రక్తదానం.. ఆధునిక సమాజంలో దీని ప్రాధాన్యం అనన్య సామాన్యం. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తికీ ఇది పరమౌషధంగా పనిచేస్తుంది. ఇంతటి ప్రాధాన్యం గల రక్తదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో అపోహలను తొలగించాల్సిన బాధ్యత కూడా సమాజంపైన ఉంది. అంతేకాక రక్తదానానికి ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాల్సిన, చైతన్య పరచాల్సిన సామాజిక బాధ్యత అధికార యంత్రాంగం, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలది. దీనివల్ల అంతిమంగా సమాజానికి మేలు కలుగుతుంది.


2004లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించాల్సిన ఆవశ్యకతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‌గుర్తించింది. 58వ వరల్డ్ అసెంబ్లీ- 2005లో రక్తదాన ప్రాముఖ్యంపై అవగాహన కల్పించేందుకు ఏటా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్‌ 14‌న అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తోంది. 2005 నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా నడుస్తోంది. ఇంటర్నేషనల్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌రెడ్‌‌క్రాస్‌, ‌రెడ్‌ ‌క్రెసెంట్‌ ‌సొసైటీ సంయుక్త చొరవతో సురక్షిత రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు, రక్తదాత లకు కృతజ్ఞతలు తెలిపేందుకు తొలిసారి ఈ కార్యక్ర మాన్ని చేపట్టారు. ఏటా ఒక్కో నినాదంతో ప్రజల వద్దకు వెళుతున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్ర మాలను చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తు న్నారు. రక్తదానం ప్రాధాన్యాన్ని చాటి చెబుతున్నారు.

1868 జూన్‌ 14‌న జన్మించిన జీవశాస్త్ర వైద్యుడు డాక్టర్‌ ‌కార్ల్ ‌ల్యాండ్‌స్టీనర్‌ ‌జన్మదినాన్ని అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవంగా గుర్తించారు. ఆయన ఆరోగ్య రంగానికి చేసిన సేవలను, మానవ రక్త వర్గాలను గుర్తించడంలో చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయన జన్మదినాన్ని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కమిటీ 1930లో నోబెల్‌ ‌బహుమతిని ప్రకటించింది.

రక్తదానం ప్రాధాన్యం గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఆపద సమయంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను అది కాపాడుతుంది. పునర్జన్మ ఇస్తుంది. జీవితంపై ఆశలను కల్పిస్తుంది. పరోక్షంగా ఆ వ్యక్తిపైన ఆధారపడిన కుటుంబ సభ్యులనూ కాపాడుతుంది. వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తుంది. అయితే ఇంతటి ప్రాధాన్యం గల రక్తదానంపై ఇప్పటికీ సరైన ప్రచారం కొరవడింది. ప్రజల్లో అవగాహన లోపించింది. దాని ప్రాధాన్యాన్ని గుర్తించడంలో, వివరించడంలో వైఫల్యం కనపడుతోంది. ఏటా అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కొద్దిపాటి హడావిడి చేయడం, ఆ తరువాత మర్చి పోవడం సాధారణమైంది. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన విమర్శ కాదు, వాస్తవం. ఈ విషయాన్ని గుర్తించి సానుకూల దిశగా సాగడం మనందరి ముందున్న కర్తవ్యం. ఇప్పటికీ చాలామందిలో రక్తదానంపై అపోహలు ఉండటం ఆందోళన, ఆవేదన కలిగించే అంశం. రక్తదానం వల్ల తాము బలహీనపడతామని, అనారోగ్యానికి గురవుతామని, వ్యాధుల బారిన పడతామన్న భావన చాలామందిలో ఉంది. ఇది ఏదో పల్లెటూరి ప్రజల్లో ఉన్న అభిప్రాయం కాదు. పట్టణ ప్రాంతాల్లో విద్యా వంతులు, మేధావుల్లో, వివిధ రంగాల నిపుణులు చాలామందిలో ఇలాంటి అభిప్రాయం ఉంది. ఈ అపోహలను తొలగించేందుకు జరుగుతున్న ప్రయ త్నాలు పూర్తిస్థాయిలో ఫలవంతం కాలేదు. కాబట్టి ఈ ప్రయత్నాలను మరింత వేగవంతంగా, ప్రభావ వంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

గత ఏడాది ఇటలీ రాజధాని రోమ్‌ ‌నగరంలో అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం జరిగింది. రక్తదానాన్ని ప్రేరేపించే విధంగా, ప్రోత్సహించే విధంగా ‘రక్తాన్ని అందించండి.. ప్రపంచాన్ని కాపాడండి’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది (2022) ‘రక్తదానం.. సంఘీబావ చర్య’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. నేషనల్‌ ‌బ్లడ్‌ ‌సెంటర్‌ ‌ద్వారా ఈ ఏడాది మెక్సికో రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించ నుంది. రాజధాని నగరం మెక్సికో సిటీలో ఈ కార్యక్రమం జరగనుంది. రక్తదానంపై గల అపోహలను తొలగించి, దానివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించినట్లయితే ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు అని చెప్పవచ్చు.

వాస్తవానికి రక్తదానం వల్ల దాత బలహీనపడడు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తదానం వల్ల వ్యక్తి శరీరానికి అవసరమయ్యే రక్తం తగ్గిపోతుందని, దానివల్ల దాత బలహీనపడే ప్రమాదం ఉందన్నది కేవలం అపోహే. రక్తదానం ఎంత చేసినా ఆ మేరకు సరిపడా రక్తాన్ని శరీరం మళ్లీ ఉత్పత్తి చేస్తుంది. వ్యాధుల నుంచి త్వరితగతిన కోలుకునే అవకాశం కలుగు తుంది. ఆరోగ్యకరమైన కాలేయం ఏర్పడుతుంది. గుండెపోటు, క్యాన్సర్‌ ‌తదితర ప్రమాదాలను తగ్గిస్తుంది. మనిషి శరీరంలో ఐరన్‌ ‌లోపాన్ని నివారిస్తుంది. ఎక్కువకాలం జీవిస్తారు.  18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి వ్యక్తి రక్తదానం చేయవచ్చు. ఆ వ్యక్తి 45 కిలోల బరువు కలిగి ఉండాలి. రక్తదానం చేసే రోజు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. రక్తదానం చేసే వ్యక్తికి ఎలాంటి ఖర్చు ఉండదు. కానీ అది ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడుతుంది. ఈ విషయాలను సమర్థవంతంగా, ప్రభావవంతంగా ప్రజలకు తెలియజేసినట్లయితే విరివిగా రక్తాన్ని సేకరించవచ్చు.

ప్రజల అవసరాల మేరకు రక్తాన్ని సేకరించడం అంత కష్టమేమీ కాదు. రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు, ఇంకా పలు స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా ముందుకు సాగుతున్నప్పటికీ, ఈ ప్రయత్నానికి అందరూ కలసి రావాల్సిన అవసరం ఉంది. 2005 నుంచి ఏటా అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ రక్త సేకరణ నామమాత్రంగా ఉంది. ఆస్పత్రిలో చేరే ప్రతి ఏడుగురిలో ఒరరికి రక్తం అవసరం. ఒక్కోసారి ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం పదిశాతం మందే రక్తదానానికి ముందుకు వస్తున్నారు. వివిధ రకాల అపోహలు, అనుమానాల కారణంగా మిగిలిన 90 శాతం మంది ఈ పక్రియకు దూరంగానే ఉండిపోతున్నారు. ఇది వెనకబడిన దేశాల్లో నెలకొన్న పరిస్థితి మాత్రమే కాదు. ప్రగతికి నిలువెత్తు నిదర్శనమని చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.

అగ్రరాజ్యమైన అమెరికాలో 38 శాతం మంది రక్తదానానికి అర్హులు కాగా కేవలం 10 శాతంమంది ప్రజలే ముందుకు వస్తున్నారు. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే వెనకబడిన దేశాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2017లో అమెరికాలో 8 మిలియన్‌ ‌యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించడం గమనార్హం. ఇండియాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2016లో 12 మిలియన్‌ ‌యూనిట్ల డిమాండ్‌ ఉం‌డగా, సేకరించింది 10.9 మిలియన్‌ ‌యూనిట్లే. అయితే ఇప్పుడిప్పుడే ప్రజల్లో రక్తదానంపై అవగాహన కలుగుతుండటం స్వాగతించదగ్గ అంశం. 2006-07లో స్వచ్ఛంద రక్తదాతల శాతం 54.4 ఉండగా 2011-12 నాటికి 83 శాతం పెరగడం గమనార్హం. 2006-07లో సేకరించిన రక్తం యూనిట్ల సంఖ్య 4.4 మిలియన్‌ ‌యూనిట్లు ఉండగా 2012-13 నాటికి 9.3 మిలియన్‌ ‌యూనిట్లకు చేరుకుంది. వెనకబడిన దేశాల్లో రక్తదాతల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. పది శాతానికి మించడం లేదు. రక్తానికి సంబంధించి హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌విశేష సేవలు అందిస్తోంది. 1998 అక్టోబర్‌లో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రారంభించిన ఈ సంస్థ అతికొద్ది కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ఇప్పటివరకు దాదాపు 96 వేలమందికి రక్తాన్ని అందించినట్లు అంచనా. ఈ దిశగా మరికొన్ని సంస్థలు కృషిచేయాల్సిన అవసరం ఉంది.

కేంద్ర ప్రభుత్వ చర్యలు

ఈ ఏడాది, జూన్‌ 14 అం‌తర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ ‌సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల్లో రక్త గ్రూపుల పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రక్తదాతల సంఖ్యను పెంచడం, వారిని సన్మానించడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజల చేత సర్పంచులు ప్రతిజ్ఞలు చేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. కేవలం పంచాయతీలోలనే కాకుండా బ్లాక్‌, ‌జిల్లా స్థాయుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. రక్త పరీక్షల వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఏ గ్రూప్‌ ‌రక్తం ఎవరికి ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.

– రాజేంద్ర

About Author

By editor

Twitter
YOUTUBE