ఆధునిక జీవనశైలిలో, దాని రాపిడిలో మనిషి దేహం శిథిలమయిపోతున్నది. వీటి కారణంగా ఆవరిస్తున్న ఆకర్షణలు, బలహీనతలు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలిపి మనిషిని ప్రశాంతతకి దూరం చేస్తున్నాయి. కుటుంబాలలో సుఖశాంతులు లేకుండా చేస్తున్నాయి. వీటికి ఔషధాలు గొప్ప పరిష్కారం కాదని తేలిపోయింది. ఇలాంటి జీవనశైలిని సైతం తట్టుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన రుషి పరంపరం ఇచ్చిన దివ్య విధానమే యోగా. శతాబ్దాల క్రితం మన భారతభూమి మీద జనించిన ఈ యోగాసనాలు ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. ప్రపంచమంతా విశ్వసిస్తూ, పాటిస్తూ ఉంటే, ఈ దేశవాసులమైన మనం వాటి ఫలితాలని ఎందుకు అనుభవించకూడదు! యోగాభ్యాస సృష్టికర్త పతంజలిని స్మరించుకుని, వాటిని ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. వందలాది ఆసనాలు.. వందలాది భంగిమలు. ఇందులో ఈ నాలుగింటి గురించి తెలుసుకుందాం. తరువాత కొత్తవి నేర్చుకోవడానికి శరీరానికి సంసిద్ధతను ఇద్దాం. పైగా ఇవి కూర్చుని వేసేవే. అదికూడా జీవనశైలిని మన దేహం తట్టుకోవడానికి ఉపకరించే ఆసనాలివి. ఇవి ఇతరత్రా చేటు చేయకపోయినా, ఒక గురువు సమక్షంలో కొంతకాలం అభ్యసిస్తే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇవన్నీ స్వామి వివేకానంద యోగా అనుసంధాన కేంద్రం (బెంగళూరు) యోగాసన శిక్షణ విధి అనే పుస్తకం నుంచి సంగ్రహించినవే.
సుప్త వజ్రాసనం
కూర్చుని వేసే ఆసనాలు చాలా ఉన్నాయి. వాటిలో మూడవది సుప్త వజ్రాసనం. సుప్త అంటే నిద్రావస్థ.ఈ స్థితిలో శరీరం మొత్తం నేలపై ఆనించి పాదాలని పిరుదుల కింద ఉంచి, వజ్రాసన స్థితిలో ఉంచాలి. ఎనిమిది విభాగాలలో ఆసనం వేయాలి. ఇది కాంప్లిమెంటరీ శశాంకాసనం. దండాసన స్థితిలో ఆసనం మొదలు పెట్టాలి. కాళ్లు చాచి, దగ్గరగా ఉంచి, రెండు చేతులను పిరుదుల పక్కన ఉంచి కూర్చోవాలి.
1. కుడికాలిని వెనక్కి మడిచి, పాదాన్ని పిరుదుల కింద అదిమి ఉంచాలి.
2. ఎడమకాలిని మడిచి, పాదాన్ని పిరుదుల కింద ఉంచి, మోకాళ్లు రెండు దగ్గరగా ఉంచి, వెన్నెముకని నిటారుగా ఉంచాలి. తల, భుజాలు, మెడ నిటారుగా ఉండాలి. అర చేతుల్ని మోకాళ్లపై ఉంచి వజ్రాసన స్థితికి రావాలి.
3. నెమ్మదిగా వెనక్కి వంగుతూ, శరీరం బరువంతా కుడి ఎడమ మోచేతులపైన ఉంచాలి.
4. వీపుపై వెల్లకిలా పడుకుని, చేతులను ఒకదానితో ఒకటి మడిచి, తలమీదుగా అమర్చాలి. ఈ స్థితిలో ఒక నిమిషం ఉండవచ్చు.
5. చేతులు తలపై నుంచి తీసి, శరీరం పక్కగా ఉంచాలి.
6. నెమ్మదిగా మోచేతుల సాయంతో వజ్రాసన స్థితికి రావాలి.
7. ఎడమకాలిని తీసి, నేరుగా చాచి ఉంచాలి.
8. కుడికాలిని తీసి, నేరుగా చాచి, దండాసన స్థితిలో ఉండాలి. శిథిల దండాసన స్థితిలో ఒకదానితోఒకటి ఆనించి ఉంచాలి.
గమనిక: నేలపై మోకాళ్లు ఒకదానితో ఒకటి ఆనించి ఉంచాలి. వెనక్కి వంగినపుడు శ్వాస వెలుపలికి వదలాలి, పైకి లేచేటప్పుడు శ్వాస లోనికి తీసుకురావాలి. చివరి స్థితిలో సాధారణ శ్వాస తీసుకోవాలి.
ఉపయోగం: వెన్నముకకు శక్తి. ఉదర భాగంలోని అవయవాలకు, తుంటి భాగానికి, బలం చేకూర్చి, తొడలకూ, పిరుదులకు రక్తప్రసరణ కలిగించి, సులభంగా కదలడానికి వీలు కలిగిస్తుంది. నిలబడి పనిచేసేవారికి ఉపయోగకరం. మలబద్ధకం నివారిస్తుంది. వెన్నెముక పీఠంలో నిద్రాణమైన శక్తులలో కదలిక తెస్తుంది. సాధన వల్ల మళ్లీ విశ్రాంతి స్థితి కలుగుతుంది.
పరిమితులు : స్లిప్ డిస్క్, స్పాండిలోసిస్, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వేయకూడదు.
పశ్చిమోత్తనాసన్
కూర్చుని అభ్యాసం చేసే నాలుగవ ఆసనం పశ్చిమోత్తనాసన్. వెనుక భాగం సాగదీయటం, లాగటం, ఆసనం చివరి దశలో శరీరాంగాలన్నీ మడమలనించి, మెడవరకూ, చాచి ఉంచగలుగు తాయి. ఎనిమిది దశలలో వేయాలి. ఇది కాంప్లమెంటరీ ఉష్ట్రాసనం. దండాసన స్థితి నుంచి ఆసనం మొదలుపెట్టాలి.
1. రెండు చేతులను భుజంవరకు ఎత్తాలి, అరచేతులు నేలను చూస్తుండాలి. మోచేతులు వంచకూడదు.
2. అరచేతులు ముందుకు ఉండేట్లుగా, చేతులను చెవులకు ఆనిస్తూ, పైకి నిటారుగా లేపి ఉంచాలి.
3. శ్వాస వదులుతూ, నడుం పైభాగం వంచుతూ ముందుకు వంగాలి. నేలకు సమాంతరంగా చేతులు చాచి ఉంచాలి.
4. శ్వాస వదులుతూ, చూపుడువేళ్లతో కాలి బొటన వేళ్లని పట్టుకుని ఇంకాస్త ముందుకు వంగాలి. వీపు భాగాన్ని సాగదీస్తూ, ముఖాన్ని మోకాళ్లపై ఉంచాలి. ఈ స్థితిలో నిమిషం ఉండి సాధారణ శ్వాస తీస్తూ ఉండాలి.
5. శ్వాస తీస్తూ, చేతులని విడిచి, నేలకి సమాంతరంగా వంగి ఉండాలి.
6. చేతులని పైకి తీసుకు వస్తూ, నేలకు నిటారుగా కూర్చుని ఉండాలి.
7. శ్వాస వదులుతూ, చేతుల్ని నేలకి సమాంతరంగా తీసుకురావాలి.
8. శ్వాస పూర్తిగా వదలాలి. చేతుల్ని కిందికి తీసుకువచ్చి అరచేతుల్ని నేలపై ఉంచి, దండాసన స్థితిలోకి రావాలి.
గమనిక: మోకాళ్లు వంచకూడదు.
ఉపయోగాలు : కాలేయం, జఠరగ్రంథి జాగృతమవుతాయి. ఉదరభాగం దృఢమవుతుంది. పిల్లలు పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం, సియాటికా, పుంసత్వ సమస్యలు, మొలలు, డయాబెటిక్ లాంటి వ్యాధులు దూరమవుతాయి. మూలాధారంలోని, సుప్తావస్థలోని ఆధ్యాత్మిక శక్తులు జాగృతమవుతాయి. ‘అనాహిత ధ్వని’ వినగలుగుతారు.
పరిమితులు : రక్తపోటు, స్పాండిలైటిస్, తీవ్ర మలబద్ధకం ఉన్నవారు వేయకూడదు. ‘ఉడ్డీయాన బంధం’ దీర్ఘకాలం చేయకుండా ఆసనం చేస్తే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి.
ఉష్ట్రాసనం
వాటిలో అయిదవది ఉష్ట్రాసనం. ఉష్ట్రం అంటే ఒంటె. ఆసనాంతానికి శరీరం ఒంటె ఆకృతికి వస్తుంది. ఎనిమిది విభాగాలలో ఆసనం వేయాలి. దీనికి ఉప ఆసనం పశ్చిమోత్తనాసన్. దండాసన స్థితిలో ఆసనం మొదలుపెట్టాలి.
1. శ్వాస తీస్తూ, కుడికాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందకి తీసుకురావాలి.
2. అలాగే ఎడమకాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందికి తీసుకువచ్చి వజ్రాసన స్థితికి రావాలి.
3. శ్వాసతీస్తూ, శరీరాన్ని నిలువుగా, నిటారుగా ఉంచి మోకాళ్లపై నిలబడాలి.
4. శ్వాస వదులుతూ, నెమ్మదిగా వెనక్కి వంగుతూ, అరచేతులతో పాదాలని పట్టుకోవాలి. నిమిషం ఈ స్థితిలో ఉండి సాధారణ శ్వాస తీస్తూ ఉండాలి.
5. శ్వాసతీస్తూ, నెమ్మదిగా చేతులు వెనక్కితీస్తూ నిటారుగా రావాలి.
6. మడమలపై కూర్చుని, వజ్రాసన స్థితికి రావాలి.
7. ఎడమకాలిని ముందుకు చాచాలి.
8. కుడికాలిని ముందుకి చాచి, దండాసన స్థితిలో కూర్చోవాలి.
గమనిక : మోకాళ్లు దగ్గరగా ఉండాలి. తొడలు నేలకు నిటారుగా ఉంచాలి.
ఉపయోగం : వెన్నెముకకు శక్తి, మెదడుకి రక్తప్రసరణ. పక్కటెముకలకు బలం. కీళ్లనొప్పులు, నడుం నొప్పి, సయాటికా, శ్వాస సంబంధ వ్యాధులకు మంచిది. తమోగుణాన్ని తగ్గించి, అభ్యాసిని ఉత్తేజ పరుస్తుంది. ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది.
పరిమితులు: ఆరునెలల క్రితం ఛాతి, ఉదరభాగాలలో శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, హెర్నియా ఉన్నవారు వేయరాదు. గుండెజబ్బు, నడుమునొప్పి ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి.
వక్రాసనం
కూర్చుని వేసే ఆరవ ఆసనం వక్రాసనం. వక్ర అంటే వంకర అని అర్థం. ఆసనం చివరి భంగిమలో శరీరం మెలి తిరిగి వంకరగా ఉంటుంది. నాలుగు దశలలో వేయాలి. ఇది సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసనం. దీనిని రెండు వైపులా చేయాలి. దండాసన స్థితి నుండి ఆసనం మొదలు పెట్టాలి.
1. శ్వాస తీస్తూ, కుడికాలుని వంచి, చాచిన ఎడమ మోకాలి పక్కన, కుడిపాదాన్ని ఉంచాలి.
2. శ్వాస వదులుతూ, శరీరాన్ని కుడివైపు తిప్పుతూ, ఎడమచేతిని కుడి మోకాలి పైనించి తీసుకువచ్చి కుడి మోకాలి బొటనవ్రేలు పట్టుకోవాలి. కుడిచేతిని వీపు వెనుక ఉంచి, అరచేతిని నేలకు అదిమి, కుడివైపు చూస్తూ ఉండాలి- సాధారణ శ్వాస తీస్తూ ఒక నిమిషం భంగిమలో ఉండే ప్రయత్నం చేయాలి.
3. శ్వాస తీస్తూ, కుడిబొటన వ్రేలు వదిలి ఎడమ చేయిని, శరీరం ఎడమవైపు నేల మీద ఆనించి, శరీరాన్ని నిటారుగా ఉంచాలి.
4. శ్వాసతీస్తూ, మడచివున్న కుడికాలుని నిటారుగా చాపి, మామూలు స్థితికి తీసుకువచ్చి- దండాసన స్థితికి రావాలి. శిథిల దండాసన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగం: వెన్నెముకకు మర్దనను కలిగించి శక్తినిస్తుంది. కాలేయానికీ, చిన్న ప్రేవులకూ, జీర్ణ గ్రంథులకూ శక్తినిస్తుంది. మలబద్ధకం, డయాబెటిస్, మూత్ర పిండాల వ్యాధి, కాలేయ సంబంధిత వ్యాధులూ, నడుము కండరాల నొప్పి, తుంటి కీళ్ల నొప్పులు పోతాయి. బద్ధకం వదిలిపోతుంది.
పరిమితులు: ఉదర సంబంధ వ్యాధులతో ఆరుమాసాల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న వారు, హెర్నియా ఉన్న వారు వేయరాదు.