జూన్‌ 11 ‌కూర్మ జయంతి

ప్రతి ఘట్టం వెనుక పరమార్థం, సందేశం ఉంటాయనేందుకు క్షీర సాగర మథనాన్ని ఉదాహరణగా చెబుతారు. అమృతం కోసం క్షీర సాగర మథనం అంతసులువు కాదని, దానవుల చేతిలో పరాజితులైన తమకు అంతపెద్ద కార్యసాధన సాధ్యమా? అని దేవతలు అశక్తత వ్యక్తం చేశారు. అయితే ప్రయత్నమంటూ మొదలుపెడితే అవసరమైన ప్పుడు పైవాడు సహకరిస్తాడు. తదేక ధ్యానం, పట్టుద లతో ఆరంభిస్తే సత్ఫలితాలు ఉండవచ్చు. ఒకవేళ మధ్యలో ఒడిదొడు కులు ఎదురైతే పరమాత్ముని సహకారం ఉండక పోదన్నది ఈ అవ తార సారాంశం. సూక్ష్మంగా పరిశీలిస్తే, పాలసంద్ర మథన ఘట్టంలో ఆధ్యాత్మిక, వేదాంత అంశాలు అవగతమవుతాయి. మనస్సును క్షీరసాగరం అనుకుంటే మందరగిరి ధ్యానం. ధ్యానంతో మనసును మథించాలి. అప్పుడే అమృతమనే ఏకాగ్రత, మోక్షం సిద్ధిస్తాయి. నిలకడలేని ధ్యానంతో ప్రయోజనం ఉండదనేందుకు ఆ పర్వతం నీటిలోకి ఒరిగిపోబోవడాన్ని ఉదాహరణగా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.


శ్రీమహావిష్ణువు ప్రసిద్ధ అవతారాలలోని అ‘ద్వితీయం’ కూర్మావతారం. దేవదానవులు క్షీరసాగరంలో అమృత మథనానికి యత్నించినప్పుడు కవ్వంగా నిర్దేశించిన మందర పర్వతం సాగరజలాల పాలుకాకుండా దానిని కాపాడేందుకు హరి కూర్మ రూపుడిగా అవతరించాడు. మందరగిరిని వీపున మోస్తూ సముద్ర మథనానికి చేయూతనిచ్చాడు. కృతయుగంలో 28వ మహాయుగంలో ఏడవ మనువైన వైవస్వతుని కాలంలో కూర్మావతార ఘట్టం చోటుచేసుకుందని ఐతిహ్యం.

పాండవ వంశజుడు పరీక్షిత్‌ ‌మహారాజు వినతిపై శ్రీశుకమహర్షి భాగవత విశేషాలను వివరించగా, పోతనామాత్యుడు కూర్మావతార ఘట్టాన్ని శ్రీమద్భా గవతం అష్టమ స్కంధంలో కమనీయంగా, రమణీ యంగా ఆవిష్కరించారు.

రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతలు విజయ సిద్ధి, మృత్యుభయ నివారణకు ఉపాయం కోసం విధాతను శరణువేడి ఆయన నేతృత్వంలో శ్రీహరిని ఆశ్రయించారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించాలని హితవు చెప్పాడు దేవదేవుడు. ‘అయితే అది అత్యంత క్లిష్ట పక్రియ. అందుకు కవ్వం, తాడులాంటి సాధనాలు కావాలి. కడలిని చిలికేందుకు తాడుకు ఇరువైపుల బలగం కావాలి. అది కేవలం తమ వల్ల సాధ్యం కాదు’ అనే ఆలోచనలో పడ్డారు సురలు. వారి మనోగతాన్ని ఎరిగిన మహావిష్ణువు, అసురలతో సఖ్యత కుదుర్చుకుని కార్యం ప్రారంభిం చాలని ఉపాయం చెప్పాడు జగన్మోహనుడు. ఆ దిశలో చేసిన ప్రయత్నాలు ఫలించగా, సముద్రాన్ని చిలికేందుకు శ్రీహరి ఆజ్ఞపై గరుడుడు కవ్వంగా మందర పర్వతాన్ని సాగరతీరానికి చేర్చాడు. వాసుకు కవ్వపు తాడుగా నియుక్తులయ్యాడు. దానవులు వాసుకి శిరోభాగం వైపు, దేవతలు తోకభాగంవైపు పట్టుకుని సాగర మథనం ప్రారంభించారు. అంతలో అదుపు  తప్పిన మందరం బుడబుడమని నీట మునిగి పోతుండడంతో దేవదానవుల ప్రార్థనతో విష్ణువు కూర్మరూపుడై గిరిని వీపున ధరించాడు.

‘కమఠంబై జలరాశి జొచ్చి లఘుముక్తాశుక్తి/చందంబునన్‌ ‌నమదద్రీంద్రము నెత్తె వాసుకి/మహానాగంబుతో లీలతో…కమలాక్షా! /శరణంబు భూదిశలు నాకాశంబునన్‌ ‌మ్రోయగనన్‌ (‌తాబేలుగా మారిన శ్రీహరి తేలికైన ముత్తెపు చిప్పలాగ ప్రవేశిం చాడు. అడుగున ఉన్న పర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు.)

‘సవరనై లక్ష యోజనముల వెడలుపై కడు గఠోరమైన…. సుందరంబుగ విష్ణుండు సురల తోడి, కూర్మి చెలువొంద నొక కూర్మమయ్యె’ (ఆ కూర్మం లక్ష యోజనాల వెడల్పు, మిక్కిలి కఠినమైన డిప్ప కలిగింది. సమయం వస్తే బ్రహ్మాండాన్నీ మింగ గలిగే పెద్ద గుహలాంటి నోరు… స•కల జీవరాశులను తనలో దాచుకోగలిగిన పెద్ద పొట్ట. ఒక ప్రపంచం వేరే ప్రపం చంపై పడితే చలించనంతటి బలమైన కాళ్లున్నాయి. లోనికి, బయటికి వచ్చే పెద్ద మూతి, తామరల్లాంటి కన్నులున్నాయి. ఇలా శ్రీకూర్మావతార వర్ణన మనో హరంగా చేశారు పోతనామాత్యుడు.

కచ్ఛప రూపుడైన కమలనాథుడు మందరం అటుఇటు ఊగకుండా గిరి శిఖరాన్ని వేయి చేతులతో పట్టుకున్నాడు. తాడుగా మారిన వాసుకి శరీరం చిలుకుతున్నప్పటి రాపిడికి తెగిపోకుండా శక్తిని, దేవదానవులలో ఆవేశించి బలాన్ని ప్రసాదించడంతో సురాసురులు పాలకడలిని తరచడం పునః ప్రారంభిం చారు. అలా కడలి అనే మజ్జిగ కడవకు కుదురు, కవ్వమూ, రాట కట్టే తాడూ తానే అయ్యాడు. ‘జలధి గడవ సేయు శైలంభు గవ్వంబు..సిరియు, సుధయు బడయు శ్రీవల్లభుడు దక్క నొరుడు శక్తి మంతుడొకడు గలడె? (సముద్రాన్ని కడవగా, పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి, లక్ష్మిని, అమృతాన్ని సంపాదించ డానికి శ్రీహరియే శక్తిమంతుడు)అన్నారు పోతన.

ఆది శ్రీకూర్మం క్షేత్రం

యావత్‌ ‌భారతదేశంలోనే ఏకైక కూర్మనాథా లయం ఆంధప్రదేశ్‌ శ్రీ‌కాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల మధ్య వెలసి ఉంది. అదే శ్రీకూర్మ క్షేత్రం. ఆదికూర్మక్షేత్రం నెలవై ఉన్న శాలిహుండం కొండను ‘కూర్మాద్రి’ అనీ వ్యవహరిస్తారు. పద్మ, బ్రహ్మ పురాణాలలో ఈ క్షేత్రం విపులంగా వర్ణితమైంది. బ్రహ్మదేవుడు స్వామిని ప్రతిష్ఠించాడని, శ్వేతచక్రవర్తి తపోఫలితంగా కూర్మనాథుడు వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ పరమేశ్వరుడిని (పాతాళ సిద్ధేశ్వరుడు) క్షేత్రపాలకుడిగా నియమించారు. విజయనగరం పూసపాటి వంశీయుల సంస్థానంలోని శతాధిక ఆలయాలలో అగ్రగామిగా నిలిచిన వాటిలో ఇది ఒకటి.

ఈ క్షేత్రం వైష్ణవ, శైవ సంప్రదాయాల సమైక్య తకు ఆలవాలమై, అరుదైన విశేషాలతో విరాజిల్లు తోంది. ఇది వైష్ణవ ఆలయమైనా దాని చుట్టూ ఐదు శివాలయాలు (సుందరేశ్వర, కర్పూరేశ్వర, కోటేశ్వర, హాటకేశ్వర, పాతాళసిద్దేశ్వర) ఉన్నందున ఈ ప్రదేశాన్ని పంచలింగాత్మక క్షేత్రమనీ వ్యవహరిస్తారు. ఈ ఆలయంలోని శంఖనిధి, పద్మనిధులకు బలరామ కృష్ణులు పాలకులుగా ఉంటారు. ఆలయ గోపురానికి శ్రీకూర్మ విమానమని పేరు. శ్వేతాచలంగా వ్యహ రించే ఈ ప్రాంతాన్ని ఏలిన శ్వేత చక్రవర్తి చేసిన తపస్సుకు మెచ్చి జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు శ్రీ కూర్మ రూపంలో సాక్షాత్కరించి, ఈ రూపంలోనే తనను అర్చించాలని చెప్పినట్లు స్థల పురాణం. అంతేకాదు చక్రధారి హరి మహారాజుతో ఒక వటవృక్షం వద్దకు వచ్చి చక్రాయుధ ప్రయోగంతో చక్కని తీర్థం (సరస్సు) నిర్మించాడట. అప్పటి నుంచి అది చక్రతీర్థం, కూర్మగుండం, శ్వేతగుండం అనే పేర్లతో ప్రసిద్ధికెక్కింది. మహాక్ష్మి ఇందులోనే అవతరించి ‘శ్రీకూర్మ నాయిక’గా పూజలందు కుంటున్నారు. ఈ పుష్కరిణిని ‘మోక్షస్థానం’గా వ్యవహరిస్తారు. కాశీ, పూరీ క్షేత్రాలలో మాదిరిగా ఇక్కడ పిండప్రదానాలు చేస్తారు. నదీ తీరాలలో మాదిరిగా పుష్కరిణిలో అస్తి నిమజ్జనం చేస్తారు. అవి సాలగ్రామాలవుతాయని ప్రతీతి. ఈ పుష్కరిణిలో మాఘ శుక్ల చవితి నాడు గంగా గమన యాత్ర జరుగుతుంది. అందరి పాపాలను కడిగేసే గంగాదేవి వాటి పరిహారార్థం స్వామి సూచన మేరకు కూర్మ గుండంలో ఆనాడు పుణ్నస్నానమాచరిస్తుందని పురాణ ప్రసిద్ధం. కూర్మనాథుడు శనీశ్వరునికి అధిదేవత కనుక ఈ ఆలయం దర్శనంతో శని దోష నివారణ అవుతుందని చెబుతారు.

జంట ధ్వజస్తంభాలు

‘భాష్యకార ప్రసన్నాయ పరమానంద రూపిణే!

శ్వేతచల నివాసాయ కూర్మనాథాయ మంగళమ్‌!!

ఏ ‌వైష్ణవ క్షేత్రంలో లేని విధంగా జంట ధ్వజ స్తంభాలు ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. విశిష్టాద్వైత మత ప్రవక్తమ్‌ ‌రామానుజాచార్యులు ఆరాధనతో స్వామి వారు దిశమార్చి చూడడం వల్ల ఈ జంట ధ్వజస్తంభాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆలయ తూర్పు దిక్కున ధ్వజ స్తంభం ఉండడం సర్వ సాధారణం. ఈ క్షేత్రంలో స్వామి పడమర వైపు చూస్తున్నాడు కనుక అటువైపున రెండవ ధ్వజస్తంభం ఏర్పాటైంది. భగవద్రామానుజులు పూరీ జగన్నాథ స్వామి దర్శనానంతరం ఈ ఆలయాన్ని పునః ప్రతి ష్ఠించారని 1281 నాటి శాసనం బట్టి తెలుస్తోంది. దివ్యక్షేత్ర సంస్కరణల జైత్రయాత్రలో భాగంగా ఆయన పూరీ క్షేత్రంలో ఆరాధన విధానాన్ని సవరించేందుకు యత్నించగా, పాత విధానమే కొనసాగాలని అక్కడి అర్చకవర్గాలు స్వామిని వేడుకున్నాయట. దాంతో రామానుజులకు స్వప్న సాక్షాత్కారం చేసిన జగన్నాథుడు, నూతన ఆరాధన విధానాన్ని శ్రీకూర్మంలో ప్రవేశపెట్టవలసిందిగా అనుజ్ఞ ఇచ్చారట. వైష్ణవం ప్రకారం అర్చనాదులు సాగే క్షేత్రంలో వీరశైవం ప్రబలిన కాలంలో శైవారాధన జరుగుతుండగా, అక్కడి మూలవిరాట్‌ను కూర్మ  రూపంగా ప్రకటించాలని స్వామి ఆదేశించా రట. అందుకు అనుగుణంగా రామానుజులు స్థానిక ఏలికలు, ఆధ్యాత్మికవాదులతో వాదించి ఒప్పించారని ‘ప్రసన్నామృతం’ అనే గ్రంథంలో ఉందని ఆలయ స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు పేర్కొన్నారు. రామానుజులు మూలవిరాట్‌కు వెనుకవైపు కూర్చుని ప్రార్థించగా, స్వామి పశ్చిమ దిక్కుకు తిరిగాడట. ఆ కారణంతోనే ఈ క్షేత్రంలో తూర్పు, పడమరలుగా రెండు ధ్వజ స్తంభాలు దర్శనమిస్తాయి. ఈ విశేషాలను అక్కడి శిలాఫలకాలు తేటతెల్లం చేస్తాయి. త్రేత, ద్వాపర యుగాలకు చెందిన లవకుశులు, బలరాముడు, ఈ యుగంలో శంకరభగవత్పాదులు సహా ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని పు•రాణేతిహాసాలు పేర్కొంటున్నాయి.

ఆదిశంకరులు తమ ఆరాధనలో నుంచి ప్రసాదించిన సుదర్శన సాలగ్రామమూర్తిని మూల వరుల వాల భాగంలో నేటికీ దర్శించుకోవచ్చని శ్రీభాష్యం వారు తెలిపారు. ఆలయ సందర్శనంలో తాబేళ్ల ప్రదర్శన శాల ప్రత్యేక ఆకర్షణ.

‘బ్రహ్మాండకోటి పరిపూర్ణ మహోదరాయ

క్షీరాబ్ధి నిర్మదన మందర ధారకాయ

విశ్వాత్మనే సకల లోకసముద్ధరాయ

కూర్మావతార సతతం భజేతే నమోస్తు’

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE