జపాన్, యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ (క్వాడ్రిలేట్రల్ సెక్యూరిటీ డైలాగ్) అధినేతలు గత రెండేళ్ల కాలంలో సమావేశం కావడం ఇది నాలుగోసారి. గత కొన్నేళ్లుగా క్వాడ్ దేశాలతో చైనా ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. తాజా క్వాడ్ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్‌బెనీస్, జపాన్ ప్రధాని ఫ్యుమివొ కిషిదా హాజరయ్యారు. ఈసారి క్వాడ్ సమావేశం ఉమ్మడి ప్రకటనలో భారత్ దౌత్య పటిమ మరోసారి రుజువైంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మనదేశ వైఖరిని స్పష్టం చేయాలని అమెరికా సహా భాగస్వామ్య దేశాలు పట్టుపడతాయని, ఇది ఒకరకంగా ఇరకాట పరిస్థితేనని భావించిన వారికి ఉమ్మడి ప్రకటన ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. సీమాంతర ఉగ్రవాదం, 26/11 దాడులు, పఠాన్‌కోట్ ఉగ్రదాడి అంశాలు ఉమ్మడి ప్రకటనలో చోటుచేసుకోవడం భారత్ ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అన్నింటికి మించి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరిని అమెరికా సహా ఇతర దేశాలు ప్రశంసించడం తిరుగులేని మన దౌత్యవిజయానికి నిదర్శనం.
ఇటీవలి కాలంలో చైనా తన నేవీ బలోపేతానికి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడం, సాల్మన్ దీవులతో భద్రతాపరమైన ఒప్పందం కుదుర్చుకోవడం ఆస్ట్రేలియాను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశం. సాల్మన్‌దీవులతో కుద్చుర్చుకున్న ఒప్పందం ద్వారా చైనా నేరుగా ఆ దీవుల్లో తన యుద్ధ నౌకలను నిలుపవచ్చు. అదేవిధంగా దీవుల్లో సామాజిక భద్రతను కాపాడటంలో అక్కడి ప్రభుత్వానికి సహకరించవచ్చు. తరచుగా చైనా నేవీ తన సముద్ర జలాల్లోకి చొరబాట్లు జరుపుతుండటం జపాన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు యూఎస్ ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)ను ఏర్పాటు చేసింది. అమెరికా నేతృత్వంలోని ఈ ఫ్రేమ్‌వర్క్‌లో మొత్తం 13 దేశాలున్నాయి. ఈ దేశాలు వరుసగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రూనై, దారుస్సలాం, ఇండియా, ఇండొనేసియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం. వాషింగ్టన్‌లో ఇటీవల ఆసియన్ దేశాలతో బైడెన్ సమావేశమైన నేపథ్యంతో ఇది ఏర్పాటైంది.
ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం ఖండనార్హమేనని క్వాడ్ దేశాలు మే 24న ఉమ్మడి ప్రకటనలో కుండబద్దలు కొట్టాయి. యుఎన్‌ఎస్‌సీ 2593 (2021) తీర్మానం ప్రకారం మరే ఇతర దేశాన్ని బెదిరించడానికి లేదా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి లేదా మద్దతు ఇవ్వడానికి లేదా ఉగ్ర దాడులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆఫ్ఘానిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని స్పష్టంచేశాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని 26/11, పఠాన్‌కోట్ ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా ఇది పాకిస్తాన్‌కు హెచ్చరిక. ఎఫ్‌ఏటీఎఫ్ సిఫారసుల మేరకు ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి వ్యతిరేకంగా ఇతర దేశాలు పోరాడాలని పిలుపు నిచ్చాయి. ఆసియన్ దేశాల ఐకమత్యానికి మద్దతు ప్రకటించాయి. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యుఎన్‌సీఎల్‌ఓఎస్)లో పేర్కొన్న ప్రకారం అంతర్జాతీయ చట్టాలను అమలుపరచే విషయంలో క్వాడ్ దేశాలు కృషి చేయాలని పేర్కొన్నాయి. ఇది చైనాకు హెచ్చరిక. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో కూడా స్వేచ్ఛావాణిజ్యానికి ఏవిధమైన ఆటంకాలు ఉండకూడదని, అంతర్జాతీయ సముద్ర నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టంచేశాయి. ఈ ప్రాంతంలో యథాతథస్థితిలో మార్పు తీసుకొచ్చే ఏ చర్యలనైనా తీవ్రంగా పరిగణిస్తామని ఉమ్మడి ప్రకటన హెచ్చరించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆహారం, విద్యుత్, ఇతర మానవతా సహాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న అంశాన్ని సమర్థించాయి. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కారమని భారత్ మొదటినుంచి చెప్పుకుంటూ వస్తోంది.
ఐపీఎండీఏ ఏర్పాటు
ఇండో-పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ (ఐపీఎండీఏ) ఏర్పాటును క్వాడ్ దేశాలు స్వాగతించాయి. దీని ఏర్పాటు వల్ల పసిఫిక్ ద్వీపాలు, ఆగ్నేయాసియా, ఇండో ఆసియన్ ప్రాంతాల్లోని దేశాలకు ఈ ప్రాంత సముద్ర జలాలు, తీరాలను పూర్తిగా పర్యవేక్షించేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విపత్తులు సంభవించినప్పుడు మానవతా సహాయం అందిం చడం, అక్రమంగా చేపలు పట్టడాన్ని నిరోధించడం వంటి చర్యలకు కూడా ఐపీఎండీఏ వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్, ఆగ్నేయాసియా, పసిఫిక్ ద్వీపాల్లో సుస్థిరతను, అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన జరగకుండా, ఈ ప్రాంతంలోని దేశాల్లో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పరస్పరం పంచుకుంటారు. ఇందుకు అవసరమైన సాంకేతికతను క్వాడ్ దేశాలు సమకూరు స్తాయి. క్వాడ్ దేశాలు ఐపీఎండీఏలో వచ్చే ఐదేళ్ల పాటు 50 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టి దీన్ని మరింత బలోపేతం చేస్తాయి. నిజానికి చైనా తన చుట్టుపక్కల దేశాల ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొరబడి చేపలు పట్టడం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెక్ పెట్టడానికే దీని ఏర్పాటని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. తూర్పుచైనా సముద్రంలో జపాన్ నియంత్రణలోని శంకాకు దీవులు (ఇటీవలి కాలంలో వీటిని దియాయూ దీవులు అని కూడా పిలుస్తున్నారు) కూడా తమవేనని వాదిస్తోంది. ఈ దీవులపై దాడికి దిగితే తాము చూస్తూ ఊరుకునేది లేదని అమెరికా హెచ్చరిస్తోంది. అయితే చైనా పేరు ప్రస్తావించకున్నా, క్వాడ్ దేశాలు పరోక్షంగా తీవ్రంగానే ఆ దేశాన్ని హెచ్చరించాయి. క్వాడ్, ఆసియన్ దేశాలకు చైనాతో ఇప్పటికీ గణనీయమైన వాణిజ్య సంబంధాలున్నాయి. అందువల్ల క్వాడ్ సమావేశం నేరుగా చైనాకు హెచ్చరికలు జారీచేసే పరిస్థితి లేదన్నది గమనార్హం. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలను ఖండించాయి. మయన్మార్‌లో హింసకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చాయి.
క్వాడ్ దేశాలు మే 24న టోక్యోలో సమావేశ మవుతుండగానే, చైనా, రష్యాలకు చెందిన నాలుగు ఫైటర్ విమానాలు జపాన్ సమీపంలో విన్యాసాలు చేయడం వివాదం సృష్టించింది. ఇవి ప్రాదేశిక ఉల్లంఘనకు పాల్పడనప్పటికీ గత నవంబర్ నుంచి చైనా, రష్యా విమానాలు ఈవిధంగా జపాన్ సమీపంలోకి చొచ్చుకురావడం ఇది నాలుగోసారని జపాన్ రక్షణశాఖ వెల్లడించింది. అదేవిధంగా సెంట్రల్ జపాన్‌లోని నోటో పెనెన్సులా సమీపంలో ఉత్తర హొక్కాయ్‌డో ప్రాంతంలో రష్యా నిఘా విమానాలు మే 24న సంచరించినట్లు కూడా జపాన్ రక్షణశాఖ ఆరోపించింది. నిజంగా ఇది రెచ్చగొట్టే చర్య అంటూ జపాన్ వ్యాఖ్యానించింది. అయితే చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ మాత్రం చైనా హెచ్-6కె బాంబర్లు, రష్యాకు చెందిన టియు-95 ఎంఎస్ బాంబర్లు జపాన్ సముద్రం, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో రొటీన్ పెట్రోలింగ్ కార్యక్రమాల్లో భాగంగా తమ విధులను నిర్వర్తించాయని ట్వీట్ చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించ లేదని రష్యా కూడా స్పష్టం చేయడం గమనార్హం. ఇక్కడ జపాన్-రష్యాల మధ్య కురిల్ ద్వీపాల విషయంలో వివాదం కొనసాగుతోంది. అదేవిధంగా జపాన్ ఆధీనంలో ఉన్న శంకాకు దీవులు తనవేనని చైనా వాదిస్తోంది. ఈ రెండు వివాదాల నేపథ్యంలో జపాన్‌కు హెచ్చరికగా రష్యా, చైనాలు ఈవిధంగా బాంబర్లను పంపాయన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మనకు ప్రధాన శత్రువైన చైనా ఈ చర్యకు ప్పాడిందంటే సరే. కానీ ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న సమావేశం ఒకపక్క జరుగుతుండగానే రష్యా కూడా తన బాంబర్లను ఎందుకు పంపిందనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.
నేపథ్యం
2004, డిసెంబర్‌లో హిందూ మహా సము ద్రంలో సంభవించిన భూకంపం, సునామీకి దారి తీసింది. దీన్నే ‘బాక్సింగ్ డే సునామి’ అని కూడా అంటారు. ఈ సునామీ సందర్భంగా దెబ్బతిన్న దేశాలకు సహాయం అందించడానికి నాలుగు దేశాలతో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఏర్పడిన సునామి అడ్‌హాక్ కోర్ గ్రూపు ప్రస్తుత ‘క్వాడ్’కు పూర్వరూపం. 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ‘క్వాడ్రిలేట్రల్ సెక్యూరిటీ డైలాగ్’ లేదా ‘క్వాడ్రిలేట్రల్ ఇనిషియేటివ్’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అప్పటినుంచి భారత్.. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలతో బహుముఖ చర్చలు జరుపుతూ ఇందులో భాగస్వామి అయింది. ‘డెమోక్రటిక్ పీస్’ (ప్రజాస్వామిక శాంతి) భావనతో ఈ నాలుగు దేశాల మధ్య ఏర్పడిన రక్షణ ఏర్పాటు ఘనత మాత్రం షింజో అబేకి దక్కుతుంది. మధ్య ఆసియా, మంగోలియా, ఆగ్నేయాసియా, కొరియన్ ద్వీపకల్పాలను కలుపుతూ ‘ఆసియన్ ఆర్క్ ఆఫ్ డెమోక్రసీ’ ఏర్పాటు చేయాలన్నది ఈ క్వాడ్రిలేట్రల్ ఆర్క్ ప్రధాన లక్ష్యం. నిజానికి ఈ ఆర్క్‌లోకి వచ్చే దేశాలన్నీ చైనా చూట్టూ సరిహద్దుగా ఉన్న దేశాలే! చైనా అనుకూలురు దీన్ని ‘యాంటీ చైనా మూవ్’ అని పేర్కొంటే, చైనా వ్యతిరేకులు ‘డెమోక్రటిక్ ఛాలెంజ్’ అని వ్యవహరిస్తారు. భారత్ క్వాడ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చింది. ముఖ్యంగా సభ్య దేశాల మధ్య నౌకా విన్యాసాలు విస్తృతంగా చేపట్టడమే కాదు, భారత్-జపాన్‌ల మధ్య అంతకుముందు పెద్దగాలేని సంబంధాలు బలోపేత మయ్యాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ అనుసరించిన విధానాలు, ముఖ్యంగా భారత్‌తో పెంచుకున్న స్నేహం చైనాకు ముకుతాడు వేయడానికే అన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని మన్మోహన్, చైనా ప్రధాని విన్ జియా బావోతో, ఆ దేశ అధ్యక్షుడు హు జింటావోతో చర్చలు జరిపిన తర్వాత ఒక్కసారిగా భారత్ వైఖరి మారి పోయింది. చైనాకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనేది లేదని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. దీంతో క్వాడ్ కార్యకలాపాలు మందగించాయి. క్వాడ్‌పై చైనాకు పెరుగుతున్న ఆగ్రహం నేపథ్యంలో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడ్ కూడా వెనకడుగు వేశారు. ఆస్ట్రేలియాకు చైనా ఆర్థిక భాగస్వామి కావడం వల్ల కెవిన్ క్వాడ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
2017 నవంబర్‌లో జరిగిన ఆసియన్ దేశాల సమావేశం సందర్భంగా అప్పటి జపాన్ ప్రధాని షింజో అబె.. భారత్, ఆస్ట్రేలియా, యూఎస్ అధి నేతలను చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఫ్రీ అండ్ ఇండో-పసిఫిక్’ వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. ఈ భావనను మొట్టమొదట ప్రతిపాదించింది అప్పటి యూఎస్ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్. చైనా ‘బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’కు ప్రతిగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా నాలుగు దేశాల అధికారులు చర్చించి, సైనిక సహకారాన్ని పరస్పరం కొనసాగించాలని నిర్ణయించారు. అప్పుడే దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యం కూడా చర్చకు రావడం బహుశా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘క్వాడ్రిలేట్రల్’ను పునరుద్ధరించాలన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. 2017-19 మధ్యకాలంలో క్వాడ్రిలేట్రల్ ఐదుసార్లు సమావేశమైంది. 2018లో ‘రైసినా’ పేరుతో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో నాలుగు దేశాలకు చెందిన నేవీ ముఖ్యఅధికారులు పాల్గొన్నారు. ఇది క్వాడ్ భద్రతకు సంబంధించిన మొట్టమొదటి సమావేశం. 2020 మార్చి నెలలో క్వాడ్ సభ్యులు న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాం ప్రతినిధులతో కొవిడ్-19 మహ మ్మారిపై తీసుకుంటున్న చర్యలపై చర్చలు జరిపారు. క్వాడ్ ప్లస్‌గా పేర్కొనే ఈ సమావేశంలో పాల్గొన్న మొట్టమొదటి ఆసియన్ దేశం వియత్నాం. 2021 మే నెలలో జరిగిన సమావేశంలో ఇండో-పసిఫిక్‌తో సంబంధంలేని బ్రెజిల్, ఇజ్రాయిల్ దేశాలు పాల్గొన్నాయి. ఈవిధంగా క్రమంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటూ, ఒక ప్రాంతీయ గ్రూపుగా విస్తరిస్తున్న క్వాడ్ ‘ఆసియన్ నాటో’గా రూపొందినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్