సారస్వత రంగంలో బుకర్ ప్రైజ్ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే, అది అంతర్జాతీయ స్థాయి పురస్కృతి. రచయితల/ రచయిత్రుల లోకంలో ఇప్పుడు గీతాంజలిశ్రీ వివరాలు తెలుసుకోవాలని అనుకోనివారుండరు. కారణం ఏమిటంటే, అంతటి బహూకృతి సంపాదించిన మొట్టమొదటి భారతీయ మహిళామణి ఆమే. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి ఏటా ఉత్తమ నవలా రచనకు మాన్ బుకర్ పేరిట లక్షలాది రూపాయల నగదు బహుమతి ప్రకటిస్తారని అందరికీ తెలుసు. ప్రత్యేకించి కామన్వెల్త్ సహా సంబంధిత ఇతర దేశాలవారికి ఆ పురస్కారాన్ని ఉద్దేశించారన్నదీ తెలిసిన అంశమే. అందరూ తెలుసుకుని తీరాల్సిన అసలు విషయం – యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రచురించిన ఆంగ్ల రచనలకిచ్చే ఆ ప్రైజ్‌ను కొంతకాలం కిందట అనువాదాలకు విస్తరించారు. బహుమానం మొత్తం (అంతా కలిపి దరిదాపు రూ.అరకోటికి చేరుకుంటున్నది) మూలకర్త, అనువాదకునికి సరిసమానంగా అందజేస్తారు. వనితా విజేత (స్వ రాష్ట్రం ఉత్తరప్రదేశ్) హిందీలో రాసినది ప్రపంచ స్థాయిని ఆకట్టుకొందంటే, భాషల ఎల్లలన్నింటినీ అలవోకగా దాటి పరమోన్నతిని అందుకుందంటే, ఘనాఘన చరిత్ర సృజన సమస్తం గీతాంజలి శ్రీదే! ఇప్పుడామె మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నా, పేరు ప్రఖ్యాతులన్నీ ప్రపంచ దేశాలకు వ్యాపించాయి. తన కీర్తినాదం ఇంగ్లండ్ అంతటా (ప్రైజ్ కేంద్ర స్థలి) ఇవాళ ప్రతిధ్వనిస్తోంది. ఎప్పుడో ఐదున్నర దశాబ్దాల క్రితం రూపొందిన బహుకృత సంస్థ కాంతికిరణాలు భారత్‌పైన ప్రసరించి నేడు సకల సాహితీ ప్రపంచాన్నీ ధగధగాయమానం చేస్తూనే ఉన్నాయంటే… కర్త కర్మ క్రియ అన్నీ గీతాంజలిశ్రీ!
కాల పరిణామక్రమంలో మనకు సంబంధించి ఇద్దరికి (సల్మాన్ రష్దీ, అరవింద అడిగా) మొదలూ తుదిగా బుకర్ పురస్కారాలు లభించాయి. ఒకరు భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత; మరొకరు భారత్, ఆస్ట్రేలియా దేశాల ఉభయ పౌరసత్వమున్నవారు). ఆ ఇద్దరికీ బహూకరించి చాలా సంవత్సరాలైంది. చివరగా బహూకరణ జరిగి ఒకటిన్నర దశాబ్దం కావస్తోంది. తిరిగి ఇప్పుడు అదే విశ్వవిఖ్యాత పురస్కారం గీతాంజలిశ్రీని వరించడం కచ్చితంగా చరిత్రాత్మకం. బహూకృతి- నవలలతో పాటు కథా సంకలనాలకీ విస్తరించిన దశలో, ప్రతిష్ఠా త్మక రీతిన ఎందరెందరో ఎన్నెన్ని దేశాల నుంచో పోటీపడుతున్న స్థితిలో విజేతగా ఆమె నారీ భేరీ మోగించారు. హిందీ నవలకు ఆంగ్ల పురస్కృతి సాధిం చిన ప్రథమ భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. రచయిత్రులనేకమంది ‘నువ్వా నేనా’ అన్నట్లు ముందు కొచ్చిన తరుణంలో ‘నేనే’ అంటూ విజయనాదం చేశారు. ఇంతకీ విజేత పుస్తకం పేరేమిటో తెలుసా? ‘ఇసుక సమాధి•, ఎనిమిది పదుల వయసున్న వృద్ధ వనిత ధీరోదాత్త గాథ. ఈ ఏడాది పురస్కృతంతో పాటు, భారతీయ భాషల నుంచి అవార్డు సముపార్జిం చిన ప్రత్యేక పుస్తకమూ ఇదే. ఇంతింత విలక్షణ బహుమతి ప్రాయోజిత సంస్థ పేరు మీద ఆనాడు ప్రకటితమైంది. అప్పట్లో బుకర్ – మెక్‌నో నెల్ ప్రైజ్‌గా ప్రఖ్యాతమైంది. అటు తర్వాత నిర్వహణ పక్రియ బుకర్ ఫౌండేషన్‌కు మారింది. ఇప్పుడైతే స్పాన్సర్ చేసిన వ్యవస్థ (మాన్ గ్రూప్) పేరుతో అధి కారకంగా ఇది మాన్ బుకర్ బహుమతి. ఆ మొత్తం ఒక్కసారిగా అనూహ్య రీతిన పెరిగి సర్వత్రా సుప్ర సిద్ధత సంతరించుకుంది. యుకే జతగా ట్రినిడాడ్, దక్షిణాఫ్రికా, జర్మనీ, ఐర్లండ్, న్యూజిలాండ్, నైజా రియా, కెనడా… ఇలా పలు దేశాల విజేతలున్నారు. ఇన్ని దశాబ్దాల వ్యవధిలో భారతీయులుగా అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్‌ల పేర్లూ ఉన్నాయి. ఈ అందరిలోనూ ప్రస్తుతం విశేషమంతా గీతాంజలిదే! హిందీ రచనకు శిఖరాగ్ర బహుమతి పొందడమే. తనదైన, తనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత!!
చరిత్రే ప్రధాన ఆధారం
భారతీయ హిందీ నవలను ప్రతిష్ఠాత్మక బుకర్ స్థాయికి చేర్చిన ప్రథమ, ప్రధాన రచయిత్రిగా ఈ అతివ ధ్రువతార. నాలుగేళ్ల నాడు రచించిన ‘రీత్ సమాధి’ అనంతరం ఆంగ్లంలో ‘టూంబ్ ఆఫ్ శాండ్’ అయింది. మూల రచయిత్రిగా గీతాంజలి అనువాద కురాలైన డైసీ రాక్ వెల్‌తో కలిసి బహుమతి మొత్తాన్ని పంచుకుంటారన్న మాట.
ఇదేకాక మరికొన్ని నవలలు, పిల్లల కథలనీ వెలువరించిన గీతాంజలి తాను విజేత అయిన సమాచారం వినగానే ‘కలలోనైనా అనుకోలేదు’ అంటూ స్పందించారు. ఇదెంతో ఘన సత్కారమం టూనే, వర్ణించడానికి మాటలు చాలడం లేదని వ్యాఖ్యానించారు. ఇవే మాటలు రచయిత్రిగా ఆమెకే కాక, దేశవిదేశాలలోని భారతీయ భాషల ప్రేమికులం దరికీ వర్తిస్తాయి. పదాల్లో పొదగలేని, ఇదీ అని వివరించలేని భావోద్వేగ భరిత హృదయపూర్వక స్పందనే అందరిదీ. వృద్ధ వనిత జీవన అవలోకనానికి అక్షర రూపమిచ్చిన ఆమె స్ఫురద్రూపి. విశాలమైన, చురుకైన గీతాంజలి నేత్రాలు ఎదుటి వ్యక్తుల్ని చదువుతున్నట్లు ఉంటాయి. మాటలు సూటిగా, ధాటిగా, ఘాటుగా ఉండి ప్రస్ఫుటమైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంటాయి. ఆమె రాతలు ఆలోచనాత్మకంగా మళ్ళీ మళ్లీ చదవాలనిపించేలా ఆకట్టుకుంటాయి. అనుబంధాల్ని అక్షరబద్ధం చేసే తాను తన మాతృ మూర్తి కుమారి పేరులోని ‘శ్రీ’ని చెంత చేర్చుకున్నారు. అందుకే గీతాంజలిశ్రీగా పిలిపించుకోవడానికే ఎంతగానో ఇష్టపడుతుంటారు. రచనా వ్యాసంగాన్ని అభిమానించే తండ్రి ఇష్టతను పుణికి పుచ్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఆయనకు బదిలీలు సహం కావడంతో, వెళ్లిన ప్రతిచోటా జనజీవన రీతులను గమనించే వారామె. భారతీయ ఇతిహాసాలన్నింటినీ ఇంటాబయటా చదుకున్న నేపథ్యం. మన సంస్కృతిని మనమే మహోన్నతంగా గౌరవించి, ప్రపంచమంత టికీ చాటి చెప్పాలన్న అభిమతం. అన్నింటికన్నా మిన్నగా చరిత్రను ప్రేమించారు. తాను ఉంటున్న ఢిల్లీలోని విశ్వ విద్యాలయం నుంచే చరిత్రాంశంలో పట్టభద్రులయ్యారు. అంతటితో ఆగలేదు. బరోడా యూనివర్సిటీ ద్వారా హిందీలో డాక్టరేట్ చేశారు. హిస్టరీ పైనే ఎందుకింత మక్కువ అని అడిగితే…‘ఏ భాష పూర్వాపరాలు తెలియాలన్నా చరిత్రే మూలా ధారం కాబట్టి’ అంటూ బదులిచ్చారు. అదీ ఆమె పరిపూర్ణత, పరిణత తత్వం.
అతివ మనోగత సూచిక
ఆంగ్ల మాధ్యమంలో చదివినందున, హిందీని ఎంచుకునే అవకాశం ఆమెకి లేదు. అందుకే ఢిల్లీ, బరోడా వర్సిటీలతో విద్యానుబంధం సాగించారు. చరిత్ర సంపూర్తి అవగాహన, హిందీ సాహిత్యానురక్తి జోడై తన కలాన్ని కదం తొక్కించాయి. పదుల సంఖ్యలో కథలు, అనేక నవలలు ఒకటొకటిగా వెలువడ్డాయి. చాలామటుకు ఆంగ్లంతో పాటు జర్మన్, ఫ్రెంచి, కొరియన్ తదితర విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘ఇసుక సమాధి’ నవల రాసి దరిదాపు నాలుగేళ్లు. ఆంగ్లానువాదం గత ఏడాదిలో అయింది. అదే రచనకు మునుపు మరెన్నో అవార్డులు లభించినా, ఈసారి అందుకుంది శిఖరాగ్ర పురస్కారాన్ని. లండన్ ప్రత్యేక సదస్సులో స్వీకరించిన గీతాంజలిశ్రీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ‘కలమే నా బలం’ అని ప్రకటించారు. అనువాదకు రాలిని చూసి మాట్లాడటం ఇదే ప్రథమమంటూ వినమ్ర సహిత కృతజ్ఞతలందించారు. పురస్కృత రచన ముందు వెనుకలను విశదీ కరిస్తూ-‘స్త్రీగా సాటివారిని బాగా అర్థం చేసుకున్నా. వారి మనోగ తాన్ని నాదిగా చేసుకున్నా. దీన్ని ఏ వాదమంటారో నాకైతే తెలి యదు. మానవతను మించిన వాదం, విధానం ఇంకేముం టాయి చెప్పండీ? నా నవలలో నాయిక బాల్యమంతా భారత్- పాకిస్థాన్ విభజన సమయం భావాలతో నడుస్తుంది. దేశ విభ జనసమస్యల తీవ్రత, పలురకాల పరిణామాల పరంపర, సంప్రదా యాల వైరుధ్యం, అంతర్గత- బాహ్య సంఘర్షణల వెల్లువ.. వీటన్నింటి నడుమ భిన్న భావనలు, విభిన్న అనుభవాలు ఎదురవుతాయి. అలా అని ఆ ప్రభావంతో తీవ్రతర పదజాలం వాడకుండా, వాతావరణ వేడిని మరింత పెంచకుండా, సమరస స్ఫూర్తిని జతపరుస్తూ బతుకు చిత్రాన్ని చదువరుల ముందుంచాను’ అని వివరిం చారు. పాక్ వెళతానని ఇంట్లో వాళ్ళకు తెగేసి చెప్పిన స్త్రీ మూర్తి తదనంతర కాలంలో తనయ, భార్య, తల్లిగా తన స్థితిగతుల్ని విశ్లేషించుకుంటుంది. అనూహ్య రీతిలో భర్త దూరమవడంతో మానసిక ఆందోళనల మధ్య నలగిపోతుంది. తనూ తిరిగిరాని తీరాలకు తరలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఒక్కుమ్మడిగా విరుచుకుపడిన స్థితిగతుల తాకిడి నుంచి తనకు తాను ఏ విధంగా బటపడిందన్నదే నవలాంశం. ‘కొత్త జీవితాన్ని ఎలా ఆరంభించిందో విపులీకరిస్తూ రాశానీ పుస్తకాన్ని. మీరు ఎప్పుడైనా గమనించారా? వృద్ధుల్లో కొందరు గోడవైపు మొహం పెట్టి పడుకుంటారు. అంటే, వెన్ను చూపుతుంటారు. జీవితానికి కూడానా అనిపిస్తుంది నాకు. అటువంటి ఆలోచనల, ఫలితాల, ప్రభావాల విపులీకరణతో రసస్ఫూర్తివంతంగా రాసినందుకే ఈ పురస్కారం వచ్చిందనిపిస్తుంది!’అన్న రచయిత్రి మాటలే ఆమె అంతరంగ తరంగాల్ని మనముందు ఉంచుతాయి. ‘అవార్డు కోసం రాయను, రాసినందుకు వస్తే సంతోషించకుండా ఎలా ఉండనూ?’ అంటున్న ఆమెలో ఆచరణవాది కనిపిస్తారు. ఎనభై సంవత్సరాల వృద్ధురాలిలోని బాల్య యౌవన కౌమార దశలను విశ్లేషించడంతో చారిత్రక సదవగాహన ప్రతిబింబి స్తుంది. చరిత్రనీ, వర్తమానాన్నీ భవితను తేరిపార చూడగల తన దృక్పథం అసమానంగా తోస్తుంది. ‘ఇసుక సమాధి’ అని పేరు పెట్టడంలో ఎన్నెన్ని జీవితానుభవాలు ఇమిడి ఉన్నాయో చూసిన మనసు ఒక అలౌకిక అనుభూతికి లోనవుతుంది.
ప్రతి రోజూ జేజేలు
అన్నట్లు, జూన్ 12నే గీతాంజలిశ్రీ పుట్టినరోజు. ఇప్పుడామెకు 65 ఏళ్ళు. ఐదో నవలకు వచ్చిన ఖండాంతర ఖ్యాతి అపూర్వం, అపురూపం. ఏది రాసినా చారిత్రక దృక్పథం ఉండాలి. వర్తమానం ప్రతిఫలించాలి. భవిష్యత్తును చూడగలగాలి. సమ స్యల జాబితా కాక వాటిని పరిష్కరించుకునే దిశను పఠితలకు చూపగలగాలన్నదే ఈ మహారచయిత్రి కలం చెబుతున్న పాఠం. ఇటువంటి సాహితీవేత్తలకే ఎక్కడైనా, ఎప్పుడైనా జన నీరాజనాలు. ఇదే నిత్యసత్యం. చరిత్రాత్మక వాస్తవం.
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్