భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక పక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీల్లో సహజం గానే హడావిడి మొదలైంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఏకగ్రీవం కోసం యత్నిస్తున్నప్పటికీ, తమలో తమకే ఐక్యతలేని విపక్షాలు అందుకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలోనే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. కానీ అందులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరనే విషయంలో స్పష్టత రాలేదు.
ఎవరి ఎజెండా వారిదే
దేశంలో విపక్షాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు నామావశిష్ట నాయకుడి స్థాయినుంచి రాహుల్ గాంధీ ఎదగడంలేదు. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఎవరి ఎజెండా వారిది. సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అంతా మాట్లాడతారు, ఎవరి మాట ఎవరూ వినరు. ఏకాభిప్రాయం ‘గగనకుసుమం’. ఒక్కమాటలో చెప్పాలంటే వీరి ఐక్యత ‘రోకలిని తలకు చుట్టుకున్న’ చందం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 15న ఢిల్లీలో నిర్వహించిన విపక్ష నేతల సమావేశం ఇందుకు గొప్ప ఉదాహరణ.
ముందుగా ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా 22 మంది విపక్ష నేతలకు లేఖలు రాశారు. పురిట్లో సంధికొట్టినట్టు విభేదాలు ‘లేఖ’ స్థాయిలోనే బయటపడ్డాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆర్‌జేడీలతో సహా 17 పార్టీల నేతలు హాజరు కాగా, ఆమ్‌ఆద్మీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ పార్టీలు గైర్హాజరయ్యాయి. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్సేతర ఫ్రంట్ ఏర్పాటుపై తమ సొంత ఎజెండాపై ముందుకెళుతున్న తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రసమితి, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటుందని భావించడానికి మించిన అమాయకత్వం మరోటి ఉండదు. ఇక సీపీఎం, సీపీఐలకు చెందిన అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. సీపీఎం రాజ్యసభ నేత ఎలామరమ్ కరీం మాత్రం హాజరయ్యారు. విచిత్రమేమంటే, అంతకుముందు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ అధినేత్రికి లేఖ రాస్తూ ‘ఇటువంటి సమావేశాలు నిర్వహించ డానికి ముందు సహచర పార్టీలతో సంప్రదింపులు జరిపి అత్యధిక సంఖ్యలో పార్టీలు పాల్గొనే అవకాశం ఇవ్వాలి. కానీ మీరు ఏకపక్షంగా తేదీని తెలుపుతూ లేఖ రాసారు. అదీకాకుండా సమావేశానికి కేవలం మూడురోజుల ముందే లేఖ అందింది’ అని పేర్కొన్నారు.
గెలవడం సాధ్యంకాదని ఖాయంగా తెలిసి నప్పుడు, పోటీలో నిలబడి పరువు పోగొట్టు కోవడం ఎందుకు అనుకున్నారో ఏమో శరద్‌పవార్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండటానికి అంగీకరించ లేదు. 2017లో కూడా విపక్షాల నుంచి వచ్చిన ఇదే ప్రతిపాదనను తిరస్కరించడం గమనార్హం. అకాళీదళ్ ఈ సమావేశానికి హాజరుకాబోనని ముందే కుండబద్దలు కొట్టింది. ఇక తనకు ఆహ్వానమే అందలేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు చెప్పారు. అంతేకాదు ఒకవేళ ఆహ్వానం అందినా కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో తాను ఆ సమావేశానికి హాజరయ్యే వాడిని కాదని కూడా స్పష్టం చేశారు. ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశ మైన విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న అభిప్రాయానికి మాత్రం వచ్చాయి. శరద్‌పవార్ పోటీకి అంగీకరించని నేపథ్యంలో గోపాకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా పేర్లను మమతా బెనర్జీ తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఫరూక్ అబ్దుల్లా కాలంలోనే కశ్మీరులో హిందువులపై విపరీతంగా దాడులు జరిగాయి. ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లపై అత్యాచారాలు, హింసకు పాల్పడటమే కాకుండా, వారు రాష్ట్రం విడిచి పారిపోయేలా చేసింది ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే. మమతా బెనర్జీ ఆయన పేరును ప్రతిపాదించినట్టు వచ్చిన వార్తలు నిజమైతే, ఆమె నైజాన్ని తెలుసుకోవడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. అయితే కొన్ని పార్టీలు గోపాలకృష్ణ గాంధీ పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన మహాత్మాగాంధీ, చక్రవర్తి రాజగోపాలాచారి మనుమడు. ఈ మేరకు ఆయన్ను కొందరు విపక్ష నేతలు కలిసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా పేరు కూడా వినిపిస్తోంది. ఈయన గతంలో బీజేపీలో ఉండి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇక కాంగ్రెస్‌కు చెందిన అత్యంత సీనియర్ నాయకుడు గులాం నబీఆజాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఉమ్మడి అభ్యర్థి అవసరమేనని విపక్షాలు చిలుక పలుకులు పలికినా, ఎవరి స్వార్థం వారిదే, ఎవరి ఎజెండా వారిదే. అవకాశవాదమే వీరి పరమావధి. అసలు గెలిచే అవకాశమే లేని అభ్యర్థి ఎంపికలో కూడా తలలు కూడకపోవడం మన విపక్షాల విలక్షణత! ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, శివసేన, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, ఎస్‌పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జెడీ(ఎస్), డీఎంకే, ఆర్‌ఎల్‌డీ, ఐయూఎంఎల్, జేఎంఎం పార్టీలు పాల్గొన్నాయి.
ఏకగ్రీవం సాధ్యమేనా?
రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు విపక్షాలతో చర్చలు జరిపే బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు భాజపా అప్పగించింది. ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైంది కేవలం రెండు సందర్భాల్లోనే. 1950లో దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేందప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 1977లో రాష్ట్రపతి పదవికి పోటీచేసిన 36 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించాలన్న కృతనిశ్చయంతో ఉండటంతో ఏకగ్రీవం సాధ్య మవడం దాదాపు అసాధ్యమే. అయితే ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని భాజపా రాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తే ఏకగ్రీవానికి అవకాశాలుండ వచ్చు. ఎందుకంటే ఆయనకు సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. కానీ అభ్యర్థి ఎంపికలో ఎన్నో అంశాలు ప్రాధాన్యం వహిస్తాయి కాబట్టి ఇది ఒక కోణం మాత్రమే కాగలదు.
ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలను పరిశీలిస్తే భాజపా సంఖ్యాపరంగా బలంగా ఉంది. దీంతో ఆ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్డీయే కూటమి మెజారిటీకి చేరువలో ఉండటంతో బిజూ జనతాదళ్ (ఒడిశా), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (ఏపీ)ల వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై దృష్టి కేంద్రీకృతమైంది. ఈ రెండు పార్టీల మద్దతుంటే ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతి కాగలరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ఇటీవల న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఏం చర్చించారన్న వివరాలు బయటకు తెలియనప్పటికీ, వీరు కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడంలేదు. 2017లో రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికీ మద్దతి చ్చారు. ప్రస్తుతం భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ కోసం 13 వేల ఓట్లు అవసరం. వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న ఓట్ల విలువ 43 వేలు. ఆ పార్టీ మద్దతిస్తే ఎన్డీయే అభ్యర్థి గెలుపు ఖాయం.
ఎవరిని వరిస్తుంది?
రాబోయే ఎన్నికల దృష్ట్యా గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గిరిజనుల ఓట్లు కీలకమన్న సంగతిని భాజపా గుర్తించింది. ఇప్పటివరకు రాష్ట్రపతి పదవికి ఆ సామాజిక వర్గం నుంచి ఎవరూ ఎన్నిక కాలేదు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రైపది ముర్ము పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమెను అభ్యర్థిగా నిలబెడితే, ఇటు గిరిజనులను ఆకట్టుకోవడంతోపాటు ఒక మహిళను అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినట్టూ కాగలదన్న అభిప్రాయలు బీజేపీలో ఉన్నాయి. ఇదే సమయంలో కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈయన గొప్ప విద్యావంతుడు మాత్రమే కాదు, ఇస్లామిక్ ప్రపంచంలో ఎంతోమందికి బాగా తెలిసిన వాడు. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో స్థానం సంపాదించినప్పటికీ షాబానో కేసు నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు. తర్వాత వీపీ సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. వచ్చేవారం పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్టీ అభ్యర్థి ఖరారయ్యే అవకాశముంది. నరేంద్ర మోదీ, అమిత్ షా చివరివరకూ ఏ విషయాన్ని బయటపెట్టరు కాబట్టి ఈ విషయంలో చివరిదాకా సస్పెన్స్ తప్పేలా లేదు.
ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు
పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సభ్యులు, నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు. లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటుహక్కు ఉండదు. పార్లమెంట్‌లోని ఒక గదిలో రాష్ట్ర అసెంబ్లీలకు చెందిన సెక్రటేరియట్ భవనంలో ఎన్నిక జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లను రెండు రంగుల్లో ముద్రిస్తారు. ఆకుపచ్చనివి ఎంపీల కోసం. గులాబీ రంగులోవి ఎమ్మెల్యేల కోసం. తొలి ప్రాధాన్య ఓటు తప్పనిసరి. రెండో ప్రాధాన్య ఓటు ఐచ్ఛికం. ఓటింగ్‌లో పాల్గొనే ఎలక్టోరల్ సభ్యులకు పార్టీ విప్‌లు వర్తించవు. వారి అభీష్టం మేరకు నచ్చిన అభ్యర్థికి ఓటు చేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. అయితే ఇది రొటేషన్ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో, 2022 ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థిని 50 మంది ఎంపీలు ప్రతిపా దించగా, మరో 50 మంది అందుకు మద్దతు తెలపాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో 1997 నుంచి అధికార పక్షం నుంచి ఒకరు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మరొకరు మాత్రమే పోటీలో నిలుస్తున్నారు.
ఈ ఎన్నికలో దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 4,809 మంది ఎలక్టోరల్ సభ్యులు నూతన రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రామ్‌నాథ్ కోవింద్ ప్రతిపక్షాల ఉమ్మడి ప్రత్యర్థి మీరాకుమార్‌పై విజయం సాధించారు. అప్పట్లో ఆయనకు 7,02,000 ఓట్లు పోల్ కాగా, మీరాకుమార్‌కు 3,67,000 ఓట్లు వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ ఓటు విలువ 1974లో అత్యధికంగా, అంటే 723గా నమోదైంది. అంటే 1971 జనగణన ప్రాతిపదికన ఈ ఓట్ల సంఖ్యను లెక్క కట్టారు. కాగా 1977లో ఈ ఓటు విలువ 702కు పడిపోగా 1997 ఎన్నికల నుంచి 708గా కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం ఎంపీల సంఖ్య 776 కాగా వీరి మొత్తం ఓట్ల విలువ 5,43,200. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 4,033 కాగా, వీరి మొత్తం ఓట్ల విలువ 5,43,231. మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య 4809 కాగా మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఎంపీల ఓటు విలువ సమానంగా ఉండగా, ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, 176తో జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర ఎమ్మెల్యే ఓటువిలువ 175. ఆంధప్రదేశ్, ఒడిశాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, బీజేడీలకు అత్యధిక మెజారిటీలు ఉండటంతో ఈ పార్టీలకు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ 159, 149 చొప్పున ఉన్నాయి. ప్రస్తుత ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు ఉన్న ఓట్లు సుమారు 5.6 లక్షలు. కాబట్టి ఎన్డీయే గెలుపు నల్లేరు మీద నడక చందమే!
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్