‘పూర్ణ’ది పేరుకు తగిన తీరు. ఇరవై రెండేళ్ల ఈ అమ్మాయిది ఖండాంతర ఖ్యాతి. ‘సమస్త శక్తీ నిండి ఉన్నది’ అని తన పేరుకు అర్థం. సంపూర్ణం, పరిపూర్ణం అనేవి అందరికీ తెలిసిన అర్థాలు. ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిన అంశాలెన్నో తనలో ఇంకా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా గర్వపడేంత అపార అపూర్వ అపురూప శక్తి సామర్థ్యాలవి. అందుకే పూర్ణ ఓ పతాక శీర్షిక పర్వతారోహణ రంగాన భారత కీర్తిపతాకను శిఖరస్థాయికి చేర్చిన మహిళామణి దీపిక. నిజామాబాద్ యువతి మలావత్ పూర్ణ పేరు ప్రఖ్యాతులు ఒక్క మన దేశంలోనే కాదు; ఆసియా ఖండంలో మాత్రమే కాదు; ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలన్నింటా మారు మోగుతున్నాయి. ఏడు ఖండాల్లోని పర్వతాల అధిరోహకురాలిగా ఈమె సృష్టించిన రికార్డుల పరంపర చరిత్రాత్మకం; సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన మహా అధ్యాయం!
ఎవరెస్ట్, కిలిమంజారో, విన్సన్, డెనాలీ, ఎల్‌బ్రస్ కార్టెన్జ్‌పిరమిడ్, అక్రోన్ కగువా.. వీటి పేర్లన్నీ కాకున్నా తొలి రెండూ మనం వినే ఉంటాం. ఎవరెస్ట్ పర్వతం ఆసియాలో, కిలిమంజారో ఆఫ్రికా ఖండంలో ఉన్నాయనీ చెప్పగలం. వీటితో కలిపి మొత్తం ఏడు ఖండాల్లోని, ఏడు శిఖరాలనూ అధిరోహించిన నారీ రత్నం ఎవరో తెలుసా? పూర్ణ. ఎవరెస్ట్‌తో ఆరంభించిన ఆరోహణ క్రీడా పక్రియను ఈ మధ్య-డెనాలీ (అమెరికాలోని అలస్కా ప్రాంతంలో ఉన్న వేలాది అడుగుల పర్వత శిఖరం)తో ముగించి ప్రపంచ ప్రజలందరితోనూ ‘ఔరా’ అనిపించింది. తెంగాణకు చెందిన ఈ అమ్మాయి ఆంధప్రదేశ్ సహ ఇతర రాష్ట్రాలన్నింటా, దేశ విదేశాల్లోని తెలుగువారి మనోమందిరాలంతటా ఈ పేరే. సిరికొండలో పుట్టి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి, సాహసాలను స్పృజించిన ధీరనాయిక. రికార్డులు సృష్టించడమన్నది తనకు వెన్నతో పెట్టిన విద్య. మరిన్ని ఉదాహరణలు కావాలా?
- అప్పుడు ఈమెకు 14 ఏళ్ళు తాడ్వాయి బడిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని. వ్యవసాయ కుటుంబం. పలు సంస్థల స్ఫూర్తితో శిఖరారోపణపై ఆసక్తిని, ఆశక్తినీ పెంచుకుంది. అత్యంత కఠినమైన శిక్షణను ఎంతో మక్కువతో మరీ పూర్తి చేసింది. పెద్దలందరి తోడ్పాటూ, ఉత్సాహ ప్రోత్సాహా లన్నీ జతకూడి నేపాల్ చేరుకుంది. అక్కడే ఎవరెస్ట్ అధిరోహణ. ఎంతో చిన్న వయసులో అత్యంత పెద్ద లక్ష్యం చేరిక. నిర్ణీత సమయం కన్నా ముందుగానే శిఖరాగ్రాన నిలిచి మువ్వన్నెల భారత పతాకను విజయగర్వంతో ఎగురవేసింది పూర్ణ. జాతీయ గీతాలాపనతో సమస్త ప్రజానీకం చేత జయహో అనిపించుకుందీ మేటి.
అటు తర్వాత 2016, 2017, 2019, 2022 సంవత్సరాల్లో అన్నీ ఘనాఘనా విజయాలే. రోజుల తరబడి, నెలల పర్యంతం శిఖరారోహణయాత్ర సాగించడం పూర్ణకు అలవాటుగా మారింది. ఎటు చూస్తే అటు చుట్టూరా ఆవరించిన మంచు, రక్తాన్ని ఒక ఉదుటన గడ్డ కట్టించేంతగా వణికించే చలి, అనుకోని పరిణామాలు, పలు రకాల సందేహాలు, సమస్యలూ… వీటన్నింటినీ అధిగమించటం; పర్వత శిఖరాలను అధిరోహించడం సహజ సిద్ధంగా అలవడింది. అసలు పర్వతారోహణ అంటే మాటలా? ప్రాణాలకు తెగించి, చేసే నిరంతర సాహసోపేత విన్యాసం. ఎందరు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. ఎన్నెన్ని పుస్తకాలైనా రాయవచ్చు. నానా విధాల ఆలోచనలూ చేయవచ్చు. ఒక్క పని చేసినప్పుడే తెలుస్తుంది సత్తా! అందునా ఎంతెంతో ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరడం, పైభాగాన నిలిచి విజయహాసం చేయడం పూర్ణకే చెల్లింది. పట్టుమని పాతికేళ్ళయినా లేని యువతి, చిన్నప్పటి నుంచీ సాహసాలే ప్రవృత్తిగా కలిగిన పడతి నాడూ నేడూ కూడా ఆ ఘనతలోనే కొనసాగుతోంది. నిజానికిది ఎవరి ఊహకైనా అందని జీవితాంశం. ఊహనే వాస్తవంగా మలచుకున్న ఈమెకివి సర్వ సాధారణం.
‘పూర్ణ ఒక అసాధారణ’ అంటున్నారు ప్రధాన శిక్షకుడు శేఖర్ చాబు. ‘ఆమె రణోత్సహి. జీవన సమరం తనకొక క్రీడ’ అని చెప్తున్నారు సంబంధిత గురుకుల వ్యవస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్. వీరికితోడు ఆమె గురువులు, సహధ్యాయులు సైతం పూర్ణను విలక్షణ శక్తిగా భావిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యమేముందీ? సంకల్ప బలం ముందు శిఖరాగ్రాలైనా తలవంచాల్సిందే కదా! పాఠశాల దశలోనైనా, ఇప్పుడైనా తనలో దీక్షాదక్షతలు వెల్లివిరుస్తూ వస్తున్నాయి. మొట్టమొదట ఎవరెస్ట్ అధిరోహించిన సందర్భంలో ‘ఇక్కడి నుంచి (శిఖారాగ్రం) చూస్తుంటే ఈ ప్రపంచమంతా చాలా చిన్నదిగా కనిపిస్తోంది’ అందామె. నిజమే. సాధకుల ముందు ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్నదిగానే మారి పోతుంది. చిన్నపిల్ల అయినా ఆ ఒక్క వాక్యమూ ఎంతెంతో పెద్దరికాన్ని పరిపూర్ణత్వాన్ని వెల్లడిస్తోంది. మీరేమంటారు?
జైత్ర యాత్రికురాలు
అమ్మా నాన్న రైతు కూలీలు. కాయకష్టం చేసుకునే అతి సాధారణ వ్యక్తులు. ఇవన్నీ పైకి కనిపించేవైతే, అంతర్లీనంగా వారిద్దరూ ఆశయాల చక్రవర్తులు. బిడ్డల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దిన ఆదర్శాల శ్రీమంతులు. సోదరుడూ పూర్ణకెప్పుడూ అండదండ. ఐదో తరగతి దాకా తన ఊళ్ళోనే చదివిందా అమ్మాయి. ఆ తర్వాత ఇంటర్ వరకు గురుకుల విద్యాలయంలో చదువుకుంది. కామారెడ్డిలో పట్టభద్రురాలైంది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. బాల్యం గురించి అడిగితే బహు మక్కువగా బదులిస్తుంది. కొండలూ గుట్టలున్న ప్రాంతమే తన స్వస్థలం. నడక తొలి నుంచీ ఉన్నదే. తాడ్వాయిలో చదువుకుంటున్పప్పుడు, పర్వతా రోహణ శాస్త్రీయ వివరాలన్నీ తెలుసుకుంది. తగినంత శిక్షణనిచ్చే భువనగిరి కేంద్రానికి ఎంపికైంది. అనంతర సమగ్ర శిక్షణను లడఖ్ సంస్థ నుంచి పొందింది. సంవత్సరమైనా తిరక్కుండానే ఎవరెస్ట్ పర్వతారోహక బృందంలో స్థానం సాధించుకుంది. అప్పుడు ఆరంభమైన జైత్రయాత్ర ఇప్పటికీ దిగ్విజయ రీతిన సాగుతోంది. ఎనిమిదేళ్ళ కాలవ్యవధిలో ఏడు మహాశిఖరాల అధిరోహణ స్వప్నాన్ని సాకారం చేసుకుంది పూర్ణ. ‘పిన్న వయస్కురాలు – పెద్ద లక్ష్యాల సాధకురాలు’ అంటూ అభినందనలందిస్తే వినమ్రంగా నవ్వుతుంది. జాతి సగర్వానికి మూలకారకమైన మధురహాసమది.
విశ్వ కథానాయిక
ప్రపంచ స్థాయిలో పేరొందిన ‘సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్’ను మీరు వినే ఉంటారు. ఆ సవాలును స్వీకరించి పరిపూర్తి చేసిన నారీరత్నం పూర్ణ. తన సాహసయాత్రకు సర్వవిధాలా సహాయ సహకారా లందించిన హైదరాబాద్ సంస్థకు సదా రుణపడి ఉంటానంది. నిరుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి మాట్లాడినప్పుడు భవిష్యత్ ప్రణాళిక వివరాలడిగారు. ‘మరింత ముందుకు ఉన్నతికి వెళ్లడమే’ అని సమాధానమివ్వడం ఆమె ఆత్మవిశ్వాస సూచిక. గట్టి పట్టుదల, నిత్య అంకిత భావం, ఎడతెగని పోరాట పటిమే తనతో అద్భుతాలు చేయించాయి, చేయిస్తున్నాయి. అందుకనే ‘పూర్ణ’ పేరిట ఇప్పటికే పుస్తకం వెలువడింది. బయోపిక్ చలనచిత్రం నిర్మితమైంది. అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ వస్తున్నందుకు అభివాదాల ధారాపాతం నేటికీ కురుస్తూనే ఉంది. క్రీడాంశాల పరంగా పర్వతారోహణది ప్రత్యేక స్థానం. ఉపరితలం పైన భూస్వరూప రీత్యా, కొండకన్నా పర్వతం మిన్న అని అందరికీ తెలుసు. రెండువేల అడుగుల ఎత్తున ఉన్నదాన్నే పర్వత ప్రాంతంగా పరిగణిస్తున్నప్పుడు, ఇరవైవేల అడుగులకు పైగా అధిరోహణ ఎంత అద్భుతమో వేరే చెప్పాలా? హిమాలయ, వింధ్య,ఆరావళాది పర్వతాల పేర్లు వినడమేకానీ చూసిన వారెందరు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాటిలో కొన్నింటి శిఖరాగ్రాలకైనా చేరగలిగేది ఎంతమంది? ఎందరెందరికో కలగా మిగిలిన పర్వతారోహణను నిజం చేయగలిగిన సత్తా, సత్తువ ఉన్నందునే పూర్ణ విశ్వ కథానాయకురాలైంది. ఎన్నెన్నో ప్రశ్నలకు ఏకైక సమాధానంగా నిలచి పేరును సార్థకం చేసుకుంటోంది. తిప్ప, గుట్ట, కొండ… వాటిని మించిన పర్వతం పలు సంపదల నిలయం. వనమూలికలైనా జీవనదులైనా అక్కడే. అరణ్యాల నిలయమైనా ఖనిజాల నెలవైనా అదే. విహార, వికాస, విజ్ఞానాల ఆలవాలమే కదా పర్వతమంటే! ఆ శిఖర ఆరోహణను జీవనకృత్యంగా చేసుకున్న పూర్ణ అక్కడే భరతజాతి పతాకాన్ని రెపరెపలాడించటం విశ్వమంతటికీ అభినందనీయం.
క్రీడాప్రపూర్ణ
కాంచనగంగ, నందదేవి, బదరీనాథ్, త్రిశూల.. ఇలా భారతీయత ్టపడే శిఖరాలు ఇంకెన్నో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తున గల ఎవరెస్ట్‌ను సాగరమాత, గౌరీశంకర శిఖరంగానూ పిలిచేవారున్నారు. ఇరవై తొమ్మిదివేల అడుగులకు మించి ఎత్తునుంది. ఇతర ఖండాల్లోని పర్వతాల పైకీ చేరి గెలుపు బావుటా చేపట్టిన తెలుగు అతివ పూర్ణ గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఆమెది నిస్సందేహంగా అద్భుత చరిత్ర, రికార్డులను బద్దలుకొట్టిన భారతీయతా ఘనత. ఎనిమిదేళ్ల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించి అభివర్ణించినట్లు – శాశ్వత కథానాయిక పూర్ణ. జాతీయ స్థాయిలోనూ నేతల ప్రశంసలందుకున్న ఈ పర్వతారోహక ప్రముఖురాలు జాతిజనుల ఆశాదీపం,కాంతి తోరణం. వయసులో పిన్న, ఘనతలో మిన్న. అన్ని రంగాలలోనూ (విద్య, క్రీడలు, నిర్వహణ, సాహసయాత్ర) శిఖర సమానురాలైన పూర్ణ ఒకే ఒక్క మాటలో – పరిపూర్ణ!
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్