పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో సృజనాత్మక ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం జరగాలనీ, అప్పుడే వారు బాగా ఆలోచించగలుగుతారనీ విద్యాభారతి అధ్యక్షులు దూసి రామకృష్ణ చెప్పారు. నూతన జాతీయ విద్యా విధాన రూపకల్పనలో విద్యాభారతి కీలక పాత్ర వహించిన సంగతి తెలిసినదే. చరిత్ర పాఠ్య పుస్తకాలలో మార్పును అంతా కోరుకుంటున్నారనీ, సాహిత్యంలో ఇప్పటి పరిస్థితిని బట్టి దేశీయమైన కంటెంట్ తీసుకోవడమే సరైనదని నూతన జాతీయ విద్యా విధానం అభిప్రాయమని ఆయన చెప్పారు. దేశ అవసరాలకు అనుగుణంగా వృత్తి విద్యలలో పిల్లలకు పరిచయం ఉండాలని కూడా కొత్త విద్యా విధానం భావిస్తోంది. వ్యాయామం, యోగా, కళలకు ప్రాధాన్యం ఇస్తారని, పరిశోధనలను దేశ అవసరాలకు అనుగుణంగా మలుస్తారని కూడా చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జాతీయ విద్యా విధానం మీద బీజేపీయేతర రాష్ట్రాల మాటలలో ఉన్న వ్యతిరేకత అమలు దగ్గర లేదని కూడా రామకృష్ణ తెలియచేశారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 గురించి ఆయనతో జాగృతి జరిపిన ముఖాముఖిలో చివరి భాగమిది:
పిల్లల్లో సృజన పెంచడానికి కొత్త జాతీయ విద్యావిధానం 2020 ప్రత్యేకంగా చూపించిన శ్రద్ధ ఏమిటి?
సాధారణంగా 21వ శతాబ్దపు నైపుణ్యాలు- క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్ – వీటన్నింటి విస్తరణకు ఈ విధానంలో ఎంతో చక్కగా యోజన చేశారు. ఇందుకోసం సీబీఎస్‌సీ, విద్యారంగ నిపుణులు కలసి ముందుగానే చక్కటి పుస్తకాలు సేకరించి పెట్టారు. మిగిలిన పాఠశాలలకు వెళ్లి వాళ్లు చేసిన ప్రయోగాలను కూడా సంగ్రహించి పెట్టారు. ఇప్పుడు విద్యా విధానంలో మూల్యాంకనకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు పిల్లలూ, వాళ్ల సృజనాత్మక ప్రతిభ అని ఆలోచిస్తే- రెండు రకాల ఇంటెల్‌జెన్స్ ఉంటాయి. అవి, దేశీయం, సహజం. సాధారణంగా ప్రతి ఒక్కడి రక్తంలోనూ ఈ రెండూ ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెల్‌జెన్స్ వచ్చిన కారణంగా అవి పక్కన పెట్టేస్తున్నారు. ఉదాహరణకు ఓ కుర్రాడు రాత్రివేళ టార్చ్‌లైట్ వెలుగులో అమ్మమ్మని తీసుకుని వెళ్తున్నాడు. దారిలో గొయ్యి. అందులో వాళ్ల అమ్మమ్మ పడి, కాలు విరిగింది. వాడికి దు:ఖం, ప్రశ్న ఒకేసారి వచ్చాయి. టార్చ్‌లైట్ ఉన్నా ఆమె ఎలా పడిపోయింది? వాడు ఆరునెలల తర్వాత అదే టార్చ్‌లో అసలు బల్బు కింద ఇంకో చిన్న బల్బు అమర్చాడు. ఫోకస్ చేస్తే దారే కాదు, టార్చ్ కింద నేల కూడా కనిపించేటట్టుగా చేశాడు. ఇది సృజనాత్మక శక్తి కాదా! ఇలాంటి సృజనశీలతని పాఠశాలల్లో ప్రోత్సహిస్తే, ఆ దశ నుంచే పిల్లలు పెద్దగా ఆలోచించగలుగుతారు. ఇప్పుడు విద్యార్థి యాటిట్యూడ్, యాప్టిట్యూడ్-ఇవన్నీ తీసుకొని, వాటిని వికసింపచేయడానికి అవకాశాలు ఇచ్చారు. దానికి వాళ్లు రకరకాల పేర్లు పెట్టారు. ఇంటర్ డిసిప్లె యినరీ అప్రోచ్, మల్టీ డిసిప్లెయినరీ అప్రోచ్, ఇంటిగ్రేషన్ ఇలా. ఈ విధానంలో జరిగినదేమిటి అంటే- కేవలం తరగతికే పరిమితం కాకుండా, ఇంటి ప్రమేయం ఉండాలన్నారు. నిజానికి ఇల్లే పెద్ద తర్ఫీదు కేంద్రం.
ఇప్పుడు ప్రాజెక్టు వర్క్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇంతవరకు ఏమిటంటే అందరం ఏదో చెప్తాం. అది వాళ్లు రాసుకురావడం. ఇప్పుడు అలా కాదు. మేము టీచర్స్ ట్రైనింగ్ పెడుతున్నాం. ముందర ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలో చెప్పాలి. అంటే ఉపాధ్యాయునికి పరిచయంచలేనిదే పిల్లలతో చేయించలేడు కదా! ఈ విద్యా విధానంలో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యమైనది- ప్రజలను చైతన్యవంతులను చేయడం. విద్యా రంగంలో, దాని పురోగతిలో వారి ప్రమేయం పెంచడం. ఈ విధానం వచ్చిన మూడు నెలల కాలంలో ఎంతమందిని విద్యాభారతి చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించిందో చెప్పలేం. ఉదాహరణకు ఈ విధానం వెలువడిన వెంటనే తెలంగాణ ప్రాంతంలోనే 3 నెలల కాలంలోనే 16 వేల మందిని కలిశాం. చిన్న చిన్న బృందాలుగా విభజించి ఈ విషయాలన్నీ వివరించి చెప్పాం. అలా దేశం మొత్తం జరిగింది. కొత్త విధానం ఫలితం ఎలా ఉంటుందని ప్రజలు ఎదురు చూడటానికి కారణం ఇదే. ఎంత కష్టపడి మనం చేశామంటే విద్యాప్రవేశ్ అనే ఒక పుస్తకాన్ని విడుదల చేశాం. ఇది ప్రభుత్వ ప్రచురణే. దానికోసం 28 మంది ఉపాధ్యాయులను దేశం మొత్తం నుంచి ఏర్పాటు చేశాం. భారతీయ పద్ధతుల్లో చేశాం. మనం చేసిన ప్రయోగాలన్నింటిని చూసి ఇప్పుడున్న స్టీరింగ్ కమిటీ కూడా సంతోషించింది.
ఇప్పుడు చరిత్ర రచన, దృష్టికోణం వీటి మీదే చర్చంతా నడుస్తున్నది. కాబట్టి చరిత్రకు సంబంధిం చిన యోజన ఏమిటి?
కొత్త జాతీయ విద్యావిధానంలో చరిత్ర అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పును ఆశించవచ్చు. చరిత్రనంతా ఒక చోట చేర్చి, సరైన పద్ధతుల్లో రాసే పక్రియకు అవకాశం ఇవ్వాలన్నదే ప్రభుత్వం కోరిక. ఇందుకు సంబంధించి కార్య శాలలు కూడా నిర్వహిస్తున్నది. 6,7,8 తరగతులకి చెన్నైలో చేశాం. మనం కూడా ప్రత్యేకంగా చేశాం. ఆ పుస్తకాల్ని గవర్నమెంట్‌కి ఇచ్చేస్తున్నాం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించింది. దీని మీద మనం కూడా సమావేశం ఏర్పాటు చేశాం. గవర్నమెంట్, ఇతరులని కూడా పిలిచాం. విషయం చెప్పాం. వాళ్లు అంగీకరించారు. అయితే ఆ విషయం మీద తమకు పరిజ్ఞానం లేదు కాబట్టి అది ఇమ్మన్నారు. ప్రభుత్వంతో పాటు మనం కూడా పరిశోధకులని, ఎడిటర్లని గుర్తించాం. చరిత్ర పుస్తకాలలో మార్పు రావాలన్న ఆకాంక్ష ప్రజలలో బలంగా ఉంది.
ఇప్పుడు సాహిత్యమే పెద్ద ప్రశ్నార్ధకం. దాని దిశ ఇంకా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. భారతీయమైన చింతన తగ్గి, విదేశీ సిద్ధాంతాల ప్రభావంతో ఉన్న సాహిత్యమే గొప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే సంఘర్షణే సాహిత్యానికి కేంద్ర బిందువు కావాలన్న ప్రచారం. దీనికి కొత్త జాతీయ విద్యావిధానంలో సమాధానం ఏదైనా ఉందా?
ఇక అలాంటి వాతావరణమైతే నిలబడదు. దీని మీద చర్చ జరిగింది. విదేశాల నుంచి తీసుకునే రిఫరెన్సులు తగ్గాలన్నది ఒక తీర్మానం కూడా. మిచిల్ డేనియల్ అని మనతోనే ఇందులో పని చేశారు. ఫ్రెంచ్ దేశీయుడు. 1975 నుంచి భారత్‌ను ప్రేమిస్తూ ఇక్కడే ఉండిపోయారు. ఇప్పటి పరిస్థితిని బట్టి భారతీయమైన కంటెంట్‌ను మాత్రమే తీసుకో వాలని ఆయన అన్నారు. నిజానికి ఇలా విదేశీ ఆలోచనల మీద ఆధారపడడం అనేది ఇక్కడ తప్ప ఎక్కడా కానరాదని ఆయనే మనకు చెప్పారు. చాలా దేశాలను చూసి వచ్చిన తరువాత, ఆ అనుభవంతో ఆయన చెప్పిన మాట ఇది. వీటి ప్రాతిపదికగానే నేను సిఫారసులు చేశాను. ఒకటి అంగీకరించాలి. సాహిత్యం కంటే భాష అనే అంశం మీద ఎక్కువ దృష్టి పడింది. సాహిత్యం మీద తక్కువే. భాషకు ఒక కమిటీ ఉంది. దాని అధ్యక్షులు వృషభ్ జైన్. దానిని సమావేశపరిచాం. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఇంకా సమావేశం కాలేదు. ఆ సమావేశాలలో సాహిత్యం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కానీ కింది తరగతులలో కూడా సాహిత్య పరిచయం ఉండాలి. ఇక పిల్లలకోసం నాలెడ్జ్ ఆఫ్ ఇండియా పథకం ఉంది. దానినే వాళ్లు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటున్నారు. చిన్న పిల్లలకు భారతీయమైన పరిజ్ఞానం అందాలి. కపిల్ కపూర్, డేనియల్ దీని మీదే పనిచేస్తున్నారు. మనదైనది ఏమిటో తెలిస్తే బయటివాటి జోలికి వెళ్లరు.
వృత్తి విద్య గురించి జాతీయ విద్యా విధానం ఏమంటుంది?
స్కిల్లింగ్ బై స్కూలింగ్ అనేది ఉంది. వృత్తివిద్యకి ఈ కొత్త విద్యా విధానంలో అధిక ప్రాధాన్యమే ఉంది. మన యువతకి దేశ అవసరాలను బట్టి ఏదో ఒక వృత్తి నై•పుణ్యం ఉండాలి. ప్రాథమిక స్థాయిలో వృత్తి విద్య అంటూ ఇక విడిగా ఉండదు. 6 నుండి 8వ తరగతి వరకు పాఠ్యాంశాలతో పాటే వృత్తి విద్యా ప్రణాళికను జోడించి, బోధించే పద్ధతి, దానికి అవసరమైన ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. అలాగే సెకండరీ లెవల్ దేనినైనా ఎంచుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇక తన ఇష్టం. ఎన్నెన్ని అవకాశా లున్నాయో అవన్ని కూడా అక్కడ కనిపిస్తాయి. ఒక ప్రత్యేక విద్యా విధానం తయారుచేయడం కోసం national skill qualification framework పరిధిలో వీటికోసం పని చేస్తున్నారు. దానికి ఒక టీం వేసి, ఆ టీం ద్వారా అధ్యయనం చేసి, ఇప్పటివరకు జరుగుతున్న ప్రయోగాలన్నింటికి కూడా నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. కాబట్టి రాబోయే రోజుల్లో దీంట్లో మంచి మార్పులు వస్తాయని మనం ఆశించవచ్చు. ప్రాథమిక స్థాయిలో మనం చేసే పనుల ద్వారా వృత్తి విద్య పట్ల ఆకర్షణ కలగడం, మిడిల్ స్కూల్ స్థాయిలో, అంటే 6 నుండి 8వ తరగతి వరకు కూడా బోధనాంశాలతో పాటే వృత్తి విద్యా నైపుణ్యాల్ని జోడించే ప్రయత్నం జరుగుతున్నది. సెకండరీ లెవల్‌లో ఏ సబ్జెక్టు అయినా తీసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్యను పూర్తిగా విస్మరిస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రైవేటు పాఠశాలల సంగతి సరే. కొత్త జాతీయ విద్యా విధానంలో వ్యాయామం, యోగాలకు ఎలాంటి స్థానం ఉండబోతోంది?
ఈ మధ్య యూనెస్కో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఎక్కువ మంది వ్యాయామం, యోగా, సంగీతం ఇతర కళల పట్ల ఆసక్తి చూపు తున్నారు. వీటి కోసం ఆచార్యులను నియమించా లన్న యోచన ఉంది. అది తప్పకుండా జరగాలి కూడా. ఇందుకు సంబంధించిన ప్రశిక్షణ కూడా గాఢంగా జరగాలి. ఆ పని జరుగుతుందని ఆశిస్తున్నాం.
పరిశోధనలో ఎలాంటి మార్పులు రాబోతు న్నాయి?
చక్కటి పరిశోధక వ్యవస్థ దేశానికి అవసరం. మారుతున్న ప్రపంచ పరిస్థితులు, స్థానికంగా ఉండే అవసరాలు దృష్టిలో ఉంచుకొని నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ రాబోతున్నది. సమాజంలో నేటి అవసరా లను దృష్టిలో ఉంచుకొని మాత్రమే దాని ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతాయి. పరిశ్రమలు లేదా సమాజంలో ఉండే ఇతర వ్యవస్థలు, పర్యావరణ పరిస్థితులు, ఇతర సమస్యలు దృష్టిలో ఉంచుకొని పరిశోధన జరగాలన్నదే కోరిక. భారతీయ జ్ఞాన పరంపరలో ఉండే పద్ధతి ప్రకారం నేడు దేశానికి ఉపయోగపడే పరిశోధనలు రావాలి. దాని ద్వారా మన దేశం కూడా పెద్ద జ్ఞాన సమాజంగా ప్రపంచం మొత్తం వెలుగొందాలని ఆశ. ఇప్పటికే భారతదేశం లోకల్ ప్లేయర్‌గా ఉంది. రాబోయే రోజుల్లో విశ్వ నాయకత్వం వహించడానికి కావల్సిన మార్గాల్లో రిసెర్చ్ వ్యవస్థపై దృష్టి పెట్టడం ప్రధానం. దానికి కావలసిన ప్రయత్నాలు, కమిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతున్నది. అదే కనుక జరిగితే హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఒక పెద్ద మార్పు రాబోతున్నట్టు లెక్క.
సమాజంలోని అన్ని వర్గాల వారి పిల్లలు, తరతమ భేదం లేకుండా ఒకే బడిలో చదవాలన్న విధానం అమలుకు ఎలాంటి సూచనలు ఉన్నాయి?
నిజానికి ఇక్కడ అన్ని వర్గాల పిల్లలు ఒకే బడికి అనే విధానమే ఉండేది. కానీ స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఇది దారి తప్పింది. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పాఠశాల అనే పద్ధతిని ప్రోత్సహించింది కూడా ప్రభుత్వమే. ఉదాహరణకి కేంద్రీయ విద్యాలయాలనే పేరుతో, నవోదయ, మోడల్ స్కూల్స్ పేరుతో ఇలా ఒక్కొక్క వర్గానికి పాఠశాలలు వచ్చాయి. అందరికీ ఒకే రకమైన విద్య ఉన్నప్పుడే ఏకరూపమైన పెద్ద మార్పు సాధ్యం. అయితే నేటి విద్యా విధానంలో దానికంత పెద్ద ప్రోత్సాహం లేదు. అయితే ఒక ప్రయత్నం ఏమిటంటే, ఇప్పుడున్న అంగన్‌వాడీ పాఠశాలలు, ప్రీ ప్రైమరీ వీటన్నింటినీ ప్రధాన స్రవంతి విద్యారంగంతో అనుసంధానం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు బలపడినట్టయితే అందరికీ• ఒకే బడి, అందరికీ ఒకే విద్య అన్న విధానం అమలులోకి వస్తుంది. అరమరికలు లేని పద్ధతుల్లో ఒకే రకమైన విద్యావ్యవస్థకు అవకాశం ఉంటుంది. దానికోసం ఎదురుచూద్దాం. మనవంతు ప్రయత్నం కూడా మనం చేద్దాం.
బీజేపీ ఏం చేసినా కాషాయం అన్న ఆరోపణ సిద్ధంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న విపక్షాలు బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకతతో ఉన్నాయి. అవి కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఎలా తీసుకుంటాయి?
ఆ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల ఇష్టం. ముందే చెప్పుకున్నాం. ఇది సిఫారసు మాత్రమే. ఆదేశం మాత్రం కాదు. అయితే మా పద్ధతుల్లో మేము విద్యావిధానాన్ని అమలు చేస్తామని చెప్పేవారు కూడా రాబోయే రోజుల్లో ఈ కొత్త జాతీయ విద్యా విధానం గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కేరళలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్‌లో తెచ్చిన మార్పులు, నియమాలు చూసుకున్న తర్వాత, అవసరాల దృష్ట్యా కొంత యూటర్న్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కేరళ మాత్రమే కాదు, మిగిలిన చోట్ల కూడా ఈ పాలసీలో ఉండే మంచిని తీసుకొని, ముందుకి వెళ్లే యోచనలో ఉన్నారు. వాస్తవంగా, బయటికి కనిపించే వ్యతిరేకత అంతర్గతంగా లేదు. విధానం అమలులోను ఆ వ్యతిరేకత గోచరించటం లేదు.