జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం
చిత్తవృత్తులను నిగ్రహించటమే యోగ్ (చిత్తం = అంతఃకరణం)
ఇక్కడ కాస్త వివరించుకుందాం. చిత్తం, వృత్తులు అంటే ఏమిటో చూడలేవు. మెదడులో నేత్ర నాడీ కేంద్రముంటుంది. దాన్ని తీసివేయండి. కన్నులు మామూలుగానే ఉంటాయి. రెటీనా (నేత్రాంతః పటలం) కూడా చక్కగానే ఉంటుంది. దానిపై ప్రతిబింబాలు పడుతూనే ఉంటాయి. అయినా సరే, కన్నులు రూపాలను చూడలేవు. కాబట్టి కన్నులు అప్రధాన సాధనాలు. అవి చూచే ఇంద్రియాలు కావని తేలుతోంది కదా! మెదడులోని ఒక నాడీ కేంద్రంలో ఈ చూసే ఇంద్రియముంటుంది. కన్నులున్నంత మాత్రాన చూపుంటుందని చెప్పలేం. ఒక వ్యక్తి కన్నులు తెరచుకుని పడుకున్నాడు. చుట్టూతా మంచి వెలుతురుంది. వెలుపలి వస్తువుల నుండి ప్రతిబింబాలు కూడా ఏర్పడుతున్నాయి. అయినా వస్తువు కనిపించదు. కారణమేమంటే..వీటికి తోడుగా మరొకటి ఉండాలి. అదే మనసు ఇంద్రియంతో సంయోగం చెందాలి. అప్పుడే వస్తువు కనిపిస్తుంది.
తస్య వాచకః ప్రణవః
ఓంకారమే అతని నామధేయం. మనసులో కలిగే ప్రతి భావానికీ ప్రతిరూపం అనదగిన పదమొకటి ఉంటుంది. పదం, అర్థం రెండూ అవిభాజ్యాలై ఉంటాయి. ఒకే విషయానికి చెందిన బాహ్య రూపాన్ని పదమని, అంతర్భాగాన్ని అర్థమని అంటాం. అర్థాన్నుండి పదాన్ని ఎవ్వరూ విడదీయ లేరు. జనులు కొందరు ఒకచోట చేరి కూర్చుని పదాలను నిర్ణయించి, భాషను నిర్మించారన్న సిద్ధాంతం కేవలం హేతు విరుద్ధమని నిశ్చయించారు. సృష్టిలో మనుషులున్నంత కాలం మాటలు, భాష కూడా ఉంటాయి.
అర్థానికి, పదానికి (శబ్దానికి) ఉన్న సంబంధ మేమిటీ? భావాన్ని అనుసరించి, పదాలు ఏర్పడ్డాయని మనం ఊహించినా, ఒకానొక భావాన్ని తెలుపటానికి, ఒకానొక మాటే కావాలన్న నియమమేమీలేదు. ఒకే భావాన్ని తెలపటానికి ఇరవై దేశాల్లో ఇరవై వేరువేరు భాషలు ఉండవచ్చు. ఒక్కొక్క భావాన్ని తెలపటానికి ఒక్కొక్క మాట కావాలి. అయితే వీటికి ఒకే విధమైన శబ్దాలుండనక్కరలేదు. వివిధ దేశాల్లో శబ్దాలు వివిధంగా ఉంటాయి. ‘‘భావానికి, పదానికి సంపూర్ణంగా స్వాభావిక సంబంధమున్నా, ఒకానొక భావానికి, ఒకానొక శబ్దానికి అవినాభావ సంబంధం ఉండాలని ఊహింపరాదు’’ అని వ్యాఖ్యాత చెబుతున్నాడు. శబ్దాలు వేరువేరై ఉన్నా, శబ్దాలకు, భావాలకు సహజ సంబంధం ఏర్పడి ఉంటుంది. సంజ్ఞకు, అది తెలిపే వస్తువు లేదా విషయానికి సరి అయిన సంబంధముంటేగానీ, శబ్దాలకు భావాలకు సమంజస సంబంధం ఏర్పడదు. అంతవరకూ ఆ సంజ్ఞ వాడుకలోకి రాదు. సంజ్ఞ అంటే, నిర్దేశిత వస్తువును లేదా విషయాన్ని తెలిపే పదం. నిర్దిష్ట వస్తువులకు ఇదివరకే ఒక సంజ్ఞ ఏర్పడి ఉంటే, ఆ సంజ్ఞతో ఆ వస్తువు అనేక పర్యాయాలు వెల్లడి అయినట్లు అనుభవపూర్వకంగా మనకు తెలిస్తే, ఆ రెంటికీ అన్యోన్య సంబంధముందని నిశ్చయింపవచ్చు. వస్తువులు తమ ఎదుట లేకున్నా, వాటిని గ్రహించే జనులు వేలకొలది ఉంటారు. సంజ్ఞకూ-అది నిర్దేశించే వస్తువుకూ స్వాభావిక సంబంధముండాలి. అప్పుడే, మనం సంజ్ఞముచ్చ రించగానే, అది నిర్దేశించే వస్తువు మనకు స్ఫురిస్తుంది.
ఓంకారం భగవంతుని తెలిపే సంజ్ఞ అని వ్యాఖ్యాత అంటాడు. వ్యాఖ్యాత ఓంకారాన్ని అంత ప్రధానంగా పరిగణించటానికి కారణమేమిటీ? భగవంతుని తెలుపడానికి వందల కొలది పదాలు న్నాయి. ఒకే భావం, వేయి పదాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. భగవంతుడనే భావం వందల కొలది పదాలతో సంబంధం కలిగి ఉంది. వీటిలో ప్రతి పదం కూడా భగవంతునికీ ఒక సంజ్ఞగా ఉంది.
సరే, ఈ సంజ్ఞలనన్నింటినీ సమీకరిస్తూ, వీటికి మూలాధారంగా సంజ్ఞ ఒకటి ఉంటే, ఆ సంజ్ఞ వీటి భావాలనన్నింటినీ తెలుపుతూ ఉంటుంది; కాబట్టి అది ఉత్తమోత్తమ సంజ్ఞ అవుతుంది. శబ్దోచ్ఛారణలో మనం స్వరపేటికను, అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాం. ఏ శబ్దం నుండి, ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో, అలాంటి అత్యంత స్వాభావిక శబ్దం ఏదైనా ఉందా? అన్ని శబ్దాలకు మూలమైన ప్రణవం లేదా ఓంకారమే ఆ శబ్దం. దీనిలో మొదటి భాగం ‘అ’కారం. నాలుకలోని, అంగిలిలోని ఏ భాగం కూడా ‘అ’ కార ఉచ్చారణకు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజంగా ఉంది. చివరిది ‘మ’కారం. పెదవులను మూసి దీన్ని ఉచ్చరిస్తారు. నోటిలోని మూలభాగం నుండి అంత్యభాగం వరకు కూడా ‘ఉ’కారం ఉచ్చారణ సమయంలో దొర్లుతూ ఉంటుంది. ఇలా శబ్ద ఉచ్చారణ పక్రియనంతా ఓంకారం తెలియచేస్తున్నది. కాబట్టి ఇదే శబ్దా లన్నింటికీ మూలమైన స్వాభావిక సంజ్ఞయై ఉండాలి.
సమస్త శబ్ద్దజాలం కూడా ఓంకారంతో ఇమిడి ఉంది. అంతేకాదు, భారతదేశంలోని వివిధ మతాభిప్రాయాలు అన్నీ ఓంకారం మీదే ఆధారపడే ఉన్నాయి. దీనివల్ల ఆంగ్లేయులుగానీ, ఇతర విదేశీయులు కానీ ఏం గ్రహించాలి? భారతదేశంలో మతాభివృద్ధి కలిగినప్పుడల్లా ఓంకారాన్ని ప్రధానంగా పరిగణించారు. అంతేకాదు, భగవంతుని గూర్చిన సాకార, నిరాకార భావాలన్నీ ఓంకారం ద్వారానే అన్వయించారు. వేదంలోని వివిధ మతాశయా లన్నింటికీ ఓంకారమే పట్టుకొమ్మ. ద్వైతులూ విశిష్టాద్వైతులూ శైవ, శాక్తేయాది స్వతంత్ర మతస్థులు, చివరికి నాస్తికులు కూడా ఓంకారాన్ని స్వీకరించి ఉన్నారు. జన బాహుళ్యానికి ఓంకారం మత పరమావధిని తెలిపే చిహ్నంగా ఏర్పడి ఉంది. ఉదాహరణకు, భగవంతుడు అనే అర్థం గల ‘గాడ్’ అనే ఆంగ్ల పదాన్ని తీసుకుందాం. ‘‘గాడ్’’ అనే పదం భగవంతుని సమగ్రభావాన్ని తెలుపజాలదు. సాకార నిరాకారాలను సూచించటానికి ‘గాడ్’ అనే పదానికి (పర్సనల్- ఇంపర్సనల్-అబసాల్యూట్ అనే) విశేషణాలు చేర్చవలసి ఉంటుంది. ఇతరభాష లన్నింట్లో కూడా, భగవంతుని తెలిపే పదాలన్నీ కూడా ఇలాంటివే. అవన్నీ అతిపరిమిత భావాన్ని మాత్రమే వ్యక్తం చేస్తుంటాయి. ఓంకారం అలా కాదు. భగవంతుని గూర్చిన వివిధ భావాలన్నీ దీనిలో కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి అందరూ ఓంకారాన్ని స్వీకరించవచ్చు.