– నాదెళ్ల అనూరాధ
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
గోపాల్రావు గారి భార్య సుభద్ర గారికి గుండె సంబంధమైన సర్జరీ జరిగిందని తెలిసింది. తిరుపతిలో ఉన్న రోజుల్లో గోపాల్రావు గారి కుటుంబంతో మాకు మంచి స్నేహం ఉండేది. ఆమెను చూసి రావాలని అనుకున్నాం.
రైలెక్కిన దగ్గర్నుంచీ ఆ రోజుల్లోకి మనసు ప్రయా ణమై పోయింది. అప్పట్లో ఇంటికి వచ్చే పోయే అతిథులతో ఉక్కిరిబిక్కిరి అనిపించినా ఆ నేల, ఆ గాలి, ఆ కొండలు జ్ఞాపకమొస్తే మనసు ఒక మధుర మైన భావంతో నిండిపోతుంది. రైల్లో పెద్దగా జనం లేరు. బెర్త్ మీద అలా కూర్చునే మావారు, నేను ఎవరికి వాళ్లం తిరుపతి జ్ఞాపకాల్లో మునిగిపోయాం.
‘సుధా! నువ్వు ఎప్పుడూ అంటూండే దానివి కదూ! ఆవిడ పిల్లలను మరీ అపురూపంగా చూసు కుంటారని’.. ఉన్నట్టుండి మావారు అన్నారు. ఆలోచనల్లోంచి బయటపడి అవునన్నాను.
ఆయన ఒక్క క్షణం ఆగి,
‘నీకు తెలుసా? మొదటిసారి నాకు ముంబై బదలీ అయినప్పుడు ఎంత బెంగ పడిపోయానో. నాకంటే అమ్మానాన్నలైతే మరీను. పెళ్లి కూడా కాలేదు. తోడు లేకుండా ఒంటరిగా ఎలా పంపాలని అమ్మకి బెంగ. ఇంటికి ఒక్కణ్ణి. తాతయ్య, నానమ్మలైతే ఉద్యోగం మానెయ్యమన్నారు. తాతయ్య ఆరోగ్యం బావులేదు, నేను అంత దూరం వెళ్లిపోతే ఆయన చూడాలను కుంటే వెంటనే రాగలనా అని దిగులు’
ఏదో ఆలోచిస్తూ చెబుతున్నారాయన.ఈ విషయం ఎప్పుడూ వినలేదు. ఇంతకీ ఇప్పుడెందు కొచ్చిందిది?
‘కారణం ఉంది. సుభద్ర గారు పిల్లలకోసం బాగా దిగులు పడిపోయారట. అదే ఆమె అనారోగ్యానికి కారణమని గోపాల్రావు గారి నమ్మకం.’’
పిల్లలు పెద్దవాళ్లైపోయారు. పెళ్లిళై, తండ్రులు కూడా అయ్యారు. పిల్లలతో చిన్నప్పటి సాన్నిహిత్యం ఎప్పుడూ కావాలంటే దొరుకుతుందా?
సుభద్ర గారి మనస్తత్వం తెలుసున్నదే. ఏ తల్లీ పిల్లల్ని అంతలా ప్రేమిస్తుందో లేదో అనుకునేదాన్ని. ప్రతిక్షణం ఆ పిల్లల వెనుక ఆమె. వాళ్లూ అలాగే ఉండేవారు. ఆ ప్రేమ పిల్లల భవిష్యత్తుకి సంకెళ్లు వెయ్యటమో, లేదా ఆమెకు నిరాశ మిగల్చటమో చెయ్యదు కదా! అని భయం వేసేది. అదే నిజం అయిందన్న మాట!
ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఇల్లు, పిల్లలు! మధ్యమధ్య గుడి, ప్రవచనాలు! ఇదే లోకం. ఫంక్షన్లంటూ ఎటూ వెళ్లదు. సినిమాలు చూడదు. ఒకే దీక్షగా తనదైన చిన్న ప్రపంచం. ముఖంలో ఒక సంతృప్తి. నా అభిరుచులు, ప్రయాణాలు, స్నేహితులు ఆమెకు ఆశ్చర్యంగా ఉండేవి.
ఆమె గుడికి వెళ్తూ నన్నూ రమ్మనేది. ఆస్తికత్వం, నాస్తికత్వం ఏదీ లేకపోయినా ఆమెతో కాస్సేపు గడిపేందుకు వెళ్తూండేదాన్ని. ఒకరోజు రామాల యంలో ప్రవచనమేదో జరుగుతోంది. చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ, మధ్యలో పక్కనున్న సుభద్ర గారిని గమనిస్తున్నాను. ఆమె వినటంలో పూర్తిగా లీనమై పోయింది. కార్యక్రమం పూర్తై వస్తుంటే,
‘మనవాళ్లనుకున్న వారితో అనుబంధాలు జీవితం పట్ల మమకారాన్ని కలిగిస్తాయి. అవి లేకపోతే జీవితానికి అర్థం ఏముంటుంది? బంధాల పట్ల వ్యామోహం పెంచుకోకుండా ప్రపంచాన్ని పరోక్షంగా మాత్రమే చూడాలని, అలా చూడటంలోనే జీవనసాఫల్యం దొరుకుతుందని చెప్పారు. కానీ, అది సాధ్యమేనా సుధా?’
ఏమో! నా ప్రపంచం పెద్దది. అందుకే ఆ సాధ్యాసాధ్యాల గురించి అంతగా ఆలోచించను. ఆప్రశ్నకి సమాధానం చెప్పలేదు నేను.
‘మనిషి జీవితంలో ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలే కాక ‘అపరోక్షానుభవం’ అంటూ ఒకటుందని చెప్పారు. ‘అపరోక్షం’ అనే మాటను మొదటిసారి విన్నాను. చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. నిద్ర తాలూకు అనుభవం నిద్రపోయే సమయంలో తెలియకపోయినా ఆ తర్వాత అది శరీరానికి మిగిల్చేదే అపరోక్షాను భవం అన్నారు. జాగ్రత్తగానే విన్నాను కానీ అదేమిటో సరిగా పట్టుకోలేక పోయాను’ ఇల్లు చేరేవరకూ ఆమె మాట్లాడుతూనే ఉంది.
‘కుటుంబాన్ని దాటి అందరినీ నావాళ్లను చేసుకోగలను కానీ, అంటీ ముట్టనట్టు బతకటం చేత కాదు’ ఆమె గొంతు రుధ్ధమయ్యింది.
జీవితం చుట్టూ ఎంత బలంగా అనుబంధాల్ని అల్లుకుందో! సున్నిత మనస్కురాలు! కుటుంబ బంధాలను దాటి మరో వ్యాపకమేదో కల్పించు కోవాలి. ఆమె ధోరణి మార్చుకోకపోతే ముందు ముందు మరింత నలిగిపోక తప్పదు. ఆమెతో ఈ విషయాలు గట్టిగానే చెప్పాలనుకున్నాను ఆ పూట.
*******************
రైలుదిగి, బసలో స్నానాదులు ముగించుకుని బైరాగి పట్టెడవెళ్లాం. కాఫీలు, కాసిని కబుర్లు అయ్యాక గోపాల్రావుగారు అన్నారు, ‘అన్నింటికీ బెంగం టుంది. అరవైల దగ్గరకొచ్చినా ఇంకా పెద్దరికం రాలేదు. పిల్లలు దగ్గరగా, ఎదురుగా ఉండా లంటుంది. అది అయ్యేపనేనా? శుభ్రంగా చదువు కున్నారు, వాళ్లక్కావలసిన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రపంచమంతా ఒక చిన్నగ్రామం ఇప్పుడు. దేశం లోనే, మన ఎదురుగానే పిల్లలుండాలని కోరు కోవటం ఎంతవరకు తెలివైన పనంటారు? ఎదురుగా ఉంటే వాళ్ల జీవనశైలి, ఆ వేగం చూసి తట్టుకో గలదా? ఇవన్నీ మనకి అనుగుణంగానే మారుతూ వచ్చిన పరిస్థితులనుకోవాలి. మీరైనా చెప్పండి.’ ఆయన మాటలకి దెబ్బతిన్నట్టు చూసిందామె.
‘భలేవారే… పిల్లలకోసం తాపత్రయపడటం అమ్మలకి సహజమే కదండీ’ అంటూ లేచాను. నా వెనుకే ఆమె. ఇద్దరం వంటింటి గుమ్మం దాటి పెరటివైపు మొక్కల్లోకి నడిచాం.
‘పిల్లల్ని చూడాలనుకోవటం నేరమన్నట్టు మాట్లాడతారు ఈయన. మీకు తెలుసుగా నాకు పిల్లలంటే ఇష్టం. వాళ్లను పెంచుకునేప్పుడు ప్రతి రోజూ అపురూపమైనదన్నట్టే ఉండేది. పల్లెనుంచి అప్పుడప్పుడు వచ్చిపోయే మా అత్తగారు, ‘లోకా నికంతా నువ్వొక్కత్తెవే కన్నట్టు..పిల్లలో అంటూ అస్తమాటూ వాళ్ల చుట్టూ తిరుగుతావేమే! ఒక్క నాలుగు రోజులు నా దగ్గరకి పంపమంటే పంపవు.’ అంటూండేవారు. ఏమోవాళ్లని వదిలి ఉండలేను అనిపించేది. ఇంకెలా ఉండాలో కూడా తెలియదు’.. చెబుతుంటే ఆమె కళ్లల్లో సన్నని కన్నీటి పొర.
‘అసలే ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతోంది, ఆ ఆలోచనలు వద్దు’ అని చెప్పాను.
‘నన్ను చెప్పనీయండి. నాకు అక్కచెల్లెళ్లు లేరు. పెద్దగా స్నేహితులూ లేరు. మీతోనే చెప్పుకోగలను. అమ్మ చిన్నప్పుడే దూరమవటంతో నాలో ఒక వెలితి ఎప్పుడూ వేధిస్తుండేది. పెళ్లై, పిల్లలు పుట్టాక క్రమంగా అది తీరింది’ అంది ఆమె నా చేతిని పట్టుకుని.
‘మీకు తెలుసుగా, పెద్దవాడు చదువుకోసం వెళ్లినవాడు అమెరికాలో ఉండి పోయాడు. ఇప్పుడు చిన్నవాడు లండన్ వెళ్లాడు. మంచి అవకాశంట. కనీసం దేశంలో ఉండరా’ అని చెప్పాను.
‘మంచి ఉద్యోగం, మంచి జీతం’ అన్నాడు.
‘ఇక్కడ మాకున్నది తినేందుకు ఎవరున్నారు? నీకు కావలసింది మేము ఇస్తాం రా’ అంటే నవ్వు తాడు. ‘ప్రపంచం చూడాలమ్మా, బోలెడు విషయాలు తెలుసుకోవాలి. ఇక్కనుండమంటే ఎలా?’ అంటాడు. నా ఆత్రం పట్టలేక ‘అయితే ఒకనాలుగైదేళ్లు ఉండి వచ్చెయ్యరా. నీకోసం చూస్తుంటాం’ అని చెప్పాను.
‘వచ్చేస్తాడు లెండి. నేను చెప్పానుగా. వాడికీ నేనంటే ప్రాణం. నా ఆరోగ్యం బావులేదని చెబితే పిల్లలిద్దరూ రాలేని పరిస్థితి. ఇద్దరూ గిలగిల లాడిపోయారు. పిచ్చి మొహాలు!’
ఆమె ఏమీ మారలేదు. తిరుపతిలో ఉన్న రోజుల్లో మా మధ్య చాలాసార్లు ఈ విషయాల గురించిన చర్చలు జరుగుతూనే ఉండేవి. ఆమె తన వాదనే సరైనదని నమ్ముతుండేది. మరో విధంగా ఆలోచించ లేననేది.
‘మీ ఆధ్యాత్మికపరమైన ఆసక్తి, ఆలోచనలు లౌకికమైన విషయాల పట్ల నిర్మొహమాటంగా ఉండమని చెబుతున్నాయి కదా!’ అంటే, మౌనమే సమాధానం.
గుడికి వెళ్లటం, ప్రవచనం వినటం తనకు ఆనందం కలిగిస్తాయనేది. అంతకుమించి ప్రపంచం పట్ల తన ధోరణి మార్చుకోలేననేది.
ఆ రోజు సుభద్ర గారు ఆ ప్రవచనం విని కన్నీరు పెట్టుకున్నారే కానీ ఏమీ నేర్చుకుందుకు సిధ్ధం కాకపోవటమే అసలు విషాదం కాబోలు! ఇలా అనుకుంటే ఎందుకో నొప్పి కలుగుతోంది మనసుకి.
ఏదో గుర్తొచ్చినట్టు ఆమే కొనసాగించింది,
‘హాస్పిటల్‌లో నా పక్క రూం పేషెంట్‌కి ఎనభయ్ ఆరేళ్లు. ఆవిడకి బావులేదని తెలిసి, పిల్లలు ఐదుగురూ వచ్చారు. ఆసుపత్రిలో ఉన్న పది రోజులూ పిల్లలంతా ఆవిణ్ణి చూసేందుకు వచ్చి వెళ్లేవాళ్లు. అసూయతో చెప్పట్లేదు. మన ముందు తరం మనకంటే అదృష్ట వంతులనిపిస్తుంది.’
ఆమె మూడ్‌ని మార్చాలని టాపిక్ మార్చాను.
‘గుర్తుందా?’ అంటూ
తిరుపతి అంటే అప్రయత్నంగానే గుర్తొచ్చేది మరొకటుంది. కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే, ‘ముందు టూ వీలర్ లైసెన్స్ తెచ్చుకుంటేనే’ అని షరతు పెట్టారు మావారు.
చిన్నప్పుడు సైకిల్తొక్కిన అనుభవమైనా లేదు నాకు. రెండుచక్రాల మీద అలా ఎలా సైకిల్ నిలబడు తుంది? స్కూల్లో స్నేహితులు సైకిల్ నేర్చుకుంటున్నా మన్నా, కొనుక్కున్నామన్నా ‘ఓహో’ అనేసి ఊర్కోటమే.
ఇప్పుడింక కారు డ్రైవింగ్ మీద ఆశతో డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లాను. ఇన్‌స్ట్రక్టర్ చెప్పేది. గ్రౌండ్‌లో స్కూటీ ప్రాక్టీసప్పుడు కాస్తవేగం పెంచమని హెచ్చ రిస్తూ, ‘జాగ్రత్తగా నడుపుతున్నారు, పడిపోయే ప్రమాదం లేదు’ అంటూ ప్రోత్సహిస్తుండేది.
పొద్దున్నే అందరూ నిద్ర లేవకుండా బైరాగిపట్టెడ రోడ్ల మీద స్కూటీ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని ‘అప్రోత్సాహ కాలు’ ఎదురయ్యేవి. అంటే నిరుత్సాహానిచ్చి, నీరస పరిచేవని అర్థం. హారన్ కొడుతూ చుట్టూ ఒక భద్రతా వలయాన్ని తయారు చేసుకునే నన్నూ, నా స్కూటీ వ్యవహారం చూస్తూనే పొద్దున్నే నడకకి బయలు దేరినవాళ్లు రోడ్డుపై ఒదిగి ఒదిగి నడిచేవారు. వాళ్లు నన్ను చూసి అలా భయపడి పోవటం నాకు కష్టంగా ఉండేది. ఎదుటి మనిషిని తక్కువ అంచనా వెయ్యకూడదు కదా!
అలాటి ప్రాక్టీస్ నడుస్తున్న రోజుల్లో ఇంటి ముందు ముగ్గు వేయిస్తున్న ఒకామె చటుక్కున గేటు లోపలికి తప్పుకోవటం, ముగ్గువేస్తున్నామెని ‘కాస్సే పాగి వేద్దువు గాని, లోపలికిరా’ అంటూ పిలవటం నాకు వినిపించింది. విననట్టు వెళ్లిపోయాను హారన్ వేసుకుంటూ. ఆ ఇంటి ముందు నుంచి రోజూ వెళ్తూనే ఉన్నాను.
నా వెనకే మావారు నా డ్రైవింగ్ మీద ఓ కన్ను వేసి ఉంచేవారు. ఒకరోజు రోడ్డు మలుపు తిరిగి, వెనక్కి వచ్చేసరికి అదే ఇంటి ముందు నిలబడి ఆ ఇంటాయనతో మాట్లాడుతున్నారు. ‘వీళ్లతో పరి చయం లేదే’ అనుకుంటూ ఇంటికెళ్లాక అడిగాను.
‘ఈరోజే పరిచయమయ్యారులే. గోపాల్రావు గారు, సుభద్ర గారు. రోజూ చూస్తున్నారుట మనిద్దర్నీ’ అన్నారు.
సుభద్ర గారితో స్నేహం పెరిగాక అప్పుడప్పుడు ఉక్రోషంగా ఆమెకి గుర్తు చేస్తుండేదాన్ని, ‘నా డ్రైవింగ్‌కు భయపడే కదూ ఆ సమయంలో ముగ్గు వేసే పని మానేశారు’ అంటే
‘అయ్యో, అదికాదు. మా అబ్బాయి క్లాసులకి టైం మారటంతో వాడికి డబ్బా కట్టే పనిలో ఉండే దాన్ని. సుమతి చీకటితో ముగ్గు వేసేసేది’ అనేదామె.
ఆ రోజులు, నా డ్రైవింగ్ ముచ్చట్లు చెప్పుకుని నవ్వుకున్నాం ఇద్దరం. ఆమె ముఖంలో దిగులు మాయమైంది. ఇంతలో, గోపాల్రావుగారు పెరట్లోకి తొంగిచూసి, ‘కబుర్ల విందేనా లేక భోజనాల ఏర్పాటు ఉందా?’ అన్నారు హాస్యంగా. ఇద్దరం లోపలికి నడిచాం.
ఆమె వంటామెతో వడ్డన ఏర్పాట్లు చేయిస్తుంటే, ముందు గదిలో మేము ముగ్గురం మిగిలాం.
గోపాల్రావుగారు చెబుతున్నారు, ‘ఊర్కే పిల్లలు పిల్లలంటుందండీ. ప్రాణంలా పెంచుకుంది. నిజమే, తల్లులంతా అలాగే పెంచుకుంటారు. కానీ ఎల్లకాలం వాళ్లని కట్టి పడెయ్యటం కుదురుతుందా? అరె, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. తన పట్ల నాకు ఎలాటి కంప్లైంట్లూ లేవు. పిల్లలకోసం ఆరాటంతో అనా రోగ్యం కోరి తెచ్చుకుంది. పుస్తకాలో, స్నేహితులో, ఎటైనా వెళ్లిరావటమో, మనకు చేతనైనదేదైనా అవసరమున్న వాళ్లకి చేసి పెట్టటమో..ఏదో ఒకటి చేసి మనసుని మళ్లించుకోవాలి. అక్కర్లేని బెంగలు మానుకోవాలి’.
‘అసలు ప్రపంచం పట్ల డిటాచ్‌డా ఉండాలన్నదే కదా మన వేదాంతసారమంతా. ఆధునిక స్వామీజీలూ అదే చెబుతున్నారు. అన్నీ వింటుంది. అది అలవాటు చేసుకోవాలి. అంతేకానీ, నాలుగు సంవత్సరాల్లో పిల్లవాడు దేశం తిరిగొచ్చేస్తాడని, మాటిచ్చాడు కనుక ఆ నాలుగేళ్లూ ఎదురు చూస్తుం టాను అంటే అవుతుందా?వాళ్ల కమిట్మెంట్లు వాళ్లవి. వాళ్ల జీవితం వాళ్లది. మనకేం హక్కుంది వాళ్ల భవిష్యత్తు మీద?’
ఆయన మాటల వెనుక ఉన్న ఆవేదన అర్థ మవుతోంది. తమ చేతిలో లేని విషయాల గురించిన ఆలోచనల్ని వదిలి పెట్టపెట్టాలని భార్యకి చెప్పి, ఒప్పించలేక ఆయన పడే దిగులు తెలుస్తోంది.
తిరుగు ప్రయాణంలో మనసంతా భారమైంది.
పూర్వం తల్లిదండ్రుల్ని, ఉన్న ఊరిని వదల వలసిన పరిస్థితి ఉండేది కాదు. ఆ తర్వాత్తర్వాత మెల్లిగా చదువులు, తగిన ఉద్యోగాలు, కాస్తకాస్త దూరాల్ని అలవాటు చేశాయి.
ఇప్పుడు చదువులతో పాటు అవకాశాలు, దూరాలు అవిభాజ్యాలైపోయి మనుషుల్ని చెరో ఒడ్డుకీ విసిరేస్తున్నాయి.
మనుషుల మధ్య భౌతిక దూరాలు మరీ అంతగా సమస్యకాని కాలంలో ప్రయాణాలు ఇంత సులభంగా లేవు. అయినా తల్లిదండ్రుల్ని వెనక వదిలి వచ్చామన్న ఆలోచన పిల్లల్లో ఉండేది. వచ్చి, వారితో గడిపే వెసులుబాటును కుదుర్చుకునేవారు.
ఇప్పుడో గోపాలరావు గారన్నట్టు ప్రపంచం పట్ల ఒక డిటాచ్మెంట్ అవసరం. ఇది ఏ కాలానికైనా అనుసరణీయమే అన్నా, ఈ కాలానికి మాత్రం అనుసరించి తీరవలసిన నియమంగా మారింది. మనిషి, సమాజం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన జీవనతాత్త్వికత, దృక్పథం ఇదే.
ఈ వేగం, సాంకేతికత, ఇన్ని ప్రయాణ సాధ నాలు మనుషుల్ని కోరుకున్నంత దగ్గర చెయ్య గలుగుతున్నాయా? అమ్మ ఆరోగ్యం బావులేదు, బెంగెట్టుకుంది, ఓసారి వచ్చివెళ్లరా’ అంటూ తండ్రి ఓ కార్డు ముక్క రాస్తే పరుగెత్తుకొచ్చే వెసులుబాటు, ఔదార్యం ఇదివరకటి తరంలో ఉండేది.
అలా అంటే, ఇప్పటితరం పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమను తక్కువ చెయ్యటం కాదు. ఇప్పటివాళ్ల స్పందన మరోవిధంగా ఉంటుంది.
‘ఎంత ఖర్చైనా మంచి వైద్యం చేయించండి. డబ్బు పంపిస్తాం’ అంటారు. తమ ప్రేమని డబ్బు రూపంలో చూపించగలరు. అయినా, వాళ్ల అవగాహన అంతే అనుకోలేం.
నిష్పూచీగా ఆడుతూ పాడుతూ పెరిగిన అమ్మ ఒడిలోకి ఎప్పుడంటే అప్పుడు వెళ్లే వెసులుబాటు పిల్లలకి ఎంతవరకు ఉంది? అమ్మ చూడాల నుందంటే పరుగెత్తుకెళ్లేందుకు అంత సులువుగా అవకాశం దొరకని పరిస్థితుల మధ్య వాళ్లకి వాళ్లే ఒక మార్గాన్ని ఎంచుకుని తమని తాము ఓదార్చు కుంటున్నారేమో!
తల్లిదండ్రుల గుండెచప్పుడు పిల్లలకి వినిపించి, పిల్లల ప్రతిస్పందన తల్లిదండ్రులకి అంది, సాంత్వన నిచ్చే అవగాహనొకటి ఎరుకకొస్తే ఎంత బావుణ్ణు! ఈ అవగాహన వస్తే ప్రవచనకారుడు చెప్పిన అపరోక్షానుభవం అర్థమైనట్టే కాబోలు.
కంటి కెదురుగా కనిపించే ప్రత్యక్షానుభవాన్నీ, దూరాల్ని అధిగమించే పరోక్షానుభూతినీ దాటి మనశ్శరీరాలకు లేపనమై హాయినిచ్చే ఆ అపరోక్షా నుభవ మేదో ఒంట బట్టించుకోవలసిందే.