2014లో కేంద్రంలో నరేంద్రమోదీ మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. రైతు ఆర్థిక స్థితిగతుల్ని పెంపొందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇ-నామ్, పీఎం కృష్టి షించాయీ యోజన వంటి ఎన్నో పథకాల అమలు ద్వారా రైతు అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రైతు అభివృద్ధి కోసం 2014 నుంచి చేపడుతున్న వివిధ పథకాల గురించి తెలుసుకుందాం!
పీఎం పంటల బీమా పథకం
దీనిని 2018లో ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు దీని కింద ఊరట లభిస్తోంది. ఈ పథకానికి శ్రీకారం చుట్టాక ఇప్పటి దాకా 37.52 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారు. రూ.1.2 లక్షల కోట్ల పరిహారంగా అందుకున్నారు. (జూన్, 2022)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో 2019 ఫిబ్రవరి 21న నగదు బదిలీ పథకం ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిటి) కింద అర్హులైన రైతుల ఖాతాలకు ఏటా మూడు విడతలుగా రూ.6,010 జమ చేస్తున్నారు. ఈ మేరకు 2022 ఏప్రిల్ 25 వరకూ మొత్తం 11.3 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు రూ.1.82 లక్షల కోట్లు జమ చేశారు.
ఇ-నామ్ పథకం: వ్యవసాయోత్పత్తులకు పోటీ ధర పొందడంలో తోడ్పాటు
రైతులు తమ ఉత్పత్తులపై లాభసాటి ధర పొందడమే లక్ష్యంగా పారదర్శక ఆన్ లైన్ వేలం విధానాన్ని రూపొందిస్తూ ‘ఇ-నామ్’ వేదిక ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 11, 801 మండీలు దీనికి జోడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి 1.73 కోట్ల మంది రైతులు, 3.21 లక్షల మంది వ్యాపారులు కమీషన్ ఏజెంట్లతో పాటు 2,113 రైతు ఉత్పత్తిదారు సంస్థలు ఈ పోర్టల్లో నమోదయ్యాయి. 2022 మార్చి 22 నాటికి రూ.1.82 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార లావాదేవీలు సాగాయి.
స్వామిత్వ పథకం
2021 ఏప్రిల్ 21న ఈ పథకం ప్రారంభించారు. దీని కింద రైతుల భూమి సంబంధిత యాజమాన్య హక్కు కార్డుతోపాటు సదరు వ్యవసాయ భూమి రికార్డులు డిజిటల్ రూపంలో తయారవుతాయి. ఇది 2025 నాటికి దేశమంతటా అమలవుతుంది. 2022 మే 1 నాటికి దాదాపు 1.35 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి కాగా, 31 వేల గ్రామాల్లో 36 లక్షలకు పైగా ఆస్తి కార్డులు జారీ అయ్యాయి.
కిసాన్ క్రెడిట్ కార్డు
వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతుకు విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018 జూలై 1న ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద సింగిల్ విండో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా సులభ షరతులతో రూ. 3 లక్షల దాకా రుణం అందుతోంది. రూ. 3.38 లక్షల కోట్ల మేర రుణం మంజూరు పరిమితితో దేశవ్యాప్తంగా 2022 ఏప్రిల్ 25 వరకూ 3.05 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశారు. ఈ పథకం కింద రైతుపై వడ్డీ భారం సంవత్సరానికి కేవలం 4 శాతమే.
కనీస మద్దతు ధర పెంపు
ప్రభుత్వం కనీస మద్దతు ధరతో ధాన్యం, గోధుమలు కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు 2022-23 రబీ మార్కెటింగ్ కాలానికి గాను 2022 ఏప్రిల్ 21 వరకూ 137 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ కొనుగోలు చేశారు. అలాగే 2021-22 ఖరీఫ్ కాలానికిగాను 757.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులు పంట సాగుకు పెట్టిన ఖర్చుకన్నా ఒకటిన్నర రెట్లు అధికంగా రబీ పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించారు. రైతుల ఆదాయం పెంచే దిశగా దేశంలో 10 వేల రైతు ఉత్పత్తిదారు సంస్థలు ఏర్పాటు కానున్నాయి. వీటికి 5 సంవత్సరాలపాటు ప్రభుత్వ సహాయం అందిస్తుంది. ఈ మేరకు 2022 ఏప్రిల్ నాటికి 2315 ఎఫ్‌పీఓలు నమోదయ్యాయి.
జాతీయ వెదురు కార్యక్రమం
పునర్ వ్యవస్థీకృత జాతీయ వెదురు కార్యక్రమానికి 2018 ఏప్రిల్ 25న మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికింద వెదురు సాగు కోసం ప్రభుత్వం రైతులకు రూ.50 వేల దాకా సబ్సిడీ ఇస్తుంది. సన్నకారు రైతులకు ప్రతి మొక్క పైనా రూ.120 సబ్సిడీ ఇచ్చే విధంగా నిబంధన రూపొందించారు. భారతదేశం ఏటా 14 మిలియన్ టన్నుల వెదురును ఉత్పత్తి చేస్తుంది.
పకడ్బందీగా మార్కెట్ వ్యవస్థ
రైతులు పండించే పంటలు సకాలంలో మార్కెట్‌కు చేరేవిధంగా శీతల గిడ్డంగుల సౌకర్యం సహా ‘కిసాన్ రైలు’ పథకం ప్రారంభించారు. దీనికింద 2022 మార్చి 25 వరకూ కిసాన్ రైలు 2190 ట్రిప్పులు పూర్తి చేసింది.
ఇక 2020 ఆగస్టులో ‘కృషి ఉడాన్ 1.0’; 2021 అక్టోబరులో ‘కృషి ఉడాన్ యోజన 2.0’ ప్రారంభమయ్యాయి.
భూసార నిర్వహణ
భూసార పరీక్ష ఆధారిత సూక్ష్మ పోషకాల నిర్వహణను ప్రోత్సహిస్తూ ప్రవేశపెట్టిన ఈ పథకం కింద 2018-2019 నుంచి 2020-2021 వరకూ 5.67 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. తదనుగుణంగా 2022 ఏప్రిల్ 19 వరకూ దేశవ్యాప్తంగా 22.19 కోట్లకు పైగా భూసార కార్డులు రైతులకు పంపిణీ చేశారు.
పీఎం కిసాన్ సంపద యోజన
ఈ పథకాన్ని 2015 మే 3వ తేదీన రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం రూ.4600 కోట్ల అదనపు అంచనా వ్యయంతో 2025-2026 వరకు దీనిని పొడిగించారు. దీనికింద ఇప్పటివరకూ మెగా, మిసీ ఫుడ్ పార్కులు, ఆహార పరీక్ష ప్రయోగశాలలు సహా 1088 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
జాతీయ గోకుల గ్రామం కార్యక్రమం
దేశీయ సమీకృత పశుగణాభివృద్ధి కేంద్రాలుగా 16 గోకుల గ్రామాల ఏర్పాటు కోసం ఈ కార్యక్రమం కింద 2022 మార్చి 31 వరకూ నిధులు మంజూరు చేయగా, గత మూడేళ్లలో వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు దాదాపు రూ.2082 కోట్లు విడుదల చేశారు.
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పేరిట 2015-16లో ఒక సామూహిక పథకంగా ఇది ప్రారంభమైంది. ఇందులో సత్వర సాగునీటి లభ్యత కార్యక్రమం కూడా అంతర్భాగంగా ఉంది. దీని కింద ఉద్యమ తరహాలో పనులు చేపట్టిన 99 పెద్ద ప్రాజెక్టులలో ప్రస్తుతం 46 పూర్తయ్యాయి. ఈ 2021 మార్చి వరకూ గల సమాచారం మేరకు 50.64 లక్షల హెక్టార్ల భూమికి అదనపు నీటిపారుదల సౌకర్యం కల్పించారు.
‘ది న్యూ ఇండియా సమాచార్’ నుంచి