సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి – 13 జూన్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


హిందూత్వం మీద, భారతదేశం మీద, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ప్రకటించడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయా? ఇలాంటి ప్రతికూలత, ఇలాంటి వాతావరణం మన దేశం ఎన్నడూ చూడనిది కాదు. కానీ ఇలాంటి నిరసనను చూడడం మాత్రం ఇప్పుడే. బీజేపీ అధికార ప్రతినిధులు నుపూర్‌ ‌శర్మ, నవీన్‌ ‌జిందాల్‌ ‌ప్రవక్త మహమ్మద్‌ ‌పట్ల దైవదూషణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇప్పుడు అరబ్‌ ‌దేశాలతోపాటు, చాలా ముస్లిం సమాజాలు భారతదేశాన్ని ఒక్కసారిగా పరమ శత్రువుల జాబితాలో చేర్చాయి. ఇక భారత ప్రతిపక్షాల సంగతి చెప్పక్కరలేదు. వాటిది పాతపాటే.

ప్రవక్త మీద ఏ విధమైన ప్రతికూల వ్యాఖ్యలు చేసినా ముస్లిం సమాజం తీవ్రంగానే స్పందిస్తుంది. ఈ విషయంలో ఆ వర్గం మనోభావాలను అర్థం చేసుకోవాలి కూడా. అర్థం చేసుకున్నది కాబట్టే పార్టీలో ఎంతో కీలకంగా ఉన్న ఆ ఇద్దరు అధికార ప్రతినిధులను బీజేపీ బహిష్కరించింది. ఈ నిర్ణయాన్ని కొన్ని ముస్లిం దేశాలు హర్షించాయి కూడా. ఇక్కడే కొన్ని అర్థంకాని అంశాలు, జవాబు దొరకవలసిన ప్రశ్నలు ఉన్నాయి.

నుపూర్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఆమె సొంతం కాదనీ, గతంలో జాకీర్‌ ‌నాయక్‌ ‌వంటివారు వెల్లడించినవేనని ఒక వాదన ఉంది. వృత్తి చేత న్యాయవాది అయిన ఈ పార్టీ అధికార ప్రతినిధికి ఏది దైవ దూషణో తెలియదని అనుకోలేం. కానీ వివాదం వచ్చింది కాబట్టి ఆ అధికార ప్రతినిధిని సమర్థించకుండా, మొండిగా వాదించకుండా బీజేపీ తొలగించింది. ఈ వాస్తవాలను ప్రపంచం ఎందుకు గుర్తించడం లేదు? వివాదాన్ని అంతర్జాతీయం చేయడం ఎందుకు? హిందువులకు ఆధిక్యభావం ఉన్నదంటూ, మైనారిటీలను అణచివేస్తున్నారంటూ అబద్ధాలు ప్రచారం చేసే అంతర్జాతీయ సంస్థలకు కనిపించని చాలా అంశాలు కూడా ఉన్నాయి. జ్ఞాన్‌వాపి మసీదు వివాదంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ఎం‌త హుందాగా తమ వైఖరిని వెల్లడించారో ఇంతలోనే ముస్లిం దేశాలు మరచిపోయాయా? 40,000 మసీదులు మా ఆలయాలను కూల్చి కట్టినవేనని హిందువులు గట్టిగా వాదిస్తున్న తరుణంలో, ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకవద్దని సర్‌సంఘచాలక్‌ ‌చెప్పిన హితవు గుర్తుకు రాదేమి? కశ్మీర్‌లో మే మాసంలోనే తొమ్మిదిమంది హిందువులను వెంటాడి మరీ కాల్చి చంపారు ముస్లిం ఉగ్రవాదులు. జూన్‌ 6‌వ తేదీన ఒక ఆలయాన్ని ముస్లిం మతోన్మాదులు ధ్వంసం చేశారు. ఇది దైవ దూషణ కిందకు రాదా? లేకపోతే అసలు హిందూ దేవుళ్లను ఎంత నీచంగా తిట్టినా ప్రపంచం దానిని దైవదూషణగా పరిగణించదా? హిందూ ఆధ్యాత్మిక చింతనలో విగ్రహారాధన ఉంటుంది. ఎప్పుడో జరిగిన చరిత్రలోనే కాదు, ఇటీవలి కాలంలో కూడా ఎన్ని హిందూ గుడులను, దేవుళ్ల విగ్రహాలను ఉన్మాదులు అపవిత్రం చేశారో ప్రపంచానికి తెలియదా? ముస్లిం దురాక్రమణదారుల అపచారాలకు అద్దం పడుతూ దేశం నలుమూలలా ఆలయాలు కనిపించే మాట నిజం కాదా? అంటే ఎన్ని లక్షల దైవదూషణలు?

కువైట్‌, ‌కతార్‌, ఇరాన్‌ ‌భారత దౌత్యవేత్తలను పిలిచి బీజేపీ అధికార ప్రతినిధి మాటలకు నిరసన చెప్పాయి. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ‌జోర్డాన్‌, ‌బెహ్రెయిన్‌, ‌మాల్దీవ్స్, ఒమన్‌, అఫ్ఘానిస్తాన్‌ ‌వెంటవెంటనే రంగంలోకి దిగిపోయాయి. కువైట్‌ ‌తన మార్కెట్ల నుంచి భారతీయ ఉత్పత్తులను వెంటనే ఉపసంహరించింది. 57 దేశాల ఇస్లామిక్‌ ‌రాజ్యాల కూటమి, పాకిస్తాన్‌ ‌కలసి విమర్శలు గుప్పించినపుడు మన విదేశ వ్యవహారాల అధికార ప్రతినిధి దీటుగానే స్పందించారు. భారత్‌ అన్ని మతాల పట్ల సమాన గౌరవంతో ఉందని ఆయన చెప్పవలసి వచ్చింది. భారత ప్రభుత్వం లక్ష్యం విభజన, వివక్ష కానేకాదని స్పష్టం చేయవలసి వచ్చింది. ఆయా దేశాలలో, చాలా పాశ్చాత్య దేశాలలో హిందూ దేవతామూర్తుల బొమ్మలను చెప్పుల మీద ముద్రించినపుడు భారత్‌ ఎం‌త గొంతు చించుకున్నా ఎవరూ మద్దతు ఇవ్వలేదు. అది న్యాయమా? హిందూ దేవుళ్లను అవమానించడం, వారి మనోభావాలను గాయపరచడం ముస్లిం మతోన్మాదుల హక్కుగా ప్రపంచం భావిస్తోంది.

కొందరు విజ్ఞులు అంచనా వేస్తున్నట్టు ముస్లిం దేశాల ఆగ్రహం ప్రేరేపితమేనని నమ్మక తప్పదు. వారి మనోభావాలను గౌరవిస్తూనే, ఎవరో ప్రేరేపిస్తే, తాము సమున్నతంగా చూసే మత భావనలను దుర్వినియోగం చేయడానికి సిద్ధపడడం ఆ దేశాలకు వాంఛనీయం కాదని చెప్పక తప్పదు. ఎందుకంటే భారతదేశంలో చాలామంది ముస్లిం మతోన్మాదులు చేస్తున్న పని అదే. జ్ఞాన్‌వాపి మసీదులో వజూఖానాలో శివలింగం ఉన్నట్టు గుర్తించారు. అంటే నమాజ్‌కు వెళ్లే ముందు కాళ్లూ చేతులూ కడుక్కునే స్థలం. అక్కడ శివలింగం ఉండడం హిందువుల మనోభావాలను ఎంతగా గాయపరచి ఉంటుందో తెలుసుకోరేమి? కానీ అది ఫౌంటేన్‌ అని అసదుద్దీన్‌ ‌వంటి కపట మైనారిటీ నాయకుడి వివరణ. నుపూర్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ ఇప్పటికే చాలామంది రోడ్డెక్కారు. దైవదూషణ అనేది ఎక్కడైనా ఏ మతానికైనా ఒక్కటే అని నమ్మితే ఇలాంటి అరెస్టులు ఇంకా చాలా జరగవలసి ఉందన్న సంగతిని అంగీకరించాలి. హిందూ దేవతలు ఎవరికి పుట్టినవాళ్లు అంటూ పరమ నీచమైన వ్యాఖ్య చేసిన పార్టీ మనుషులు కూడా భారతదేశంలో పరమత అసహనం పెట్రేగి పోతున్నదంటూ ఊగిపోతున్నారు. లక్ష్మీదేవి ఎవరికి పుట్టిందంటూ వాగిన అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్య, నిన్నగాక మొన్న ఓ ఊరేగింపులో కృష్ణుడినీ, నటరాజస్వామి భంగిమనీ పరమ నీచంగా నడిరోడ్డు మీదే తిట్టిన ఆ డీఎంకే కార్యకర్తలు చేసింది దైవదూషణేనన్న సంగతి విస్మరించవద్దు.

About Author

By editor

Twitter
YOUTUBE