– డా।। గోపరాజు నారాయణరావు

అవి ఏ మొక్క ఆకులో మరి, పక్కనే ఉన్న చిన్న గుడ్డ మూటలో నుంచి ఇంకో నాలుగు తీసి అరచేతిలో పెట్టుకుని ఒక్క నిమిషం బాగా నలిపి, వంచి ఉన్న బూతా ఎర్రేసు మెడ మీద పడేలా నాలుగు చుక్కలు పిండాడు ఉగ్గిరంగి రామన్న. ఒక ఘాటైన వాసన గుప్పుమంది. నెమ్మదిగా మొదలైన నెగళ్లు ఇప్పుడు చురచుర మండుతున్నాయి. మెడ మీద నుంచి భుజం మీదకి జారుతున్న పల్చటి పసరు మీద చేతులు వేసి వేగంగా మళ్లీ మర్దనా చేయడం మొదలు పెట్టాడు కారంగి నాగులు. ఇద్దరిదీ మర్రిపాలెమే. ఇద్దరూ దాదాపు పాతికేళ్ల వాళ్లే.

 ‘‘ఎర్రేసు! ఎలా ఉందిరా?’’ రెండు నిమిషాలు మర్దనా చేసిన తరువాత అడిగాడు రామన్న. ఆ మాట వినపడనట్టు అటే చూస్తున్నాడు ఎర్రేసు. చలికి దాదాపు జ్వరం వచ్చినట్టే ఉంది అతడికి. ‘‘మాట్లాడ వేంటి?’’ పక్కనే గొంతుక్కూర్చుని ఉన్న అతడి భార్య బాధను దిగమింగుకుంటూ అంది. తన బలమైన చేతులతో రుద్దుతున్నాడు నాగులు. ఆ బాధను ఓర్చుకుంటూ మధ్య మధ్యలో కళ్లు మూస్తున్నా, నెగడులో నుంచి లేస్తున్న జ్వాలలనే తీక్షణంగా చూస్తున్నాడు ఎర్రేసు. అతడి కళ్లలో నెగడు బాపతు జ్వాల ప్రతిబింబిస్తోంది. అది నేల మీద నెగడుదేనా? అతడి గుండెలో మండుతున్న అగ్ని గుండానిది కూడా కావచ్చు. ‘‘ఎలా ఉందంటే మాట్లాడవేరా?’’ మళ్లీ అన్నాడు నాగులు. ‘‘రుద్దుతున్నంత సేపూ బాగానే ఉంటది. రుద్దుడు ఆపితే మళ్లీ మొదలు, నొప్పి’’ అన్నాడు ఎర్రేసు. ‘‘ఈ రోడ్డు పనైన తర్వాతైనా నర్సీ పట్నం డాట్రుగారి దగ్గరకి ఎల్లిరారా! దేవుడంటోడు.’’ సలహా ఇచ్చాడు రామన్న, రెండు నిమిషాలు ఆలో చించి. అంటే తేతలి సత్యనారాయణ మూర్తిగారన్న మాట.

బాస్టియన్‌ ‌దెబ్బలకి ఇంటికెళ్లి మంచం పడుతున్నారు. పసర్లతో ఏది తగ్గుతుందో, ఏది తగ్గదో అతడికి తెలుసు. మనిషి ప్రాణమంటే గొప్పదనీ తెలుసు. కానీ డాక్టర్‌ ‌మూర్తి ఇక్కడే తిరుగుతున్న విషయం వాళ్లకి తెలియదు.

****************

రెండు కొండముచ్చులు మొండిగా అన్నం కుండల వైపు వస్తుంటే ఒక ముసలమ్మ చూసి, చటుక్కున లేచి కర్రతో కదిలింది. గాల్లో విసురుగా తిప్పింది. భయంకరంగా అరుస్తూ వెనక్కి తగ్గాయి. వచ్చి కూర్చుంటూ అందామె, బాధగా. ‘‘ఆడికి ఇంకా నూకలున్నాయి భూమ్మీద, అమ్మోరి దయుంది బతికాడు! అలా చేస్తే మడుసులు బతుకుతారా? ‘‘బూతా ఎర్రేసు మీద నిన్న జరిగిన ఘోరం గురించే అనుకుంటున్నారు వాళ్లు. ‘‘ఈ దొర అసలు కొండోళ్లని బతకనిస్తాడా? ఈయన కొట్టే దెబ్బలకి ఇంటికెళ్లి చచ్చిపోతన్నారంట!’’ మరో వృద్ధురాలు అంది. ‘‘కొండోళ్లని కాదే, అసలు అడవిని బతకని స్తాడా అని అడుగు.’’ అన్నాడు రామునాయుడు, ఒక్కసారిగా అతడి కళ్లలో నీళ్లు ఉబికాయి. ‘‘ఎలాంటి బతుకు ఎలాగయిపోయిందో చూసావంటే!? ఏం పాపం చేసారు ఈళ్లంతా!’’ డగ్గుత్తికతో అన్నాడు రామునాయుడు. ఆగిఆగి అంటున్నాడతడు. కాదు, అతడి జీవితా నుభవం ముక్కలు ముక్కలుగా మాటలతో కలసి బయటపడుతోంది. ‘‘ఇదేదో కొండోళ్లకి శాపంలాగే ఉంది. నూరేళ్ల శాపమో, ఏమో! మీకు తెలుసంటే! నా చిన్నప్పుడు అడవి అంటుకుంటే మా కొంపల మీద పడి ఈడ్చుకు పోయేవారు ఎర్రబుట్టలోళ్లు. అంటుకున్న అడవిని మేం ఆర్పాలి. అడవి అంటుకోవడం అంటే ఎలా ఉంటది! దావాగ్ని అంటారు. భూమ్యాకాశాల కింద అంతా ఎర్రని మంట. భుగభుగలాడిపోతుంటది. అదేం ఆకలో అగ్నిదేవుడికి ! కసొచ్చినట్టు ఆడతాయి మంటలు. పిచ్చెత్తినట్టు ఎగురుతాయి. రెప్పపాటులో మండిపోతుంటదంతా. పచ్చని చెట్టనీ లేదు, ఎండు కొమ్మా లేదు. అంతా బూడిదే. కిందో, పక్కనో, పైనో ఎక్కడో ఉంటది జల. అక్కడ నుంచి రాత్రనక పగలనకా నీళ్లు పట్టుకెల్లి ఆర్పేవాళ్లం. అందుకు ఏదైనా ముట్టచెప్పేవారా? ఎర్రని ఏగాణి కూడా విదిల్చేవాళ్లు కాదు. కాలుతున్న అడవి దగ్గరకెళ్లడ మంటే చావుకు సిద్ధపడడమే. ఎంత వేడో. రెండు, మూడు రోజులు కాలతానే ఉంటాది. దాన్ని ఆర్పాలి. ఒళ్లు కాలేది.జాగర్తగా లేకపోతే బతుకే బుగ్గయ్యేది!’’ ఒక నిమిషం ఆగి అన్నాడు. ‘‘ఈళ్లు అడివిలో చెట్లు నరుకుతారు. వాటిని ముక్కలు చేసి, భుజాల మీద మోసుకుని కొండసంత కాడికో, కృష్ణదేవిపేటకో కొండోళ్లు మోసుకురావాలి. దానికీ చిల్లిగవ్వ ఇచ్చేవారు కాదు. భుజం జారినా, కాలు ఇరిగినా బతుకంతా అంతే.’’ ఈసారి రోడ్డు పని చేస్తున్న వాళ్ల కేసి చూపుడు వేలితో చూపిస్తూ అన్నాడు. ‘‘ఆళ్లు చూడు. తలెత్తకుండా పనిచేస్తన్నారు. ఆళ్లంతా పులిబిడ్డలు. ఇప్పుడు కాడికింద ఎద్దులైపోయారు.

అందులో చిరతలని తరిమినోళ్లుంటారు. పులులని ఎదరించిన వాళ్లుంటారు. ఎలుగొడ్లతో కలబడిన వాళ్లుంటారు. ఇప్పుడా పౌరుషం ఏమైంది? కర్మ. ఒకసారి బానిసయ్యాక మళ్లీ మామూలు మనిషి కావాలంటే తపస్సు చెయ్యాలి. ఈళ్లకి ఈ శాపం నుంచి మోక్షం ఎప్పుడో !?’’

****************

చుట్టూ వేసిన నెగళ్లు మండుతూనే ఉన్నాయి. ఆరోజు మాత్రం ఆ గూళ్ల మధ్య వేసిన పెద్ద మంటకి ఒక వైపే దగ్గర దగ్గరగా కూర్చున్నారు అంతా. ఒకింత భయంతోనే, మధ్యమధ్య చుట్టూ చూసుకుంటూ ఈ కథ చెప్పాడు రామన్న, గొంతు తగ్గించి ఆగిఆగి.

‘‘చోడవరం దగ్గరున్న భూపతిపాలెం తమ్మనదొర ఎంతటోడో తెలుసా! ఓటెం (భయం) అంటే తెలీనోడు. చోడవరం పోలీట్టేషన్‌• ‌తగలెట్టాడాయన’’ బ్రహ్మానందపడ్డారు అక్కడ ఉన్నవాళ్లంతా ఆ మాట విని. ‘‘అంతేనా!’’ అని ఒక నిమిషం మౌనంగా ఉండి మళ్లీ అన్నాడు రామన్న, ‘‘ఇద్దరు పోలీసులని మావెలి అమ్మోరి గుడి కాడ ఏటపోతుల్ని నరికినట్టు నరికాడు! ఒక్క వేటుతో తెగాలన్న కొండోళ్ల కట్టుబాటుని పాటించాడంట.’’ కొందరి గుండెలు వేగంగా కొట్టు కున్నాయి. నోరెళ్లబెట్టి వినడం మొదలుపెట్టారంతా. కొండల నుంచి వచ్చిన వడగాలి కొట్టినంత విసురుగా కొత్త తమ్మనదొర పేరు పోలీసులకి తెలిసింది. పోలీసుల మీద పగ పట్టినట్టు ఉండే ఆ  తమ్మనదొర గుర్తుకు వచ్చాడు. ఒక సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ‌వచ్చాడంట. వాడి ఎనకాల తొమ్మిది మంది చోడవరం కానిస్టేబుల్లు. అంతా కలసి ఫితూరీదార్ల కోసం వేట మొదలు పెట్టారు.

మొదట గుర్రేడు సరిహద్దులలో వాకబు చేశారు. ఇక్కడికి ఎవరూ రాలేదని చెప్పారు జనం. ఆ పది మంది పోలీసులు బోడలూరు పరిగెత్తారు. అంబుల్‌ ‌రెడ్డి అనేవోడు అప్పటికే అక్కడ పితూరీ లేవదీశాడు. అంతేనా, వాలమూరు ముఠాదారు రామిరెడ్డి, ముసురుమిల్లి ముఠా వాసి లుర్రిమిరెడ్డి కూడా వాళ్ల ఇలాకాలలో గొడవలే చేస్తున్నారు. అంబుల్‌ ‌రెడ్డి ఆచూకీ దొరకలేదు గానీ, కుట్రవాడ నుంచి తన బృందంతో తిరుగుబాటు మొదలెట్టిన సర్దార్‌ ‌పులికంట సాంబయ్య …ఆ దగ్గరలోనే దేవరపల్లిలో ఉన్నాడంటే మళ్లీ అక్కడికి పరుగెత్తారు పోలీసులు. ఇంతకీ దేవరపల్లికి అట్టహాసంగా వెళ్లినా పోలీసులకు సాంబయ్య పట్టుబడలేదు. కానీ కారం తమ్మనదొరకి ఆ పది మంది పోలీసులు పట్టుబడి పోయారు. ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది పోలీసు బృందానికి. ఆకు రాల్చిన ఆ అడవిలో, భుగభుగలాడు తున్న ఎండలో వీళ్లందరినీ రంప దగ్గర ఓ అమ్మవారి ఆలయం దగ్గరకి తీసుకుపోయి నిలిపాడు తమ్మనదొర. రెండు వందల మంది ఫితూరీదారులు కక్ష కట్టినట్టు పోలీసులలో ఎవరు నోరెత్తినా కొడుతూ నడిపించారు. ఎండలో నడిచి నడిచి ప్రాణాలు పోతున్నట్టు ఉన్న సమయంలో ఆలయానికి చేరుకున్నారంతా. ఆ చిన్న ఆలయాన్ని గుర్తు పట్టి వణికిపోయారు పోలీసులు. నవనాడులు కుంగి పోయాయి. అది మావెలి ఆలయం.

మావెలి మనషులను తింటుందని నానుడి. వామాచార ఆరాధన అక్కడి సంప్రదాయం. భయపడినంతా అయింది కూడా.

అక్కడే ఓ చింతచెట్టు కింద ఉండే కొండగండి అనే చోట వామాచారం ప్రకారం ఒక కానిస్టేబుల్‌, ఒక హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌తలలు తమ్మనదొరే స్వయంగా తెగ నరికాడు. అంటే అమ్మవారికి బలేశాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు కొండవాళ్ల ఆడవాళ్ల కేసి చూడ్డానికి కూడా వణికిపోవడం మొదలైంది అప్పటి నుంచే. ఆ ఇద్దరు పోలీసులు చేసిన తప్పు కూడా అదే. ఆ వెంటనే చోడవరం పోలీసు స్టేషన్‌ ‌మీద తమ్మనదొర బృందం దాడికి వెళ్లింది. అక్కడే ఉన్న సబ్‌ ‌కలెక్టర్‌, ‌జిల్లా పోలీస్‌ ‌సూపరింటిండెంట్‌ అతడిని వేడుకున్నారు. బందీలుగా ఉన్న మిగిలిన పోలీసులను విడిచిపెట్టవలసిందని అడిగారు. ఫితూరీదార్లు ఒప్పు కోలేదు. పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద కాల్పులు జరిపారు. తెల్లదొరలు, పోలీసులు అంతా కకావికలైపోయారు. తరువాత ఆ స్టేషన్‌ను తగులబెట్టారు. మరునాడే పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారు. తమ్మనదొర సొంతూరు భూపతి పాలానికి నిప్పు పెట్టారు. అంటే ఏంటన్నమాట! ఒక పోలీట్టేషన్‌ని తగలబెడితే, ఒక ఊరినే తగులబెడతాం అని చెప్పారు.’’ అక్కడ హఠాత్తుగా అపేశాడు రామన్న. దూరంగా ఏదో అలజడి. తోడేళ్ల గుంపు ఏదో వస్తోందని అనుమానం వచ్చింది. ఆ రాత్రికి కాపలా ఉండాలనుకున్న నలుగురు యువకులు కర్రలు, లాంతరు తీసుకుని ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్లారు.

****************

‘‘ఏంటి ఆలీసెం? రోజురోజుకీ పొద్దెక్కి వస్తన్నారు. బెస్టీను దొరకి తిక్క రేగిందంటే చస్తారు నాయాళ్లారా !’’ గట్టిగా అరుస్తున్నాడు కిష్టయ్య. ఆలస్యం ఏమీ లేదు. అది కిష్టయ్యకీ తెలుసు.

కానీ ఏదో ఒక రకంగా రోజూ తిట్టాలి. మామిడిచెట్టు కింద అన్నం ముంతలు పెట్టి గబగబా పనిలోకి వస్తున్నారు కూలీలు. అక్కడే ఉన్న తట్టలు, గునపాలు, పారలు, వంకర గునపాలు నేల మీద నుంచి లిప్తలో కూలీల చేతుల్లోకి వచ్చాయి. నాలుగు నిమిషాలు కాకుండానే పని మొదలయింది. మట్టిబుంగ అందుకుంటూ అంది సన్యాసమ్మ కసిగా, కొండమ్మతో. ‘‘ఏంటే ఈడు? మనిషేనా? బేస్టీను బంట్రోతైపోయాడు కోతెదవ. లేకపోతే పీక పిసికి చంపేద్దును’’ ‘‘ఊరుకోయేబాబు! ఆళ్లంతా సర్కారోళ్లు.! ’’ అంటూ తను కూడా బుంగ తీసుకుని కదిలింది. అప్పుడే గప్పీ దొర బంగ్లా దగ్గర జరిగిందా సంఘటన. జెడుమూరు మల్లయ్య, సెట్టి రామయ్య, దాసగిరి అయ్యన్న గప్పిదొర బంగ్లా కొచ్చారు. వీళ్ల ముగ్గురూ కూడా పనిలోకి పంపించవలసిన కూలీలను పంపలేదు. ఇందులో మల్లయ్య భీమవరం మునసబు. ‘‘ఇళ్లు తాళాలు ఏసుకుపోతన్నారు దొర!’’ భయంభయంగా చెప్పాడు మల్లయ్య. ‘‘నువ్వేం చేశావ్‌? ఎవరి ఈకలు పీకావ్‌ ?’’ అవమానకరంగా సైగలు చేస్తూ అన్నాడు బాస్టియన్‌. ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచొచ్చి మునసబు జుట్టు పట్టుకుని దారుణంగా వంచేశాడు తల కిందకి. మెడ మీద బలంగా గుద్దాడు. ‘‘అబ్బా!’’ హృదయ విదారకంగా అరిచాడు మల్లయ్య. బెదిరిపోయారు మిగిలిన ఇద్దరు. పైగా అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. మల్లయ్యని వదిలేసి వాళ్ల జుట్లు పట్టుకున్నాడు బాస్టియన్‌. ‌వాళ్ల మెడలు కూడా కిందకంటా వంచేశాడు. తట్టుకోలేకపోతున్నారు వాళ్లు. సెట్టి రామయ్యని గట్టిగా తన్నేసరికి కిందపడ్డాడు. దెసగిరి అయ్యన్న మెడ మీద పది గుద్దులైనా గుద్దాడు. ఇక ఓపిక లేక ఆగిపోయాడు బాస్టియన్‌.

****************

ఒక నెగడులో కట్టెలని పైకి నెట్టుతూ మొదలుపెట్టాడు రామన్న. ‘‘తమ్మనదొర పోలీట్టేషను తగలేస్తే, పోలీసులు ఆయన సొంతూరే తగలెట్టారు. అప్పటికీ ఆళ్లకి కసి తీర్లేదు. రంపదేశమంతా కాలుగాలిన పిల్లుల్లా తిరగడం మొదలెట్టారు. వేటే అనుకోండి. తమ్మనదొర, ఆయన మనుషులు రేకపల్లిలో దాక్కోవలసి వచ్చింది. ఆ వర్షాకాలంలో మూడు మాసాలు ఎతికారంట. తమ్మనదొర, ఆయన మనుషులు దొరకలేదు గానీ, పోలీసోళ్లకి రోగాలొచ్చాయి. మంచాలెక్కారు. అయినా కొత్తోళ్లు దిగడం, రంపదేశమంతా గాలించడం. అయినా ఆళ్ల కన్నుగప్పి ఇంకో మూడు మాసాల తర్వాత తమ్మన దొర రంప నుంచి మల్కన్‌గిరి పారిపోయాడు. సీలేరు ఒడ్డున ఉంది ఇది. అక్కడ కూడా కోయోళ్లు ఆళ్ల జాతి వీరుడికి నీరాజనం పట్టారు. మరో రెండు మాసాలలోనే అందరినీ ఏకం చేసి పోడె పోలీట్టేషను మీద దాడి చేశాడు. మల్కన్‌గిరి రాజా అని పేరు తెచ్చుకున్నాడు తమ్మన. రంపదేశం, మల్కన్‌గిరి, తూర్పున ఈ మన్యం కొండల్లో గూడెం వరకు కూడా తమ్మనదొర పేరు కొండగాలిలా వీచేసింది. జనం ఆయన ఎంట పడతన్నారు. భద్రాచలం కాడి రేకపల్లి అడవుల్లో వాళ్లు కూడా నీ ఎనకే మేం అన్నారు. రేకపల్లి కొండల్లోనే అప్పటికే ఉన్నాడు ఇంకో వీరుడు. ఆయన కూడా పితూరీ చేయాలని అక్కడంతా తిరిగి చెబుతున్నాడు. సమయం కోసం కాచుకుని కాస్కొని ఉన్నాడు. ఆ వీరుడే కొండ్ల భీమారెడ్డి. రేకపల్లి రైతు. రంప గొడవల గురించీ, తమ్మన గురించీ చెవిన పడింది. ఆనందంతో ఉప్పొంగి పోయాడు. భీమారెడ్డిని అడవులు పట్టించినోడు యెజు కృష్ణయ్య. ఆడో ఫారెస్టాపీసరు, తహసీల్దారను రెచ్చగొట్టి భీమారెడ్డి మీద కేసు బనాయించాడు. తహసీల్దార్‌ ‌భీమారెడ్డికి తాఖీదు ఇచ్చి, వచ్చి సంజాయిషీ ఇమ్మన్నాడు. భీమారెడ్డి వెళ్లలేదు. రాజమండ్రి కోర్టు కాయితం పంపింది. కొండలలోకి పారిపోయాడు భీమారెడ్డి. తరువాత బోడలూరు వెళ్లాడు. ఆ ముఠాదారు భీమారెడ్డి బంధువు. అతని కొడుకే అంబులరెడ్డి. ఆయన్ని సాయం చేయమని కోరాడు తమ్మన. అంబులరెడ్డి ఇచ్చిన యాభయ్‌ ‌మంది బలగంతో తిరిగి రేకపల్లి చేరుకున్నాడు. ఇప్పుడు బగతలు, కోయలు కూడా భీమారెడ్డి వెనుక చేరారు. వేయి మంది. అంతా పోలీసులతో బాధపడతన్నోళ్లే. ఈళ్లంతా కల్సి పాపికొండల్లో దాక్కుని ఓసారి ఏం చేశారో తెలుసా? కొత్త నీళ్లతో గోదావరి బురద బురదగా ఉంది. రాజమండ్రిలో పోలీసు బలగాలను ఎక్కించుకుని పెద్ద పడవ బయలుదేరింది. అది మామూలు పడవ కాదు. స్టీమరంటారు. మరపడవ. దాని పేరు షామరాకు. గోదావరిలో రేకపల్లి బయలుదేరింది. మబ్బుమబ్బుగా ఉంది ఆకాశం. చినుకులు పడతాయని అంతా గుబులుగా ఉన్నారు. పాపికొండల మధ్యలో చిన్నగా శబ్దం చేసుకుంటూ పోతోంది మరపడవ. హఠాత్తుగా మొదలైంది వర్షం- మబ్బుల నుంచి కాదు. చెట్ల కొమ్మల మధ్య పొంచి ఉన్న ఫితూరీదారులు విల్లుల నుంచి బాణాల వర్షం.

వేయి మంది పితూరీదారులు ఈ మరపడవ మీద దాడి చేశారు. వెనక్కి పోవాలా? ముందుకు పోవాలా? ఆ పితూరీకి నాయకులు ఎవరను కున్నారు? భీమారెడ్డి, అంబుల్‌ ‌రెడ్డి. వాళ్లిద్దరు గోదావరి ఉపనది శబరి దాటారు, రేకపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడికి. శబరి గోదారిలో కలసినట్టు ఆ ఇద్దరి బలగాలు తమ్మనదొర బృందంలో కలసి పోయాయి.

తమ్మనదొరను పట్టిస్తే ఇనాం ప్రకటించారు. పోలీసులకి ఆయన తల కావాలి. దానికి తహతహలాడిపోతున్నారు. పోలీసుల తలలు అమ్మవారికి బలిచ్చిన తమ్మన ఇంకా బతికుంటాడా? అని పంతం. పోలీసుల తలలు తెగినప్పటి నుంచి పోలీసులకు తల కొట్టేసినట్టయింది. కానీ పోలీసు లతో మనం తూగలేం. రేకపల్లి-రంప సరిహద్దులలో ఒకరోజు తమ్మనదొర దొరికి పోయాడు. తమ్మన దొరను తరిమి తరిమి పట్టుకుని కాల్చి చంపారు. పోలీసుల తలలు నరికాడు కాబట్టి తమ్మన తలను నరికారు. అదేదో మందునీళ్లు ఉన్న కుండలో పడేసి రాజమండ్రి పంపారు.’’ ఏం వివాదమో మరి, వాళ్లు గుడిసెల మీదే ఉన్న చింతచెట్టు కొమ్మల్లో ఏవో పక్షులు పొడుచుకుంటూ అరుచుకున్నాయి.

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE