నేను క్రితంసారి మా కుటుంబంతో భారత్‌కి వెళ్ళినప్పుడు ఆంధప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కొన్ని మారుమూల గ్రామాలలో సమరసత సేవా ఫౌండేషన్ (ఎస్.ఎస్.ఎఫ్) చేస్తున్న కార్యకలాపాలను సందర్శించే భాగ్యం లభించింది. ఆ పర్యటనలో ఎస్.ఫ్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తాళ్లూరి విష్ణువు, సామాజిక విషయాలపై దార్శనికత కలిగిన డాక్టర్ సారంగపాణి మాకు ఆద్యంతం సహకరించారు. మా రెండు రోజుల పర్యటనలో మా ప్రియతమ మిత్రురాలు ఎస్తేరు ధనరాజ్ కూడా పాల్గొన్నారు.
మా ఈ సుడిగాలి పర్యటన గురించి వివరించే ముందు ఎస్.ఎస్.ఎఫ్. కార్యకర్తల ఘనతను గూర్చి కొంత వివరించాలనుకుంటున్నా. వారి వ్యక్తిత్వాలు, నిజాయితీ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక ఉద్యోగంగానో, ఒక హాబీగానో కాక ధర్మ పరిరక్షణ కార్యమే ఊపిరిగా జీవిస్తున్నవారు. కేవలం మాటలకే పరిమితం కాక చేతల వారు. తమ కార్యకలాపాలలో ఎల్లవేళలా సేవాభావం వెల్లివిరుస్తూ ఉంటుంది. కొన్ని మతసంస్థలు సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో జరిపే తంతు నాకు కొత్తేమీ కాదు. ‘మేము ప్రజల్ని రక్షిస్తాము’ అని కల్లబొల్లి కబుర్లు చెప్పుకు తిరిగే వారి మధ్యనే నా బాల్యం గడచింది. ప్రజలను పాపాలు, శాపాల నుంచి విముక్తం చేసి, నరక లోకంలోని భయంకరమైన అగ్నికీలల నుంచి రక్షిస్తామని చెప్పుకుంటూ ఉంటారు. అలా ‘రక్షించే’ కార్యంలో ఉన్నట్లు చెప్పుకునే వ్యక్తులు ప్రేమ, కరుణల ప్రతిరూపాలని సహజంగా ఎవరైనా భావిస్తారు. కానీ నిజానికి అక్కడ అవేమీ లభించవు. ‘ప్రజలను నరకం నుంచి రక్షిస్తాం’ వంటి పెద్దపెద్ద మాటలు ఎస్.ఎస్.ఎఫ్ సభ్యులు ఎప్పుడూ చెప్పరు. సహజమైన ప్రేమ ఆప్యాయతలతో సామాన్యుల అవసరాలను తీరుస్తూ ఉంటారు.
మా పర్యటనలో భాగంగా రెండు గ్రామాలలో జరిగిన ‘ప్రత్యేక పూజ’ కార్యక్రమాలలో పాల్గొన్నాం. ఎస్.ఎస్.ఎఫ్. స్థాపించి, నిర్వహిస్తున్న రెండు దేవాలయాలను సందర్శించాం. సంస్థ ఆధర్యంలో నడుస్తున్న రెండు బాలవికాస కేంద్రాలను సందర్శించి అక్కడి పిల్లలతో కొంతసేపు గడిపాము. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలోని మా స్వగ్రామం మల్కా పురంలో ఎస్.ఎస్.ఎఫ్. ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నాం. గ్రామాల్లో ‘సామూహిక హారతి’ కార్యక్రమాలతో పాటు ఎస్.ఎస్.ఎఫ్. ధర్మ ప్రచారకులతో కలసి ‘ఇంటింటిటా ధర్మ ప్రచారం’లో పాల్గొనే మహదవకాశం లభించింది. ఆ కార్యక్రమాల గురించి…
ప్రత్యేక పూజలు
‘ప్రత్యేకపూజ’లలో పాల్గొనడం ద్వారా నాకు ఎస్. ఎ•.•ఎఫ్. చేస్తున్న కార్యక్రమాల ప్రాధాన్యం అవగత మయింది. మతమార్పిడి కార్యక్రమాలు, బాప్టిజం స్వీకరించే కార్యక్రమాల లాంటివి ఎన్నో చూశాను. జనాన్ని నీళ్ల తొట్టెలలో ముంచి బాప్టిజంలోకి తీసుకునే దృశ్యాలను ఎన్నింటినో నేను నా బాల్యంలో చూశాను. మూడు దశాబ్దాల క్రితం నేను క్రైస్తవంలో ఉన్నప్పుడు, అలా మనుషుల్ని నీళ్ల తొట్టెలలో ముంచి లేపడం అనేది చాలా భయంకరంగా అనిపించేది. అందుకే ఆ కార్యక్రమాలు జరుగుతున్న ఛాయలకు కూడా వెళ్లేదాన్ని కాదు.మతం మారిన వారిని ఆహ్లాదకర వాతావరణంలో తిరిగి స్వధర్మంలోనికి తీసుకువచ్చే ఈ ‘ప్రత్యేక పూజ’ కార్యక్రమాలను చూసిన తర్వాతే నాకు నిజంగా స్వధర్మంలోకి రావడం అంటే ఏంటో అర్థమైంది.
క్రైస్తవ మతంలోకి మారడాన్నే స్వధర్మ స్వీకరణగా ఒకప్పుడు భావించేదాన్ని. నిజానికి క్రైస్తవ మతం స్వీకరించడమంటే సొంత ఇంటికి దూరం కావడమే. ఒక వ్యక్తిని స్వధర్మం నుంచి, సొంతగూటి నుంచి వేరు చేసే అనేక మార్గాలలో అది కూడా ఒకటి. అంటే ఆ వ్యక్తి తన గుర్తింపును, ప్రత్యేకతను, తన పూర్వీకుల వారసత్వాన్ని, తమ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని కోల్పోవటం. భూతలస్వర్గాన్ని పరిచయం చేస్తామంటూ తమ సొంతమైన, సహజమైన పరిసరాల నుంచి, సంస్కృతి నుంచి ప్రజలను వేరు చేయడమే. రోగాలు నయం చేస్తామనో, బంగారు భవిష్యత్‌ను కల్పిస్తామనో కొందరు క్రైస్తవ మత ప్రచారకులు చేసిన వాగ్దానాలను నమ్మి స్వధర్మానికి దూరమైన వ్యక్తులను తిరిగి తమ మాతృధర్మంలోనికి తీసుకువచ్చే ఈ ‘ప్రత్యేక పూజ’ కార్యక్రమమే నిజమైన పునరాగమనం, స్వంత ఇంటికి రావడం
ఈ ప్రత్యేక పూజ కోసం చేసిన ఏర్పాట్లే అద్భుత మైనవి. పుష్పాల, అగరొత్తుల పరిమళం, వెలిగే హోమగుండం.. ఇవన్నీ ఆ పరిసరాలలో ఒక సకారాత్మక, దైవీశక్తిని నింపాయి. వేదమంత్రో చ్ఛాటనలో కలిసిపోయిన గుడిగంటల సవ్వడి కొద్దిరోజుల పాటు తమ మాతృధర్మానికి దూరమైన వారిని ఎవరినైనా తిరిగి ఆహ్వానించడానికి తగిన, చక్కటి వాతావరణం. ప్రత్యేకపూజలో పాల్గొన్న మహిళలు ధరించిన రంగు రంగుల చీరలు, తలలో పువ్వులు, చేతికి గాజులు, ముఖాన సిందూరం, చందనం చూసి ఇన్నాళ్లూ తాము కోల్పోయిన దానిని తిరిగి పొందుతున్న వారి సౌభాగ్యాన్ని తలచుకుని నా కళ్లలో ఆనందబాష్పాలు చిప్పిల్లాయి. ఈ మహిళలు ఇప్పటివరకూ ఏం కోల్పోయారో, ఇప్పుడు తిరిగి ఏం పొందుతున్నారో నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో? నిజానికి వారికి ఇప్పుడు పునర్జన్మ లభించింది. బాప్టిజం స్వీకరించినవారు సహజంగా తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు. క్రైస్తవాన్ని స్వీకరించిన మహిళలు తమ నుదుటిపై సింద•రాన్ని తొలగించుకోవాల్సి రావడం వారికి అత్యంత బాధాకరమైన విషయం. క్రైస్తవులుగా మారడానికి హిందూ స్త్రీలు అత్యంత పవిత్రమైనవిగా, మాంగల్య చిహ్నాలుగా భావించే బొట్టు, గాజులు వంటి వాటిని ఏ విధంగా త్యాగం చేసిందీ చెబుతూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.
మొదటి ప్రత్యేకపూజ అమరావతి సమీపంలోని తాడికొండ గ్రామంలోని మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో, రెండవది మా స్వగ్రామం మల్కా పురంలోని గ్రామదేవత ఆలయంలో జరిగింది. తాడికొండ గుడిలోని ప్రధాన శివలింగం స్వయంభువుగా వెలసిందని, మొదటగా అగస్త్య మహామునికి ఆ లింగం దర్శనం ఇచ్చిందని చారిత్రక కథనం. అలాంటి పవిత్రమైన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన తాడికొండ మూలస్థానేశ్వర దేవాలయంలో ఏడుగురుకి వేద మంత్రోచ్ఛాటన మధ్య హిందూ ధర్మంలోనికి సాదర స్వాగతం లభించింది. 50 మందికిపైగా ఎస్.ఎస్.ఎఫ్. సభ్యులు ఈ ప్రత్యేక పూజలో భాగస్వాయులయ్యారు. స్వధర్మంలోనికి తిరిగి వచ్చిన ఆ వ్యక్తులపై ఎన్.ఎస్.ఎఫ్. సభ్యులు కురిపించిన ప్రేమాప్యాయతలు అత్యంత అభినందనీయం.
మా స్వగ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆరుగురు వ్యక్తులు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. మా పూర్వీకులు ఆరాధిస్తూ వచ్చిన గ్రామదేవత దేవాలయాన్ని పునరుద్ధరించే భాగ్యం నాకు రెండేళ్ల క్రితం కలిగింది. ఇప్పుడు ఆ దేవాలయంలోనే ఈ ప్రత్యేకపూజ నిర్వహించారు. క్రైస్తవ మతమార్పిడి ముఠాలకు మా గ్రామం ఎప్పటి నుంచో లక్ష్యంగా మారింది. 40 ఏళ్ల క్రితం మా నాన్నతో మొదలైన మతమార్పిడి ఉధృతంగా కొనసాగింది. అప్పుడు కేవలం 5 వేల మంది జనాభా గల గ్రామంలో మొట్టమొదటిసారిగా ఓ చర్చి అని పిలిచే వ్యాపార కేంద్రం వెలసింది. ఇప్పుడు పదికి పైగా చర్చిలు ఉన్నాయి. వాటి కారణంగా గ్రామం ఇప్పుడు అనేక ముఠాలుగా, వర్గాలుగా చీలి పోయింది. ఒకే కుటుంబంలోని వారికి కూడా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోని మొత్తం 500 కుటుంబాలలో గత రెండు మూడు దశాబ్దాలుగా మతం మారకుండా మిగిలి ఉన్న 10,15 కుటుంబాలు అండగా నిలబడిన కారణంగానే ఆ గ్రామం మధ్యలో ఈ దేవాలయం ఏర్పాటు కాగలిగింది.
ప్రత్యేకపూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఎన్.ఎస్.ఎఫ్. కార్యకర్తలు ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇంకా మహాద్భుతమైనది. ఇప్పుడు స్వధర్మాన్ని స్వీకరించిన వారు గతంలో మత మార్పిడి పాస్టర్‌ల మాయమాటలు నమ్మి తాము ఏ విధంగా మోస పోయిందీ, ఆ ఆశబోతు పాస్టర్లు తమను అడ్డగోలుగా ఎలా దోచుకున్నదీ, తమతమ కుటుంబాలలో ఏ విధంగా చిచ్చుపెట్టిందీ వివరించారు. విష్ణువు గారు, సారంగపాణి గారు ఆ వ్యక్తులను ప్రేమగా ఆలిం గనం చేసుకోవడం చూసి క్రైస్తవమతంలో ఉండగా తాము ఎలా మోసపోయామో, ఎలా దోపిడీకి గురయ్యామో విలపిస్తూ వివరించినప్పుడు, స్వధర్మం లోనికి తిరిగి వస్తున్న ఈ వ్యక్తులు సురక్షిత స్థానానికే చేరుకున్నారనే విషయం నాకు స్పష్టమైంది.
ఎస్‌ఎస్‌ఎఫ్ నాయకుల కరుణాపూరితమైన మాటలు ఇప్పుడు చేతలుగా మారిన వైనాన్ని నేను చూస్తూ ఉన్నాను. స్వధర్మములోనికి తిరిగివచ్చిన వారు హిందూ సమాజంలో గౌరవప్రదమైన సభ్యులుగా కొనసాగుతారని ఎన్.ఎస్.ఎఫ్. నాయకులు స్పష్టమైన హామీ ఇస్తున్నారు. ఈ విషయంలో ఎన్.ఎస్.ఎఫ్. సభ్యులు తీసుకునే శ్రద్ధే స్వధర్మాన్ని స్వీకరించే వారి విషయంలో వారి పట్ల ప్రత్యేకతను చేకూర్చి పెట్టింది. ఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు నిర్మించి ఆరేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్న దేవాలయాలను దర్శించిన తర్వాత వారిని నేను అభినందించకుండా ఉండలేకపోయాను. కేవలం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్.ఎస్.ఎఫ్. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ 502 దేవాలయాలను నిర్మించింది. వాటిలోని రెండు దేవాలయాలను దర్శించుకునే మహాద్భాగ్యం మాకు లభించింది. రెండు దేవాలయా లకూ అనుబంధంగా దేవాలయాల ప్రాంగణంలోనే బాల వికాస కేంద్రాలు కూడా నడుస్తున్నాయి.
మొదటగా మేము అమరావతి సమీపంలోని మునుగోడు అనే ఒక గిరిజన గ్రామంలోని దేవాల యాన్ని సందర్శించాం. అప్పటికే ఆ దేవాలయంలో హారతి కార్యక్రమం కోసం వచ్చి, మా కోసం ఎదురు చూస్తున్న పెద్ద సంఖ్యలోని భక్తుల నుంచి మాకు అద్భుతమైన స్వాగతం లభించింది. 4-12 సంవత్సరాల మధ్య వయసున్న 40 మందికిపైగా పిల్లలు కూడా మాతో గడపడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరు గిరిజన పూజారులు ఆ ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ అతి చిన్న గ్రామంలో తమకు ఒక దేవాలయం ఉన్నందుకు ఆ గ్రామస్థులు ఎంతగానో గర్విస్తున్నారు. వారు ఎంతో భక్తిశ్రద్ధలతో అక్కడ పూజా కార్యక్రమాలు, భజనలు, హారతి నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎక్కువగా పూరి గుడిసెలే కనిపిస్తున్నాయి. కానీ వారు తమ దేవాలయంలో ఆనందంగా భజనలు, పూజలు చేయడం చూస్తుంటే ధనవంతుల కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన భక్తి గుణ సంపన్నులని అనిపించింది. ఆ కుటుంబాలలోని పిల్లలు కూడా ఎంతో సంస్కార వంతంగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారు. మా మాటలను వారెంతో శ్రద్ధగా ఆలకించారు. పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు, వారిలో ఎక్కువమంది దేశం కోసం పోరాడే వీర సైనికులం కావాలనుకుంటున్నట్లుగా చెప్పారు. ఎంత గొప్ప విషయమిది? నేను నా చిన్న తనంలో క్రైస్తవుల మధ్యే పెరిగాను. క్రైస్తవ సంస్థలు నిర్వహించే ఆదివారం పాఠశాల నా జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. మేము ఆ వయసులో ఎలాంటి పాటలు పాడామో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లోనూ సైన్యంలో కవాతు చెయ్యమని, ఎయిర్ ఫోర్స్ వంటి వాటిలో చేరబోమని, మేము క్రీస్తు సైన్యంలో చేరి కల్వరి సందేశాన్ని మాత్రమే వ్యాప్తి చేస్తామని ప్రపంచానికి ప్రకటిస్తూ పాటలు పాడేవారం. ఆ విధంగా పసిహృదయాలను మలినం చేసే పరిస్థితుల మధ్య పెరిగాను. నేను చూసిన ఆ పరిస్థితులకు, ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎఫ్ ద్వారా ఏర్పడిన ఈ ఆహ్లాదకరమైన, పవిత్రమైన వాతావరణా నికి మధ్య హస్తిమశకాంతరం ఉన్నదన్న సంగతి నాకు కూడా ఇప్పుడిప్పుడే అవగతమై కళ్ళు ఆనంద బాష్పా లతో నిండిపోయాయి. శుభం భూయాత్.
– మేరీ సురేష్ అయ్యర్, హూస్టన్