– కామనూరు రామమోహన్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఊరిలోని జనాలు ఒకరి వెంట ఒకరు ఆత్రంగా వెళుతున్నారు. అందరూ ఊరబావి దగ్గర గుంపులు గుంపు లుగా వున్నారు. ‘నాయనా! ఎందుకట్లా పర్గెత్తు తున్నారు?’ అని కానచ్చిన వారినందరిని అడగ సాగింది మంచంలో లేవలేని స్థితిలో వున్న సంజమ్మ. ‘ఏమర్రా! ఎవరూ పలకరు. ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు’ అని వాపోసాగింది. ‘ఏమో! మాకు తెలిస్తే కదా నీకు చెప్పేది, అయినా ముసల్దానికి నీకెందుకు నోర్ముసుకొని పడుండం అంటూ కసరు కున్నాడొక యువకుడు. ‘చూడు నాయనా ఓబన్నా! వాని మిడిసిపాటు ముసలివాళ్లమైతే ఊర్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండాలా? ‘అదేం లేదులే పెద్దమ్మా, నేను పోతాండ తెల్సుకొని వచ్చి చెబుతా’ అని సముదాయించాడు ఓబన్న.

‘ఈమాటన్నావు బాగుండాది, నూరేళ్లు బతుకు నాయనా!’ ‘అంత పెద్దసిచ్చేందుకు పెద్దమ్మా, యాభైయేండ్లు బతకడమే కస్టంగా వున్న ఈ రోజుల్లో నూరేండ్లంటే ఇంతకంటే పెద్ద సిచ్చ ఇంగోకటుం డదు’ అంటూ పోయి విష•యం కనుక్కొని వచ్చాడు ఓబన్న. ‘పెద్దమ్మా పెద్ద గోరమే జర్గిపోయింది. సుబ్బ మ్మత్త ఊరబాయిలో దుంకి సచ్చి పోయింది’. ‘ఆ… ఏంది నాయనా! యింత బతుకు బతికి అత్తె సావు సచ్చింది. నేను సూడు ఇన్నేళ్లు మంచాన పడినా అత్తె సేసుకున్నానా? అత్తె సావు సత్తే పుట్టగతులుండ వంటారు పెద్దోళ్లు.’ ‘అది నిజమే పెద్దమ్మా, ఆయత్తకు ఏమగసాట్లు వచ్చాయో! ఎవరికి తెల్సు. తెల్లగున్నవన్నీ పాలే అనుకుంటే యట్లా?’ ‘అవుండ్రా ఓబన్నా సుబ్బమ్మ కొడుకులు, కోడల్లే దానికి మిత్తువైనారు. ఎప్పుడూ నాకాడి కొచ్చి గోడు ఎల్లబోసుకొని ఏడ్చేది. మనసు నిబ్బరం సేసుకోమని ఓదార్చేదాన్ని. అయినా ఎన్నాళ్లు సాధింపులు బరిస్తది. ‘అందుకే ఈ అగాయిత్యానికి పూనుకున్నది’. ‘ఎమ్మా ఆమెకంత కట్టం ఏమొచ్చింది?’ ‘ఏంది నాయనా! ఆ మాటం టావు. ఆమె గూర్చి నీకు తెలియదేమో! యిట్రా చెప్తా’.

‘మిసిమి వయసులో ఇదవరాలై నల్గురు పిల్లలతో పుట్టింటికి చేరుకుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేయడం ఆమెకు అనుభవం నేర్పిన పాటం. తోడు నీడగా ఉంటాడనుకున్న పెనిమిటి దూరం కావడం ఆమెకు దేవుడు విధించిన శిచ్చ. అప్పుడు ఆమెకు అండదండ వాళ్ల అమ్మ బయమ్మే. వున్న పొలంలో ఎగసాయం చేసుకుంటూ, పిల్లోళ్లను సంగదీడు కుంటూ జీవనము సేసేది. కాలక్రమేణా వాళ్లమ్మ కాలం సేసింది. అప్పటికి పిల్లోళ్లు సెతికిందికి వచ్చారు. అందరూ కలసి ఎగసాయం జమాయించి సెత్సండారు. కస్టపడి నాల్గు రూకలు ఎనకేసు కున్నారు. వూళ్లో వాళ్లందరూ వాళ్లకేమి నెమ్మదస్తులు అనే కాడికి వచ్చారు. పిల్లోళ్లకందరికి మాంచి సంబంధాలు సూసి పెళ్లిళ్లు సేసింది. ఆమె కలలు కన్న వుమ్మడి కుటుంబం నాలుగైదు యేండ్లు సాబీగా సాగింది. అన్నదమ్ముల బంధాలు బంధనాలుగా మారాయి. మాటల్లో, సేతల్లో, సూపుల్లో అంతరం అనంతంగా పెరిగి పోయింది చిన్న చిన్న ఇసయాలకే అలకలు, కొట్లాటలు కొలువు దీరాయి. కోడళ్లు కలహాల కాపురం ఏగలేక పెట్టెబేడతో పుట్టింటికి పోవడం, నెలల తరబడి అమ్మగారిళ్లలో కూర్చోవడం పరిపాటి అయింది. సుబ్బమ్మను గౌరవంగా సూడడం మాని కొడుకులు, కోడళ్లు ఎదిరించడం మొదలు పెట్టారు.

ఒకసారి రెండవ కోడలు సరళ పుట్టింటికి పోయి నాల్గు నెల్లయినా అత్తారింటి మొగం సూళ్లా. పెండ్లాము కోసం పోయి కొడుకు కూడా అత్తారింట్లో కూర్చో సాగాడు. చిన్న కోడలు నవనీత కడుపు నొప్పి, తలకాయ నొప్పి అని సాకులు సెప్పి మంచం దిగడం లేదు. పెద్ద కోడలు ధరణికి పనిభారం ఎక్కువైంది. తోడికోడళ్లకు కూడా చాకిరీ సేయవలసి రావడం ఆమెకు బాధ అనిపించింది, ఒకరోజు భర్త రాముతో ‘ఇక ఈ సంసారాన్ని ఈదడం నావల్ల కాదు, ఎవరికొద్ది వాళ్లు ఏదో ఒక సాకుతో పనులు తప్పించుకొని కూర్చుంటే అందరినీ కూర్చోపెట్టి ఎన్నాళ్లు చేయాలి, ఏదో చేదోడు వాదోడు అన్నారు పెద్దోళ్లు. మరీ యింత విడ్డ్డూరమైతే ఎలా? మీరే చెప్పండి’ అని నిలదీసింది. అప్పటికి ఆమెకు ఏదో సర్ది చెప్పాడు. భార్య మాటలు రాము మెదడును తొలుస్తూనే వున్నాయి. ఆమె మాటల్లోకూడా నిజం లేకపోలేదు. ఒకరోజు అమ్మ దగ్గర కూర్చొని కుటుంబం సమస్యలన్నీ ఏకరువు పెట్టాడు రాము. ‘సరే నాయనా నీవు చెప్పింది నిజమే, నేను కూడా అందరి పరిస్థితి గమనిస్తూనే వున్నాను. ఎవరి బిడ్డ అయితేనేమి, పెద్ద కోడలుగా నీ భార్య కుటుంబ భారం మోస్తూ వున్నది. వాళ్లు అది తెలుసుకోలేక అలుసుగా చూస్తున్నారు. రేపు సంక్రాంతి పండుగకు అందరూ వుంటారు, అందరం కలసి ఎలా చేద్దామో ఆలోచిస్తాము. అంతవరకూ ఓపిక పట్టండి’ అంది సుబ్బమ్మ. అనుకున్నట్లే ఆరోజు రానేవచ్చింది. కొడుకులు, కోడళ్లను కూర్చోపెట్టుకొని కుటుంబ పరిస్థితి వివరించింది. ‘మీరందరు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకర్థము కావడం లేదు. మీ మనసుల్లో ఏముందో చెప్పండి?’ అని అడిగింది. కాసేపు మౌనం… కాసేపు గుసగుసలు తర్వాత పెద్దవాడు తప్ప మిగతా ముగ్గురు వేరు కాపురం పెట్టాలనే అభిప్రాయాన్ని చెప్పారు. ‘ఇన్నాళ్లు కలసిమెలసి గౌరవంగా బతికాము. కలసి ఉండడంలో వున్న సౌఖ్యం ఏమిటో మీకు ఇప్పుడు తెలియదు. సంసారం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూ పోతూ వుంటాయి. కాస్త ఓర్పు, సర్దుబాటు వుంటే ఎన్ని సమస్యలైనా సమసిపోతాయి. అందరూ కలసి తలా ఒక పని చేసుకుంటూ కలసివుండండి’ అని హితవు చెప్పింది. అయిన ఎవరూ వినే పరిస్థితిలో లేరు విడిపోవడం అనివార్యం అయ్యింది.

ఉన్న పొలాన్ని పెద్ద మనుషుల సమక్షంలో నాలుగు భాగాలు చేశారు. ముగ్గురు కొడుకులకు మూడు భాగాలు, సుబ్బమ్మకు ఒక భాగంగా నిర్ణ యించారు. అందరూ సరేనన్నారు. ఎవరి కాపురం వారిదయింది. సుబ్బమ్మ పెద్ద కొడుకు దగ్గర ఉండ డానికి మొగ్గుచూపింది. ఇలా కొంతకాలం జరిగింది. సుబ్బమ్మ పెద్దోనివద్ద ఉండడం, అతనికి నాలుగెకా రాలు కావడం మిగతా వారికి కంటగింపుగా అయ్యింది. అమ్మ భాగం రెండెకరాలయితే ఒకరి దగ్గరే ఉండటానికి వీళ్లేదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి వద్ద వుండాలి. ఎవరి దగ్గర వుంటే వాళ్లు ఆ రెండెకరాలు చేసుకోవాలి అనేది మిగతా వాళ్ల ప్రతి పాదన. కొడుకులు చేసిన తప్పుకు సుబ్బమ్మ దోషిలా పెద్ద మనుషుల ముందు నిలబడవలసి వచ్చింది. ‘ఏమమ్మా నీ కొడుకులు చెబుతున్న దానికి నీవేమం టావు?’. ‘ఏముందన్నా నా రెండెకరాలలో పెద్దోడు ఏదో భోంచేస్తున్నాడని వీళ్లకు కడుపులో మంట. ఈరోజు దాంట్లో వచ్చే ఫ•లసాయం ఎక్కువే కావచ్చు. నా ఆరోగ్యం ఎల్లకాలం ఇలాగే వుంటుందా? ఎప్పుడు ఏ రోగమొస్తుందో ఎవరికెరుక? చేతిలో నాలుగు రూకలు పెట్టుకోకపోతే ఏలా? వీళ్ల బుద్ధులు ఇప్పుడే ఇలా వుండాయి, ఇంకా ఏం పాడు బుద్దులు పుడతాయో ఎవరికెరుక?’ ‘నీవు చెప్పేది నిజమే, వీళ్ల్లు రోజూ నాచుట్టూ తిరుగుతున్నారు. నేనొకమాట చెబుతా వినమ్మ. పెద్దోడివద్ద వున్నట్లే ఒక్కొక్క యేడు ఒకరి దగ్గర వుండు. నీవెవరి దగ్గర వుంటే వాళ్లు పొలం చేసుకుంటారు. నీవు అందరి దగ్గరా వున్నట్లు వుంటుంది, అసూయలు లేకుండా పోతాయి. దీనికేమంటావమ్మా’ అడిగాడు పెద్దమనిషి. ‘అన్నా! పెద్ద కోడలి దగ్గర ఇమిడినట్లు మిగతా వాళ్ల దగ్గర ఇమడలేకపోతున్నా. వాళ్ల మాటల్లో, చేతల్లో తేడాలున్నాయి. నాకు నచ్చిన చోట వుండే స్వేచ్ఛ నాకు ప్రసాదించండి’ అని వేడుకుంది. ‘నీవెటూ పొలం చేసుకోలేవు. ఎవరికో ఒకరికి గుత్తకు ఇవ్వాల్సిందే, నీకు కావాల్సింది గుత్త. ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం పొలం చేసుకుంటారు. ఒకరితో పాటు గుత్త ఇస్తారు. నీవు నీ ఇష్టం వచ్చినవాళ్ల దగ్గర వుండు’ అన్నాడు పెద్దమనిషి. ‘సరే అలాగే చేయండి అంది సుబ్బమ్మ. ‘అట్లాయితే నాదగ్గ రెందుకు? ఎవరు పొలం చేసుకుంటారో వాళ్ల దగ్గరే ఉండమను’ అన్నాడు రాము. ‘ఆమె ఇష్టం ఉండే టట్లయితే వుండమను’ అన్నారు మిగతా వాళ్లు. ‘ఉండమనడం కాదు.. మీ పెండ్లాలను బాగా చూసుకోమని చెప్పండి ఆమె చెప్పేది అదే కదా’ అని గద్దించాడు పెద్దమనిషి. ‘నీపెండ్లామిట్లా అంటే నీపెండ్లామిట్లా’ అని మాటామాటా పెరిగి కొట్లాటకు దిగినారు అన్నదమ్ములు. ఇది చూడలేని సుబ్బమ్మ ‘ఒరేయ్‌! ఎం‌దుకురా కుక్కల్లా అలా కాట్లాడుకొని సస్తారు. చూసేవాళ్లు నవ్వి ముఖాన ఊస్తారు. నన్నెవరూ ఉద్ధరించనవసరం లేదు. నా కాళ్లు చేతులు ఆడినన్నినాళ్లు నా బతుకు నేను బతకగలను, నన్నెవ్వరూ ఉద్ధరించవద్దు. నా కోసం మీరెందుకు తన్నుకొని చస్తారు. నా ఆగసాట్లు నాయి మీకెట్లా ఇష్టమయితే అట్లా చేయండి’ అంటూ వాపోయింది. పెద్ద మనిషి వాళ్లకు సర్దిచెప్పి, ‘మీ బాగుకోరే ఆమెలోని అమ్మతనాన్ని చూడండి, స్వార్థంతో సంకుచితంగా వ్యవహరించడం మాను కోండి. ఆమె కష్టజీవి. మీకంటే బాగా బతకగలదు. ఏదో ఒక ఇంట్లో ఒక మూలన వుండే ఏర్పాటు చేయండి. ఒక్కతి ఇంత వండుకొని తింటుంది. మనిషికొక్క యేడు పొలం చేసుకొని ఆ గుత్త ఆమెకివ్వండి’ అని చెప్పి పంపాడు పెద్ద మనిషి.

వచ్చిన గుత్తగింజలు కొన్ని తిండికి ఉంచుకొని, మిగతావి అమ్మి తన ఖర్చులకు వాడుకుంటూ, అందులో తృణమో పణమో మిగిలితే మనువళ్లకు, మనుమరాళ్లకు యిచ్చుకుంటూ కాలం వెళ్లబుచ్చుతూ వుండేది. ఒక యేడు ఒక కొడుకు వచ్చి ఇరవై మూటలకు బదులు పదిహేను మూటల గుత్త యిచ్చాడు. ‘అదేమీ నాయనా! తక్కువ యిచ్చావు’ అడిగింది సుబ్బమ్మ. ‘అమ్మా ఈ యేడు తెగుళ్లతో పంట స•రిగా రాలేదు వూళ్లో అందరూ అలాగే తగ్గించారు’ అని అమ్మకు సర్ది చెప్పు కున్నాడు. కడుపుతీపి కొద్ది ‘సరేలే నాయనా! ఈ మాట ఎవరితో చెప్పకు లేకపోతే కొంపలు అంటుకుపోతాయి’ అని అంది సుబ్బమ్మ. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి మిగతా వారికి తెలిసింది. మరలా పెద్దమనిషి వద్ద పంచాయితీ పెట్టారు. ‘వాడు తగ్గించి ఇచ్చాడు కాబట్టి మేము కూడా తగ్గించి ఇస్తాము’ అనేది ఇప్పటి ప్రతిపాదన. ‘అందరూ ప్రతిసారి ఇలా తగ్గించి ఇస్తే నేనెట్లా బతకాలి! ఏదో ఒక యేడు అంటే పరవాలేదు. ఇదేం పాడు బుద్ధిరా మీకు’ అని దీరిగించింది సుబ్బమ్మ. ‘గతంలో మాకు కూడా నష్టాలు వచ్చి నాయి, మేమేమైనా తగ్గించి యిచ్చామా? వాడొచ్చి నాలుగు కమ్మని మాటలు చెబితే వెన్నపూసలా కరగి పోయావు. వాడి మాదిరే మేమూ కొడుకులం కాదా?’ అంటూ కొట్లాటకు దిగినారు. పెద్ద మనిషికి ఏమి చెప్పాలో పాలుపోలేదు. ముగ్గురూ ఉద్దండులే. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసే రకం. ‘బాగా ఆలోచించి ఆ భూమిని సమానంగా పంచుకొని లాభనష్టాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక్కొక్కరు ఏడు మూటల ప్రకారం గుత్త ఇవ్వండి. ఇక మీదట పంచాయితీ తెస్తే మర్యాద వుండదు’ అని హెచ్చరించి పంపాడు. ఇలా కొంత కాలం గడిచింది. వుండబట్టలేక ఎవరి ఇంటికైనా వెళితే మిగతా వాళ్లు గుసగుసలాడడం, ‘మా అత్త ఏమి చెప్పింది ఏమి యిచ్చింది’ అని ఆరాలు తీయడం ఎక్కువైంది. ‘ఏమిరా భగవంతుడా నాకీ శిక్ష, నోరారా పిలిచి ఎవరూ పట్టెడన్నం పెట్టక పోయినా! కూర్చున్నా, లేచినా తప్పుగానే భావిస్తున్నారు. ముసలి ముప్పున ఏదో ఒక రకంగా కాలం వెళ్లబుచ్చాలి. అభిమానంతో పలకరించే వారితో మనసు విప్పి మాట్లాడినా తప్పే అయితే ఎలా? ఆ మాత్రం స్వేచ్ఛ లేని బతుకు బతుకేనా?’ అని చింతిస్తూ కానీ కాలంలో అన్నీ ఇబ్బందులా అని గుండెదిటవు చేసుకొని ఇంట్లోనే వుండసాగింది.

ఒకరోజు ఒక మనుమడు వచ్చి ఐదొందలు డబ్బు అడి గాడు. ‘నా దగ్గర అంత లెక్క ఎక్కడిదిరా? నాకు మందులకు మాకులకు కావద్దా? నాకు అవసరమైతే ఎవరిస్తారు? లేదంటే రెండొందలుంది తీసుకో’ అంటూ సర్దిచెప్పబోయింది. ‘అంతేలే నీకిష్టమైన వారికైతే ఎంతైనా ఇస్తావు. నేను నీ మనవన్నీ అయితే కదా?’ అంటూ కోపంగా వెళ్లిపోయాడు. నిజంగా ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదు. అయినా ఇప్పుడు ఐదొందలతో వీడికి ఏ అవసరమొచ్చిందో? మొన్న ఇంకొక మనవడికి పరీక్ష ఫీజుకని ఐదు వందలు యిచ్చాను అది తెలిసి వీడొచ్చాడు ఇది వరస. ఇస్తే ఒక తంటా ఇవ్వకుంటే మరొక తంటా. వీళ్లతో చచ్చిపోతున్నాను’ అని తనలో తానే కుమిలి పోసాగింది సుబ్బమ్మ. ‘అమ్మ దగ్గర డబ్బు వున్నది. ఆ డబ్బును తనకు ఇష్ట మైన వాళ్లకు దోస్తూ వుంది. ఇది చాలా అన్యాయం. ఆమె పక్షపాతంతో వ్యవహరిస్తూ వుంది. ఏదైనా ఇవ్వదలిస్తే అందరికీ సమానంగా ఇవ్వాలి. ఆమెకు కావలసింది తిండి, బట్టే కదా! ఆమెకెందుకు ఇంత గుత్త’ అని తగవులాడి పెద్ద మనిషి దగ్గరికి పోయి ఏదో చెప్పబోయారు. ఆయనకు కోపం ‘వచ్చి మీరు మనుషులేనా ప్రతి దానికి కుక్కల్లా కాట్లాడుకుంటు న్నారు. తల్లిని చూసే తీరు ఇదేనా? ఆమెను ఊరు మ్మడి గొడ్డులా చేశారే మీకు బుద్ధి వుందా’ అంటూ తిట్టి పంపినాడు. సుబ్బమ్మ ఎవరికీ ఏమీ చెప్పలేక నిస్సహాయంగా నిలబడి ఉంది. చివరకు వాళ్లు వీళ్లు కలసి ఒక్కొక్కరు ఒక్కొక్క జత గుడ్డలు, ఒక్కొక్కరు నాలుగు నెలలు అన్నం పెట్టేటట్లు ఒప్పించారు.

సుబ్బమ్మ బతుకు మాసాల బతుకు అయి పోయింది. చివరకు బిచ్చగత్తెలా ఇల్లిల్లు అడుక్కు తినవలసిన దురవస్థ వచ్చింది. వారేది ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి. ఏదైనా బాగలేదు అంటే మహానేరం. నాలుగు నెలలు అవుతూనే తట్టా బుట్టా సర్దుకొని ఇంకో యిల్లు చేరాలి. ఒకరి యింట్లో వున్నపుడు ఇంకొకరితో మాట్లాడకూడదు. అలాగే కొన్నాళ్లు వెళ్లబుచ్చింది. క్రమేణా ఒంట్లో శక్తి సన్నగిల్లింది. చిన్న కొట్టంలో కుక్కి మంచంలో పడకరాపులు పడ్డ శరీరంతో అంపశయ్య జీవితం గడపసాగింది. వాళ్లకు తీరుబాటై నాలుగు మెతుకులు పడేస్తే తినాలి, లేదంటే పస్తులైనా వుండాలి. పలకరించే దిక్కు లేరు. పిలిస్తే పలికే వారు లేరు. పశువుకు మేత వేసినట్లు మొక్కుబడిగా నాలగు మెతుకులు విదుల్చుతొన్నారు. ‘మనిషికి ఇంత కంటే దుర్భరమైన శిక్ష ఏముం టుంది? ఇంతకంటే నరకం వెయ్యి రెట్లు మేలు కదా’ అనుకుంది. తన చావు కోసం దేవుళ్లనందరిని పేరు పేరునా వేడుకుంది. కానీ దేవుళ్లు కూడా ఆమె నమ్మకాన్ని వమ్ముచేశారు. అంపశయ్య జీవితం నుండి విముక్తి కోరుకుంది. తెల్లవారి ఊరబావిలో శవమై తేలింది… ఇది నాయనా! ఆమె సంగతి. ‘పోయి ఏదైనా సాయపడు నాయనా నీకు పున్నేమైనా వస్తుంది’ అంది సంజమ్మ.

About Author

By editor

Twitter
YOUTUBE