‘నేను ఎప్పుడో ఆయుధం వదిలి పెట్టేశాను. ఆ తరువాత సాక్షాత్తు గాంధీజీ అహింసా మార్గంలోనే ఉద్యమించాను. మహాత్ముడి సిద్ధాంతాల మేరకు నడుచుకున్నాను. అహింసాయుత రాజకీయాలే నడిపాను.’ ఇవి కరుడు కట్టిన ఒక ఉగ్రవాది నోటి నుంచి వెలువడిన మాటలు. అతడు ఎవరో కాదు, కశ్మీర్‌ ‌వేర్పాటువాద నాయకుడు, ఉగ్రవాది, అక్కడి హిందువుల మీద జరిగిన అనేక ఘోరాలలో భాగస్వామి యాసిన్‌ ‌మాలిక్‌. ‌జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం (ఢిల్లీ) దోషిగా నిర్ధారించడానికి కాస్త ముందు అతడు చెప్పిన మాటలివి. యాసిన్‌ను ఉపా (అన్‌లాఫుల్‌ ‌యాక్టివిటీస్‌ (‌ప్రివెన్షన్‌) ‌యాక్ట్) ‌కింద జాతీయ దర్యాప్తు సంస్థ విచారించింది. మరణదండనే ఇతడికి సరైన శిక్ష అని జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయవాది వాదించినా, కోర్టు అందుకు నిరాకరించి రెండు యావజ్జీవిత కాలాల శిక్ష విధించింది. పది లక్షల రూపాయల జరిమానా విధించింది. హిందూ భారతదేశమే కశ్మీర్‌ ‌మీద యుద్ధం చేస్తున్నదని మాలిక్‌ ‌జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం న్యాయమూర్తి ప్రవీణ్‌ ‌సింగ్‌ ‌ముందు వాదించాడు. ‘నేను ఏడుగురు ప్రధానులతో పనిచేశాను’ అయినా నాలో ఉగ్రవాది కనిపిస్తే ఉరి తీయండి అని కూడా మాలిక్‌ ‌సవాలు విసరడం ఈ ఉదంతానికి కొసమెరుపు.

యూపీఏ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మాలిక్‌ ‌కరచాలనం చేస్తున్న ఫొటో ఆ మధ్య వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అలాగే అరుంధతీ రాయ్‌ ‌కూడా అతడితో కలసి ఫొటో తీయించుకుంది. వందల మంది చావుకు కారణమైనవాడు, లక్షలాది మంది కశ్మీరీ పండిత్‌లు లోయ వీడి ప్రాణభయంతో పారిపోయే పరిస్థితులు సృష్టించినవాడు తాను గాంధీజీ అనుచరుడినని చెప్పడం కలికాలపు వింతకు మించిన వింత కాదా? త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి దేశ వినాశనాన్ని కోరుతూ షాహిన్‌బాగ్‌లో తిష్ట వేసిన తరహా దగాయే ఇది కూడా. మాకు రాజ్యాంగం శిరోధార్యమంటూంటూనే ఎర్రకోట మీద దాడి చేయడం ఈ కోవలోనిదే. ఇస్లామిక్‌ ‌మత ఛాందసంలో, భారత వ్యతిరేక ధోరణిలో ఇప్పుడు కనిపిస్తున్న కొత్త కోణమిది. మరొకమాట కూడా చెప్పుకోవాలి.

యాసిన్‌ ‌మాలిక్‌ అం‌టే పాక్‌ అనుకూల వేర్పాటు వాదిగానే ప్రపంచానికి తెలుసు. మే 25న ఇతడికి శిక్ష ఖరారైంది. తన మీద దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణలలో వేటినీ మాలిక్‌ ‌తిరస్కరించలేదు. తాను నేరాలు చేసినట్టు రుజువు ఉంటే ఉరిశిక్ష వేసినా అభ్యంతరం లేదని బీరాలు పలికాడు. శిక్ష తగ్గించమని తాను ఏ కోర్టునూ దేబరించననీ కూడా ప్రకటించాడు. దీనితో మే 19న ఇతడిని దోషిగా ప్రకటించారు. మే 24న యావజ్జీవ కారాగారం విధించారు. అది కూడా రెండు యావజ్జీవ కారాగార శిక్షలు. పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. తీర్పు ప్రకటించే సమయంలో ఢిల్లీ అంతటా ప్రత్యేక బలగాలను మోహరించవలసి వచ్చిందంటేనే మాలిక్‌ ‌ఘనత ఏమిటో అర్ధమవు తుంది. ముస్లిం మతోన్మాదులు హింసకు పాల్పడ వచ్చునని నిఘా వర్గాలు అనుమానించాయి.

జమ్ముకశ్మీర్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ (‌జేకేఎల్‌ఎఫ్‌) ‌నాయకుడు మాలిక్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ 2019లో అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందించిన ఆరోపణపై 2017లో నమోదైన కేసుకు సంబంధించి అప్పుడు అరెస్టు చేశారు. పాకిస్తాన్‌ ‌నుంచి, ఉగ్రసంస్థ లష్కరే తాయిబా నిర్వాహకుడు హఫీద్‌ ‌సయీద్‌, ‌హిజ్‌బుల్‌ ‌ముజాహిదీన్‌ ‌నాయకుడు సయ్యద్‌ ‌సలాహుదీన్‌ల నుంచి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు తీసుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఆరోపించింది. భద్రతా బలగాల మీద రాళ్లు విసిరే మూకలకు పంచడానికి, పాఠశాల భవనాలు తగలబెట్టడానికి, నిరసనలు, సమ్మెలు నిర్వహించడానికి ఈ డబ్బు వినియోగించాడని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. కశ్మీర్‌లోయ నుంచి పండిత్‌లు వలస పోవడానికి ఇతడు కూడా కారణమని జాతీయ దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం ఇంకొందరి పైన కూడా అభియోగాలు మోపింది. ఇందులో ఫారూక్‌ అహ్మద్‌ ‌దార్‌ ‌కూడా ఒకడు. ఇతడినే బిట్టా కరాటే అంటారు. కశ్మీరీ పండిత్‌ల ఊచకోతలో ఇతడు కూడా కీలకమే. ఇంకా షాబీర్‌షా, మస్రత్‌ ఆలం, మహ్మద్‌ ‌యూసుఫ్‌ ‌షా, అఫ్తాబ్‌ అహ్మద్‌ ‌షా, నయీం ఖాన్‌, ‌మహ్మద్‌ అక్బర్‌ ‌ఖాందే, రాజా మెహరుజుద్డీన్‌ ‌కల్వాల్‌, ‌బషీర్‌ అహ్మద్‌ ‌భట్‌, ‌జహూర్‌ అహ్మద్‌ ‌షా వతాలి, అబ్దుల్‌ ‌రషీద్‌, ‌నావల్‌ ‌కిశోర్‌ ‌కపూర్‌ ఉన్నారు.

మాలిక్‌ ‌పుట్టినది (1966) శ్రీనగర్‌లోనే. ట్యాక్సీ డ్రైవర్లకీ, ఇద్దరు జవాన్లకీ మధ్య జరిగిన ఘర్షణను చూసిన తరువాత ఇతడు తిరుగుబాటు ధోరణిలోకి వచ్చాడని కొన్ని పత్రికలు రాస్తూ ఉంటాయి. తరువాత తాలా పార్టీని స్థాపించాడు. 1986లో దీనికే ఇస్లామిక్‌ ‌స్టూడెంట్స్ ‌లీగ్‌ అని పేరు మార్చాడు. దీనికి విప్లవ సంస్థ అని పేరు. మాలిక్‌ ‌నేరాల చిట్టా తక్కువదేమీ కాదు. ఇస్లామిక్‌ ‌స్టూడెంట్స్ ‌లీగ్‌ ‌పంచిన కరపత్రాలతో అల్లర్ల• చెలరేగేవి. 1983లో షేర్‌ ఇ ‌కశ్మీర్‌ ‌మైదానంలో వెస్టిండిస్‌తో జరగవలసిన క్రికెట్‌ ‌మ్యాచ్‌ను భగ్నం చేయడానికి మాలిక్‌ ‌ప్రయత్నిం చాడు. నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌సమావేశాలను భగ్నం చేయడం కూడా ఇందులో ఒకటి. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, హత్యలు కారణంగా మక్బూల్‌ ‌భట్‌ అనే ఉగ్రవాదిని ఉరి తీసినప్పుడు లోయలో అల్లర్లు సృష్టించాడు. దీనితో మాలిక్‌ను అరెస్టు చేసి నాలుగు నెలలు నిర్బంధంలో ఉంచారు. 1987 నాటి అసెంబ్లీ ఎన్నికలలో మాలిక్‌ ‌సంస్థకు చెందిన అనుబంధ విద్యార్థి సంఘం ముస్లిం యునైటెడ్‌ ‌ఫ్రంట్‌తో కలసి పనిచేసింది. మాలిక్‌ ‌సంస్థ నేరుగా ఎందుకు పోటీ చేయలేదంటే, రాజ్యాంగం మీద నమ్మకం లేకపోవడమే. ఈ ఎన్నికల తరువాతే లోయలో ఉగ్రవాదం పెట్రేగిపోయింది. ఆ ఎన్నికల తరువాత మాలిక్‌ ‌సాయుధ శిక్షణ కోసం ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లాడు.

కశ్మీర్‌ను రక్తపాతంతో అల్లకల్లోలం చేసిన సంస్థలలో దాదాపు మొదటిది జేకేఎల్‌ఎఫ్‌. ‌మక్బూల్‌ ‌భట్‌తో కలసి 1976లో అమానుల్లా ఖాన్‌ ‌స్థాపించాడు. దీనిని ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ప్రారంభించినప్పటికీ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాపూర్‌లో కార్యాలయం ఉండేది. లోయలో అతి పెద్ద ఉగ్రవాద సంస్థగా ఆవిర్భవించిన తరువాత జేకేఎల్‌ఎఫ్‌ ‌విద్రోహచర్యలను ప్రారంభించింది. పాకిస్తాన్‌లో రెండేళ్లు సాయుధ శిక్షణ పొంది వచ్చిన తరువాత 1980 దశకంలో మాలిక్‌ ఈ ‌సంస్థలోనే చేరాడు. లష్కరే తాయిబా, హిజ్‌బుల్‌ ‌ముజాహిదీన్‌, ‌జేకేఎల్‌ఎఫ్‌, ‌జైషే మహ్మద్‌ ‌వంటి సంస్థలు ఒకపక్క రక్తపాతం సృష్టిస్తుండగా, రాజకీయ పరిష్కారం నినాదంతో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడినది హురియత్‌ ‌కాన్ఫరెన్స్. అం‌దులో కూడా మాలిక్‌ ‌సభ్యుడే.

మాలిక్‌ ‌మీద 65 క్రిమినల్‌ ‌కేసులు ఉన్నాయి. ఇందులో ఎక్కువ హత్య, హత్యకు ప్రయత్నించడం, దేశద్రోహం కేసులే అధికం. వీపీ సింగ్‌ ‌ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన మంత్రిమండలిలో హోంశాఖను నిర్వహించిన ముఫ్తీ మహ్మద్‌ ‌సయీద్‌ ‌కుమార్తె రుబయా అపహరణ ఉదంతం దేశాన్ని కదిపింది. 1989లో జరిగిన ఆ కేసులో మాలిక్‌ ఉన్నాడు. 1990లో జరిగిన నలుగురు వైమానిక దళ సిబ్బంది హత్య కేసులోను మాలిక్‌ ‌నిందితుడు.

ఇతడు 1990లోనే బాగా గాయపడి ఉన్న దశలో భద్రతా దళాలకు దొరికాడు. తరువాత 1994 వరకు కారాగారంలో ఉన్నాడు. ఎందుకో మరి అదే సంవత్సరం బెయిల్‌ ‌మీద వచ్చిన తరువాత జేకేఎల్‌ఎఫ్‌ ‌నిరవధికంగా కాల్పుల విరమణ పాటిస్తుందని ప్రకటించాడు.

సమయం దొరికింది కదా అని పాకిస్తాన్‌లో ప్రతి నాయకుడు మాలిక్‌ ‌మీద వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారు. పనిలో పనిగా భారత్‌ను ఆడిపోసుకుంటున్నారు. మాలిక్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ ఉరిశిక్ష విధించాలని సూచించడం ద్వారా భారత్‌ ‌ఫాసిస్ట్ ‌దేశమని రుజువయిందని పాకిస్తాన్‌ ‌పీకేసిన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌కూడా మాలిక్‌ను శిక్షించిన రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినమని గోల పెట్టాడు. ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్‌ ‌భుట్టో, కశ్మీరీ సోదర సోదరీమణులకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని నోరు పారేసు కున్నాడు. పాకిస్తాన్‌ ‌సంగతి సరే. ఇస్లామిక్‌ ‌దేశాల సహకార వ్యవస్థ (ఓఐసీ) వైఖరి ఎంత ప్రమాదకరంగా, నీతి బాహ్యంగా ఉన్నదో చెప్పడానికి మాటలు చాలవు. యాసిన్‌ ‌మాలిక్‌ ‌శిక్ష పట్ల ఆ సంస్థ నిరసన ప్రకటించింది. ఒక ఉగ్రవాది హత్యను వివాదాస్పదం చేసి ఒక దేశాన్ని బోనులో నిలబెట్టే యోచన నీచం కాదా? ఈ ధోరణి మతం ప్రాతిపదికగా ఒక దేశ వ్యవహారాలలో ఒక అంతర్జాతీయ సంస్థ కలుగచేసుకోవడమే. ఇది ప్రపంచానికి పెద్ద ప్రమాద సంకేతమే. ఒక ఉగ్రవాదిని, నరహింతకుడిని శిక్షిస్తే ఇంత రాద్ధాంతం దేనికి? ఏ

రుజువులూ లేకుండా పాకిస్తాన్‌ ‌మాదిరిగానో, చైనా మాదిరిగానో అతడిని గుట్టుచప్పుడు కాకుండా విచారించలేదు. జైల్లో కుక్కలేదు. అసలు ముస్లిం దేశాలలో ఉండే న్యాయవ్యవస్థ ఎలాంటిది? అక్కడ హక్కుల మాటేమిటి? ముందు ఆ సంగతి ఆ సంస్థ ప్రశ్నించుకోవాలి.

అయినా మాలిక్‌ ఇం‌త సులభంగా తన నేరాలను ఎందుకు అంగీకరించినట్టు? ఏ ధీమాతో జైలుకు వెళ్లడానికి సిద్ధమైనట్టు? ఇది కూడా కుట్రేనా? ఇవన్నీ ఎలా ఉన్నా పాకిస్తాన్‌ ఉ‌గ్రవాదుల పట్ల తనకు ఉన్న అనురాగాన్ని మాలిక్‌ ఉదంతంతో మరొకసారి లోకానికి చాటుకుంది. శ్రీనగర్‌లో ప్రస్తుతానికి కుక్కిన పేనుల్లా ఉన్న పాక్‌ ‌మానసపుత్రులు మళ్లీ గొంతెత్తారు. తీర్పు వెలువడిన తరువాత శ్రీనగర్‌లోని మాలిక్‌ ఇం‌టి దగ్గర కొందరు గుమిగూడి భారత వ్యతిరేక నినాదాలు చేశారు. వారిలో కొందరిని అరెస్టు చేశారు కూడా. ఇలాంటి ధోరణిని నిలువ రించాలంటే ఎలాంటి చట్టాలు రావాలి? అసలు హక్కులు అనేవి ఇలాంటి ముస్లిం ఉగ్రవాదులకీ, మతోన్మాదులకేనా? వీళ్ల చేతుల్లో నిర్దాక్షిణ్యంగా మరణించినవారికి హక్కులు ఉండవా? కొన్ని కోట్ల మంది నమ్ముతున్న వ్యవస్థను మతోన్మాదంతో ఏ కొద్దిమందో తుపాకీ సాయంతో భగ్నం చేద్దా మనుకుంటే ఎంతటి కఠిన శిక్షలు అవసర మవుతాయి?

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE