భాగ్యనగర్: హిందువునని చెప్పుకోవడానికి ఎవరూ ఏమాత్రం వెనుకాడవద్దని, స్వాభిమానంతో ముందుకు సాగాలని తెలంగాణ అబ్కారీ శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ చల్లా వివేకానందరెడ్డి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రథమ, ద్వితీయ సంఘ శిక్షావర్గల సార్వజనికోత్సవం భాగ్య నగర్, అన్నోజిగూడలోని శ్రీ విద్యా విహార్ పాఠశాల (ఆర్‌వికె)లో జూన్ 3న సాయంత్రం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానందరెడ్డి హాజరై ప్రసంగించారు. నాలుగు వేల సంవత్సరాల నాటి విష్ణుపురాణంలోనూ భారత్ ప్రస్తావన ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం మన దేశంలో విదేశీ మూలాలు ఉన్నవారు ఎవరూ లేరని, విదేశీ మతాలను అవలంబిస్తున్న వారి పూర్వీకులు కూడా హిందువులేనని అన్నారు. మన అమూల్యమైన నాగరికతను, పూర్వీకుల నుండి అందివచ్చిన వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతపైనే ఉందని అన్నారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తగా హిందూ జాగరణ్ మంచ్ పశ్చిమ, మధ్య (మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల) క్షేత్రాల సంఘటన మంత్రి పి. దేవేందర్ మాట్లాడుతూ స్వయంసేవకుల శక్తి, సామర్థ్యాలను పెంపొందించి, సంఘ సిద్ధాంతం పట్ల అవగాహన పెంచుకునే అవకాశాన్ని సంఘ శిక్షావర్గ కల్పిస్తుందని అన్నారు. సమాజ హితాన్ని ఆకాంక్షిస్తూ మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా స్వయంసేవకులు పని చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ బస్తీ, గ్రామం, నగరం, పట్టణాల్లో ప్రజల సమస్యల పరిష్కారంలో పాలు పంచుకోవాలన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు నిరంతరాయంగా హిందూ ధర్మరక్షణ కోసం పనిచేస్తూ, ప్రతిఒక్కరూ ధైర్యంగా ‘నేను హిందువు’నని చెప్పుకునేలా చేసిందన్నారు. మన సంస్కృతిని, ధర్మాన్ని కించపరిచే అనేక ప్రయత్నాలు నేడు జరుగు తున్నాయని, మన ధర్మానికి నష్టం కలిగించే విధర్మీ యులను, విజాతి శక్తులను ఎదిరించేలా, ప్రశ్నించేలా స్వయంసేవకులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పని చేస్తుందని దేవేందర్ అన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హిందూ ఆలయాల ధ్వంసం జరుగుతున్నదని, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కనీసం వారిపై చర్యలు తీసుకోకపోవడం విచారకరం అని అన్నారు. తెలంగాణలో ఎస్సీలపై, మహిళలపై ఒక మతంవారు దాడులు జరుపుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ఘటనల పట్ల హక్కుల కార్యకర్తలు, కమ్యూనిస్టు నాయకులు, కుహనా సెక్యులరిస్టులు, మేధావులు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని, ఇది వారి ద్వంద్వవైఖరికి నిదర్శనని దేవేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేసినవారు ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాల్లో కావాలనే హిందువుల మీద దాడిచేసి, వారి దుకాణాలు ధ్వంసంచేస్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. అంతేకాదు, మన దేశంలో హిందువుల సంఖ్యను తగ్గించే కుట్ర కూడా జరుగు తుందని.. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. ఈ చర్యల్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత హిందువులందరి మీద ఉందని దేవేందర్ అన్నారు. మే 15 నుండి జూన్ 3 వరకు జరిగిన ప్రథమ వర్ష శిక్షావర్గలో 297 మంది (తెలంగాణ); ద్వితీయ వర్ష శిక్షావర్గలో ఆంధప్రదేశ్, తెలంగాణ నుండి 173 మంది స్వయంసేవకులు శిక్షణ తీసుకున్నారు. ప్రథమ వర్ష వర్గాధికారిగా పబ్బ సత్యనారాయణ, ద్వితీయ వర్ష వర్గ సర్వాధికారిగా హెచ్. కె. నాగు వ్యవహరించారు.
కార్యక్రమంలో క్షేత్ర ప్రచారక్ సుధీర్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, ప్రాంత కార్యవాహ కాచం రమేష్, ఆంధప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహ యుగందర్ ఇతర క్షేత్ర, ప్రాంత అధికారులు పాల్గొ న్నారు. శిక్షణ పొందిన స్వయంసేవకుల శారీరిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం తిలకించడానికి పురుషులు, మాతృమూర్తులు, యువతీయువకులు మొత్తం 1134 మంది హాజరయ్యారు.