బీజేపీని రాజకీయంగా, ఎన్నికల బరిలో ఓడించే సామర్థ్యం లేదని గ్రహించిన ప్రతిపక్షాలు రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో బీజేపీని ఓడించాలని ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు. ఇది విపక్షాలకు పెద్ద నిరాశ. అలాగే అయోధ్యలో సుప్రీంకోర్టు అనుకూల తీర్పు మొదలు, జ్ఞాన్‌వాపి, మధుర వివాదాల వరకు హిందువులదే పై చేయి కావడం సహించలేని ముస్లిం మతోన్మాద శక్తులు కూడా రెచ్చిపోతున్నాయి. ఇవాళ దేశంలో కనిపిస్తున్న అరాచకమంతా ముస్లిం మతోన్మాద శక్తులు, బీజేపీని వ్యతిరేకించే పేరుతో భారతీయతను వ్యతిరేకిస్తున్న విధ్వంసకర శక్తులు కలసి చేస్తున్నదే. ఒక విధ్వంసక శక్తికి ఇంకొక విధ్వంసక శక్తి మద్దతుగా నిలుస్తోంది. జ్ఞాన్‌వాపి, తరువాత ప్రవక్త మీద వ్యాఖ్యల వివాదం, తాజాగా సైనిక నియామకాలకు సంబంధించి అగ్నిపథ్‌ అల్లర్లు ఈ రెండు శక్తుల ఉమ్మడి విన్యాసమే. ఒక అల్లరి తరువాత ఒక అల్లరి సృష్టిస్తూ బీజేపీని ఓడించాలన్నదే వీటి ధ్యేయం. కానీ దీనికి సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ప్రభుత్వం ఆస్తులు ధ్వంసమవుతున్నాయి.

జవాన్లు కావాలని కలలు కన్నవాళ్లు చేయవలసిన పనా ఇది? దేశ రక్షణ ఆశయం కలిగిన వారి ప్రవర్తన ఇదా? దేశసేవ కోసం జీవితాన్ని అర్పిద్దామని నిర్ణయించుకున్న వారు వీరేనా?

జూన్‌ ‌మూడవ వారంలో దాదాపు సగం దేశంలో జరిగిన విపరిణామాలను గమనించిన వారందరికీ వచ్చిన ప్రశ్నలు ఇవే. సైనిక నియామకాలలో కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతూ జూన్‌ 14, 2022‌న కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ ‌పథకాన్ని ప్రకటించింది. సైన్యంలో చేరాలని అనుకుంటున్న వారు ఆ వెంటనే మాతృదేశం మీద యుద్ధం ప్రకటించారని చెప్పడం కొంచెం బాధాకరమే అయినా అతిశయోక్తి కాదు.13 రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నిరసనలు ప్రధానంగా రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ప్రజలను నిశ్చేష్టులను చేశాయి. ఇందుకు బిహార్‌ ‌తొలి వేదిక అయింది. 15వ తేదీన అక్కడ నిరసనలు మిన్నంటాయి. తర్వాత కొన్ని అసాంఘిక శక్తులు దేశవ్యాప్తంగా పథకం ప్రకారం అందోళనలకు తెర తీశాయి. 17వ తేదీన సికింద్రా బాద్‌లో జరిగిన అల్లర్లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జూన్‌ 17‌న ఒక్కరోజే 12 రైళ్లు దగ్ధ మయ్యాయి. ఆ నాలుగైదు రోజులలో 300 రైళ్లు దెబ్బతిన్నాయి. అరవై బోగీలు దగ్ధమయ్యాయి. పాతిక స్టేషన్లు ధ్వంసమైనాయి. 214 రైళ్లను రద్దు చేయవలసి వచ్చింది. 90 రైళ్లు గమ్యస్థానాలకు చేరుకోలేక పోయాయి. 19వ తేదీ నాటికి రైల్వేలకు రూ. 700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తూర్పు మధ్య రైల్వే అధికారి వీరేంద్ర కుమార్‌ ‌చెప్పారు. జూన్‌ 20 ‌నాటి భారత్‌ ‌బంద్‌ ‌వరకు కూడా ఈ అరాచకం కొనసాగుతూనే ఉంది. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌జార్ఖండ్‌, ‌తెలంగాణ (సికింద్రాబాద్‌), ‌రాజస్తాన్‌లలో ఆందోళనకారులు రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. బిహార్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఆ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు.

మాజీ సైనికాధికారులు, ప్రస్తుత సైనికాధి కారులు, రక్షణ రంగ నిపుణులు – వీరిలో ఎవరి వాదనతోను సంబంధం లేకుండా బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్‌, ఆప్‌, ‌టీఎంసీ, ఆర్‌జేడీ వంటి పార్టీలు అగ్నిపథ్‌ ‌పథకం గురించి చేస్తున్న ప్రచారం, యువతను రెచ్చగొడుతున్న తీరు విద్రోహం వంటిదేననడానికి ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇందులో ముస్లిం మతోన్మాదులు కూడా తమ వంతు మంట మండిస్తున్నారు. బీజేపీ మీద వ్యతిరేకతతో కొద్దికాలం క్రితం ముస్లింలను, తరువాత రైతులను, ఇప్పుడు సైన్యంలో చేరాలనుకుంటున్న యువతను ఈ రాజకీయ పార్టీలు దగా చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా అందులో లోపాలు వెతకడం, వాటిని భూతద్దంలో చూపడం ఇవాళ్టి ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయి. గాంధీ కుటుంబం మీద పడిన నేషనల్‌ ‌హెరాల్డ్ అవినీతి నిందను అగ్నిపథ్‌ ఆం‌దోళనల ద్వారా చెరిపి వేసుకోవచ్చునని కాంగ్రెస్‌ ‌నేతలు ఆశపడుతున్నారు.

సైన్యంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతలో కొన్ని అరాచక శక్తులు అపోహలను సృష్టించి హింసాత్మక చర్యలకు పురిగొల్పినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఈ కుట్రలో అమాయకులు బలిపశువులుగా మారడం బాధాకరం. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనలను అదుపు చేసే క్రమంలో జరిగిన కాల్పుల్లో వరంగల్‌ ‌జిల్లా ఖానాపూర్‌ ‌మండలం దబ్బీర్‌పేటకు చెందిన రాకేశ్‌ ‌మరణిం చాడు. మరో 13 మంది గాయపడ్డారు. ఇక్కడ ఆందోళనకారులు మూకుమ్మడిగా స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత మూడు రైళ్లలోని నాలుగు బోగీలకు నిప్పు పెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ లోకో ఇంజిన్ల వైపు వస్తుండడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. లోకో ఇంజిన్‌లో 4వేల లీటర్ల హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌ ఉం‌ది. 3వేల లీటర్ల సామర్థ్యం ఉన్న లోకో ఇంజిన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టి ఉంటే ఊహించని ప్రాణ, ఆస్తినష్టం సంభవించేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 20 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనలో రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఎంత భయపడి ఉంటారో ఊహించవచ్చు.

తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌లలో విధ్వంసా నికి సైనిక నియామకాలకు వెళ్లే వారికి తర్ఫీదును ఇచ్చే సంస్థలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్లో విధ్వంసానికి కుట్ర కేసులో ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అల్లర్లు జరిగిన రోజు ఆవుల సుబ్బారావు సికింద్రా బాద్‌ ‌పరిసర ప్రాంతంలోనే ఉన్నారని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవచ్చని ఆర్మీ అభ్యర్ధులను ఆయన రెచ్చగొట్టారని ఆరోపణ. అల్లర్లకు పాల్పడిన యువకులకు సుబ్బారావు ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారాన్ని అందించినట్లు గుర్తించారు. గత 15 నెలలుగా ఆర్మీ ఎంపికలకు శిక్షణ ఇస్తున్న సుబ్బారావు కేంద్రం ప్రకటనతో నష్టపోతాననే భావనతో విద్యార్ధులను రెచ్చగొట్టినట్లు అనుమానిస్తు న్నారు. సుబ్బారావుతో పాటు మరికొందరు శిక్షణా సంస్థల నిర్వాహకుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. కొన్ని గంటల తరువాత సుబ్బారావు మీద పోలీసుల కథనం మారిపోవడం విశేషం.

పక్కా పథకంతోనే

సికింద్రాబాద్‌ ఉదంతంలో రైల్వే పోలీసు, నిఘా విభాగాలతో పాటు సాధారణ పోలీసుల వైఫల్యం కూడా ఉందని సర్వత్రా విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులతో పాటు, కొందరు అభ్యర్థులు కూడా ఆందోళనకు ఉసిగొల్పి, విధ్వంసానికి కారకులయ్యారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ‘సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌బ్లాక్‌’ ‌పేర ఓ వాట్సాప్‌ ‌గ్రూపు, దానికి అనుబంధంగా మరో 3 గ్రూపులు ఏర్పాటు చేసుకుని తీవ్రస్థాయిలో ఆందోళనకు పక్కాగా పథకం రూపొందించుకుని, అమలు చేసినట్టు తేల్చారు. ఈ విధ్వంసం కేసులో 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కామారెడ్డి వాసి మధుసూదన్‌ను కూడా ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ఆదిలాబాద్‌ ‌నుంచి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న సాబేర్‌ ‌జెండాలు, కర్రలు, రాళ్లు వంటివి తెచ్చే బాధ్యత తీసుకున్నాడు. ఈ మేరకు సాబేర్‌తో పాటు శ్రీను అనే మరొక యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో పది మంది అనుమానితులను కూడా పట్టుకున్నారు. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన అభ్యర్థి రాజా సురేంద్ర కుమార్‌ ‘‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌బ్లాక్‌’ ‌గ్రూపులో సభ్యులందరినీ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడు. ఆందోళనకు వచ్చే వారంతా పాత టైర్లు, వస్త్రాలు, రాడ్లు, పెట్రోల్‌ ‌తీసుకుని రావాలని, వాటితో విధ్వంసం సృష్టిద్దామని సూచించాడు. రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే ముందు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు అద్దాలను, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైళ్ల ఏసీ బోగీల అద్దాలను పగలగొట్టింది అతడేనని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఇక రైలుబోగీల్లోకి ప్రవేశించి నిప్పుపెట్టిన వారిలో ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్‌, ‌కామారెడ్డికి చెందిన సంతోష్‌ ‌కీలకంగా వ్యవహరించినట్టు తేల్చారు. ఇందులో ఎవరినీ వదిలిపెట్టరు. ఇది తథ్యం. దేశ రక్షణ కోసం జీవిద్దామనుకుని, క్షణికావేశంలో పౌర సమాజం మీద యుద్ధం ప్రకటిస్తే పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయన్న జ్ఞానం యువతరానికి ఉండాలి. నిరసనల పేరుతో విధ్వం సానికి పాల్పడుతున్నవారిని ఆర్మీలో చేర్చుకునేది లేదని త్రివిధ దళాధిపతులు తేల్చి చెప్పిన సంగతిని గుర్తు చేసుకోవాలి. ఆర్మీలో క్రమశిక్షణా రాహిత్యానికి తావుండదు. ‘భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయి. ఆస్తుల విధ్వంసానికి తావు లేదు. ప్రతి అభ్యర్థి నిరసనల్లో పాల్గొనలేదని ధ్రువపత్రం సమర్పించాలి. అది లేకుంటే ఎవరినీ చేర్చుకునేది లేదు. ఎవరిపై అయినా ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు అయితే వారికి ఆర్మీలో చేరే అవకాశం ఉండదు. విధ్వంసానికి పాల్పడలేదని వారు ఎన్రోల్మెంట్లో రాతపూర్వకంగా పేర్కొనాలి. ఆ తర్వాత పోలీసుల ద్వారా వెరిఫికేషన్‌ ఉం‌టుంది’ అని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదంతా స్యయంకృతం కాదా? వాస్తవాలు తెలుసుకోకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టడం ఎంతవరకు సబబు? కొన్ని రాజకీయ పార్టీలు, శక్తులు అగ్నిపథ్‌ ‌విషయంలో అపోహలు సృష్టించాయి. అపోహలను దూరం చేయడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేసింది. చివరికి ఈ పథకాన్ని కొనసాగించి తీరుతామని స్పష్టం చేసింది. ఇంతకీ అగ్నిపథ్‌ ‌వాస్తవాలు ఏమిటి?

ఏమిటీ అగ్నిపథ్‌

‌త్రివిధ దశాల నియామక పక్రియలో కొత్త మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ ‌విధానాన్ని తీసుకొచ్చింది. నియామక పక్రియలో యువత, సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ మార్పులన• తీసుకురావడం దీని ఉద్దేశం. భారత సైన్యం, రక్షణ రంగ నిపుణులు ఈ సంస్కరణలను స్వాగతించారు. సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ చేపట్టిన షార్ట్ ‌సర్వీసెస్‌ ‌పథకం ‘అగ్నిపథ్‌’. ‌మన సేనలను ప్రపంచంలోనే ఉత్తమ దళాలుగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. ఉద్యోగావ కాశాలు పెరుగుతాయి. దీనికి ఎంపికయ్యే అభ్యర్థులను ‘అగ్నివీర్‌’ అని పిలుస్తారు. కొత్త విధానం ద్వారా నియామకాల కోసం టూర్‌ ఆఫ్‌ ‌డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపడతారు. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నారు. మన యువత జీవిత ఆరంభంలో నాలుగేళ్లపాటు దేశ రక్షణ కోసం పని చేసి మంచి ప్యాకేజీతో సైన్యం నుంచి బయటకు వచ్చి, భావి జీవితాన్ని ఇతర ప్రభుత్వ ఉద్యోగం లేదా ఇంకేదైనా నచ్చిన వృత్తి, వ్యాపారం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తోంది.

నేపథ్యం

రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో అత్యధికం వేతనాలు, పింఛన్లకే పోతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రక్షణ రంగ బడ్జెట్‌ ‌రూ.5 లక్షల 25వేల 166కోట్లు. అందులో పెన్షన్ల వాటా రూ.లక్షా 19వేల 696 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 33వేల కోట్లు. అయితే అగ్నిపథ్‌ ‌ద్వారా చేపట్టిన సంస్కరణల కారణంగా రక్షణశాఖకు కొంతమేర ఆర్థికభారం తగ్గనుంది. మిగులు నిధులతో త్రివిధ దళాల ఆధునీకరణకు వెసులుబాటు లభించనుంది.

‘అగ్నివీర్‌’‌లుగా చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్‌ ‌పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్‌ ‌కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. అగ్నివీర్‌ల సేవాకాలం నాలుగేళ్లు. ఆరు నెలల శిక్షణ,మూడున్నరేళ్ల సర్వీసు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ‘అగ్నివీర్‌ ‌స్కిల్‌ ‌సర్టిఫికెట్‌’‌తో పాటు తదుపరి ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. సీఏపీఎఫ్‌ (‌ఖీ), రాష్ట్ర పోలీసుల నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తారు. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. స్వయం ఉపాధి కోసం కేంద్రం ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పైచదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్‌ ‌ప్రదానం చేస్తుంది. మొత్తం మీద అగ్నివీర్‌ల భవిష్యత్తు చాలా సురక్షితమే. వీరి భవిష్యత్తు అగమ్యగోచరమన్న వాదన అవాస్తవం.

అగ్నిపథ్‌ ‌ద్వారా దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్ల కంటే అగ్ని వీరుల రిక్రూట్‌మెంట్లు కొన్నేళ్లలో మూడు రెట్లు పెరుగుతాయి. కొత్త విధానంతో రెజిమెంటల్‌ ‌వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ పథకం వల్ల అగ్నివీరులుగా అత్యుత్తమమైన యువత ఎంపికవుతుంది. దీనితో సాయుధ బలగాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచినట్లు అవుతుంది. సైన్యంలో అగ్నిపథ్‌ ‌తరహా స్వల్పకాలిక నియామక విధానం ప్రపంచంలో పలు దేశాలలో ఉంది. శక్తిమంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమం. మొదటి సంవత్సరంలో రిక్రూట్‌ అయ్యే అగ్నివీరుల సంఖ్య సాయుధ దళాలలో 3% మాత్రమే.

నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. అందువల్ల ఆర్మీ పర్యవేక్షక ర్యాంక్‌ల కోసం అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది. అగ్నివీరులు సర్వీసు పూర్తయ్యాక సమాజంలోకి వస్తే ప్రమాదకారులవుతారని, ఉగ్రవాదులతో చేతులు కలుపుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలు పెద్ద అపోహ. ఈ వ్యాఖ్యలు భారత సైన్యాన్ని అవమానించేవే. నాలుగేళ్లు యూనిఫాంలో ఉండి, భారత మాతకు సేవలందిం చిన యువకులు జీవితాంతం దేశం కోసమే పనిచేస్తారు. దేశానికి ద్రోహం చేయలేరు. ఏటా వేలాది సైనికులు పదవీ విరమణ పొందుతున్నారు. వారిలో ఏ ఒక్కరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న దాఖలాలు లేవు.

రక్షణ రంగ నిపుణులను సంప్రదించలేదా?

సాయుధ దళాల మాజీ అధికారులను, రక్షణ రంగ నిపుణులను సంప్రదించకుండా అగ్నిపథ్‌ ‌పథకాన్ని ప్రకటించారనే ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ అంశం మీద కేంద్రం రెండేళ్లు సంప్రదింపులు జరిపింది. మిలిటరీ అధికారులతో కూడిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌మిలిటరీ ఆఫీసర్స్ ఈ ‌ప్రతిపాదనను రూపొందించారు. మాజీ అధికారు లందరూ ఈ పథకం ప్రయోజనాలను గుర్తించి స్వాగతించారు. రగడ నేపథ్యంలో నరేంద్ర మోదీ కూడా సంస్కరణలు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నౌకా, వైమానిక దళాల అధిపతులతో పాటు సైనిక విభాగం అధిపతి కూడా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌• ‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ పథకం అమలుపై గానీ, అగ్నివీరుల శిక్షణ విషయంలో గానీ రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. భారత సైన్యాన్ని యువత, అనుభ వజ్ఞుల కలయికతో రూపొందించేందుకే అగ్నిపథ్‌ను తీసుకొచ్చినట్లు త్రివిధ దళాల ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేశారు. సైన్యం సగటు వయసు పెరుగుతుండటం ఆందోళనకరమని చెబుతున్నారు. ఇందుకోసం ఇతర దేశాల సైనిక వ్యవస్థల గురించి కూడా సమగ్ర అధ్యయనం చేశారు. అగ్నిపథ్‌ ‌విషయంలో వచ్చిన అనుమానాలను నివృత్తి చేసేందుకు రక్షణ శాఖ సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శి లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ అనిల్‌ ‌పురీ, ఎయిర్‌ ‌మార్షల్‌ ఎస్కే ఝా, నేవీ వైస్‌ అడ్మిరల్‌ ‌దినేశ్‌ ‌త్రిపాఠి మీడియా ముందుకు వచ్చారు. కార్గిల్‌ ‌రివ్యూ కమిటీ సైతం దీనిని ప్రస్తావించిందని గుర్తు చేశారు.

సైన్యంలో సంస్కరణలు తేవాలన్న నిర్ణయం అమలు కాక ఇప్పటికే ఆలస్యమయింది. పథకం పనితీరును అంచనా వేయడం సహా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మొదట 46 వేల మందిని తీసుకుంటారు. వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్మెంట్‌ ‌సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతారు. సమీప భవిష్యత్‌లోనే ఇది 1.25 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 46 వేల మందిని తీసుకుంటున్నారు. భవిష్యత్‌ ‌నియామకాలు ఇదే స్థాయిలో మాత్రం ఉండవు. దేశసేవలో అమరుడైతే అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందుతుంది. కేవలం అగ్నిపథ్‌ ‌వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదు. త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరంతా రిటైర్మెంట్‌ ‌తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదు. ఎవరి దారులు వారికి తెరిచి ఉంటాయి.

కంపెనీల బాసట

అగ్నిపథ్‌ ‌పథకంపై విపక్షాలు రాజకీయం చేసినా దేశ వ్యాప్తంగా ప్రముఖ కార్పొరేట్‌ ‌కంపెనీలు బాసటగా నిలిచాయి. ఆనంద్‌ ‌మహీంద్రా అగ్ని వీరులకు మంచి ఆఫర్‌ ‌ప్రకటించారు. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన వారికి తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తామని ట్విట్టర్‌ ‌వేదికగా వెల్లడించారు. గతేడాది ఈ పథకం గురించి తెలిసినప్పుడు నేను ఒక్కటే చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నా. ఈ పథకంతో అగ్నివీరులు పొందే క్రమ శిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి లభించేలా చేస్తాయి. అలాంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్‌ ‌చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్‌ ‌స్వాగతిస్తోంది’ అని మహీంద్రా వెల్లడించారు. ఆందోళనలు విచారకరమని అన్నారు.

మహీంద్రా బాటలోనే మరికొందరు పారిశ్రామిక వేత్తలు తమ సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్‌పీజీ గ్రూపు కూడా అగ్నివీరులకు స్వాగతం పలికింది. మహీంద్రా ట్వీట్‌కు హర్ష గోయెంకా రీట్వీట్‌ ‌చేస్తూ అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. ‘ఇతర కార్పొరేట్‌ ‌సంస్థలు సైతం ఈ ప్రతిజ్ఞను చేస్తాయని, యువత భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు ముందుకొస్తాయని ఆశిస్తున్నా’ అంటూ గోయెంకా ట్వీట్‌ ‌చేశారు. ‘ఇండస్ట్రియల్‌ ‌జాబ్‌ ‌మార్కెట్‌ ‌రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్‌లకు ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని కిరణ్‌ ‌మజుందార్‌ ‌పేర్కొన్నారు. అపోలో హాస్పి టల్‌ ‌గ్రూప్‌ ‌సైతం ముందుకొచ్చింది. ‘అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు మార్కెట్‌, ‌పరిశ్రమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని గట్టిగా నమ్ము తున్నా. అలాంటి సామర్థ్యం ఉన్న యువతకు ఉద్యోగం కల్పించేందుకు మా సంస్థ సిద్ధంగా ఉంటుంది’ అని వెల్లడించారు అపోలోగ్రూప్‌ ‌జాయింట్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌సంగీతా రెడ్డి. ‘అగ్నిపథ్‌’ ‌పథకం సమాజంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, దేశ నిర్మాణానికి గొప్పగా దోహదపడుతుందని టీవీఎస్‌ ‌మోటార్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌సుదర్శన్‌ ‌వేణు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడంలో, సమా జాన్ని బలోపేతం చేయడంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషిస్తారని వేణు ఒక ప్రకటనలో తెలిపారు.

————

‘అగ్నిపథ్‌’ ‌విశేషాలు ఇవీ

–              త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామకంలో యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం.

–              కొత్త విధానం వల్ల భారత సైనిక దళాల్లో ఎక్కువ భాగం యువత ఉండే అవకాశం

–              అగ్నిపథ్‌ ‌నియామకాలను షార్ట్‌టర్మ్, ఒప్పంద ప్రాతిపదికన చేపడతారు.  ‘అగ్నివీర్‌’‌ల సర్వీసు నాలుగేళ్లు.

–              90 రోజుల్లో తొలి బ్యాచ్‌ ‌నియామకం. అందులో దాదాపు 45వేల మందికి అవకాశం.

–              చేరిన యువతకు సైనికులతో సమాన ర్యాంకులు, వేతనాలు.

–              సర్వీసులో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు.

–              ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు.

–              మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం.

–              సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి.

పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవా నిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తన వంతు జమచేస్తుంది. నాలుగేళ్ల తరువాత ఏక మొత్తంగా రూ. 11.71 లక్షల నిధి(పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. కొవిడ్‌ ‌వల్ల రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో  ప్రధాన నరేంద్ర మోదీ అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాదికి మాత్రం వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు.

About Author

By editor

Twitter
YOUTUBE