బుద్ధుని జీవిత విశేషాలతో ‘బుద్ధ ప్రదర్శన’ ప్రారంభం కావటం బర్మా సంఘ చరిత్రలో ఒక మైలురాయి. భగవాన్ బుద్ధుని 2500వ జన్మదిన ఉత్సవాల (1956) సందర్భంగా బర్మాలో జరిగిన 6వ ‘బౌద్ధ మహాసంగాయన్’లో ఏర్పాటైన ప్రదర్శన ఆహూతులతో పాటు దేశ నాయకులందరినీ ఆకర్షించింది.
దేశ ప్రధానమంత్రి ‘ఊనూ’తోపాటు అనేక ప్రముఖులు ఆ ప్రదర్శన తిలకించి సంతోషాన్ని వ్యక్తపరిచి సంఘ ప్రయత్నాన్ని కొనియాడారు. ఈ ప్రదర్శనను తమతమ ప్రదేశంలో ఏర్పాటు చేయవలసిందిగా ఆనేకచోట్ల నుండి ఆహ్వానాలు వచ్చేవి. తదనుగుణంగా దేశంలోని వివిధ ప్రదేశాలలో అవి ఏర్పాటవుతూ ఉన్నాయి. పది రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో బుద్ధుని జన్మస్థలం, తపోస్థలం, మొదటి దీక్షాస్థలం, మహాపరినిర్వాణ స్థలంతో పాటు ప్రముఖ చారిత్రక స్థలాల గురించి తెలుపుతూ బౌద్ధం భారత్ నుండి వివిధ దేశాలకు ఎలా విస్తరించిన తీరును వివరిస్తుంది. ఇందుకోసం ఆసియా ఖండం ‘మాన చిత్రం’ నేలపై వేసేవారు. చక్కగా కనబడేందుకు ఇటుకలతో వివిధ దేశాల భౌగోళిక చిత్రాలను రూపొందించి వాటిలో మట్టిని నింపి, రంగులతో వివిధ దేశాలను గుర్తించేవారు. పర్వతాలు ఉన్నచోట్ల పర్వతాలు, సముద్రం ఉన్న చోట నీటిని నింపేవారు. మాన చిత్రంపై వివిధ ప్రదేశాలను గుర్తించడానికి విద్యుత్తు దీపాలను ఏర్పాటుచేసి ఆ ప్రదేశం పేరు చెప్పినపుడు ఆ దీపం వెలిగేలా ఏర్పాటు చేయడం ఆహూతులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండేది.
బర్మా దేశంలోని శ్వేడగాన్ పగోడా అత్యంత ప్రాచీనతతో పాటు, ప్రముఖమైనది. 1975 సంవత్సరంలో బౌద్ధ ప్రదర్శన అక్కడే జరిగింది. దానినిన చూడడానికి మిలిటరీ అధికారులు వచ్చారు. తదనంతరం శ్రీరాం ప్రకాశ్ ధీర్‌జీను ఇంటలిజెన్స్ అధికారులు తమ కార్యాల యానికి పిలిపించుకుని ఒక దినమంతా ప్రదర్శన గురించి వాకబు చేశారు. తమకు, అధికారులకు ఆ ప్రదర్శన నచ్చిందని, తాము నిర్ణయించిన స్థలాల్లో దీనిని ఏర్పాటు చేయాలని కోరగా ధీర్‌జీ సమ్మతిం చారు. ఇలా సనాతన ధర్మ స్వయంసేవక్ సంఘ్ గడచిన 72 సంవత్సరాలుగా హిందూ సమాజ ఐక్యతకు, ఉన్నతికి పాటుపడుతూ బౌద్ధ సమాజంతో సమన్వయాన్ని సాధిస్తూ తన 75వ వసంతాలవైపు అడుగులు వేస్తోంది.
ఇతిశం…
బర్మాలోని వేర్పాటువాద కేంద్రాల గురించి చెప్పి అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోరగా, ధీర్‌జీ అత్యంత ధైర్య సాహసాలతో నిర్వహించారు. అక్కడి వేర్పాటువాదులు అనేకసార్లు ఉదయం సాధారణ ప్రజల రూపంలో వచ్చి, రాత్రి తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతూ తుపాకులతో వచ్చి కూర్చునేవారు. ధీర్‌జీ అంతే ధైర్యంతో వారికి బుద్ధుని గురించి, ఆయన బోధనల గురించి వివరించేవారు. ఈ బౌద్ధ ప్రదర్శ నలో పెద్ద మొత్తంలో విరాళాల రూపంలో ధనం వచ్చేది. ప్రదర్శన నిర్వహణ ఖర్చు పోనూ మిగతా ధనాన్ని స్థానిక బౌద్ధ మందిరానికో, ఆరామానికో విరాళంగా ఇచ్చేవారు. సంఘం ధనాభావంతో ఉన్న రోజులలో కూడా దాన రూపంలో వచ్చిన డబ్బును సంఘం కొరకు ఉపయో గించకపోవటం గమనార్హం. ఇప్పటికీ నిర్వహిస్తున్న ఈ బౌద్ధ ప్రదర్శనల పట్ల ప్రజల ఆకర్షణ తగ్గకపోగా హిందూ సమాజం పట్ల గౌరవ భావనలు ఏర్పడ్డాయి.
సేవా రంగంలో సంఘం
సంఘ స్వయంసేవకులు ఎక్కడ ఉన్నా సేవా కార్యక్రమాలలో పాల్గొంటుండం కద్దు. అవి ప్రకృతి వైపరీత్యాలైనా లేదా సాధారణ పరిస్థితులలో సమాజోన్నతి కోసమైనా సరే స్వయంసేవకులు సహజంగా పాల్గొంటూ తమవంతు సహకారం అందిస్తుంటారు. స్వయంసేవకులలో సహజంగా ఉండే ఈ సేవాభావం వల్లే సమాజానికి ఇంకా దగ్గరవుతుంటారు. మయన్మార్‌లో కూడా స్వయం సేవకులు ప్రారంభం నుండి దేశానికి ఎటువంటి ఆపద కలిగినా అది తమ కష్టం అన్నట్లుగా స్పందించి పనిచేశారు. 1957, 58లో శ్వేనో, మనెనా పట్టణంలో జరిగిన అగ్నికాండ, 1981, 1984లలో మాండలే నగరంలో సంభవించిన భీషణ అగ్ని కాండలో సగం మాండలే నగరం భస్మం అయిన సందర్భంలో కానీ, 2008లో మయన్మార్ దక్షిణతీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన నర్గీస్ పెను తుఫాను సందర్భంలో గానీ స్వయంసేవకులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్గీస్ తుఫాన్‌లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలలకు రంగూన్‌లో ఒక ఆవాసం ఏర్పాటు చేశారు. 2016లో ‘బగో’ నదికి వరదలు వచ్చిన సమయంలో స్వయంసేవకులు బాధితులను కాపాడడంతో పాటు వారికి కావలసిన నిత్యావసర వస్తువులను, రోగాల బారిన పడకుండా మందులను పంపిణీ చేశారు. 2017లో రఖై రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో రోహింగ్యా ముస్లింలు స్థానిక బెంగాలీ హిందువులను ఊచకోత కోశారు. 200 మందిని చంపి గుంతల్లో పూడ్చి పెట్టారు. స్త్రీలను అపహరించి బంగ్లాదేశ్‌కు తీసుకుపోయారు. ముస్లింల దాడికి భయపడి ప్రాణాలు చేతిలో పెట్టుకుని సుమారు 15వేల మంది హిందువులు తమ స్థలాల నుండి రాజధాని సిట్వే నగరానికి చేరుకున్నారు. వారందరని ఓదారుస్తూ, తమ కాళ్లపై తాము నిలబడేవరకు వారికి కావలసిన ఏర్పాట్లను స్వయంసేవకులు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సంఘ ప్రయత్నంతో బంగ్లాదేశ్‌కు తరలించిన హిందూ స్త్రీలను తిరిగి మయన్మార్‌కు రప్పించడంతో ఆనాడు రోహింగ్యాలనే ముస్లింలు చేసిన ఆకృత్యాలు ప్రపంచానికి అర్థమయ్యాయి.
చైనా నుండి ప్రారంభమై, ప్రపంచం అతలా కుతలం చేసిన కరోనా మహమ్మారి భూతం మయన్మార్‌నూ వణికించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో స్వయంసేవకులు ఆక్సిజన్ సిలెండర్ల ఏర్పాటుతో పాటు, ఆస్పత్రులకు కావలసిన మందులను ఇవ్వటం, క్వారంటైన్ సెంటర్లలోని వారికి 50 వేల భోజనాల ఏర్పాటు, 2500 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కరోనా రెండవ విడత సమయంలో దేశ అంతర్గత కారణంగా వైద్యులు పనిచేయక, ఆస్పత్రులు ఎత్తివేసినపుడు యోగా తరగతులు నిర్వహిస్తూ, భారత్ నుండి తెప్పించిన ఆయుర్వేద మందులతో వందలాది రోగులను బ్రతికించుకోవటంలో ముందుండి పనిచేశారు.
ప్రాకృతిక విపత్తుల సమయంలోనే కాకుండా సాధారణ పరిస్థితులలో కూడా సమాజ వికాసం కోసం స్వయంసేవకులు పనిచేస్తూ ఉండటం కద్దు. ప్రముఖంగా విద్యా రంగంలో, అనాథ, పేద విద్యార్థు లకు ఆవాసాలు నిర్మించటంలో, వ్యక్తులలో సేవాభావం పెంచేందుకు సంఘం నిరంతరం పనిచేస్తూ ఉంది. 1963లో స్థానిక నాగాజాతి బాలల కోసం ప్రారంభమైన ఒక ఆవాసాన్ని ఆ మరుసటి సంవత్సరం (1964)లో సైనిక పాలకులు జాతీయం చేయడంతో ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోయింది. 1972లో హిందూ బాలల కోసం ఒక పాఠశాలతో పాటు ఆవాసం ప్రారంభమై సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోని ఈనాటి మానవ సమాజం ఎదుర్కొం టున్న అనేక సమస్యలకు పరిష్కారంగా యోగా ఒక మాధ్యమంగా వచ్చింది. మయన్మార్‌లో కూడా ప్రజలు యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ సందర్భంలో చక్కని యోగా శిక్షకులు తయారవ్వటం అవసరమని గుర్తించి 2017లో భాగయ్య ద్వారా పంచవటి యోగా కేంద్రానికి శంకుస్థాపన జరిగి 2019 నాటికి భవనం సిద్ధమైంది. అనేక సేవా కార్యక్రమాలలో స్వయంసేవకులు పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు ఏర్పాటవు తున్నాయి. ఏటా శాఖలలో జరిగే సేవాదిన్ కార్యక్ర మాలలో.. దేవాలయాలు, ప్రభుత్వ వైద్యశాలల, శ్మశానవాటికల శుభ్రత, మొక్కల పెంపకం లాంటివి వాటిలో స్వయంసేవకులు పాలుపంచుకుంటున్నారు.
మాతృభాషా వికాసంలో సంఘము
భాషతోనే భావన, భాష వల్లనే సంస్కృతి విలసిల్లు తుంది. ఇతర దేశాలలోని బాలబాలికలు చదువు ఆయా దేశ భాషలలో ఉంటుంది. ముఖ్యంగా మయన్మార్‌లోనైతే పూర్తిగా బర్మీస్ భాషలలోనే విద్యాబోధన జరుగుతోంది. సమాజ వ్యవహారాలు కూడా బర్మీస్ భాషనే ఉండటంతో హిందూ బాలబాలికలు, చిన్న వయస్సులోనే మాతృభాషకు దూరమవుతూ, నెమ్మదిగా విదేశీ సంస్కృతికి దగ్గరై మన హైందవ మూలాలను మరచిపోతుంటారు. ఈ పరిస్థితిని నివారించడానికి, మాతృభాషా వికాసానికి సంఘం 1972 నుంచి కృషిని ప్రారంభించింది. ముఖ్యంగా వేసవి సెలవులలో బాలబాలికలకు మాతృభాషా పాఠశాలలు నిర్వహిస్తుంటారు. హిందీ భాష మాట్లాడే వారుండే సుమారు 100 గ్రామాలలో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి. అలాగే తమిళ గ్రామాలలో కూడా ఇటువంటి పాఠశాలలు ప్రారంభమయ్యాయి.
రక్షాబంధన్ ద్వారా ప్రబోధం
సంఘంలో ప్రముఖంగా ఆరు జరుపుకుంటున్నా, రక్షాబంధన్ ఒక సామాజిక, ఓ సౌభ్రాతృత్వ ఉత్సవంలా వికసించింది. రక్షాబంధన్ సందర్భంగా జరిగే ఉత్సవంలో ప్రభుత్వంలోని ప్రముఖులు పాల్గొంటుంటారు. రిలీజియస్ మినిష్టర్, భారత్‌లోని ఎంబాసిడర్‌లు దాదాపు ప్రతి సంవత్సరం పాల్గొంటుంటారు. 2020లో 2014 మాధ్యమంగా జరిగిన కార్యక్రమంలో వారు తమ సందేశాలను అందజేశారు. ఆ ఏడాది రక్షాబంధన్ సందర్భంగా రక్ష కడుతూ స్వయంసేవకులు సుమారు 25వేల ఇళ్లకు రక్షాబంధన్ సందేశాన్ని అందజేశారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లు, ఫైర్ స్టేషన్‌లలో కూడా రక్షాబంధన్ కార్యక్రమాలు జరుగుతుంటాయి.
హిందూ బౌద్ధ సమన్వయ సాధనలో సంఘము
సంఘ కార్యక్రమాలు ప్రముఖంగా హిందువులకే పరిమితమైనా హిందూ, బౌద్ధ సమన్వయ సాధనలో ప్రారంభం నుండే పనిచేస్తుంది. బౌద్ధ ప్రదర్శన కార్యక్రమాల ద్వారా బౌద్ధ సమాజానికి అత్యంత దగ్గరయ్యే ప్రయత్నం సంఘం చేస్తూనే ఉంది. అంతేకాకుండా వాజో (వాసో) మాసంలో (ఇది మన ఆషాఢ, శ్రావణంలో వస్తుంటుంది) బౌద్ధ భిక్షువులకు జరిపే అన్న, వస్త్రదాన కార్యక్రమాలు హిందువుల, బౌద్ధుల మైత్రికి సోపానాలు.
– బండి జగన్మోహన్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, విశ్వవిభాగ్