దేశ రాజకీయాలలో ఇవాళ బీజేపీ కీలకంగా ఉండాలని సామాన్యుడు కోరుకుంటున్నాడు అంటే, అందుకు పార్టీ వ్యవహార సరళి, దేశ సమస్యల పట్ల చిత్తశుద్ధి, సంక్షేమం, మెజారిటీ ప్రజల మనోభావాల పట్ల గౌరవం కారణమని రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణ నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఇప్పుడు కీలక సమయంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్‌తో జాగృతి జరిపిన ముఖాముఖీ. సాధారణ కార్యకర్తను గుర్తించడం బీజేపీలోనే సాధ్యమని ఆయన చెప్పారు. ఏపీజే అబ్దుల్ కలాం, రామ్‌నాథ్ కోవింద్, నేడు ద్రౌపది ముర్ము వంటి సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారిని దేశ ప్రథమ పౌరులను చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం. ఆ ప్రయాణం గురించి కొంచెం చెప్పండి!
నాది 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. అంతకు ముందు సంఘం (ఆర్‌ఎస్‌ఎస్), సంఘం నేర్పిన పాఠాలతో, విశ్వవిద్యాలయంలో విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ, పీజీ సైన్స్ కాలేజీ అధ్యక్షుడిగా, పరిశోధక విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. జియాలజీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేశాను. చాలా ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ జాతీయవాదం, హిందుత్వం విద్యార్థి దశలోనే ఒంటబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఎమ్మెల్యే అవుతానని లేదా పార్టీ కేంద్రంలో అధికారం లోకి వస్తుందని భావించి నేను రాజకీయాల్లోకి రాలేదు. విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు వామపక్ష భావాలు విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించేవి. సమాజంలో మార్పు తీసుకురావాలన్న తలంపుతో రాజకీయాల్లో చేరాను. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. హైదరాబాద్ పార్టీ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా మూడు పర్యాయాలు చేశాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించాను.
ఇంతకు ముందు రాష్ట్ర శాఖ నేతృత్వం, చట్టసభల ప్రవేశం ఎలా జరిగాయి?
హైదరాబాద్ శాఖ అధ్యక్షునిగా ఉన్నప్పుడే శాసన సభకు పోటీ చేసే అవకాశం వచ్చింది. మొదటిసారి కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ, 1999లో ఎమ్మెల్యేగా ముషీరాబాద్ నుండి గెలవడం, రెండవ సారి పోటీ చేసేటప్పుడు 200 ఓట్లతో ఓడిపోవడం జరిగాయి. ఇలా అంచలంచలుగా ఎదుగుతూ, ప్రజల కోసం పనిచేస్తూ వచ్చాను. పదవులని బాధ్యతలుగా భావించే రాజకీయాలు నావి. పార్టీ విలువలతో కూడుకున్న రాజకీయాలకు చిరు నామాగా భావిస్తాను. ఎందుకంటే వాజపేయి ఒక్క ఓటుతో ఓడిపోతారు, ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా రాజీపడలేదు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా నని చెప్పారు. దేశ రాజకీయాల్లోనే అదో మైలురాయి. ఆ వారసత్వం మాది. జాతీయ స్థాయిలో ఒకసారి పార్టీ కార్యదర్శిగా పనిచేసే అవకాశం వచ్చింది. శాసనసభ పక్ష నాయకునిగా, మేం ఐదుగురు ఉన్నా, పన్నెండు మంది ఉన్నా ప్రజల గొంతుకగా వ్యవహ రించాం. అంతకుముందు మిత్రపక్షంగా తెలుగు దేశంతో కలిసి పోటీ చేయడం వల్ల పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో విస్తరించలేకపోయింది. తర్వాత ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో 8% ఓట్లు వచ్చినప్పటికీ, వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడం.. మళ్లీ ఒంటరిగా పోటీ చేస్తే 4 ఎంపీ స్థానాలు గెలవడం, దాదాపు 20% ఓట్లు రావడం, ఇదంతా చరిత్ర.
ఇలాంటి పరిపక్వ దశలో దేశ రాజకీయాలలోకి వెళుతున్నారు. మీ అనుభూతి ఏమిటి?
ఇది ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఒక వ్యక్తికి దక్కిన గౌరవమని కాక, నిబద్ధతతో, జెండా విడువకుండా పనిచేస్తే గుర్తింపు వస్తుందని చెప్పడానికి మోదీ గారు తీసుకున్న నిర్ణయమే దీని వెనుక ఉందని భావిస్తున్నాను. ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగానూ భావి స్తాను. పార్టీకి జాతీయ స్థాయిలో అన్ని విభాగాలూ ఉన్నాయి. 2015లో ఓబీసీ మోర్చా ప్రారంభించారు. ఒక సీనియర్ నాయకుడిగా, అనుభవశాలిగా మీ సేవ ఈ మోర్చాకు అవసరమని జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు పిలిపించి చెప్పారు. అప్పటికి ఇద్దరు అధ్యక్షులైనారు. పూర్తిస్థాయిలో పని చేయలేదు. మోదీ, అమిత్‌షాల సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం ఈ సమాజంలో 50% పైగా ఉన్న జనాభాను బీజేపీకి చేరువ చేయాలి. ఈ వర్గాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదు. ఆ లోటు తీరడానికి ఈ సేవలు అవసరమని చెప్పారు. నేను అంగీకరించాను.
మోర్చా పనిలో మీరు సాధించిన విజయాలు ఏమిటి?
ఓబీసీ మోర్చా కోసం జాతీయ కమిటీతో పాటు మొదటిసారిగా దాదాపు అన్ని రాష్ట్రాలలో, 856 జిల్లాల్లో కమిటీలు వేశాం. ఎంపీ, ఎమ్మెల్యేలు అందరినీ సభ్యులుగా తీసుకున్నాం. మండలాల్లో కూడా కమిటీలు వేశాం. కరోనాలో ఇబ్బందులు ఉన్నా మేము 22 రాష్ట్రాలు వ్యక్తిగతంగా తిరిగాం. ఓబీసీల కోసం మోదీ తీసుకున్న నిర్ణయాలు గతంలో కాంగ్రెస్ కానీ, ఇతర జాతీయ పార్టీలు గానీ తీసుకోలేదు. సంక్షేమ పథకాలతో మోదీ పేదలకు ఏ తీరులో మేలు చేస్తున్నారనే విషయాన్ని మోర్చా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం మంచి తృప్తినిచ్చింది. దీనిని పార్టీ గుర్తించి మొదటిసారి తెలంగాణ నుండి రాజ్యసభకు ఎంపిక చేసింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి నన్ను పంపారు.
పెద్దల సభ పనితీరు మీద మీకున్నటువంటి అభిప్రాయం లేదా యోజన ఎలా ఉన్నాయి?
అసెంబ్లీలో నాకున్న అనుభవం దృష్ట్యా కొంత చెబుతాను. అసెంబ్లీలలో బిల్లుల మీద చర్చలు ఎలా జరగాలో ఆ మేరకు ఇవాళ జరగడం లేదు. పార్లమెంట్‌లో కొద్దో, గొప్పో చర్చలు జరుగుతు న్నాయి. కానీ రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి సంఖ్యా బలం లేకపోవడంతో మొదట్లో కొన్ని బిల్లుల ఆమోదం దగ్గర ఇబ్బంది ఎదురైంది. దేశానికి మేలు చేయాలనే తలంపు ఉన్న మోదీ గారు దీనితో కొద్దిగా వెనుకంజ వేయవలసి వచ్చింది. ఇప్పుడు రాజ్య సభలో బీజేపీ సంఖ్య పెరిగింది. ఒక విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద గానీ, దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు స్పందిస్తూ అభివృద్ధి ఎజెండాతో పార్టీకి సహకరిస్తాను. పార్టీ కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడిన నిర్ణయాలు కూడా సాహోసోపేతంగా తీసుకుంటున్నది. బీజేపీని మేం ఆరాధించేది అందుకే.
పెద్దల సభలో పార్టీకి ఇంకా ఎలాంటి ప్రతిబంధ కాలు ఉన్నాయి?
నేషన్ ఫస్ట్, పార్టీ నెక్టస్, సెల్ఫ్ లాస్ట్ అంటున్నాం. ఆ సిద్ధాంతంతో పనిచేస్తున్న మోదీ గారు ప్రజాహితం కోసం తీసుకున్న నిర్ణయాలను వామపక్షాలు, కాంగ్రెస్ సంకుచితత్వంతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయా లను కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. జీఎస్‌టీ, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను తీసుకోవా లని గతంలో కాంగ్రెస్ అనుకున్నా సాహసించలేదు. రైతులకు మేలుచేస్తూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించేం దుకు సంస్కరణలు తీసుకొస్తే అడ్డుకున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను నాడు కాంగ్రెస్ ఆమోదించింది. కానీ వాటి అమలుకు మోదీ సాహసిస్తే జీర్ణించుకోలేక పోతున్నది. కొంతమంది జాతి వ్యతిరేకశక్తులు కూడా మోదీ వ్యతిరేకతకు ఆజ్యం పోస్తున్నారు. దేశంలో ఉన్నవే కాదు, అంతర్జా తీయ సంస్థలు కూడా దీనికి తోడవుతున్నాయి. కాబట్టి రాజ్యసభ సభ్యునిగా నేను కచ్చితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, దేశ హితం కోసం, బీజేపీ మొదటి నుంచి చెబుతున్న అంశాల విషయంలో వాటి అమలుకు నిబద్ధతతో పని చేస్తాను.
మీరు ప్రమాణ స్వీకారం చేసిన పది, పదిహేను రోజుల్లోనే ఒక వివాదం వచ్చింది. పార్లమెంటులో కొన్ని పదాల వాడకాన్ని నిషేధించారంటూ విమర్శలు మొదలైనాయి. గతంలోనూ పదాల నిషేధం గురించి బుక్‌లెట్స్ విడుదల చేశారు. ఈ పదాలు అన్ పార్లమెంటరీ అంటున్నారు పెద్దలు. దీనినీ వివాదం చేశారు. ఉదాహరణకి అసమర్థుడు వంటి కొన్ని పదాలు. వాటి గురించి…
పార్లమెంట్ ఓ పవిత్ర నిలయం. ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఏ స్థాయి చర్చకైనా ప్రభుత్వం సిద్ధం. కాని వ్యక్తిగత దూషణలు, పస లేని ఆరోపణలు చేయడం, ఆ రకంగా పార్లమెంట్ చర్చల లక్ష్యం నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడం సబబు కాదు. ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు వెల్‌లోకి వచ్చి రాద్ధాంతం చేయడం సరికాదు. నా రాజకీయ జీవితంలో ఏనాడు వ్యక్తిగత ఆరోపణలు, దూషణ చేయలేదు. నేను రెండు పర్యాయాలు శాసనసభ్యుడిని. ఏనాడు వెల్‌లోకి వెళ్లలేదు. అది మా పార్టీ విధానం. ఏదైనా మన సీట్లో కూర్చుని ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి గొంతు విప్పాలి. అంతేకాని అసభ్య పదజాల ప్రయోగం, స్పీకర్‌పై దాడి, కాగితాలు చింపడం మంచి సంప్రదాయం కాదు. ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గౌరవం పొందుతున్న దేశంలో పార్లమెంట్ సరైన చర్చా వేదిక. డా।। బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది. వెనుకబడ్డ వర్గాల కోసం, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు చర్చ దోహద పడుతుంది. ఈ మధ్య మీడియా కూడా సంచలనాల కోసం, వార్తల కోసం నిరర్ధక మాటలను ప్రోత్సహించ వచ్చు. అది మన విశ్వసనీయతకు సంబంధించిన విషయం. మేం జాతీయ పార్టీ కార్యకర్తలుగా, అధికారంలో ఉన్న పార్టీకి చెందినవారిగా పరుష పదజాలం కాకుండా, అంశం మీద ప్రభుత్వాన్ని, పాలకులను నిలదీయడమే మా పద్ధతి.
భారతదేశం మొత్తం మీద, అంతర్జాతీయంగాను ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు పాల్పడినట్టుగా చెప్పే కొన్ని ఘటనలలోను హైదరాబాద్ పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాగే నగరంలో రొహింగ్యాల సమస్య. వీటి గురించి రాజ్యసభలో మళ్లీ ప్రస్తావిస్తారా?
సంతుష్టీకరణను మా పార్టీ సమర్థించదు. దేశంలో ఏ సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయంటే గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రస్తుత టీఆర్‌ఎస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడడం, ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారటం కారణం. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ యథేచ్ఛగా చేసే ప్రకటనలు చూశాం. మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు హిందుత్వం మీద, హిందూ దేవీదేవతల మీద చేసే వ్యాఖ్యానాలు విన్నాం. వాటిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం, పైపెచ్చు ఉదాసీనంగా వ్యవహరించడం కూడా కారణమే. మతం ఆధారంగా నడిచే మజ్లిస్ పార్టీని చంకలో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. దీనితో మజ్లిస్ ప్రాబల్యం ఉన్న పట్టణంలో ఏ ఒక్క ప్రభుత్వ యంత్రాంగానికి పనిచేసే అవకాశం ఉండడం లేదు. మజ్లిస్‌ను సమర్ధిస్తే కరెంటు బిల్లు కట్టనవసరం లేదు, నీళ్ల బిల్లు కట్టే పనిలేదు. అనుమతులు అవసరం లేదు. అసలు చలాన్లు ఉండవు అని ప్రచారం చేసు కుంటున్నారు. అక్కడ అధికారులుగానీ, మంత్రులు గానీ అడుగుపెట్టడానికి లేదు. ఆ ప్రాంతంలో కనీసం సమీక్షలు జరిపినా ఎదురుతిరిగే పరిస్థితి. ఇలాంటి అంశాలు తప్పనిసరిగా కేంద్రం దృష్టికి వెళతాయి.
మీరు రాజ్యసభలో ఉన్న కాలంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు వస్తుందని ఆశించవచ్చునా?
భారతీయ జనతాపార్టీ విధానమది. సరైన సమయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుం దని మేం ఆశిస్తున్నాం. 370 ఆర్టికల్ రద్దు చేయాలని విద్యార్థి దశ నుంచి గోడల మీద రాసినవాళ్లం. అసలు ఆ ఆర్టికల్ గురించి సామాన్య ప్రజానీకానికి తెలియదు. దీని విషయంలో కాంగ్రెస్ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, నెహ్రూ మొదలు, మొన్నటి వరకు ఏ రకంగా వారు వ్యవహరించారు? భారత దేశంలో కశ్మీర్ అంతర్భాగం అయినప్పటికీ రెండు రాజ్యాంగాలు, రెండు పతాకాలు, ఇద్దరు ప్రధానులు అన్న వాదం ఉండేది. అలాంటి ధోరణి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి డా।। శ్యామాప్రసాద్ ఆహుతై నారు. చివరికి మోదీ, అమిత్‌షా పట్టుదలతో రద్దు చేశారు. ఆ ఆర్టికల్ తాత్కాలికమేనని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయినా తొలగించ డానికి 70 ఏళ్లు పట్టింది. అది బీజేపీ, మోదీలతోనే సాధ్యమైంది. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, మిగతా పాలకులు కశ్మీర్ అంశంలో ఎలాంటి రాజకీయం చేశారో అర్థమైంది. అక్కడి ముస్లిం ప్రాబల్యం కొనసాగడానికి నెహ్రూ దోహదపడితే, మేధావులు దానికి వత్తాసు పలికారు. ఈ రోజు కాకపోతే రేపైనా యూనిఫాం సివిల్ కోడ్ అవసరం. అనేక సందర్భాల్లో న్యాయస్థానం కూడా దీనిని రూఢి చేసింది. ఈ విధమైన జనాభా పెరుగుదల, సమతుల్యత లోపించడం, ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తోందో తెలుసు. కాబట్టి యూనిఫాం సివిల్ కోడ్ రావాలి. దానికి కావలసిన సంసిద్ధత, మైండ్‌సెట్ కూడా తయారవుతున్నాయి. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నా దానిని ఏ రకంగా వక్రీకరిస్తారో చూశాం. హింసాత్మకం చేస్తారో గమనించాం. సాగు సంస్కరణల బిల్లు మాటేమిటి? ఎంత చక్కటి బిల్లు! ఏ కారణమూ లేదు, దాన్ని అడ్డుకున్నారు. పౌరసత్వ బిల్లు కూడా అంతే. రొహింగ్యాలుగానీ, ఎవరైనా గానీ భారత్‌ను ఒక ధర్మసత్రంగా భావిస్తే ఏ రకంగా భావ్యం? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అన్ని పక్షాలను, అన్ని వర్గాలను ఒప్పించి ఉమ్మడి పౌరస్మృ తిని తీసుకురావలసిన సమయం ఆసన్నమైంది.
రాజ్యసభ సభ్యుడైన సందర్భంగా మీ మనోగతం?
పార్టీ గొప్ప అవకాశం ఇచ్చింది. ఒక కార్యకర్తను గుర్తించి రాజ్యసభకు పంపారు. ఇదే మోదీ ప్రత్యేకత. పద్మ అవార్డులు కానివ్వండి, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పక్రియ లేదా చివరికి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక-వాటిలో మోదీ ప్రత్యేకత కనిపిస్తుంది. భారతీయ జనతాపార్టీకి అవకాశమొచ్చినప్పుడు అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తను వాజపేయి ఎంపిక చేసి దేశానికి వన్నె తెచ్చారు. రాజకీయాలతో నిమిత్తం లేని అబ్దుల్‌కలాం ఒకనాడు న్యూస్‌పేపర్ పంచారు. స్వయంకృషితో ఎదిగారు. ఆయనను గుర్తించిన దెవరు? బీజేపీ. మోదీ హయాంలో ఒక దళిత మేధావి, సామాన్య కుటుంబంలో పుట్టిన రామనాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశారు. 75 సంవత్సరాల ఈ దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఈనాడు ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ముగారిని దేశ ప్రథమ పౌరురాలిని చేయడం ఎవరికి సాధ్యమైంది? అది పార్టీ సంస్కరణ ధోరణి. ఇది ఒక చరిత్ర. చరిత్రను సృష్టించగలిగేది బీజేపీ•, మోదీ ప్రభుత్వమే కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇలాంటి నిర్ణయాలు సాహసో పేతంగా తీసుకునే అవకాశం ఎంతో ఉంది. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ రామమందిర నిర్మాణం చేపట్టారు. సామరస్యంగా, న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ, యోగి ఆదిత్యనాథ్ భవ్యమైన మందిర నిర్మాణం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు గర్వపడుతున్నారు. రాముడు పుట్టిన అయోధ్యలో మందిరం సాధించడం బీజేపీకి సాధ్యమైంది. కాశీ విశ్వనాథ కారిడార్ కూడా. నరేంద్రమోదీ మెజార్టీ ప్రజల మనోభావాలు కాపాడుతూ, అభివృద్ధి ఎజెండాతో, సంక్షేమ పథకాల మధ్య సమతౌల్యం పాటిస్తూనే దేశాన్ని విశ్వగురువు స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను రాజ్యసభ సభ్యుడినైనందుకు గర్వపడుతున్నాను. నా వంతు పాత్రను, బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నం చేస్తాను.
మీరు జీవితకాలం పాటు నమ్ముతూ వచ్చిన బీజేపీ, దాని ప్రస్థానం, ఫలితాల గురించి ఏమంటారు? ఇవాళ బీజేపీ దేశ రాజకీయాలలో కీలకంగా ఉండడం చారిత్రక అవసరమని సామాన్యుడు అనుకుంటున్నాడంటే అందుకు నిజంగా ఏది దోహదం చేసింది?
చాలా మంచి ప్రశ్న. ఈ దేశం కోసం ప్రాణా లర్పించినటువంటి అనేక మంది త్యాగధనులు ఉన్నారు. మన వీరజవానులు సరిహద్దులు కాపాడు తున్నారు. మంచుపర్వతాలు, ఎముకలు కొరికే చలిలో ఉండి, ఇరుగు పొరుగు అంగుళం కబళించ కుండా చూడడానికి వాళ్లు ఉన్నారు. కుటుంబానికి దూరంగా, దేశం కోసం పనిచేస్తున్నారు. పాకిస్తాన్, చైనా కవ్వింపులకు పాల్పడుతుంటే తట్టుకుని వీరోచి తంగా పోరాడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఎయిర్ స్ట్రెక్స్‌లో, సర్జికల్ స్ట్రెక్స్‌లో మన సైనికులక• మోదీ అండగా ఉన్నారు. ఇవాళ దాన్ని సైతం ఎద్దేవా చేస్తున్నారు. మోదీ మీద ఉన్న విద్వేషంతో సైన్యం మీద అవమానకర వ్యాఖ్యలు చేస్తూ కొందరు దేశ ప్రయోజనాలను పణంగా పెట్టే దుస్థితికి వచ్చారు. మన ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతారు – ఎయిర్ స్ట్రెక్స్ జరిగాయా? సర్జికల్ స్ట్రెక్స్ జరిగాయా? జరిగితే ఆ ఖ్యాతి మీరు తీసుకుంటున్నారు! ఇదీ ధోరణి. ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ జవాన్లను గానీ, దేశహితాన్ని గాని ఏనాడైనా పరిగణనలోని తీసుకున్నారా? వాళ్లది ఓ ప్రాంతీయ పార్టీ, తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చింది. అవినీతి, నియంత పాలన. పూర్తిగా కుటుంబానికి పరిమిత మైన పాలన. ప్రజలు విసిగిపోయారు. మోదీగారు మొదటి నుండి చెబుతున్నారు. కాంగ్రెస్ వంశ పారంపర్య రాజకీయాలను నడిపింది. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తే, ఒక కుటుంబమే దేశాన్ని పాలించాలన్న రీతిలో కాంగ్రెస్ వ్యవహ రించింది. ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీని చూసినా ఇదే తీరు. ఉత్తరప్రదేశ్, బిహార్, జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, ముఫ్తీ మహమ్మద్, మహబూబా, తెలంగాణలో కొడుకు, తండ్రి, కూతురు, అల్లుడు. జార్ఖండ్, ఆంధప్రదేశ్‌లోనూ ఇంతే. బీజేపీలో ఇది కొనసాగే వీలులేదు. అందుకే ప్రాంతీయ పార్టీలనీ, కుల పార్టీలనీ, కుటుంబ పార్టీలనీ ప్రజలు ఓడిస్తున్నారు. బీజేపీకి పట్టం కడుతున్నారు. 18 రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగామంటే మాకున్న ఎజెండాయే కారణం. కేవలం అభివృద్ధి, సంక్షేమం, దేశహితం. అందుకే సామాన్యుడు ఇవాళ ఆ విధమైన భావనకు వచ్చాడు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు నడిపినా ఆ ఉచ్చులో యూపీ ప్రజలు పడకుండా మోదీ నాయకత్వంలో యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా డబుల్ ఇంజన్ సర్కార్ తిరిగి ఏర్పడింది. తెలంగాణ నంబర్ వన్ అని కేసీఆర్ పదే పదే చెపుతున్నారు. ఎందులో? తాగుబోతులను తయారుచేయడంలో నంబర్ వన్. అవినీతిని పెంచి పోషించడంలో నంబర్ వన్. కుటుంబ పాలనలో నంబర్ వన్. యోగి ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన సోదరి ఇప్పటికీ ఉత్తరాఖండ్‌లో పూజా సామగ్రి అమ్ముకుని బతుకుతున్నారు. ఇది బీజేపీ నాయకుల గొప్పతనం. యూపీలో వారిచ్చే సంక్షేమ పథకాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నేను ఎలక్షన్లలో చాలా ఊర్లు తిరిగాను. 5 లక్షలమందికి యూపీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. 50 లక్షల మంది పేదలకు ఇళ్లు మంజూరు చేసింది. 86 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. మోదీ కరోనా కాలంలో 80 కోట్ల మందికి రెండు సంవత్సరాలు ప్రతీ వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో దానికి తోడుగా ఒక కిలో పప్పు, గోధుమలు, చక్కెర, నూనె, ఉప్పు నెలకు రెండుసార్లు పంపిణీ చేశారు.15 కోట్ల మంది లబ్ధి పొందారు. అందులో 5 కోట్లమంది ముస్లింలు. వారు రాజకీయంగా ఉపయోగపడతారా, ఓటు వేస్తారా అని ఆలోచించడం లేదు. పేదరికం నిర్మూలనే పార్టీ ఆశయం. కేంద్రం, యోగి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా పనిచేస్తోంటే మతం రంగు పులుముతూ విపక్షాలు ప్రజలను మభ్యపెడుతు న్నాయి. ఈసారి తెలంగాణలో వచ్చే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అవినీతి రహిత పాలన వస్తుంది. ఇదే ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లినా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పారు- తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కలసి పనిచేయండి అని. సమాజంలో మార్పు తీసుకురమ్మని చెప్పారు. ఒక కార్యకర్తగా నా వంతు బాధ్యత నిర్వర్తిస్తాను.