ఒక విధ్వంసం పక్కా రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు వేదికయింది. ఒక కాల్పుల సంఘటన విపక్షాలకు, చివరకు రాష్ట్రంలో ప్రభుత్వ పక్షానికి కూడా నినాదం అయింది. ఓ నిండు ప్రాణం బలైపోవడం రాజకీయ ప్రాభవం పెంచుకునేందుకు వాహకంగా తయారయింది. ఇన్ని పరిణామాలకు, ఇంతగా రాజకీయ ప్రకంపనలకు కేంద్రంగా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు?
దక్షిణాదిలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్లలో, రైల్వే జంక్షన్లలో ఒకటైన.. నిత్యం లక్షల మంది ప్రయాణించే సికింద్రాబాద్ స్టేషన్‌లో ఓ మరక నమోదయింది. ఏనాడూ జరగని విధ్వంసం, కనీసం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అయితే, అది ఆగ్రహావేశాలతో పెల్లుబికిన విధ్వంసం కాదని, నిరుద్యోగులు సహనం కోల్పోయి చేసిన నిరసన ఎంతమాత్రం కాదని తర్వాత తేలిపోయింది. ఆర్మీలో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల ముసుగులో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి పక్కా ప్రణాళికతో చేసిన రణరంగమని పోలీసుల విచారణలో తెలుస్తోంది.
వారంతా సైన్యంలో చేరాలని కలలు కంటున్న వాళ్లు. దేశం కోసం సరిహద్దుల్లో గస్తీ కాయాల్సిన వాళ్లు. నిలువెల్లా దేశభక్తి నింపుకొని శత్రుదేశాల పీచమణచాల్సిన వాళ్లు. దేశ ప్రజలందరిలో ఆర్మీ పట్ల, సైన్యం పట్ల గౌరవభావం పెంపొందించాల్సిన వాళ్లు. కానీ ప్రజలను, ప్రయాణికులను వణికించారు. అందరిలోనూ భయం పుట్టించారు. వీళ్లు భవిష్యత్తులో సైన్యంలో చేరితే దేశాన్ని ఎలా రక్షిస్తారన్న సందేహాలను సృష్టించారు.
జూన్ 17.. శుక్రవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రశాంతంగా ఉంది. ప్లాట్‌ఫామ్‌లపై నాలుగైదు రైళ్లు వచ్చి ఆగాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు రైళ్లకోసం ఎదురు చూస్తున్నారు. అంతలో మూడో నెంబర్ గేటునుంచి ఒక్కొక్కరుగా యువకులు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారం మీదకు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే వందల మంది పోగయ్యారు. ఇంకొందరు రాత్రినుంచే ప్లాట్‌ఫామ్‌లపై ఉన్నారు. వాళ్ల దగ్గరున్న బ్యాగుల్లో ఇనుపరాడ్లు, పెట్రోల్ నింపిన సీసాలు ఉన్నాయి. అసలు రైల్వేస్టేషన్‌లోకి విధ్వంసకర వస్తువులు నిషేధం. కానీ పోలీసులు, ఆర్‌పీఎఫ్ బలగాల కళ్లు గప్పి ఆ మారణాయుధాలతో స్టేషన్‌లోకి ప్రవేశించారు. కోట్ల రూపాయల విలువైన రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వేస్టేషన్‌లో రణరం గాన్ని తలపించారు. ప్లాట్‌ఫామ్ మీద ఆగి ఉన్న రైలు బోగీలను తగులబెట్టారు. ప్రయాణికుల్లో వణుకు పుట్టించారు. ఊరెళ్లేందుకు వచ్చిన వాళ్లను బతుకు జీవుడా అంటూ పరుగులు తీసేలా చేశారు. ముందు స్టేషన్ బయటే కాసేపు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడే ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు. 9 గంటల సమయంలో స్టేషన్ లోపలికి దూసుకొచ్చి పట్టాలపై బైఠాయిం చారు. అనంతరం ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను తొలగించి, స్టేషన్‌లో నిలిపిన రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రైల్వే పార్సిల్ విభాగం వద్ద ఉన్న వస్తువులను తీసుకొచ్చి పట్టాలపై వేసి తగుల బెట్టారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు.
అప్పటిదాకా నిరసనకారుల పట్ల సంయమనం వహించిన ఆర్‌పీఎఫ్ బలగాలు చివరకు రంగంలోకి దిగక తప్పలేదు. ఎందుకంటే రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ట్రైన్ల ఇంజన్లలో భారీ ఎత్తున డీజిల్ నిల్వలు ఉన్నాయి. అలాగే, ట్రాక్‌లపైనా రైళ్ల ఇంజన్లలో నింపేందుకు ట్యాంకర్లలో పెద్ద ఎత్తున డీజిల్ ఉంది. ఒకవేళ ఇంజన్లకు గానీ, ఆ ట్యాంకర్లకు గానీ మంటలు వ్యాపిస్తే రైల్వేస్టేషన్ పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉండేది. చుట్టూ దాదాపు కిలోమీటర్ దాకా ఈ ప్రభావం ఉండేది. దీనిని గమనించిన భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ నిరుద్యోగి దుర్మరణం పాలయ్యాడు. మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వాళ్లందరినీ ఆర్‌పీఎఫ్ పోలీసులే స్ట్రెచర్‌లపై రైల్వేస్టేషన్ బయటకు తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. పోలీసుల కాల్పులతో నిరసనకారులు కాస్త వెనక్కి తగ్గారు. అప్పటిదాకా కొనసాగించిన దూకుడుకు ఫుల్‌స్టాప్ పెట్టారు. రైల్వేట్రాక్‌లపై బైఠాయించి శాంతియుత నిరసన వాదం ఎత్తు కున్నారు. సాయంత్రం దాకా పోలీసులు వాళ్లను చర్చలకు ఆహ్వానించినా ససేమిరా అన్నారు. ఆర్మీ అధికారులే తమ దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలని, అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కానీ, సాయంత్రం అవుతున్న కొద్దీ నిరసనకారుల్లో చాలామంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, పోలీసులు పూర్తిగా రైల్వేస్టేషన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకొని నిరసనకారులను అరెస్ట్ చేశారు.
పక్కా ప్రణాళికతోనే
ఈ పరిణామాలు గమనిస్తే ఈ విధ్వంసంలో రాజకీయ పార్టీల ప్రమేయం. ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, రాజకీయ వ్యూహకర్తల కనుసన్నల్లోనే ఇది సాగిందంటున్నారు విశ్లేషకులు. ఆర్మీ ఉద్యోగ ఆశావహులు వాట్సాప్ గ్రూపుల్లో ఈ సందేశాన్ని ముందుగానే ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. వాళ్లను రెచ్చగొట్టి పక్కా ప్లాన్‌తోనే సికింద్రాబాద్ స్టేషన్‌కు రప్పించి నిరసన కార్యక్రమాలు చేపట్టి అల్లర్లు చెలరేగేలా చేశారని అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అయితే, ఇంత విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అంతేకాదు, అసలు అగ్నిపథ్‌కు, ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా టీఆర్‌ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో సృష్టించిన విధ్వంసమని బీజేపీ నాయకులు మండిపడ్డారు.
రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యం
తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్.. ఇది సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పేమాట. టెక్నాలజీ వాడకంలోనూ హైదరాబాద్ పోలీసులకు అంతర్జా తీయ అవార్డులు వచ్చాయి. సీసీ కెమెరాలు హైదరా బాద్‌లో వీధికొకటి ఏర్పాటుచేశారు. చీమ చిటుక్కు మన్నా కనిపెట్టే సామర్థ్యం తమకు ఉందంటూ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు చెబుతూ ఉంటారు.
నిఘా పెట్టడంలో, టెక్నాలజీ వాడకంలో ముందుండే హైదరాబాద్ పోలీసుల కళ్లు గప్పి వందలాది మంది యువకులు రైల్వే స్టేషన్‌లోకి ఎలా వచ్చారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. విపక్షాలు ఆందోళనలకు పిలుపిస్తే .. రాత్రికి రాత్రే నేతలను అదుపులోనికి తీసుకుంటారు పోలీసులు. వాళ్ల ఫోన్లపై నిఘా పెట్టి ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసి పట్టేస్తారు. అలాంటిది ఇంతమంది యువకులు వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసుకుంటూ ఆందోళనకు ప్లాన్ చేసినా హైదరాబాద్ పోలీసులు ఎందుకు పసిగట్టలేక పోయారన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. ఆందోళనలు జరుగు తాయని తెలిసినా.. పోలీసులు కావాలనే నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ పెద్దల సూచనలతోనే పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించి విధ్వంసానికి పరోక్ష కారకులయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆందోళన కారులు రైల్వే స్టేషన్‌లోకి చొరబడి రైళ్లపై దాడులు చేస్తున్నా… దాదాపు గంట వరకు రాష్ట్ర పోలీసులు అక్కడికి రాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవ డంతోనే వారు రైల్వే స్టేషన్‌కి ఆల స్యంగా వచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిన కుట్రని అంటున్నారు.
భారీ కుట్రకు ప్రయత్నం
రాష్ట్రంలో ఇలాంటి తీవ్రమైన సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఉద్యోగాల కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. కానీ, విధ్వంసాలు జరగలేదు. ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ఈ తరహా అల్లర్లు జరగలేదు. విద్యార్థులు తమకు తాము నిప్పు అంటించుకున్నారు కానీ.. ఇలా ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగలేదు. ఇటీవల కాలంలోనూ ఉద్యోగాల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాని విధ్వంసానికి మాత్రం దిగలేదు. అలాంటిది ఆర్మీ ఉద్యోగాల కోసమంటూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ విధ్వంసానికి దిగడం పలు అనుమానాలకు తావి స్తోంది. దీని వెనుక పెద్ద కుట్రే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యూహం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తు న్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా దాడులు, అల్లర్లకు పీకే ప్రణాళికలు రచిస్తాడనే పేరుంది. ఏపీలో జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో జరిగిన తుని ఘటన, కోడికత్తి దాడి అందులోనే భాగ మంటారు. తునిలోనూ రైలును తగులబెట్టారు. సికింద్రాబాద్‌లోనూ రైళ్లను తగలబెట్టారు. తుని ఘటనకు, సికింద్రాబాద్ ఘటనకు పోలిక ఉందనే చర్చ వినిపిస్తోంది. ఇదే అంశం సోషల్ మీడియా లోనూ వైరల్ అవుతోంది.
- సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్