కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను 2020 నాటి బంగారం స్మగ్లింగ్‌ ‌కేసు నీడలా వెంటాడుతోంది. రెండేళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ వివాదం, జూన్‌ 21‌న ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌, ‌ప్రధాని మోదీకి రాసిన లేఖతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడి సృష్టించింది. ఈ వ్యవహారంలో కేరళ ప్రభుత్వం పాత్రపై సీబీఐ విచారణ జరపాలంటూ లేఖలో ఆమె కోరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఈ కేసులో ప్రభుత్వం తనను బలిపశువును చేసిందంటూ ఆమె ఆరోపించారు. పినరయి ప్రభుత్వం తనను, తన కుటుంబ సభ్యులను, తన లాయర్‌ను కూడా వేధింపులకు గురిచేస్తున్నదని ఆమె తాజాగా ఆరోపించారు.

బంగారం అక్రమ రవాణ కేసులో స్వప్న సురేష్‌ ‌పదహారు నెలలపాటు జ్యుడీషియల్‌ ‌కస్టడీలో గడిపి 2021, నవంబర్‌లో విడుదలయ్యారు. తర్వాత హెచ్‌ఆర్‌డీఎస్‌ ఇం‌డియా పేరుతో నడిచే ఎన్‌జీఓలో డైరెక్టర్‌గా చేరారు. నిజానికి ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరి ప్రమేయం ఉన్నదంటూ గతంలోనే స్వప్న ఆరోపించారు.

స్కాం ఎలా బయటపడింది?

2020 జులై 4న తిరువనంతపురం అంతర్జా తీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.13 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. కార్గో విమానంలో వచ్చిన ఈ బంగారం మనాకడ్‌లోని కాన్సులెట్‌ ఆఫీస్‌ ‌చిరు నామాతో వచ్చింది. కస్టమ్స్ ‌యాక్ట్, ‌దౌత్యసంబంధాల (వియన్నా కన్వెన్షన్‌) ‌చట్టం ప్రకారం దౌత్యవేత్తలకు సంబంధించిన రెండు రకాల వస్తువులకు తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. అవి కార్యా లయంలో వినియోగించే వస్తువులు, డిప్లొమేటిక్‌ ఏజెంట్‌ ‌సొంత బ్యాగులు. అయితే ఆ బ్యాగ్‌ ‌దౌత్యవేత్త వ్యక్తిగత బ్యాగేజీ కింద నమోదై ఉండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసేందుకు పైఅధికారుల అనుమతి కోరారు. ఈ బ్యాగేజీని అసీమా తరఫున  యూఏఈ కాన్సులెట్‌ ‌మాజీ ఉద్యోగి శరత్‌ ‌తీసుకోవాల్సి ఉన్నదని తర్వాతి విచారణలో తేలింది. వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ ‌చేయగా స్వప్న సురేష్‌ ‌పేరు చెప్పడంతో, ఆమెను విచారించినప్పుడు ఎం. శివశంకర్‌ ‌పేరు బయటకు వచ్చింది. గతంలోనూ ఆయన ‘స్పెషల్‌ ‌బ్యాగేజీని’ రిలీజ్‌ ‌చేయాలని కస్టమ్స్ ‌శాఖను అభ్యర్థించినట్టు కూడా వారు విచారణలో తెలిపారు. ముఖ్యమంత్రి విజయన్‌ ‌కార్యాలయం (సీఎంఓ)కు బంగారం స్మగ్లింగ్‌ ‌వ్యవహారం పూర్తిగా తెలుసని స్వప్న అధికారులకు తెలిపారు. ఈ విచారణ నేపథ్యంలో మరో యూఏఈ కాన్సులెట్‌ ‌మాజీ జనరల్‌ ‌జమాల్‌ అల్‌-‌జబీ కూడా గతంలో ఆరుసార్లు కేరళకు అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చినట్లు, మరో కాన్సులెట్‌ ఉద్యోగి కూడా కేరళకు అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చా రన్న విషయాలూ బయటపడ్డాయి. జమాల్‌ అల్‌-‌జబీ జర్మనీలో కొన్ని పెట్టుబడులు పెట్టినట్లు, ఇందులో స్వప్ప సురేష్‌కు భాగస్వామ్యాన్ని కల్పించి నట్టు ఆరోపణలున్నాయి. అల్‌ అసీమా రాస్‌ అల్‌ ‌కైమాలో ఇంటిని నిర్మించుకుంటున్నారని, దీని నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఇన్‌చార్జ్ ‌కాంట్రాక్టర్‌ ‌పారిపోవడంతో, ప్రస్తుతం ఆమెకు పెద్దమొత్తంలో డబ్బు అవసరం ఉన్నదని కూడా ఈ విచారణలో వెల్లడైంది.

ఇదిలా ఉండగా 2021, జూన్‌లో కస్టమ్స్ అధికారులు మొత్తం 53 మందికి  బంగారం స్మగ్లింగ్‌ ‌కేసులో షోకాజ్‌ ‌నోటీసులు జారీచేయగా వీరిలో మాజీ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌, ఇద్దరు  యూఏఈ కాన్సులెట్‌ ‌మాజీ జనరల్స్ ‌జమాల్‌ అల్‌ ‌జబీ, అట్టాచ్‌ ‌రషీద్‌ ‌ఖమీస్‌ అలీ ఉన్నారు. ఈ ఇద్దరికి  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ద్వారా గత ఏడాది జూన్‌లో నోటీసులు జారీ అయ్యాయి. కొవిడ్‌-19 ‌తొలి దశలో కేరళ లాక్‌డౌన్‌లో ఉండగా ఈ కేసు బయటపడటం విశేషం.

అప్పట్లో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని విపక్షాలు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌వద్ద ప్రిన్సిపల్‌ ‌ప్రైవేట్‌ ‌సెక్రటరీగా పనిచేసిన ఎం. శివశంకర్‌కు బంగారం స్మగ్లింగ్‌లో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, ప్రభుత్వంపై విమర్శల దాడులు తీవ్రంచేశాయి. విపక్ష నేత రమేష్‌ ‌చిన్నతల ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాస్తూ దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. విపక్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎం. శివశంకర్‌ను ఏడాది సెలవుపై పంపి ఆయన స్థానంలో మీర్‌ ‌మహమ్మద్‌ అలీని నియమించారు. బంగారం స్మగ్లింగ్‌ ‌కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న శివశంకరే స్వప్న సురేష్‌ను ప్రభుత్వ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో నియమించడానికి ప్రధాన కారకుడు. ఈమె నేపథ్యం సరిగ్గా లేకపోయినా, ఆమెపై ఫోర్జరీ కేసులో క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ‌విచారణ జరుపుతున్న విషయాలను పట్టించుకోకుండా ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడం గమనార్హం. అయితే బంగారం స్మగ్లింగ్‌ ఆరోపణలను ప్రభుత్వం ఖండించి, దీనిపై ఏవిధమైన విచారణ జరిపినా తమకు ఇబ్బందిలేదని అప్పట్లో ప్రకటించింది.

ఎవరీ స్వప్న సురేష్‌?

‌స్వప్న తిరువనంతపురంలో ఒక ట్రావెల్‌ ఏజెన్సీలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2010-11 ప్రాంతంలో అబుదాబిలో ఉద్యోగంలో చేరారు. కొద్దికాలం విరామం తర్వాత అబుదాబి విమానాశ్రయం నుంచి తిరిగి కేరళకు వచ్చారు. తర్వాత ఎయిర్‌ ఇం‌డియాకు చెందిన ‘ఎస్‌ఏటీఎస్‌’‌లో చేరారు. ఇది తిరువనంతపురంలోని గ్రౌండ్‌ ‌హ్యాండ్లింగ్‌ ఏజెన్సీ. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ సంస్థను విడిచిపెట్టి, అబుదాబి కాన్సులెట్‌లో చేరారు.

తర్వాత వృత్తిపరమైన వ్యవహారశైలి సక్రమంగా లేదన్న ఆరోపణలపై ఉద్యోగం నుంచి తొలగింపునకు గురయ్యారు. అనంతరం కేరళ ప్రభుత్వానికి చెందిన ఐటీ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌లో చేరారు. ప్రస్తుతం పాలక్కాడ్‌లోని హైరేంజ్‌ ‌రూరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సొసైటీ (హెచ్‌ఆర్‌డీఎస్‌ ఇం‌డియా) అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ (ఉమెన్‌ ఎం‌పవర్‌మెంట్‌ ‌సీఎస్‌ఆర్‌)‌గా పనిచేస్తున్నారు.

ఇరకాటంలో ప్రభుత్వం

కేరళ ప్రజల ప్రధాన బలహీనత ‘బంగారం’. దీన్ని ‘సొమ్ము’ చేసుకోవడానికే వివిధ మార్గాల ద్వారా అక్రమార్కులు బంగారాన్ని కేరళకు స్మగుల్‌ ‌చేస్తుంటారనేది ప్రస్తుత ‘బంగారం స్కాం’ ఉదంతం చెబుతున్న పాఠం. అయితే, ఇది స్మగ్లర్లకు మాత్రమే పరిమితం కాకుండా, ఏకంగా కేరళ ప్రభుత్వం మెడకు చుట్టుకోవడం గమనార్హం. ముఖ్యంగా త్రిక్కకర ఉపఎన్నికలో ఓటమి దెబ్బ నుంచి కోలుకోక ముందే అధికార ఎల్‌డీఎఫ్‌కు సద్దుమణిగిందనుకున్న రెండేళ్లనాటి బంగారం స్కాం వెలుగులోకి రావడం అశనిపాతమైంది. బహుశా త్రిక్కకర ఉపఎన్నికలో అధికార పార్టీ గెలిచి ఉంటే.. ఈ స్కాంలో ఆరోపణ లను ప్రభుత్వం మరింత గట్టిగా, సమర్థవంతంగా ఎదుర్కొనగలిగేది. కానీ ఓటమి కుంగుబాటు పార్టీని నైరాశ్యంలోకి నెట్టేయగా, స్తబ్ధుగా ఉన్న విపక్ష కాంగ్రెస్‌కు గొప్ప ఆయుధాన్నిచ్చింది. ప్రస్తుత పరిణామాల వల్ల ఎల్‌డీఎఫ్‌కు ఇప్పుడే వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా, ప్రతిష్ట మసకబారిందని చెప్పక తప్పదు.

అంతేకాదు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కె-రైల్‌ ‌ప్రాజెక్టుకు (కాసర్‌గడ్‌- ‌తిరువనంతపురం, తలస్సరి-మైసూర్‌, ‌నీలంబూర్‌- ‌నంజాంగఢ్‌, ‌కోచింగ్‌ ‌టెర్మినల్‌ ‌కాంప్లెక్స్, ‌శబరి రైల్వే లైన్లు) వ్యతిరేకంగా రాష్ట్రంలో వ్యక్తమవుతున్న నిరసనల నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెంచేందుకు ఇదొక గొప్ప అవకాశంగా కాంగ్రెస్‌ ‌భావిస్తోంది. ఈ స్కాంలో లబ్ధిపొందిన వారిలో ముఖ్యమంత్రి సలహాదారులు నలిని నిట్టో, మాజీ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ ఎం. శివశంకర్‌, ‌ముఖ్యమంత్రి ఓఎస్‌డీగా పనిచేసిన సీఎం రవీంద్రన్‌, ఉన్నత విద్యాశాఖ మాజీ మంత్రి కేటీ జలీల్‌ ఉన్నారని స్వప్న ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలన్నీ విపక్షాల కుట్ర అంటూ ముఖ్యమంత్రి కొట్టిపారేసినప్పటికీ నిజానిజాలు దర్యాప్తులో తేలుతాయి. ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే రాష్ట్రం మరింత భగ్గుమంటుం దనడంలో సందేహం లేదు. మరోవైపు తాను చేసిన ఆరోపణలను రుజువుచేసే ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని స్వప్న మీడియాకు చెప్పారు.

వెలుగులోనికి రానివి ఇంకెన్నో!

దేవభూమిగా పేరుపడిన కేరళ రాష్ట్ర ప్రజలకు బంగారం అంటే మహాప్రీతి. దీనిపై పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతుంటారు. బహుశా ఇదే ఆ రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్‌కు కారణం కావచ్చు. కస్టమ్స్ అధికారుల లెక్కల ప్రకారమే ఏటా రాష్ట్రానికి రూ.10వేల కోట్ల విలువైన బంగారం అక్రమ రవాణా అవుతుంటుంది. వ్యవస్థలోని లొసుగులకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. కమిషనరేట్‌ ఆఫ్‌ ‌కస్టమ్స్ (‌ప్రివెంటివ్‌) (‌సీసీపీ) 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 540.37 కిలోల బంగారాన్ని పట్టుకుంది. దీని విలువ రూ.187 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పట్టుకున్న 251 కిలోల బంగారంతో పోలిస్తే ఇది రెట్టింపు. 2019-20లో బంగారం అక్రమ రవాణాకి సంబంధించి కేరళలో 802 కేసులు నమోదయ్యాయి. ఇదే ఏడాది కాలికట్‌ ‌విమానాశ్రయంలో 232 కిలోలు, కన్నూర్‌ ‌విమానాశ్రయం (2019లో ప్రారంభమైంది) 47.1 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

అదేవిధంగా తిరువనంతపురంలో అధికారులు పట్టుకున్న బంగారం విలువ 200 కిలోలు. 2019, నవంబర్‌ ‌నుంచి 2020, మార్చి 4వ తేదీలోపు దౌత్య మార్గాల ద్వారా 18 సార్లు కేరళకు బంగారం స్మగుల్‌ అయిందని విచారణ అధికారులు గుర్తించారు. ఈ వివరాలన్నీ స్వప్న సురేష్‌ ‌కేసు పుణ్యమాని వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో!

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE