–  కుంతి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘హనుమా! నీవు చెప్పినది నిజమా? పదునాలుగు సంవత్సరాల రామ వియోగ అనావృష్టిని చూచిన యీ కన్నులకు రామదర్శన వృష్టి కలగబోతున్నదా? వానరులకు సహజమైన చాంచల్యం నీలో లేదుకదా?

దనుజవి రాముడైన నా రాముడెక్కడ? భ్రాతృ సేవా సుగుణుడు లక్ష్మణుడెక్కడ? పతివ్రతాచరిత సీతామాత యెక్కడ?’’ సుదూరంగా చూస్తూ, ఆదుర్దాగా ప్రశ్నించాడు భరతుడు, రామాగమన వార్తను మోసుకొచ్చిన హనుమతో.

‘‘సత్యసంధా! భరతా! భరద్వాజ ముని శ్రీరాము నితో పాటు ఆయన పరివారానికి, షడ్రసోపేతమైన భోజనాలను సమకూర్చాడు.

పరివారం అలసట దీర్చుకుంటున్నారు కాబోలు. భరద్వాజ ముని అనుగ్రహంతో రాముడు వచ్చే మార్గంలోని వృక్షాలు పరిమళ పుష్పాలతో, మధుర మైన తేనెలతో అలరారుతున్నాయి. ఆ మకరంద పానమదోన్మత్త భ్రమరఝంకారనాదాలు అడవి అంతటా నిండాయి.

బహుశా తీయని పండ్లను తింటూ, చెట్ల ఛాయల కింద వానరులు సేదదీరుతున్నట్లున్నారు కాబోలు.

అదిగో భరతా! వినుము! గోమతీ నదిని దాటిన కోలాహలం ఇక్కడికి వినబడుతున్నది. సాలవనము లందలి వృక్షాల కదలికలచే, వాటి పూల నుండి రాలినపుప్పొడుల వాసనలు ఇక్కడి దాకా వస్తున్నవి’’ అంటూ ప్రత్యుత్తర మిచ్చాడు హనుమ.

‘‘ఔను పావనీ! నీ మాటలు నిజమే అనిపిస్తున్నది. నాకు కూడా శుభ శకునములు గోచరిస్తున్నాయి’’ అన్నాడు ఆనందంగా భరతుడు.

‘‘మహాత్మా! అదిగో అల్లంత దూరాన బ్రహ్మ సంకల్పానుసారం చంద్రకాంతిని ధిక్కరిస్తూ,  విశ్వకర్మచే నిర్మితమైన పుష్పకవిమానం వస్తున్నది. పూర్వం బ్రహ్మ కుబేరునికివ్వగా, విభీషణుడు యుద్ధానంతరం మన స్వామికి ఇచ్చాడు.

ఆ విమానంలో విభీషణ, సుగ్రీవాదులతో, సీతాలక్ష్మణ సమేతుడై నన్నేలగా, నిన్నేలగా శ్రీరామ చంద్రుడు వస్తున్నాడు’’ అన్నాడు హనుమ ఉద్వేగంతో.

హనుమ సాధు వచనములకు ఉప్పొంగిన భరతుడు ‘‘తమ్ముడా! శత్రుఘ్నా! ఉత్సవ సమయం ఆసన్నమైనది. నేను చెప్పినట్లు చేయుము. రాముని రాకను నగరానికి తెలియజేయుము. రేపు సూర్యోదయంలోపు, సదాచార సంపన్నులైన వారు అయోధ్యలో గల కులదేవతలను, దైవమందిరాలను, మండపాలను పూలమాలలతో అలంకరించవలెనని తెలుపుము. మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా, సద్బ్రాహ్మణులు సుస్వర మంత్రోచ్చారణలతో పూజలు చేయునట్లుగా చూడుము. అదేవిధంగా మంగళ తూర్యారవాలతో, బంగారు కలశాలలో పవిత్ర జలాలతో భూసురులు, కులగురువులు, పురాణ విద్వాంసులు, వంధిమాగదులు, దేవదాసీలు, కవిగాయకులు, పురప్రముఖులు, చంద్రవదనుడైన శ్రీరామచంద్రుని ఎదుర్కోలు పలికేందుకు బయలు దేరవలెను’’ అని ఆజ్ఞను ఇచ్చాడు.

అన్న చెప్పిన మాట ప్రకారం శత్రుఘ్నుడు, మంత్రులను, అధికారులను, పౌరులను, స్వచ్ఛంద సేవకులను పిలిపించి, ‘‘రాముడు వచ్చే వేళయినది. నందిగ్రామం నుండి అయోధ్య వరకు గల మార్గములందు మిట్టపల్లములను సరిచేయండి. నేలను మంచు వంటి జలములతో చల్లబరుచండి. వీధులలో సుగంధ పుష్పములను చల్లండి. ఈ రంగవల్లికలను దిద్దించండి. వాటి పైన విడి పూలను పెట్టించండి. వీధులను ధ్వజ పతాకములతో, పూలమాలలతో అలంకరించండి’’ అని్ఞ పించాడు.

పౌరులు, అధికారులు సేవాతత్పరులై ఉండగా, భరతుడు పంపిన శీఘ్ర వార్తాహరుల వల్ల తెలిపిన సమాచారం వలన గుర్రపు గిట్టల చప్పుళ్లతో, థ చక్రపు సవ్వడులతో, శంఖదుందుభి నాదాలతో, భూసురుల మంత్రోచ్చరణలతో నేల మారు మ్రోగుతుండగా, గాయకుల గంధర్వగానాలు, నృత్యాంగనల కమనీయ నృత్యాలు, వంధిమాగదుల స్తోత్రాలు, జానపదుల పల్లెపాటలు వీధులలో నడిచే వారిని అలరిస్తుండగా, రాజమాతలు, బ్రాహ్మణులు, అమాత్యులు, రాకుమారులు, అంతఃపురస్త్రీలు, అధికారులు, పురప్రముఖులు వివిధ రకాల రథాలలో, పల్లకీలు, మేనాలలో అక్కడికి వచ్చారు.

దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్దార్ధుడు, అర్థ్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు మొదలగు మంత్రులు చిత్ర విచిత్ర అలంకారాలతో, రత్నాలంకార భూషణాలతో రథాలు, గుర్రాలు, ఏనుగులపైన వచ్చారు.

అసంఖ్యాక పదాతిదళాలు, కత్తులు, ఈటెలు ధరించి కవాతు చేస్తూ వచ్చారు.

సామాన్య పౌరులు పిల్లాజెల్లాతో వీలైన వాహనాలలో వచ్చారు. దానితో నందీగ్రామం నేల ఈనినట్లయినది.

******************

కులగురువు వశిష్ఠుల వారు చేతిలో పూలమాలలతో, మధురమైన పదార్ధాలతో ముందుకు దారితీశారు. మంత్రులు, వణిక్ప్రముఖులు, అధికారులు ముందుకు కదిలారు. శత్రుఘ్నుడు ఛ•త్రచామరములతో ఉండగా, నార చీరలు ధరించి ఉపవాసాలచే కృశించిన భరతుడు దప్పిగొన్న ఏనుగు నీటికై పరుగులు తీసినట్లు శ్రీరామచంద్రుని పాదుకలు శిరస్సున దాల్చి రామునికి ఎదుర్కోలు పలికేందుకు బయలుదేరాడు.

‘‘అదిగో రామయ్య తండ్రి, సీతమ్మతల్లి వస్తున్నారు’’ అన్న ఆబాలగోపాల శబ్దాలు ఆకాశాన్ని అంటాయి.

పండ్లతో, పూలతో నిండిన కొండ నేలకు దిగినట్లుగా పుష్పక విమానం నేలను తాకింది.

రాముడిని ఆహ్వానించటానికి వచ్చిన వారు రామదర్శన కుతూహలముతో తమ తమ వాహనాలు విడిచి నేలపైన నడవసాగారు.

భరతుడు వజ్రాయుధం ధరించిన దేవేంద్రుని వలె ప్రకాశిస్తూ, మేరు పర్వత శిఖరంపై ఉదయిస్తున్న సూర్యుని వలె ఉన్న శ్రీరామచంద్రుని వద్దకు చేరాడు. అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. సాష్టాంగం సమర్పించాడు.

శ్రీరాముడు భరతుని లేవదీసి అక్కున చేర్చు కున్నాడు. భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ, సీతమ్మకు ప్రవరనామాలు చెప్పి భక్తితో నమస్కరించాడు లక్ష్మణుని ఆలింగనం చేసుకున్నాడు. అటు పైన భరత శత్రుఘ్నులు మనుష్య రూపంలో ఉన్న జాంబవంతుని, అంగదుని, మైందుని, నలుని, నీలుని, ద్వివిదుని, గంధమాదనుని కౌగిలించుకొని కుశలప్రశ్నలు వేశారు.

భరతుడు సుగ్రీవునితో, ‘‘సుగ్రీవా! ఆత్మీయతతో ఆదుకోవటం మిత్రుని లక్షణం. అపకారం చేయుట శత్రు స్వభావం. నీమంచి మనసుతో మాకు సోదరుడవైనావు. నేటి నుండి మనం ఐదుగురం’’ అని సాదరంగా పలికాడు

శత్రఘ్నుడు విభీషణునితో, ‘‘అన్నా! నీ సాయం వల్ల మా అన్నగారు దుష్కర కార్యం సాధించారు’’ అని ప్రియోక్తులు పలికాడు.

శ్రీరామచంద్రుడు, సీతా, లక్ష్మణులు అక్కడ ఉన్న రాజమాతల, కులగురువుల, భూసురుల ఆశీర్వా దాలు పొందారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు మంత్రులను, పుర ప్రముఖులను పేరు పేరున పలకరించాడు.

ఆ తరువాత ‘‘మహాబాహు! కౌసల్యావర్ధనా! స్వాగతం !’’ అన్న ప్రజల వాత్సల్య సాగర వాగ్ఘోష ఆకాశానికి అంటుతుండగా, పుష్పకం భరతాదులతో ఆశ్రమానికి చేరుకున్నది.

శ్రీరాముని ఆజ్ఞమేరకు పుష్పకవిమానం కుబేరుని సీమకై ఉత్తరం వైపునకు వెళ్లిపోయినది.

***************

భరతుని ఆశ్రమంలో ఆసనాలపైన, ఆస్తరణా లపైన అందరూ సుఖాసీను లయ్యారు.

దేవేంద్రునికి బృహస్పతి వలె శ్రీరామునికి గురువైన వసిష్ఠునికి భరతుడు ప్రణామాలు అర్పించాడు. శ్రీరాముని వైపు తిరిగి, ‘‘ఓ రామా! మా తల్లి తృప్తికై నీవు వనవాసం స్వీకరించావు. ఈ రాజ్యపాలనం నాకు న్యాసంగా అప్పగించావు’’ అంటూ ప్రాంజలియై పలికాడు.

భరతుని పలుకులను శ్రీరాముడు వాత్సల్యంతో, రాజమాతలు ఆసక్తితో, సుగ్రీవ విభీషణాదులు గౌరవాదరాలతో వినసాగారు. హనుమ ఆనందంతో శ్రీరామచంద్రుని పాద పంకజాలపైన చూపులు నిలిపి భక్తి పారవశ్యంలో ఉన్నాడు.

వసిష్ఠుడు భరతునితో, ‘‘భరతా! రామధ్యాన తపోవ్రతా! రాముడు దుర్జనాటవిలో, నీవు జనాటవిలో ఇంతకాలం హింసలు అనుభవించారు. మనసులో ఉన్న మాటలు చెప్పుకొని ఊరడిల్లండి’’ అన్నాడు.

‘‘అన్నా! కోసలేంద్రా! బలీయమైన వృషభం ఒంటరిగా భారం మోయగలదు. కానీ దూడ ఆ భారం మోయలేదు. అంతటి మహారాజ్య పాలనకు నేను అశక్తుడను’’ అంటూ కాసేపు ఆగాడు. శ్రీరాముడు భరతునివైపు ప్రసన్నంగా చూస్తున్నాడు.

ఎడారి లాంటి తమ జీవితంలోకి వసంతంలా నడచి వచ్చిన రాముడిని రాజమాతలు కన్నార్పకుండా చూస్తున్నారు. భరతుడు, ‘‘అన్నా! గుర్రం వేగాన్ని గాడిద, హంస గమనాన్ని కాకి అందుకోలేదు. అలాగే రాజ్య రక్షణలో నీ సామర్థ్యాన్ని నేను అందుకోలేను’’ అంటూ లక్ష్మణ శత్రుఘ్నులవైపు చూశాడు. వారు అతడిని చూపులతో అభినందిస్తున్నారు.

భరతుడు, ‘‘ఇక్ష్వాకుల తిలకా! జానకీ ప్రాణనాయకా! ఒక మహానుభావుడు ఒక మొక్కను తన ఇంటిలో నాటాడు. అది శాఖోపశాఖలుగా పెరిగి, పూలతో విరాజిల్లుతూ మహావృక్షమైనది. కానీ ఆ వృక్షం పండ్లనీయకుండా శిథిలమైతే ఆ సజ్జనుని లక్ష్యం నెరవేరదు కదా? అన్నా! నా ఆంతర్యం నీకు తెలుసు. ఆ మహానుభావుడు మన తండ్రిగారు. ఆ వృక్షం మీరు. మీరు రాజ్యాధికారం స్వీకరించి, ప్రజలకు సుఖ సంతోషాలను ఈయనిచో ఆయన కలలు కల్లలు అవుతాయి.

పురుషోత్తమా! పూజ్యులైన మీరు అప్పగించిన రాజ్యాన్ని పాలిస్తూ, కోశాగారాన్ని ధాన్యాగారాన్ని, సైన్యాన్ని పదింతలు చేశాను. ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లుతున్నారు. నీ పాదుకలనే నిర్ణయ వేదికలుగా చేసుకొని, ఇంతకాలం ఈ బరువు మోశాను. ఇంక ఈ అల్పుణ్ణి రాజ్యభార విముక్తుణ్ణి చేసి, నీ నిజ పాదారవింద సేవను అనుగ్ర హించాలి.

నీవు పట్టాభిషిక్తుడవై నీ భక్తులం, భృత్యులమైన మమ్ము పాలింపుము’’ అంటూ గద్గిదుడై మరొక్కసారి రామ పాదాలను తాకాడు.

రాముడు భారతుడిని ఒడిలోకి తీసుకున్నాడు. కన్నీరు తుడిచాడు.

వసిష్ఠుడు ‘‘రామా! నీవు పట్టాభిషిక్తుడవై సకల రాజ్యభోగాలు అనుభవించు. అనుదినం వందిమాగధుల స్తోత్రపాఠాలతో భూసురుల మంత్రోచ్చరణలతో, యువతుల కటి భూషణముల సవ్వడులతో, కాలి అందెల రవళులతో మేలుకో. జ్యోతిశ్చక్రం తిరుగుతున్నం వరకు, నాలుగు దిక్కులా సాగరంను కలిగిన నేలను  జనరంజకంగా పాలించుము. రాజ్యమన్న రామునిది, పరిపాలన అన్న రామునిది అన్న కీర్తిని పొందుము’’ అని పలికాడు.

 నిండారిన సోదర ప్రేమతో బరువెక్కిన ఆ అశ్రమ వాతావరణాన్ని చూసి సుగ్రీవుడు ఆనందబాష్పాలు ఒలుకించాడు. ‘‘భరతా! నేటి ఈ న్యాస ఘట్టం భరతఖండ చరిత్రలో సువర్ణాధ్యాయమై నిలుస్తుంది. మీ సోదరుల జీవితాలు, భ్రాతృ వాత్సల్యానికి, విశ్వాస పాత్రతకు ఉదాహరణగా, జాతికి మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని పలికాడు.

విభీషణుడు ఆనందబాష్పాలతో ‘‘మీ సోదరుల అవ్యాజానురాగం, వాత్సల్యాలను ఆదర్శంగా తీసుకున్న కుటుంబాలలో రాజ్యకాంక్ష, అహంకార ధోరణి, వ్యర్థ కలహాలు ఉండవు. ఈ ఘటన నాకూ, సుగ్రీవునికే కాక దుస్తర పరిస్థితులలో విడిపోయే అన్నదమ్ములకు దారి దీపం అవుతుంది. మీ సోదరుల జీవితాలు రాబోయే యుగాలకు దిక్సూచులు అవుతాయి.

ఈ న్యాస ఘట్టం మహాభారతీయ చరిత్రలో మహోపన్యాసమై నిలిచిపోతుంది’’ అని పలికాడు ఉద్విగ్నంగా. సుహృద్భావ వాతావరణంలో జరుగు తున్న ఆ సంభాషణలను అందరూ ఆసక్తి, ఉత్సాహాలతో ఆలకిస్తున్నారు.

శ్రీరామ రాజ్యానికై ఎదురుచూస్తున్న సోదరులు, మంత్రులు, ప్రజానీకం ముకుళిత హస్తాలతో శ్రీరామునివైపు చూస్తున్నారు. కరుణాజలధి దాశరథి రాజమాతలకు, గురువులకు నమస్కరిస్తూ, సోదరులవైపు, మంత్రులవైపు, ప్రజానీకం వైపు చూస్తూ, చిరునవ్వుతో, ‘‘తథాస్తు’’ అని పలికాడు.

ఆశ్రమంలో పుష్పవర్షం కురిసింది. దేవ దుందుభులు మ్రోగాయి.

శ్రీరామరాజ్యం ప్రారంభమైనది.

About Author

By editor

Twitter
YOUTUBE