– సుజాత గోపగోని, 6302164068
ఉద్యమం ఫలించి.. పరిస్థితులు కలిసొచ్చి.. అనేక రకాలుగా చుట్టుముట్టిన ఒత్తిళ్లు ఫలించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఆ క్రెడిట్‌ను కేవలం తన వరకే పరిమితం అయ్యేలా చూసుకున్నారు కేసీఆర్. ఉద్యమపార్టీగా టీఆర్‌ఎస్ ఉన్న సమయంలో మాట్లాడిన మాటలకు, ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి అయ్యాక పాతరేశారు. తన వెంట ఉన్న మేధావులు, నేతలకు ప్రభుత్వంలో స్థానం కల్పించలేదు. అధికారం చిక్కిన వెంటనే కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష పాలనే తెలంగాణలో సాగుతున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు లభించి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా రాష్ట్రంలో విపక్షం అనేదే ఉండొద్దన్న ఏకైక వ్యూహంతో తొలి దఫాలో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, రెండో దఫా అధికార పీఠం దక్కిన తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా క్రమంగా క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ప్రధాన విపక్షాలు భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌పార్టీ పుంజుకున్నాయి. అప్పటిదాకా నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీలు కొత్త జవసత్వాలతో దూసుకెళ్తున్నాయి. పోటాపోటీగా కేసీఆర్‌కు చెక్‌పెట్టే కార్యాచరణతో ముందు కెళ్తున్నాయి. దీంతో, కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేస్తున్నారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారు. ఎలాగైతేనేం ఎన్నికల సమయానికి టీఆర్‌ఎస్ వైపు ప్రజల్ని ఆకర్షించడమెలా? అన్న వ్యూహాలకు ఇప్పటినుంచే పదును పెడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను నడిపిస్తున్న బీజేపీపై కారాలు మిరియాలు నూరుతూనే, మొన్నటిదాకా దూరం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దగ్గరవుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు కూడా అర్థం కావడం లేదు.
టీఆర్‌ఎస్ మాత్రమే కాదు, కాంగ్రెస్‌పార్టీ వ్యవహారశైలి కూడా ప్రజల్లో గందరగోళం సృష్టి స్తోంది. కొంతకాలంగా బీజేపీ, కాంగ్రెస్ రెండింటి పైనా కేసీఆర్ అంతెత్తున ఎగిరి పడుతున్నారు. కేటీఆర్, ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్యనేతలు కూడా బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే అని, ఆ జాతీయ పార్టీల వల్లే దేశం అధోగతి పాలయిందని, వాటిని జనం పట్టించుకోవద్దని విమర్శించారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా వరుసగా టీఆర్‌ఎస్ వ్యతిరేక సభలు, కార్య క్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. అంతేకాదు, రాహుల్‌గాంధీ కూడా మే నెలలో తెలంగాణలో పర్యటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై టీఆర్‌ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉండవని రాహుల్ తేల్చి చెప్పారు. నేరుగానే కాకుండా పరోక్షంగానూ గులాబీ పార్టీతో పొత్తులు ఉండవన్న సంకేతం ఇచ్చారు. రాహుల్ ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ లక్ష్యంగా మరింత దూకుడు పెంచారు.
అయితే, ఇదే సమయంలో టీపీసీసీ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ పరిణామం ప్రకంపనలు సృష్టిం చింది. అసలు తాము ఏం చేయాలో, తెలంగాణలో ఎవరిని ప్రత్యర్థిగా భావించాలో కూడా అర్థంకాని పరిస్థితిలోకి నెట్టేసింది. జాతీయస్థాయిలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు సమయంలో చోటు చేసుకున్న దృశ్యం తెలంగాణ కాంగ్రెస్‌లో ఝలక్ పుట్టించింది. ఒకే వేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, టీఆర్‌ఎస్ ముఖ్య నేత కేటీఆర్ కనిపించిన దృశ్యం అది. యశ్వంత్‌సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేస్తున్న సమయంలో ఆయనకు ఓవైపు రాహుల్‌గాంధీ, మరోవైపు కేటీఆర్ కనిపించారు. ఈ దృశ్యం వైరల్ కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు షాకయ్యారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ శ్రమిస్తోంది. తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేదన్న నిరా శలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న సంతోషంలో ఉన్నారు టీపీసీసీ నేతలు. వలసల జోరు మీదున్న తెలంగాణ కాంగ్రెస్‌కు రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో షాకిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షాల కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే కాదు, సిన్హా నామినేషన్ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు కేటీఆర్. రాహుల్‌తో కలిసి వేదిక పంచుకోవడమే కాదు, కాంగ్రెస్ నేతలతో సరదాగా గడిపారు. రాహుల్‌తోనూ ఆయన ముచ్చటింటారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న టీఆర్‌ఎస్ ఢిల్లీ వెళ్లాక తీరు మార్చింది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్య క్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్‌పార్టీని పక్కనబెట్టి బీజేపీని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ నుంచే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుందన్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ఉందని స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రావాలని ఆహ్వానించామని.. ప్రత్యేక సమావేశంలో ఆయనకు మద్దతు తెలుపు తామని వెల్లడించారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దొందూ దొందే
టీఆర్‌ఎస్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవని ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని బీజేపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉండటంతో రేవంత్ రెడ్డి వర్గీయులు కలవరపడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలుస్తాయన్న సంకేతం జనంలోకి వెళితే తమకు తీరని నష్టం కల్గుతుందనే భావనలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే రాజకీయం చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ కలవాల్సి వస్తే ఆయన జీరోగా మారడం ఖాయం. అందుకే కాంగ్రెస్ కూటమికి టీఆర్‌ఎస్ మద్దతు రాష్ట్రపతి ఎన్నికల వరకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు. అయితే, బీజేపీ మాత్రం ఈ పరిణామాలను ప్రజల్లోకి తీసు కెళ్లడంలో మునిగిపోయింది.
బీజేపీ సమావేశాలపై కుట్ర
జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు అనుకున్నంతగా ప్రాచుర్యం దక్కకుండా చేసేందుకు కేసీఆర్ ప్రణాళి కలు సిద్ధం చేసుకున్నట్లుగా వినిపిస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశం నలుమూలల నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత లందరూ హైదరాబాద్ తరలివస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంకా ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలోనే భాగ్యనగరం కాషాయమయంగా మారనుంది. బీజేపీ నేతలు పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని శ్రమిస్తున్నారు. ఈ సభ ద్వారానే వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించనున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే, ఆ పరిణామాలకు అడ్డంకిగా కేసీఆర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారట. తెలంగాణలో పాగా వేయడం, టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందులో భాగంగానే హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. దీనిని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ కటౌట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలకు అవకాశం లేకుండా చేస్తోంది గులాబీ పార్టీ. నగరంలో టీఆర్‌ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లను రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలిపేలా ప్రకటనలతో నింపేయబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు మెట్రో రైల్ ఎల్ అండ్ టీ సంస్థతో యాడ్ ఏజెన్సీ ద్వారా టీఆర్‌ఎస్ డీల్ చేసుకుందని సమాచారం. బీజేపీ సమావేశాలు జరిగే రెండు రోజులతో పాటు ముందు, వెనక రోజుల్లో మెట్రో పిల్లర్లను టీఆర్‌ఎస్ తమ ప్రకటనల కోసం బుక్ చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని మూడు మెట్రో కారిడార్లలో మొత్తం రెండున్నర వేలకు పైగా పిల్లర్లున్నాయి. ఈ పిల్లర్లపై కేసీఆర్ సర్కార్ బోర్డులు దర్శనమివ్వను న్నాయి. ముఖ్యంగా అమీర్‌పేట నుంచి మియాపూర్, రాయదుర్గం రూట్లలో భారీగా ప్రకటనల బోర్డులు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అంతేకాదు, దేశం లోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే బీజేపీ నేతలకు తెలంగాణ సర్కార్ పథకాల గురించి తెలిసేలా ఇంగ్లిష్, హిందీ లోనూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్