– మీనాక్షీ శ్రీనివాస్
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
ఈరోజు మనసేం బాగా లేదు. కారణం పెద్దదేం కాదు. నా కూతురు దాని పిల్లలను చావబాదింది. అడ్డు వెళ్లబోయిన నన్ను నిర్దాక్షిణ్యంగా పొమ్మంది. నాకు పెంచడం రాదంది. నా పెంపకంలో వాళ్లు వెధవల్లా పెరుగుతున్నారంది. ఒకటా, ఇంకా చాలా అంది. ఇంతకూ వాళ్లు చేసిన అంత ఘోరమైన తప్పిదం ఏమిటంటారా! స్కూళ్లకు మర్నాటి నుంచీ వేసంగి సెలవలిచ్చేశారని ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ వేయడంలో అక్కడున్న ఖరీదైన వస్తువు దేనిమీదో పడ్డారు. అది విరిగిపోయింది, వాళ్లకూ దెబ్బతగిలింది. పసి వెధవలు.. ఏడవక ఏం చేస్తారూ! ఏడిచారు. మొగుడూ, పెళ్లాం ఇంట్లోనే అఘోరిస్తున్నారు కదూ! వర్క్ ఫ్రం హోం… మీటింగ్‌లో ఉండగా ఏడ్చారని కొంత, ఖరీదైన వస్తువు పగలగొట్టారని కొంతా, ఆఫీస్ పని ఎంతకూ తెమలడం లేదని అంతా, అక్కసు తీర్చుకుందుకు వాళ్లూ, నేనేగా తేరగా దొరికేది.
వాళ్లను బాదింది, నన్ను మాటలతో ..
వాళ్ల అమ్మ మళ్లీ గదిలోకి వెళ్లగానే పిల్లుల్లా వచ్చారు వెర్రి నాగన్నలు ‘అమ్మమ్మా!’ అంటూ. చెప్పద్దూ తట్ల్లుతేలిన వాళ్ల తెల్లటి ఒంటిని చూస్తే నాకు కోపం ఆగలేదు. వాళ్ల పిల్లలని వాళ్లు కొట్టుకునే స్వతంత్రం ఉన్నప్పుడు నా పిల్లని నేను తిట్టే స్వాతంత్య్రం మాత్రం ఎందుకు వదులుకోవాలి? చెడతిట్టి పోశాను, వెనకాలే అనుకోండి.
మధ్యాహ్నం ‘అన్నానికి రండి’ అని అది పిలిచి నప్పుడు ‘మేము రాం’ అని ప్రొటెస్ట్ చేశాం. మాకు కోపం వచ్చిందని దానికి తెలిసేలా మా గది తలుపులు ‘దఢాల్న’ మూసేసాం. మేము రహస్యంగా ముందే తినేసి వచ్చాం మాకిష్టమైనవి చేసుకుని.
వాళ్ల వాతలకు పాండ్రీస్ క్రీం రాసి, ఇద్దరినీ చెరో పక్కా వేసుకుని ఊరడిస్తూ కథలు చెప్పడం మొదలుపెట్టాను.
నాకెందుకో అనుమానం వచ్చి చూస్తునా! వాళ్లు వినడం లేదు, ఏదో ఆలోచనలో ఉన్నట్టు సీరియస్‌గా ఉన్నారు.
‘ఏమై ఉంటుందీ!’ అనుకుంటూ చెప్పడం ఆపాను. వాళ్లు అది కూడా గ్రహించలేదు అన్న విష యాన్ని నే గ్రహించాకా అడిగాను ‘ఏం నాన్నా! అలా ఉన్నారేం?’ అంటూ.
‘అమ్మమ్మా! మాకు ఈ వేళే కదా స్కూల్ అయింది, కనీసం రెండు రోజులన్నా ఫ్రీగా వదల కుండా, ఆడుకోనివ్వకుండా రేపటి నుంచీ సమ్మర్ క్లాసెస్‌కు వెల్లాలిట’ వరుణ్ అన్నాడు దిగులుగా.
‘అవునమ్మమ్మా! మళ్లీ ఉదయం నుంచి సాయంత్రం దాకా సమ్మర్ క్లాసెస్. ఏం బాగుండదు. ఎంచక్కా మా ఫ్రెండ్సందరు వాళ్ల అమ్మమ్మగారి ఊరు వెడుతుంటే, మరికొందరు విహారయాత్రలకు వెడుతున్నారట. ప్చ్… నువ్విక్కడే ఉన్నావు. పోనీ ఇంకెక్కడికైనా వెడతామేమో అనుకుంటే, అమ్మకీ, నాన్నకీ ఎప్పుడూ ఆఫీస్, పనే!’ దిగులూ, చిరాకూ కలగలిసిన స్వరంతో అన్నాడు అరుణ్.
నా మనస్సు చివుక్కుమంది. నిజమే! పాపం వాళ్లకు అమ్మమ్మ గారింటికి వెళ్లడానికి లేకుండా నేనే ఇక్కడ చిక్కడ్డాను. మాయదారి కరోనా. కానీ వాళ్ల ఉద్దేశం నాకు అర్థమైంది. పోనీ నేను వీళ్లను తీసుకుని ఇంటికి వెళ్లిపోతే! ఆ! అలా చేద్దాం. వాళ్లకూ, నాకూ అందరకూ బాగుంటుంది. నాకు ఉత్సాహం వచ్చేసింది. చెయ్యి చాపి ఫోన్ అందు కున్నా! ‘నారాయణా! ఎలా ఉన్నారు మీరంతా? అయ్యగారికి చెప్పకు వస్తున్నట్టు. ఎలా ఉన్నారు? వేళకు తింటున్నారా? మందులు వేసుకుంటున్నారా?’ అడిగాను.
**************
‘ఆ .. ఆ, మేమంతా బానే ఉన్నాము. నేను ఓ నాలుగు రోజుల్లో మనూరు వస్తున్నా, కాస్త ఇల్లంతా శుభ్రం చేయించి ఉంచు. బయలుదేరే ముందు ఫోన్చేస్తా, స్టేషన్‌కి మన సోము ఎడ్లబండి కట్టమను. ఆ.. ఆటోలున్నాయి అంటావా! ఏం వద్దు బండే తెద్దూ గాని’ ఉత్సాహంగా అన్నా.
‘లేదు, లేదు మరచిపోయా రైల్లో రాము, కారులో నే వస్తాంలే’
నా మాటలు వింటున్న పిల్లలిద్దరూ ఒక్క ఉదుటున లేచి కూర్చున్నారు ‘అమ్మమ్మా! నువ్వెళ్లొద్దు.’ అంటూ
‘నేను కాదర్రా. మనం వెడుతున్నాం. మీ సెలవులన్నీ అయిపోయాకా అప్పుడొద్దాం’ మాట పూర్తయిందో లేదో ఇద్దరూ చెరో బుగ్గ మీదా ముద్దు పెట్టేసారు ‘మా మంచి అమ్మమ్మ’ అంటూ. అంతలోకే గాలి తీసేసిన బెలూనుల్లా అయిపోయారు.
‘నో! అమ్మ ఒప్పుకోదు, ఆల్రెడీ సమ్మర్ క్లాసెస్‌కు ఫీ కట్టేసానని చెప్పింది నిన్న రాత్రే!’ దిగులుగా అన్నాడు అరుణ్.
‘నోవే! మనం వెడుతున్నాం, కావాలంటే ఆ క్లాసెస్‌కి మీ అమ్మా, నాన్నా వెడతారు’ చిన్నగా నవ్వుతూ ఇలా అన్నానో లేదో ఇద్దరూ చెరోవైపు నుంచీ చుట్టేసారు. వాళ్ల చిన్ని ముఖాల్లో ఎనలేని ఆనందం. సడన్‌గా నాకు నా చిన్నప్పటి నేను గుర్తు కొచ్చాను. మా అమ్మతో అమ్మమ్మగారి ఊరు వెడుతు న్నామంటే సరిగ్గా ఇదే (ఎగ్జైట్మెంట్) ఉత్సాహం.
‘అమ్మమ్మా! చెప్పమ్మమ్మా!’ కుదుపుతూ అడుగుతున్నారు వాళ్లు.ఏదో అడిగినట్లున్నారు. నా లోకంలో నేనుండి పట్టించుకోలేదు.
‘మనం ఎలావెడతాం? ట్రైన్లోనా?’ ఇంతింత కళ్లు విప్పార్చుకుని అడుగుతున్నాడు వరుణ్. నా చిన్నప్పుడు మా అమ్మ తెచ్చి ఇచ్చిన ఆంధ్రా బ్యాంక్ కిడ్డీ బొమ్మలా ఉన్నాడు వాడు. బూరె బుగ్గలు, పెద్దపెద్ద కళ్లూ. అరుణ్, వరుణ్ ఇద్దరూ కవలలు. ఆరేళ్లవాళ్లు. దాని పిచ్చి కాకపోతే వాళ్లకు రోజూ స్కూలుకు వెళ్లడమే ఎక్కువ, ఇప్పుడు మళ్లీ సమ్మర్ క్లాసులా? చదవేస్తే ఉన్న మతి పోవడమంటే ఇదే! నాకు ఆ క్షణంలో నాకూతురి చిన్నప్పుడు నేనూ అదే చేసానన్న విషయం గుర్తు రాలేదు. ఏం చెయ్యనూ! ఇద్దరూ ఉద్యోగస్థులయితే ఉన్న తంటానే అది. ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఉంటారన్నదే దాని వెనక ఉద్దేశం. కానీ ఇప్పుడు వీళ్లను చూడడానికి నేనొకతెను ఉన్నాగా!
ఇద్దరూ చెరోవైపూ పట్టుకు కుదిపేసరికి నా ఆలోచనల్లోంచి బయటపడ్డాను.
‘ఆహా! కాదు నాన్నా! ఇప్పుడంతా కరోనా కదా, రైళ్లు, బస్సుల్లో వెళ్లడం మంచిది కాదు. మనం మన కారులోనే వెడదాం’ వాళ్లను దగ్గరగా తీసుకుంటూ అన్నాను. వాళ్ల సంబరమే సంబరం. నా దగ్గరనుంచి వెళ్లిపోయి బొమ్మలూ, కథల పుస్తకాలూ అన్నీ బేగ్లో పెట్టేసుకుంటున్నారు.
ఊరెళ్లడం అంటే ఎవరికైనా అంత ఆనందం ఎందుకో! నా మనసు గతంలోకి జారిపోయింది. అది కూడా చిన్నతనానికి.
ప్రతి వేసవి సెలవులకూ మా అమ్మా, అన్నయ్యా, అక్కయ్యలతో కోటిపల్లి రేవు దాటి కొత్తలంక వెళ్లేవాళ్లం.
నాన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీర్. ఆయన నాలుగు రోజులు సెలవు పెట్టి మమ్మల్ని కోటిపల్లి దాకా బస్సులో, అక్కడ రేవు దాటించి ముమ్మిడి వరం వరకూ వెళ్లి అక్కడి నుండి గుర్రపు బండీ (జట్కా అని కూడా అనేవాళ్లం)పై తీసుకెళ్లేవారు. .
బహుశా నీల్ ఆర్మ్్ర•ంగ్ చంద్ర మండలానికి వెళ్లినప్పుడు కూడా అంత ఆనందపడి ఉండడేమో! పిల్లలం అంత సంబరపడే వాళ్లం మా అమ్మ సంగతి చెప్పనే అక్కర లేదు.
పడవ ఫంటుమీద గోదావరి దాటుతుంటే ఆ థ్రిల్లే వేరు.ఇక జట్కా దగ్గర నేను ముందంటే నేను ముందంటూ గొడవ పడేవాళ్లం. అప్పుడు ఆ జట్కా అబ్బాయి వంతుల వారీ తలో కాసేపు కూర్చో బెట్టేవాడు.
ఇక అక్కడకు వెళ్లాక అమ్మమ్మ చేసి పెట్టినవి తినడం, అవి అరిగేదాకా తోటలంపటా, గట్లూ, చెట్లంపటా గంతులే గంతులు. ముఖ్యంగా వేపుడు బియ్యం. వాటిలో వేపిన నూపప్పు, కురిడీ ముక్కలూ, ఎంత తిన్నా తనివితీరేదే కాదు.
‘అమ్మా! ఏమిటి.. మన ఊరు వెడుతున్నావా? నీకసలు మతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పల్లెటూరు అవసరమా?’ కోపంగా అడుగుతున్న నా కూతురి మాటలతో ఒక్కసారిగా ఈ లోకంలో పడ్డాను.
‘ఎందుకే అంత కోపం? ఏం… అక్కడెవరూ ఉండడం లేదా? అక్కడున్న వాళ్లు మనుషులు కారా?’ నేనూ కోపంగానే అడిగాను. దానిని ఒప్పించాలంటే అదే మందు. మెత్తగా ఉంటే అస్సలు వినిపించుకోదు.
‘మీ అల్లుడు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకున్నా, నా పిల్లలని పంపడానికి నేనొప్పుకోను, నిన్నూ వెళ్లనీయను’ కచ్చితంగా ఉంది దాని స్వరం.
ఇక తప్పదు అని ఎదురు దాడికి దిగాను. ‘అసలు ఏమిటే నీ ఉద్దేశం. నన్ను నీ ఇంటి కాపలా కుక్కలా కట్టేసుకోవాలనా? ఎన్నాళ్లయింది నేను వచ్చి? మీ నాన్న మీలా స్వార్థపరుడు కాదు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. అక్కడ ఒంటరిగా ఏం తింటు న్నారో? ఎలా ఉన్నారో?’ కుళాయి తిప్పేసాను.
అంతే చల్లబడిపోయింది. ‘అది కాదమ్మా! ఇలాంటి సమయంలో ఆ పల్లెటూరుకెందుకూ అని. పోనీ నాన్ననే వచ్చేయమందామా?’ అంతలోకే విసుగ్గా ముఖం పెట్టింది.
‘ఆయన వస్తే ఇంకేం…?’
‘అవునూ! నువ్వేమిటీ వాళ్లతో అలా చెప్పావు, వాళ్లింక ఊరుకోరు అప్పుడే పెట్టా, బేడా సర్దేసు కుంటున్నారు’
‘నేను వాళ్లను తీసుకెడుతున్నా! పాపమే పసివాళ్లు. వాళ్లకు కాస్త ఊపిరాడనియ్యండి. ఆడుకునే వయసు, ఏం ఆడుకున్నా ఈ రెండు నెలలేగా! మళ్లీ బడులు తెరిస్తే ఆ ఖై•దు తప్పదుగా’ మెత్తగా చెప్పాను.
‘అబ్బా! మరి ఈ సుద్దులన్నీ నా చిన్నప్పుడు ఏమై పోయాయి? నేను ఏడ్చినా, మొత్తుకున్నా వినేవారా?’ చురచురా చూస్తూ అంటున్న దాన్ని చూస్తే ప్రేమ పొంగు కొచ్చింది.
అనుకోకుండా దగ్గరకు తీసుకుని నుదుట ముద్దుపెట్టాను. అదీ ఒక్క క్షణం అప నమ్మకంగా చూసింది.
‘అప్పటి మన పరిస్థితులు వేరు. నేనూ నాన్నా ఇద్దరం ఉద్యోగం చేస్తే కానీ కుదరదు. నిన్ను చూడడానికి ఎవరూ లేకపోవడంతో, ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటావని అలా చేసేవాళ్లం. అంతేకానీ నీమీదేమైనా కక్షటే!’ నా ముఖంలో నీలినీడలు. నిజమే దాని బాల్యాన్ని తెలిసీ చిదిమేసాం. ఏంచేస్తాం! అప్పుడున్న పరిస్థితులు అవీ.
‘కానీ వాళ్ల సమ్మర్ క్లాసెస్‌కు ఫీజు కట్టేసా. అదీగాక వాళ్లు లేకుండా మేం ఉండలేం’ ఆ మాటతో చెళ్లును చరిచినట్టయింది.
పాపం మా అమ్మ ఉన్నన్నాళ్లూ దానిని అక్కడకు పంపేసే వాళ్లం వేసవి సెలవులో. కారణం ఒకటే చూసే వాళ్లెవరూ లేరన్నదే. మేం వెళ్లడానికి ఉద్యో గాలు. ముప్ఫై ఐదేళ్లకాలం ఎలా కరిగిపోయిందో! వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ జ్ఞాపకాలూ లేవు, గడియారంలో ముల్లులా పరిగెట్టిన జ్ఞాపకం తప్ప. నిట్టూర్పు అణచుకున్నాను.
‘ఫర్వాలేదమ్మా! ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగి పోయింది వీడియోకాల్లో రోజూ వాళ్లను చూడచ్చు. మీరు మీ ఉద్యోగాలతో బిజీ. పాపం వాళ్లకూ కట్టేసినట్టే ఉంటుంది. వాళ్ల సెలవులు అయ్యే ముందు వారం రోజులు మీరూ సెలవుపెట్టి వస్తే కాస్త మీకూ ఆటవిడుపుగా ఉంటుంది. పెద్దలకైనా, పిల్లలకైనా కాస్త ఆటవిడుపు అనేది అవసరం. అంతేకానీ యంత్రాల్లా తిరుగుతూ ఉంటే కొన్నాళ్లకు ప్రాణం ఉన్న మరబొమ్మలం అయిపోతాం’. నా మాటల్లో ఉన్న వేదన దాని మనసును తాకింది.
మౌనంగా వచ్చి నా కాళ్ల దగ్గర కూర్చుని నా ఒళ్లో తల వాల్చింది. నేను దాని తల నిమురుతూ ఉండిపోయాను.
అలా ఎంతసేపు ఉన్నామో! ‘హే.. అమ్మ చిన్న పాపాయిలా అయిపోయింది ’ అంటూ కేరింతలు కొడుతున్న ఆ చిన్నారుల ముఖాల్లో పట్టరాని ఆనందం.
**************
ఏం చెప్పి ఒప్పించిందో అల్లుడిని సరిగ్గా మూడో నాటికల్లా మా ప్రయాణం, ఆయనతో చెప్పద్దనీ, అకస్మాత్తుగా వచ్చి ఆశ్చర్యపరుస్తామని నారాయణకు మరీ మరీ చెప్పాను.
వాళ్లిద్దరికీ చెరో కారూ ఉండడంతో, ఓ కారులో మేం వెళ్లి అక్కడే ఉంచేసు కునేట్టు ఎడ్ల బండులూ, అవీ ఇవీ అంటూ ప్రయోగాలు వద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఒప్పించింది. మధ్య మధ్య ఆగుతూ జాగ్రత్తగా మా ఊరు చేరాం. సుమారు పదిహేను గంటల కారు ప్రయాణం. ఒళ్లు హూనం అయిపోయింది. కారు ఎక్కిన దగ్గర నుంచీ మనవ లతో కబుర్లే కబుర్లు. అది కూడా మా ఊరి గురించీ, గోదావరి గురించీ, నా చిన్నప్పటి రోజుల గురించీ.
మా చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊరికి వెళ్లడంలె ఉన్న ఆనందం నా జీవితంలో ఎప్పటికీ మరువ లేని మధుర జ్ఞాపకం. అన్నట్టు ఇప్పుడు గోదావరిలో నీళ్లూ లేవు, పడవలూ లేవు, యానాం మీద నుంచి బ్రిడ్జి కట్టేసారు.
ఆ ఊరి జ్ఞాపకాల్లో ముఖ్యమైనవి అమ్మమ్మ చేసి పెట్టే చిరుతిళ్లు. ఎక్కి ఆడే ధాన్యపు గాదె, ఊగే పెద్దబల్ల ఉయ్యాలా, మా మామయ్యతో గిల్లికజ్జాలు, రోజూ ఏదోరకంగా వాడిని (తప్పుతప్పు..కళ్లు పోతాయి) ఏడిపించడం, తిరిగి నన్నేడిపించాడని అమ్మమ్మా, తాతయ్యలతో వాడిని తిట్టించడం, మరీ కోపంగా ఉంటే కొట్టించడం.
మీకు చెప్పలేదు కదూ మా మామయ్యకే నన్నిచ్చి పెళ్లి చేసారు. మా పెళ్లప్పటికే అమ్మమ్మ జబ్బు పడింది. పెళ్లైన ఏడాది తిరగకుండా చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేక తాతయ్యా వెళ్లిపోయాడు.
మా పెళ్లైన ఐదేళ్లకే అమ్మా, నాన్నా కాశీ యాత్రకంటూ బయలుదేరి ప్రమాదంలో ఏకకాలంలో ఇద్దరూ పోయారు. నేనూ, మామయ్యా..అదే మావారూ బ్యాంకు ఉద్యోగంలో చేరి చాలా ఏళ్లు ఎక్కడెక్కడో తిరిగాం. మాకు ఒక్కగానొక్క కూతురు పూర్ణ, అన్నపూర్ణ అమ్మమ్మ పేరే.
ఆయన పదవీ విరమణ తరువాత, నేనూ స్వచ్ఛంద విరమణ చేసి మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మా ఊరు చేరాం. అక్కడే ప్రశాంతంగా, హాయిగా ఉంటున్నాం.
ఆ మధ్య బంధువులింట్లో పెళ్లికినీ, పిల్లని చూసినట్టూ అవుతుందని ఈ మహా నగరానికొచ్చి, కరోనా పుణ్యమా అని అక్కడే ఇరుక్కుపోయాను.
మళ్లీ పచ్చపచ్చని మా కోనసీమనీ, నీళ్లున్నా లేకున్నా మా గోదారమ్మనీ చూసేదాకా మనసు మనసులో లేదంటే నమ్మండి. మా పేచీకోరు మామయ్యని కూడా!
ఇక మా ముగ్గురి పిల్లల ఆట, పాటలతో అల్లర్లతో రెండు నెలలూ ఎలా గడచిపోయాయో కూడా తెలియలేదంటే నమ్మండి. (అల్లరికీ, పేచీకీ మామయ్య కూడా పిల్లలతో సమానమే మరి)
మా అమ్మాయి, అల్లుడూ వచ్చి పిల్లలతో సహా వెడుతుంటే నాకంట్లో వరద గోదారే పొంగిపోయింది.
‘మళ్లీ ఏడాదికే కదా ఆటవిడుపు’ అనుకుంటూ నా మనసు ఉసూరుమంది.
కానీ ఈ మధుర జ్ఞాపకాల ఊట ఊరుతూనే ఉంటుంది మనసే ఊటబావిగా.