మోదీ 8 ఏళ్ల పాలన

మే 30 నాటికి మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి సరిగ్గా ఎనిమిదేళ్లు. గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు, ప్రధానిగా 8 ఏళ్లు కలిపి ఆయన మొత్తం రాజ్యాంగ పదవుల్లో కొనసాగిన కాలం 7541 రోజులు. గత ప్రధానులెవ్వరూ ఇంతకాలం రాజ్యాంగ పదవుల్లో కొనసాగలేదు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో మోదీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప నేతగా ఎదిగారు. భాజపాలో ఆయన ఇప్పుడు తిరుగులేని నేత. పార్టీని గతంలో ఎన్నడూ లేని రీతిలో సమున్నత స్థానంలో నిలిపారు. ముఖ్యంగా బీజేపీ ఉనికేలేని ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావడం నిజంగా అద్భుతం. అయితే దక్షిణాదిలో పార్టీ ఇంకా వెనుకబడే ఉంది. గతంలో ఎవరూ కనీసం కలలో కూడా ఊహించని అయోధ్యలో రామమందిర నిర్మాణం సుసాధ్యం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం, 35ఎ రద్దు (ఆగస్టు 5, 2019), పౌరసత్వ సవరణ చట్టం (పొరుగు దేశాల్లో మైనారిటీలకు మనదేశంలో పౌరసత్వం కల్పించే చట్టం), త్రిపుల్‌ ‌తలాక్‌ ‌చట్టం (ఆగస్టు 1, 2019) మొదలైనవి ఆయన ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు. ఇక మిగిలింది ఉమ్మడి పౌరసత్వ చట్టం అమల్లోకి తేవడం. కొవిడ్‌-19 ‌మహమ్మారిని మోదీ ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంది. సెప్టెంబర్‌ 18, 2018‌న పీఓకేపై సర్జికల్‌ ‌దాడులు నిర్వహించడం; ఫిబ్రవరి 26, 2019న జరిగిన పుల్వామా దాడులకు ప్రతీకారంగా బాలాకోట్‌ ఉ‌గ్రవాద శిబిరాలపై మన వైమానికదళ దాడులు.. మోదీ సాహస నిర్ణయాలకు ఉదాహరణలు.


మెజారిటీ, మైనారిటీలు ముఖ్యంగా హిందు వులు, ముస్లింల మధ్య నిరంతరం జరిపిన చర్చల ఫలితంగా మత సంబంధ చట్టాలు, త్రిపుల్‌ ‌తలాక్‌, ‌సిటిజన్‌షిప్‌ ఎమెండ్‌మెంట్‌ ‌యాక్ట్ ‌వంటివి అమల్లోకి తీసుకురావడం సాధ్యమైంది. అయోధ్య వివాదానికి పరిష్కారం లభించింది. బాబ్రీ కట్టడం కూల్చివేత తీవ్రస్థాయి చట్ట ఉల్లంఘన అని సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్నప్పటికీ చర్చల వల్ల కలిగిన సానుకూల ఫలితాలు, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బాటలు వేశాయి. అయోధ్య స్ఫూర్తితో ఇప్పుడు కాశీ, మధుర, ఢిల్లీల్లో దేవాలయాలపై మసీదులు నిర్మించా రంటూ పిటిషన్లు దాఖలు చేయడానికి దోహద పడింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణను రద్దుచేయడం మోదీ కీర్తి కిరీటంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నిజానికి 1990 నుంచి జమ్ముకశ్మీర్‌లో హింస జీవనంలో ఒక భాగంగా మారిన నేపథ్యంలో ఇక్కడ ఏవిధమైన అల్లర్లకు తావులేకుండా, అంతర్జాతీయంగా ఏ విధమైన ఒత్తిళ్లు లేకుండా 370 అధికరణను రద్దుచేయడం నిజంగా మోదీ సాధించిన అద్భుత విజయం.

సంస్కరణలతో ముందడుగు

ఎనిమిదేళ్ల క్రితం మోదీ ‘సబ్‌ ‌కా సాత్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌’ ‌నినాదంతో ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టారు. ఇందులో భాగంగా 2024-25 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించా లన్నది కూడా లక్ష్యం. ఇందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలు, ఉజ్జ్వల యోజన, జన్‌ధన్‌ ‌యోజన వంటి వాటితోపాటు పాలనాపరంగా అనేక మార్పులు అమల్లోకి తెచ్చారు.

దేశంలో కనిపిస్తున్న మార్పులకు మోదీ ప్రభుత్వం చేపట్టిన 8 కీలక సంస్కరణలు ప్రధాన కారణం. 1. నోట్ల రద్దు, 2. జీఎస్‌టీ (దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ, ఒక దేశం-ఒక పన్ను అనేది దీని విధానం. ఇది దేశంలో అమల్లో ఉన్న బహుళ పన్ను వ్యవస్థను రద్దు చేసి, ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జీఎస్‌టీ నమోదు తప్పనిసరి చేయడంతో ప్రభుత్వానికి అత్యధిక మొత్తంలో పన్ను ఆదాయం లభిస్తోంది). 3. ఉజ్వల పథకం: దేశంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఐదుకోట్ల మంది మహిళలకు ఉచిత ఎల్‌.‌పి.జి. కనెక్షన్‌ ‌సదుపాయం కల్పించడం. 2016, మే నెలలో  ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది. 2018లో ఈ పథకాన్ని మరో ఏడు కేటగిరీలకు చెందిన మహిళలకు కూడా విస్తరించి లక్ష్యాన్ని 8 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని గడువుకు ఏడునెలల ముందే సాధించడం విశేషం. 2021-22లో కేంద్రం మరో కోటి ఎల్‌.‌పి.జి. కనెక్షన్లను విడుదల చేసింది. దీన్నే ఉజ్జ్వల 2.0 అని వ్యవహరిస్తున్నారు. 4. ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టీ కోడ్‌ (‌దివాలా చట్టం-2016), 5. ఆర్‌.ఇ.ఆర్‌.ఏ. (‌రియల్‌ ఎస్టేట్‌ ‌రెగ్యులేటరీ అథారిటీ), 6. జన్‌ధన్‌ ఆధార్‌ ‌మొబైల్‌ (‌జెఏఎం). దీన్ని 2014-15 ఆర్థిక సర్వేలో మొట్టమొదటిసారి ప్రతిపాదించారు. 2016 నుంచి ప్రభుత్వం జన్‌ధన్‌ను లబ్ధిదారుల ఆధార్‌, ‌మొబైల్‌ ‌నెంబర్లకు లింక్‌ ‌చేయడం మొదలుపెట్టింది. అట్టడుగున ఉన్నవారిని కూడా ఆర్థికంగా అనుసంధానించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. నిజంగా ఇది గొప్ప మార్పు. ముఖ్యంగా కొవిడ్‌ ‌సమయంలో, లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా సహాయాన్ని జమచేయడానికి ఉపయోగ పడింది. 7. కార్పొరేట్‌ ‌పన్నులో కోత: గత 28 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పన్ను కోత ఇది. 2019 సెప్టెంబర్‌ ‌నెలలో, అంతకు ముందు 30 శాతం ఉండగా దాన్ని 22 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా పోటీపడేందుకు, దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన చర్య ఇది. 8. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం: 2019, ఆగస్టు 30న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ ‌బ్యాంకుల విలీనాన్ని ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ద్రవ్యోల్బణం నుంచి ఎగుమతుల దాకా..

మోదీ ప్రభుత్వం ఏర్పడే నాటికి అంటే 2014లో దేశంలో ద్రవ్యోల్బణం 8.33%. భరించదగ్గస్థాయి ద్రవ్యోల్బణం 2-6 శాతంగా ఆర్‌.‌బి.ఐ. పేర్కొన్న దాని కంటే ఇది ఎక్కువ. అయితే 2022 ఏప్రిల్‌లో రిటైల్‌ ‌ద్రవ్యోల్బణం 7.99%కు చేరుకోవడంతో, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్‌.‌బి.సి. వడ్డీరేట్లను 40 బేసిక్‌ ‌పాయింట్లకు, క్యాష్‌ ‌రిజర్వ్ ‌రేషియోను 0.50%కు పెంచడం ద్వారా ఉపశమన చర్యలు చేపట్టింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో నిరుద్యోగం 5.4 శాతంగా ఉంది. సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ సమాచారం ప్రకారం ఇది 2016లో 8.72 శాతానికి పెరిగి నప్పటికీ, మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2017లో 3.3%కు పడిపోవడం గమనార్హం. అన్ని రంగాల వారికి ఉపాధి కల్పనలో ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి. తర్వాత కొవిడ్‌ ఉపాధి పరిస్థితులను మరింత తలక్రిందులు చేసింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఎగుమతులు 310.1 బిలియన్‌ ‌డాలర్లు కాగా దిగుమతులు 447.6 బిలియన్‌ ‌డాలర్లు. తర్వాతి సంవత్సరాల్లో ఈ ఎగుమతులు ఏటా 300 బిలియన్‌ ‌డాలర్లకు అటూ ఇటూ కొనసాగగా, 2022లో వీటిని 400 బిలియన్‌ ‌డాలర్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. షెడ్యూలుకు 8 రోజుల ముందే ఆ మార్కును దాటడం విశేషం.

మోదీ ప్రభుత్వ హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు గణనీయంగా పెరగడం విశేషం. 2021- 22లో ఇవి 83.57 బిలియన్‌ ‌డాలర్లు. మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వ హయాం కంటే ఇవి సగటున రెండింతలు అధికం. ఈ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌.‌డి.ఐ.)లో సింగపూర్‌, ‌యు.ఎస్‌, ‌మారిషస్‌, ‌నెదర్లాండ్స్, ‌స్విట్జర్లాండ్‌ ‌దేశాల వాటా 76%. మరి 2014లో ఈ ఎఫ్‌డిఐలు 16.05 బిలియన్‌ ‌డాలర్లు మాత్రమే. 2014-15లో దేశ తలసరి ఆదాయం రూ.86,484 ఉండగా, 2019-20 నాటికి ఇది రూ.1.32లక్షలకు చేరుకొని, 2022 నాటికి రూ.1.50 లక్షలకు పెరిగింది. దేశ ప్రజలు 2014తో పోల్చినప్పుడు ప్రస్తుతం 73% అదనంగా సంపాదిస్తుండటం విశేషం. 2014-15లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి 2014 మే 16న బి.ఎస్‌.ఇ. ‌సెన్సెక్స్ 25,000 ‌మార్క్‌ను దాటగా, తర్వాతి నాలుగేళ్లలో 35,000 మార్క్‌ను దాటేసింది. మోదీ రెండోసారి అధికారంలోకి రాగానే ఇది 40,000 మార్క్‌ను దాటి రికార్డు సృష్టించింది.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో దేశ జి.డి.పి. 7.5%గా నమోదైంది. అయితే కొవిడ్‌ ‌విపత్తు నేపథ్యంలో 2020 నాటికి ఇది 4.2%కు పడిపోయింది. కొవిడ్‌-19 ‌మహమ్మారి మనదేశాన్ని మాత్రమే కాదు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. లాక్‌డౌన్‌ల పుణ్యమాని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2020 నాటికి 3.7 ట్రిలియన్‌ ‌డాలర్లకు కుంచించుకు పోవడం గమనార్హం. క్రమంగా కొవిడ్‌ ‌దెబ్బ నుంచి కోలుకొని అన్ని రంగాలు కుదుట పడుతున్నందుకు సూచనగా 2022 తొలి త్రైమాసికంలో దేశం గతంలో ఎన్నడూ లేనివిధంగా 20.1% వృద్ధిని నమోదు చేసింది. అయితే రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ఈ సంతోషాన్ని నిలువనీయలేదు. ఈ యుద్ధం అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో ప్రపంచం మరో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇందుకు మన దేశమూ మినహాయింపేమీ కాదు. ఇటీవల భారతీయ స్టేట్‌బ్యాంక్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం బేవరేజెస్‌, ఇం‌ధనాలు, రవాణా వంటి వాటి ధరలు 52% పెరిగాయి. ఫాస్ట్ ‌మూవింగ్‌ ‌కన్జూమర్‌ ‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎం‌సీజీ) రంగంలో ఇన్‌పుట్‌ ‌ధరలు ఒక్కసారిగా 7% పెరిగాయి. కొవిడ్‌ ‌సమయంలో పెరిగిన ధరలు వినియోగదారులను షాక్‌కు గురిచేయగా, ఈ ఏడాది గోధుమ దిగుబడి తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో భారత ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై నిషేధం విధించాల్సి వచ్చింది. అంతేకాదు పెట్రోల్‌ ‌ధరల తగ్గింపు కూడా పెరుగుతున్న ధరలకు ముకుతాడు వేసే చర్యల్లో భాగమే.

రాజకీయ విజయాలు

ఈ ఎనిమిదేళ్లలో భాజపా రాజకీయంగా ఎనిమిది కీలక విజయాలు సాధించింది. 2014 మే నెలలో బీజేపీ ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా 2022 నాటికి 22 రాష్ట్రాలకు విస్తరించింది. పశ్చిమబెంగాల్‌, ‌మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ‌రాజస్తాన్‌ ‌లలో దెబ్బతిన్నప్పటికీ, ఆ పార్టీ ఆసక్తికరమైన పురోగతి చూపింది. ప్రస్తుతం పార్టీ దేశంలో 70 కోట్ల మంది ప్రజలను పాలిస్తుండగా, 12 రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌కు పిలుపునివ్వడం ద్వారా 2014లో అధికారంలోకి వచ్చిన పార్టీ, దీన్ని నిజం చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. మరోమాటలో చెప్పాలంటే ఈ ఎనిమిదేళ్ల కాలంలో భాజపా ప్రగతి కాంగ్రెస్‌తో పోలిస్తే విలోమాను పాతంలో కొనసాగింది.

భాజపా దెబ్బకు ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ ఇంకా బలపడాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లోని 129 ఎంపీ స్థానాలు కేంద్రంలో అధికారానికి కీలకం. 2024లో భాజపా అధికారం లోకి రావడానికి ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సంపాదించడం పార్టీకి అవసరం. ఇక రాజ్యసభ సీట్ల విషయానికి వస్తే 2014లో కాంగ్రెస్‌ ‌నేతృత్వం లోని యూపీఏ కంటే ఎంతో వెనుకబడిన భాజపా 2022 నాటికి 100 సీట్ల మార్కును దాటే అవకాశ ముంది. 2014లో రాజ్యసభలో భాజపా బలం 55 సీట్లు మాత్రమే. ప్రస్తుతం ఎగువసభలో ఆ పార్టీ బలం 95. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ 20 సీట్లను నిలుపుకొని 91 స్థానాలకు చేరవచ్చు. అయితే ఏడు నామినేటెడ్‌ ‌సీట్లు ఖాళీగా ఉండటంతో, పార్టీ వంద మార్కుకు సమీపానికి వచ్చే అవకాశాలున్నాయి. ఎన్‌డీఏయేతర పార్టీలైన బీజేడీ వంటి వాటి సహాయంతో జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టెక్కవచ్చు.

విదేశీ పర్యటనలు

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మోదీ 28 దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా ఏడుసార్లు పర్యటించింది అమెరికాలో. రష్యా, ఫ్రాన్స్, ‌జర్మనీల్లో ఐదుసార్లు పర్యటించారు. దేశప్రధానిగా ఆయన ఇప్పటివరకు 114 విదేశీ పర్యటనలు జరిపారు.

హోస్టన్‌, ‌టెక్సాస్‌ల్లో మద్దతు దారులతో, బ్రిటన్‌, ఆ‌స్ట్రేలియా కిక్కిరిసిన పార్ల మెంట్‌ల్లో ప్రసగించడం నిజంగా చారిత్రకం. 2017లో ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఈ దేశంలో పర్యటించిన భారత తొలి ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే. ఇది ఇజ్రాయిల్‌పై భారత్‌ ‌వైఖరిలో మార్పును స్పష్టం చేసింది. అదేవిధంగా 2018లో పాలస్తీనాలో కూడా పర్యటించి, ఆ దేశాన్ని సందర్శిం చిన మనదేశ తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు.

 అంతుపట్టని వ్యూహాలు

మోదీ వ్యవహారశైలి చూస్తే ఒక ప్రత్యేక లక్ష్య సాధన దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన వ్యూహాన్ని ముందుగా అంచనా వేయడం కష్టం. నోట్ల రద్దును మనదేశంలో చాలా మంది విమర్శించారు. కానీ ఆ దెబ్బకు పాకిస్తాన్‌ ‌విలవిలలాడిపోయింది. దొంగనోట్ల ముద్రణతో కశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఫండింగ్‌ ‌చేస్తున్న పాక్‌కు నోట్ల రద్దు అశనిపాతం. దీనికి తోడు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌లో, అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. అప్పటినుంచే పాక్‌ ‌పతనం ప్రారంభమైంది. ఇక వియత్నాం- చైనాల మధ్య సముద్ర జలాల్లో చమురు అన్వేషణపై వివాదం కొనసాగుతోంది. చైనా కట్టడికి వియత్నాం చమురు అన్వేషణ బాధ్యతను భారత్‌కు అప్ప గించింది. ముడిచమురును భారత్‌కు ఎగుమతి చేస్తోంది. ఆ విధంగా చైనాపై, భారత్‌ ‌పైచేయి సాధించింది.

చైనాతో అంటకాగుతున్న పాక్‌కు, పెరుగుతున్న భారత్‌-‌యూఎస్‌ ‌సంబంధాలు పెద్ద దెబ్బ. ఇప్పుడు పాక్‌ను పట్టించుకునే స్థితిలో అమెరికా లేదు. పాక్‌-ఆఫ్ఘాన్‌ ‌సంబంధాలు దెబ్బతింటున్నాయి, ఇదే సమయంలో చాపకింద నీరులా భారత్‌ ఆ ‌దేశ ప్రజలకు అవసరమైన సహాయం చేస్తోంది. ఇది కూడా మోదీ మార్క్ ‌వ్యూహమే. దక్షిణాసియాలో సార్క్ ‌సదస్సును రద్దుచేసి తన శక్తి ఏంటో మోదీ ప్రపంచా నికి చూపారు. ఆసియాలో భారత్‌ ఆధిపత్యాన్ని కొనసాగింపజేయడంలో మోదీదే కీలకపాత్ర.

ప్రతి దేశానికి శత్రువులంటారు. కానీ భారత్‌కు పాకిస్తాన్‌, ‌చైనా మాత్రమే శత్రువులు. మిగిలి దేశాలన్నీ మిత్రులే. దేశాలతో జరిపే చర్చల్లో మోదీలోని నిజాయతీ వాటిని కట్టిపడేస్తుంది. కాదనకుండా తలూపడమే అవి చేసేపని. ఇదే వ్యవహారశైలితో ముస్లిం దేశాలను పాక్‌కు వ్యతి

రేకంగా మార్చి తనను తాను గొప్ప రాజనీతిజ్ఞుడిగా నిరూపించుకున్నారు. బద్ధ శత్రువు లైన రష్యా, అమెరికాలతో వ్యవహరించ గల ఏకైక దేశం భారత్‌ ‌మాత్రమే. మరి ఈ ఘనత మోదీకే దక్కుతుంది. ప్రపంచ రాజకీయాల్లో కేంద్రస్థానం వహించే స్థాయికి భారత్‌ను తీసుకెళ్లారు. స్వాతంత్య్రా నంతరం దేశాన్ని పాలించిన ప్రధానులకు ఎవరి ప్రత్యేకత వారికున్నప్పటికీ, ఇంతటి దార్శనికత, రాజనీతిజ్ఞత, సుస్థిరంగా పెరుగుతున్న ప్రతిష్ఠ, దేశీయంగా అద్భుత ఛరిష్మా కలిగిన అద్భుతనేత నరేంద్రమోదీ మాత్రమే.

– ‌జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE