జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్ 12) హిందూసామ్రాజ్య దినోత్సవం
మనకు విశేష ప్రేరణ ఇచ్చేదిగా హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పరిగణిస్తాం. ఒకానొకప్పుడు ఈ పవిత్రదేశంలో పరాయి వ్యక్తులు తమ రాజ్యాలను స్థాపించి, ఈ భూమి సంతానాన్ని దాస్యంలోకి నెట్టివేశారు. ఆనాటి నుంచి నిరంతర పరాజయాల మధ్యనే, అప్పుడప్పుడు మన పౌరుషం తలెత్తి, పరాక్రమాన్ని ప్రదర్శించి విజయాలనూ సాధించాం కూడా. కానీ ఆ విజయాలకు సుస్థిర రూపం కల్పించి ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నిర్మించలేకపోయాం.
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి మన చరిత్రలో అత్యంత పవిత్రదినం. హిందూరాష్ట్ర పునరుత్థాన సూచకమైన ఒక భవ్య ప్రయత్నం మొన్న మొన్న సాఫల్యాన్ని సాధించింది. ఈ మూడువందల సంవత్సరాలలో ఆ మహోత్సవపు స్మృతి దినదినమూ మరింత శోభాయమానమౌతూ వచ్చిందంటే ఆ ఖ్యాతి ఈ పుణ్యదినానిదేనని నా అభిప్రాయం. కాబట్టి ఆ విశిష్టమైన రోజుకు ఉన్న ఘనతను గురించి సరిగ్గా అవగాహన చేసుకోవడం మనకు ప్రయోజనకరం.
మన జాతీయ జీవనధార గురించిన పరిచయం, అవగాహన కొన్ని మాటలతో కలిగిం చడం సాధ్యంకాదు. దానిని సుసాధ్యం చేసుకోవ డానికి ఈ సాంస్కృతిక పుణ్యధారలో ప్రభవించిన మహాపురుషుల జీవితాలను అధ్యయనం చేయాలి. ఆ మహాపురుషుల వల్లనే ఈ పావనస్రవంతి అఖండంగా ప్రవహిస్తోంది. వారి సద్గుణాలను మనం అనుసరించి, సమాజ ఉజ్జ్వల ఆకాంక్షలకు మనమే రూపమై నిలవాలి. అందుకే ఈ ఉత్సవాల నిర్వహణను ప్రవేశపెట్టారు.
అకర్మణ్యత
స్వభావరీత్యా హిందూ సమాజం భక్తితత్పర మైనది. మహాత్ములలో ఈశ్వరాంశ ఉంటుంది కనుక వాళ్లు లోకాతీతులని మన సాధారణ సమాజం భావిస్తుంది. ఇలా అనుకోవడం వరకు ఈ భావనలో ఏ తప్పూలేదు. కానీ, ఇక్కడితో ఆగకుండా ఆ మహా పురుషులందరినీ మానవలోక పరిధికి అతీతమైన వారుగా భావించి, ఏకంగా దేవుడి సరసన జేర్చి కూర్చుండబెట్టే భ్రమా మయాప్రవృత్తి మన సమాజంలో విస్తృతంగా కనబడుతుంది. ఇలా గొప్పవాళ్లను పరమేశ్వరుని సరసకు నెట్టి ఒకరకంగా మనం చేతులు దులిపేసుకుంటున్నాం.
మన సమాజంలో సామాన్యుడు తనను తాను దీనునిగా, హీనునిగా, దుర్బలునిగా భావించుకొంటూ పరమేశ్వరుడు అవతారమెత్తి వచ్చి తనను కష్టాల నుంచి ఉద్ధరించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేతప్ప ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆత్మరక్షణ చేసుకొనే బాధ్యతను తన భుజాల మీద వేసుకోడు. మన సమాజంలోని ఇంచుమించు అన్ని జీవనరంగాలలోను ఈ వైఖరి కనిపిస్తుంది. అవసరమైన కష్టానికి ఓర్చి, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, సుఖదుఃఖాలకు చలించకుండా విపత్తులను ఎదుర్కొందామన్న పురుషార్థయుక్త భావన చాలా తక్కువ. సమస్యలను వాయిదా వేస్తూ నిశ్చింతగా కాలం వెళ్లబుచ్చేద్దామనే మనస్తత్వమే ఎక్కువ. సమాజంలో ప్రతి వ్యక్తిలోను పేరుకుపోయి ఉన్న ఈ లోపభూయిష్ట మనస్తత్వానికి లోకమాన్య బాలగంగాధర తిలక్ జీవితం ఆధారంగా విశ్లేషించు కోవచ్చు. ఆధునిక భారత చరిత్రలో తిలక్ ఒక అత్యుత్తమ కర్మయోగి, మహాపురుషుడు, జాతీయ నాయకుడు. కాని ఆయన చనిపోయిన తరువాత అనుయాయులు, ప్రజలు తిలక్ ఆదర్శాలనూ, సుగుణాలనూ అనుస రించి ఆయన రాజ కీయ పరంపరను కొనసాగించడానికి బదులుగా ఆయన విగ్రహాలు స్థాపించడం, చందాలు వసూలు చెయ్యడం, జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి పరిమితమయ్యారు. చివరకు తిలక్ మహారాజ్ చతుర్భుజ రూపాన్ని చిత్రాలుగా ముద్రించి, దానికి పూజలు చేయడం, తిలక్‌ను దేవుని అవతారమని చెప్పుకోవడం వరకూ వెళ్లింది.
ఉత్తములను మనుషుల కోవనుంచి బయటకు పంపెయ్యడం ఒక దుర్బల మనస్తత్వం. తన మామూలు వ్యవహారాలకు కూడా సహాయం చెయ్యలని దేవుడిని పిలిచి, తాను మాత్రం ఏ పనీ చెయ్యకుండా చేతులు కట్టుకుని కూర్చొనే హక్కు మనిషికి ఎక్కడిది? మనం పిలిచిన వెంటనే పరుగెత్తుకుంటూ రావడం తప్ప భగవంతుడికి వేరే పనేమీ లేదా?
సమాజపు ఈ మనోవృత్తిలో మార్పు తెచ్చి మనం పౌరుషాన్ని, ప్రయత్నశీలతను నిర్మాణం చెయ్యవలసి ఉంది. ‘ప్రయత్నమే పరమేశ్వరుడు’ అన్నాడు సమర్థ రామదాసు. ఇది మన కర్తవ్యభూమి అని భావించి ప్రయత్న పూర్వకంగా కర్తవ్యపుబాటలో ముందుకు సాగాలి. ఇక్కడ మహాత్ములను ఆరాధించాలి, గౌరవించాలి. కాని పరమేశ్వరునిగా కాదు- మహనీయ మానవులుగా మాత్రమే.
విపత్తుల పరిణామాలు
ఏ సమాజం మీదనయినా వరుసగా ఆపదలు వచ్చిపడినట్లయితే, సర్వత్రా నిరాశ తప్ప వేరేమీ గోచరించకపోతే – ఆ సమయంలో భిన్నభిన్న మనోవృత్తులు ఆ సమాజంలో తలెత్తుతాయి. కొందరు విపత్తులకు భయపడి ఈశ్వరుడిని శరణువేడతారు. కొందరు చేతులు ముడుచుకొని కూర్చోవడానికి ఇష్టపడరు. వారు తమ ఉజ్జ్వల ప్రవృత్తిలోని మెరుపును ప్రదర్శించి నశించి పోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. క్రోధావేశంతో ప్రాణార్పణ చేసేవారిని ప్రజలు ‘హుతాత్ములు’, ‘అమరవీరులు’ అని ప్రశంసించి, శ్రద్ధాంజలులు సమర్పిస్తారు.
మన భారతీయ సంప్రదాయాన్ని తప్పిస్తే ప్రపంచంలో మిగిలిన అన్ని సమాజాలు ఇటువంటి అమరవీరులను ఆరాధిస్తాయి; వారిని ఆదర్శంగా స్వీకరిస్తాయి. కాని భారతీయ సంస్కృతిలో ఇటువంటి ఆత్మబలిదానం కొంతమేరకు దౌర్బల్య చిహ్నంగా భావించడం కనిపిస్తుంది. అట్టి దౌర్బల్యం గల మనస్తత్వానికి శాంతచిత్తంతో బుద్ధిని ఉపయోగించి క్లిష్టపరిస్థితిని అధిగమించే శక్తి ఉండదు.
పైన చెప్పిన విధంగా క్షణికావేశంతో ప్రాణాలు బలిపెట్టేవారు వీర పురుషులనడంలో ఏ సందేహము లేదు. కానీ పరిస్థితిని మార్చడంలో వారు విఫలమవుతారు. తాము పరిస్థితులను అదుపులో పెట్టుకోవడానికి బదులు ఆ పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి అవి ఏమి చేయిస్తే అది చేస్తారు. ఆ కారణంగా వారు మనకు ఆదర్శం కాలేరు.
అయితే అట్టి అమరవీరుల వల్ల ఏమీ ఉపయోగం లేదని ఎవరూ అనరు. జాతి ఉన్నత పథంలో వారు అత్యవసరమైన సోపానాలు. వారి సంఖ్య మన సమాజంలో తక్కువ కాదు. రాజపుత్రుల చరిత్ర ఇటువంటి రోమాంచిత ఘట్టాలతోనే నిండి ఉంది. ఇటువంటి వీర పురుషులు పారలౌకిక జీవితానికి పాత్రులౌతారు. విదురనీతిలో ఇట్టి హుతాత్ముల గురించి ఇలా చెప్పారు.
ద్వావిమౌ పురుషోలోకే సూర్యమండల భేదినౌ
పరివ్రాక్ష్యాగయుక్తశ్చరణే చాభిముఖోహతః
(సూర్యమండలాన్ని భేదించి వెళ్లి స్వర్గాన్ని అందుకునే వారు ఇద్దరే. యోగమార్గంలో ప్రాణాలు త్యజించిన పరివ్రాజకుడు, యుద్ధంలో వెన్ను చూపకుండా హతుడైన వీరుడు). నిరాశతో చేతులు ముడుచుకొని ఊరికే కూర్చునే వారి కన్నా, భయపడి ఏడ్చే వారికన్నా, స్వార్థపరుల కన్నా, పిరికివారి కన్నా ఈ వీరపురుషులు ఉన్నతస్థాయికి చెందినవారని చెప్పక తప్పదు. కాని ఔన్నత్యానికి ఇది చివరి హద్దు మాత్రం కాదు. జీవితంలో పూర్తి సాఫల్యం పొందడమే మహనీయత.
అన్ని విధాల విషమంగా ఉన్న దశలో పరిస్థితిని మార్చివేసి అసాధారణ శక్తిని, యోగ్యతను ప్రదర్శించిన వారినే మన సంస్కృతి ఆరాధిస్తుంది, పూజిస్తుంది. మన అవతార పురుషులందరి జీవితాల లోను కనబడేది ఇదే. అటువంటి మహానుభావులకు ధర్మసంస్థాపకుల, యుగపురుషుల శ్రేణిలో స్థానం లభిస్తుంది.
క్షాత్రధర్మం విషయంలో కొన్ని అపోహలు తలెత్తడం వల్ల క్షత్రియులైనవారు ప్రాణాలను బలిచేసుకోవడమే జీవన సాఫల్యంగా భావించడం ఆరంభించారు. కాని బుద్ధిశాలియైన మనిషి తన హృదయంలో సర్వదా విజయకాంక్షనే నిలుపు కుంటాడు. శ్రీరామచంద్రుడు తన జీవితంలో ఈ నీతినే అనుసరించి విజయం సాధించాడు. స్త్రీవధ క్షాత్రధర్మ విరుద్ధమన్న ప్రతీతి ఉన్నప్పటికీ శ్రీరాముడు తాటకను హతమార్చాడు. చెట్టు చాటున దాగి వాలిని వధించాడు. ఎందుకంటే ప్రజాపీడకులను వారు స్త్రీలైనా, పురుషులైనా సరే, వధించి ధర్మస్థాపన చేయడమే ధర్మం.
చరిత్ర దుర్వినియోగం
ప్రస్తుతం మన చరిత్రకు పురాణ కథలని పేరుపెట్టి వాటిని అభూత కల్పనలుగా జమకడు తున్నారు. చారిత్రక పరిశోధన ఇప్పుడొక మోజయింది. దానిని ఆధారం చేసుకొని శ్రీరాముని శ్రీకృష్ణుని అస్తిత్వాలనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ మన సమీప గతంలోనే ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజు చారిత్రక అస్తిత్వం ఏ సందేహానికీ ఆస్కారం లేనిది. ఆయన అసాధారణ యోగ్యత నిస్సందిగ్ధమైనది. అయినప్పటికీ కొందరు మహానుభావులు రకరకాల భ్రమలను ప్రచారం చేసి ఆ మహాపురుషుడిని ఉపేక్ష పాలు చేయడానికి విఫల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎందుకంటే దురాక్రమణదారులను ఆలింగనం చేసుకుంటూ, హిందూ – ముస్లిం ఐకమత్యం గురించి పగటికలలు కంటున్నవారికి, విజయ శీలతకు ప్రతీక అయిన శివాజీ మహారాజు ప్రసక్తి చాలా అసౌకర్యం కలిగిస్తుంది. అందుకనే చరిత్ర పాఠ్యపుస్తకాలలో దోపిడీ దొంగ, బందిపోటు, కొండఎలుక మొదలైన పేర్లు పెట్టి ఆయన ఘనతను కించపరచి, ఆయన జీవితకార్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది.
ప్రజానీకపు హృదయ సింహాసనం మీద శివాజీ స్థానం సుస్థిరమైనదని గ్రహించలేని దుష్ప్రచారకులు అపోహలను, భ్రమలను కల్పించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇరవయ్యవ శతాబ్దంలో తలెత్తిన అభిప్రాయాలను శివాజీకి అంటగట్టి ఆయన హిందూ-ముస్లిం ఐక్యత గురించి పాటుపడ్డాడని చెప్పడం ఆరంభించారు. ఈ వాదనకు సమర్థింపుగా ఆయన సైన్యంలో మహమ్మదీయులు కూడా ఉన్నారని, ఆయన తన శత్రువులైన మహమ్మ దీయులకు గోరీలు కట్టించాడని, ఆయన ఎన్నడూ ముస్లింల మసీదులను కూలగొట్టించలేదని- ఇటువంటి వివరాలు ఏకరువు పెట్టసాగారు. కాని, వీటిలో హిందూ-ముస్లిం ఏకత ప్రసక్తి ఎక్కడుంది? ఆయన సైన్యంలో ముస్లింలు కొందరుండిన మాట నిజమే. అయితే ఆ ముస్లిం సైనికులతో ముస్లిం ప్రభువుల పైనే యుద్ధం చేయించే శక్తి ఆయనలో ఉంది. దురాక్రమణకారులు, ప్రజాకంటకులు మొగలుల పరిపాలనను నిర్మూలించేందుకే ఆయన సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం మరిచిపోకూడదు.
ఇంగ్లిష్ వారు హిందువులను, ముస్లింలను తమ సైన్యంలో చేర్చుకుని వారిచేత హిందూ దేశస్థులను చంపించి, ఈ దేశానికి ప్రభువులయ్యారు. ఇంగ్లిష్ వారి సైన్యంలో హిందువులున్నారు కనుక హిందూ-ఆంగ్లేయ ఏకత్వం ఏర్పడిందని చెప్పగలమా? 1857 స్వాతంత్య్ర సంగ్రామం తరువాత పీష్వా నానా సాహెబు నేపాల్ రాజును శరణు కోరగా ఆ రాజు ఇంగ్లిష్ వారికి వ్యతిరేకంగా పీష్వాకు సహాయ పడడానికి తిరస్కరించాడు. దీనిని బట్టి ఇంగ్లండ్-నేపాల్ ఏకత నెలకొన్నదని గాని, ఆ రెండుదేశాలు ఒకే దేశంగా ఏర్పడ్డాయని గాని చెప్పగలమా? శత్రువులకు సమాధులు కట్టించడం కూడా ఏకతా చిహ్నమేనా? ఇది అవిస్మరణీయమైన శివాజీ పేరును ఉపయోగించుకొని లాభపడదామన్న దురాలోచన.
ఇదేవిధంగా కమ్యూనిస్టులు ఆయనను తమ పార్టీలో చేర్చేసుకుని ‘శివాజీ సామ్యవాది, విప్లవకారుడు’ అని భాష్యాలు చెబుతున్నారు. శివాజీ వర్గపోరాటానికి అనుకూలుడని, అందువల్లనే జమీందారుల పట్టునుంచి రైతులను విడిపించాడని వాళ్ల వ్యాఖ్యానం. శివాజీ రైతులను (మావళేలను) సంఘటిత పరచిన మాట నిజమే. అయితే 19వ శతాబ్దంలోని కారల్‌మార్క్సు వ్రాసిన పుస్తకాలను చదివి 17వ శతాబ్దంలోని శివాజీ వర్గపోరాటానికి పూనుకొన్నాడనడం హాస్యాస్పదం. వాస్తవమేమిటంటే శివాజీ మహారాజు ఒక గొప్ప చారిత్రక సత్యం కనుక ఏ రాజకీయ పక్షమూ ఆయనను ఉపేక్షించలేక పోతోంది. ఆ మహాపురుషుని ఉజ్వల తేజస్సును మసకపరచడానికే ఇటువంటి అభూత కల్పనలు ప్రచారమవుతున్నాయి. అయితే ఇలాంటి కుటిల చేష్టలు చేసేవారు తమ కళ్లు తాము పొడుచుకున్నట్టే.
శివాజీని దారితప్పినవాడని ఒకప్పుడు వాఖ్యానించిన పెద్దమనిషి కూడా తరువాత గద్గద కంఠంతో ‘శివాజీ మహారాజును స్మరించుకోకుండా జాతీయౌన్నత్య సాధన సంభవం కాదు’ అనవలసి వచ్చింది. శివాజీ గతించి 300 సంవత్సరాలు గడచినా, ఇప్పటికీ ఆయన పేరు చెబితే గగుర్పాటు కలుగుతుంది. అంతటి తేజశ్శాలి, విజయశీలి ఇక్కడ జన్మించడం మన సమాజపు అదృష్టం. నిరాశా మయమైన, అంధకారమయమైన తన వర్తమాన స్థితిలో శివాజీ విజయ వైభవాన్విత జీవితం గొప్ప స్ఫూర్తిమంతం కాగలదు. అందువల్ల ఆ మహా పురుషుని జీవననీతి సూత్రాలను స్మరించుకోవడం, మననం చేసుకోవడం మళ్లీ మళ్లీ అవసరమౌ తూంటుంది.
కొందరు ‘ఆయన మన వంటి మామూలు మనిషి కాడు. సంపన్న కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకు అవెక్కడున్నాయి?’ అనేస్తారు. ఇది సరికాదు. ఆయన జన్మించినపుడు దేశం భయంకర పరిస్థితులలో ఉంది. ఏ విధమైన అనుకూలతా లేదు. ఎవ్వరూ తోడు నిలిచేవారు లేరు. ఉత్సాహం చచ్చినవారు, అభ్యంతరాలు చూపించేవారు-వీరే ఎక్కువ. చివరికి బంధువులు, స్వజనులు కూడా ఆయనకు తోడు కాలేదు.
సామాన్య హిందువు జీవితానికి ఏ రక్షణా లేదు. ఇక మానమర్యాదల సంగతి చాలా దూరపువిషయం. సమర్థ రామదాసు వంటి సాధు పురుషుని నోటకూడా నిరాశే వెలువడుతూ ఉండేది. అటువంటి తమో మయావస్థలో ఆశాకిరణం గాని, తప్పించుకొనే మార్గంగాని అగుపడని పరిస్థితులలో గొప్ప గొప్పవారు కూడా శత్రువు లకు లొంగిపోయి శరణా గతులవడం జరిగింది. అటువంటి సమయంలో శివాజీ తన పరాక్రమాన్ని, బుద్ధి కుశలతను ప్రదర్శించి విజయాన్ని సాధించాడు.
వర్తమాన పరిస్థితి
నేడు సమాజాన్ని, జాతీయ జీవనాన్ని విధ్వంసం చేయగోరే శక్తులు దేశంలో మరింత బలపడు తున్నాయి. తమ సహకారం లేనిదే ఎవరూ ఢిల్లీలో గద్దెనెక్కలేరని నిస్సంకోచంగా, పొగరు మోతుతనంతో ప్రకటించుకొనే స్థాయికి వారి దుస్సాహసం చేరుకొంది. రకరకాల పరాయి సంప్రదాయాలు, సిద్ధాంతాలు దేశంలో క్రియాశీలంగా ఉన్నాయి. ఇప్పటికీ ఖండితమై ఉన్న ఈ దేశాన్ని మరిన్ని ముక్కలుగా చేసి తమతమ సొంత రాజ్యాలను ఏర్పరచుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఆ దుష్ప్రయత్నాల కారణంగా మన దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది.
ఇవికాక పరస్పర వివాదాలు, విచ్ఛిన్నకర ప్రవృత్తులు, నిర్లక్ష్య వైఖరి, విధర్మీయుల బకాసుర చేష్టలు ఇవన్నీ కలిసి హిందూ సమాజాన్ని, ధర్మ సంస్కృతులను తుడిచి పెట్టే మార్గంలో ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నాయి. ఎటు చూసినా నిరాశామయ వాతావరణమే కనిపిస్తోంది. ఈ దుస్థితిని దాటి బయటపడాలంటే మనం శివాజీ పుణ్యస్మరణ చేసుకొని, అద్భుత ప్రతిభ, నీతి, కుశలత విలసిల్లే ఆయన జీవిత ఘట్టాల నుండి ప్రేరణ పొందాలి. అప్పుడే దేశాన్ని తీర్చిదిద్దే సామర్థ్యాన్ని ఆర్జించుకుంటాం.
‘శ్రీ గురూజీ సమగ్ర గ్రంథావళి – దిశానిర్దేశనము’ నుంచి