగొండకు చెందిన రామానుజమ్మను వివాహ మాడిన ఆయన తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిజాం పాలనపై ఉద్యమించి జైలుకు వెళ్లారు. ఒకవైపు ఉద్యమం, జైలు జీవితం, మరోవంక అనారోగ్యం. జైలులో కల్తీ, కలుషిత ఆహారం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింది. శిక్ష ముగిసి ఇంటికి చేరేసరికి అనారోగ్యంతో భార్య కన్నుమూశారు. రాయచూరుకు చెందిన ముడుంబై గోవిందాచార్యులు కుమార్తె లక్ష్మీదేవమ్మ పునర్వివాహమాడారు.
చిన్ననాటి నుంచి అన్యాయాన్ని సహించలేని ఆయన జాగీర్దార్లు, భూస్వాముల దురాగతాలకు రగిలిపోయారు. ఆ యువకవి హృదయం అగ్ని గోళమై మండింది. ఆగ్రహం కట్టలు తెంచుకుని ‘అగ్నిధార’ వర్షించింది. ఆనాటి సాంఘిక, రాజకీయ పరిస్థితుల కారణంగా దాశరథి తెలంగాణ విముక్తి ఉద్యమంలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని ఉద్యమానికి నాందీ చేసుకొని పాలనా విధానంపై మరి కొందరితో కలసి తిరుగుబాటు ప్రకటించారు. కుగ్రామాలు, తండాలు తిరుగాడి నిజాం దమననీతికి వ్యతిరేకంగా కులమత లింగ వర్గ వర్ణ భేదాలకు అతీతంగా ప్రజలను ఏకం చేశారు. పదేళ్లలోపు వయసు (1935)లోనే కలం పట్టి అన్యాయాలపై గళమెత్తిన ఆయన, పదకొండేళ్ల నుంచే పద్యాలు అల్లడం ప్రారంభించారు. ఏడవ తరగతి విద్యార్థిగా ఒక సభలో ఆశువుగా ఇరవై పద్యాలు చెప్పగా, ఆయన ప్రజ్ఞకు మెచ్చిన సభాధ్యక్షులు సుబేదార్ నారాయణరావు ‘ఏక్ దిన్ తెలుగుకా శాయర్ ఆజమ్ బనేగా’ (ఒకనాడు తెలుగులో ప్రముఖ కవి కాగలడు) అని ఆశీర్వదించారు. 19వ ఏట (1944) వరంగల్‌లో జరిగిన ‘ఆంధ్రసారస్వత పరిషత్’వార్షికోత్సవంలో ‘ఓ పరాధీన మానవా, ఓపరాని/దాస్యము విదల్చలేని శాంతమ్ము మాని/తలుపులను ముష్టి బంధాన కలచివైచి/చొచ్చుకొని పొమ్ము, స్వాతంత్య్రం సురపురమ్ము’ అని చెప్పిన పద్యానికి ‘సింహగర్జన చేశావు నాయనా!’ అని తెలంగాణ వైతాళిక ప్రముఖుడు సురవరం ప్రతాపరెడ్డి అభినందించారు.
తెలంగాణ విముక్తి ఉద్యమంలో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా రాసిన గేయాలు దాశరథిని మానసికంగా, శారీరకంగా ‘గాయ’పరిచాయి. రక్తం ఓడేలా హింసిం చాయి. అయినా వెరవలేదు, బెదరలేదు. దేశానికి స్వాతం త్య్రం సిద్ధించినప్పటికీ నిజాం తనను తాను స్వతంత్రుడిగానే ప్రకటించుకున్నారు. తన రాష్ట్రంలో జాతీయ పతాకం ఎగరడానికి వీలులేదని ‘ఫర్మానా’ జారీ చేయడంతో, గుండె రగిలిన దాశరథి అజ్ఞాతం వీడి ‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?అని నిజాంను నేరుగా నిలదీశారు. కవితా ‘అగ్నిధార’ కురిపిస్తున్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకు వెళ్లారు. అయినా మొండి ధైర్యంతో తప్పించుకు వెళ్లారు. ఆ తరువాత మరోసారి పట్టుబడగా 1947 సెప్టెంబర్‌లో 16 నెలల జైలుశిక్ష విధించి నిజామాబాద్ చెరసాలకు తరలించింది నాటి ప్రభుత్వం. అక్కడ అగ్రజ సమానులు, కవి వట్టికోట ఆళ్వార్ స్వామితో కలసి ఉద్యమ కవితా వ్యాసంగం సాగించారు.
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు…
నిను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’ ….అని జైలు గోడమీద బొగ్గు రాసి నిర్భయంగా గానం చేశారు. వట్టికోటకు మహానందం కలిగించిన పద్యాన్ని జైలు గోడల సిబ్బంది తుడిచే కొద్దీ మళ్లీమళ్లీ రాసేవారట. అనంతర కాలంలో ఉద్యమ ఉధృతికి ఆ గీతమే స్ఫూర్తి ‘గీతం’గా నిలిచింది.
1948 జనవరి 11వ తేదీన జైలులో రజాకార్ల దాష్టీకం దాశరథి జీవితంలో మరపురాని భయానక సంఘటన. రజాకారులు అధికారుల సమక్షంలోనే ఖైదీలపై విరుచుకుపడినప్పుడు బలహీనుడు, లఘుకాయుడైన ఆయనకు బాగా దెబ్బలు తగిలాయి. 1948 సెప్టెంబర్ 13వ తేదీ వేకువజామున భారతసైన్యం అన్ని వైపుల నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించడంతో నిజాం సైన్యం నీరుగారి పోయింది. తాను బేషరతుగా లొంగిపోతున్నట్లు నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అదే నెల 17వ తేదీన ప్రకటించారు. తన లక్ష్యాల్లో ప్రధానమైన తెలంగాణ విముక్తి సిద్ధించడంతో దాశరథి తన ‘రుద్రవీణ’ కవితా సంపుటిని తెలంగాణకు అంకితం చేసి ‘మాతృభూమి’ రుణం తీర్చుకున్నట్లు భావించారు.
సంప్రదాయక శ్రీవైష్ణవ కుటుంబంలో దాశరథి వేంకటాచార్యులు, వేంకటమ్మ దంపతుల జ్యేష్ఠ పుత్రుడిగా 1925 జూలై 22వ తేదీన వరంగల్ జిల్లా చినగూడూరులో జన్మించారు దాశరథి చిన్నతనంలోనే వ్యాకరణం, ఛందశ్శాస్త్రం అధ్యయనం చేశారు. ‘సంస్కృతాంధ్ర పండితులైన తండ్రి వద్ద కొంత నేర్చుకున్నారు. మహాకవి ఇక్బాల్ గీతాలను జక్కీ సాహెబ్ వినిపించిన తీరు, ఆ కవిత్వంలోని విప్లవాగ్ని దాశరథిని ప్రభావితం చేసింది. అనంతర కాలంలో దాశరథి చేపట్టిన ‘గాలిబ్ గీతాలు’ అనువాదానికి ఇక్కడే బీజాలు పడ్దాయి. వచన, పద్య, గేయ పక్రియల్లో కవిత్వం రాశారు. గాలిబ్, ఇక్బాల్, జఫర్ వంటి కవులను అనువదించారు.
స్నేహశీలి
‘చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ. అదే చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే స్నేహం’ అన్నారు దాశరథి. స్నేహం గురించి విస్పష్టంగా నిర్వచించిన ఆయన వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ దానిని ఆచరించి చూపారు. అందరికీ ఆయన మిత్రులే. ఆయనకు అందరూ మిత్రులే. వారిలోనూ మరికొందరు అత్యంత ఆప్తులు. ‘మా అన్నయ్య కల్లా కపటం ఎరుగనివాడు. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఆయనకి వేల సంఖ్యలో మిత్రులు న్నారు. ఆయనకు హెచ్చు తగ్గులు లేవు. ప్రధాన మంత్రితోను, పసిపాపతోనూ ఒకేలా మాట్లాడేవాడు. ఎవరు ఉత్తరం రాసినా వెంటనే జవాబు రాసేవాడు. అసలు… ఆయనకు మిత్రులు కాని వారెవరు? ఒక్క నిజాం ప్రభువు తప్ప’ అన్నారు ఆయన సోదరులు డాక్టర్ రంగాచార్యులు.
‘స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ముందుండే అరుదైన కవి దాశరథి’ అన్నారు ప్రఖ్యాత గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి.
‘కవి దాశరథికి నవయువ
కవి దాశరథి నిత్య కళ్యాణమగున్
రవికుల దాశరథికి వలె మా
కవికుల దాశరథి పరిధి కడలు కొను నిలన్’ అని వేటూరి చెప్పిన పద్యానికి బదులుగా…
‘ఎందరు లేరు మిత్రులు మరెందరు లేరట సాహితుల్ హితుల్
చందురు వంటి చల్లనయ సాహిత సౌహితి గుత్తకొన్నవా
రెందరు అందరన్ దిగిచి ఈ కవి డెందము హత్తుకొన్న మా
సుందరరామమూర్తికి వసుంధరలో నుపమాన మున్నదే’ అని ప్రత్యుత్తరమిచ్చిన సరసకవి.
ఇతరుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు తనలోని లోపాలను గుర్తించి చక్కదిద్దుకొనే వ్యక్తిత్వం ఆయన సొంతం. ‘స్వీయలోపంబు నెరుగుట పెద్ద విద్య’ అనే గాలిబ్ మాటలను తమకు తామే అన్వ యించుకున్న వ్యక్తిత్వం. వృత్తిపరంగా ఇతరుల సలహా, సహకారాలు తీసుకోవడంలో భేషజాలకు పోని వినయ శీలి.
సాహిత్యకారులు సహా ఇతరులు కొన్ని అంశా లలో దాశరథిని ఎలా విమర్శించినా ఆయన ఒక రాజకీయ పక్షానికో, మతానికో, వర్గానికో కట్టుబడి కవితలు చెప్పలేదు. ఆయన మతం మానవత్వం. కువిమర్శకులను, కువిమర్శలను ఎన్నడూ పట్టించుకోలేదు. చెప్పదలచింది, రాయవలసింది నిర్భయంగా, విస్పష్టంగా చెప్పారు, రాశారు. ‘శాంతి విప్లవవాది’గా నిరంకుశపాలనను వీరోచితంగా ఎదుర్కొన్న ‘కవికేసరి’ రాచరికపు అవశేషమైన రాష్ట్ర ఆస్థానకవి పదవిని అంగీకరించడం ఏమిటి?’ అని ఘాటుగా, అభిమానపూర్వకంగా విమర్శించిన వారూ ఉన్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో గల సాన్నిహిత్యంతో ఆ పదవిని స్వీకరించి ఉండవచ్చని సమాధానపడిన వారూ ఉన్నారు. అయితే దాశరథి వల్ల ఆ పదవికి వన్నె పెరిగిందేమో కానీ, దానివల్ల ఆయనకు ఒరిగిందేమీలేదని చాలామంది అంటారు. కారణాంతరాల వల్ల రద్దయిన ఆ పదవి దాశరథికి మనస్తాపాన్నే మిగిల్చింది.పేదరికాన్ని, నిజాం నిరంకుశత్వాన్ని దైర్యంగా ఎదుర్కొన్న దాశరథి• గుండె ‘ఆస్థాన’ పదవి రద్దు పరిణామాన్ని తట్టుకోలేక పోయింది. ఆయనకు పదవిపై మోజు కంటే భాష పట్ల మమకారమే అందుకు కారణం. ‘నేనిక్కడ ఆస్థానకవిగా నియమింపబడిన కొద్ది రోజులకే నా మిత్రుడు కణ్ణదాసన్ అక్కడ (తమిళనాడు) ఆస్థానకవి అయ్యాడు. ఇప్పుడతను చనిపోయాడు. ఆస్థానపదవి అక్కడ ఉంది. నేను ఉన్నాను. ఆస్థానపదవి లేదు. వాట్ యాన్ ఐరనీ’ అని నిర్తిప్తతతో వ్యాఖ్యానించారు.
‘ఆస్ధానకవి పదవి ఆయన జీవితంలో మైలురాయి కాదు. అది ఒక రాజకీయ నిర్ణయం. ఆ పదవే ఆయన మృత్యువుకు దారితీసింది. ఆ పదవి రద్దుతో మనస్తాపం చెందారు’ ఆని సోదరుడు రంగాచార్యులు గారు ఈ వ్యాసకర్త వద్ద కూడా ఒక సందర్భంలో (దాశరథి సినీగీతాల’పై పరిశోధన సందర్భంగా ముఖాముఖీగా మాట్లాడుతూ) వ్యాఖ్యా నించారు. ‘మహోన్నతమైన ఆయన వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని మరచిపోయి చిన్నపాటి లోపాలను గుర్తుంచుకున్నారు’ అని ప్రముఖ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాఖ్యానించారు. పేదరికాన్ని, నిజాం నిరంకుశత్వాన్ని దైర్యంగా ఎదుర్కొన్న దాశరథి గుండె ‘ఆస్థాన’పదవి రద్దు పరిణామాన్ని తట్టుకోలేక పోయింది. ఆయనకు పదవిపై మోజు కంటే భాష పట్ల మమకారమే అందుకు కారణం.
అతి చిన్న వయస్సులోనే కవితలల్లి పాతికేళ్లు దాటకుండానే మహాకవిగా పేరొంది, అటు ఉద్యమ కవిగా, ఇటు ఉత్తమకవిగా అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల వారి మన్ననలు అందుకున్నారు. అసలు పేరు కంటే ఇంటి పేరుకే వన్నె తెచ్చి ‘దాశరథీ! కవితా పయోనిధి’గా ప్రశంసలు అందుకున్నారు.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్