జీవితంలో పరిపూర్ణత సాధించి మనిషి ‘మనీషి’గా ఎదగాలంటే స్థితప్రజ్ఞత అవసరం. అది లేనినాడు మనసు అదుపుతప్పి విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో వయో, లింగభేదాలు కనిపించడం లేదనేందుకు మాధ్యమాలలో తరచూ వచ్చే వార్తా కథనాలే రుజువు. పరీక్ష తప్పినందుకు, ఇష్టపడిన వారు ప్రేమించలేదని, వస్తువులు-దుస్తుల వంటివి కొనివ్వలేదని,సినిమాకు వెళ్లవద్దన్నారని, కూర రుచిగా వండలేదని…లాంటి కారణాలతో అనేకుల నూరేళ్ల జీవితాలు అర్ధాంతరంగా తెలవారుతున్నాయి. మనోస్థయిర్యాన్ని పెంచుకొని ఇలాంటి వాటిని అధిగమించేందుకు యోగా దివ్యౌషధమని అనుభవజ్ఞులు చెబుతారు.
చిన్నపాటి కారణాలతో దంపతులు విడిపోవ డానికి, ఏవో సమస్యల పేరుతో ఆత్మహత్యలకు పాల్పడడానికి స్థితప్రజ్ఞత, ఆలోచన లేమి, తొందర పాటు నిర్ణయాలు వంటివి కారణమని చెబుతారు. ‘ఇలా చేయడం అవసరమా? ఇది తగునా?’ అని కొన్ని క్షణాలు ఆలోచిస్తే లేదా మనసులో విశ్లేషించు కుంటే ఇలాంటి అనర్థాలకు ఆస్కారమే ఉండదు..
‘జాతస్య మరణం ధ్రువమ్’… జననం ఉన్న ప్పుడు మరణమూ అనివార్యం. సహజ, హఠాన్మర ణాలో అయితే ఏమో కానీ, అందుకు భిన్నంగా భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని మధ్యలో తుంచేసుకోవడం ఎంత వరకు సబబు? అనేది ఆలోచనీయాంశం.
మనసు కోరికల పుట్ట. ఒక కోరిక తీరిన వెంటనే మరోటి పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆ కోరికలను సాకారం చేసుకునేందుకు శక్తిమేరకు పాటుపడతారు, సాధిస్తారు. అదే సమయంలో ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా భరించలేరు. ముఖ్యంగా సున్నిత మనస్కులకు అల్ప అంశం కూడా అనల్పం అనిపిస్తుంటుంది.
సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమనుకుంటే, పెద్దపెద్ద సమస్యలను అధిగమించి, తరతరాలకు ఆదర్శంగా నిలిచిన పురాణపురుషులు, ఆధునిక మహనీయుల మాటేమిటి? చిన్నపాటి కారణాలకే కుంగిపోయి నిరాశ నిస్పృహల పాలయ్యే నేటి తరం, ము్య•ంగా యువత శ్రీరాముడు, శ్రీకృష్ణలాంటి పురాణపురుషుల, అవరోధాలను అధిగమించి విజయాలు సాధించిన మహనీయుల నుంచి గ్రహించవలసినవి ఎన్నో ఉన్నాయి.
‘కుమారా! రేపు నీకు పట్టాభిషేకం. అందుకు దీక్ష పక్రియ స్వీకరించు’ అని దశరథుడు చెప్పగా ‘సరే!’ నంటూ వినయంగా తలూపాడు రాముడు. అంతలోనే..‘రామా! నువ్వు జటాధారివై, మునివృత్తి స్వీకరించి పద్నాలుగేళ్లు వనవాసం గడపాలి. మీ తండ్రి నిర్ణయించిన పట్టాభిషేక ముహూర్తమే నీ వనవాసానికి ప్రయాణ ముహూర్తం’ అని చెప్పింది పినతల్లి కైక. ‘మీ ఆజ్ఞ శిరోధార్యం’ అన్నాడు అంతే వినయంగా. తండ్రి చెప్పిన శుభవార్తకు పొంగలేదు, పినతల్లి వెల్లడించిన చేదు సమాచారానికి కుంగనూ లేదు. అదీ స్థితప్రజ్ఞత.
శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి నిందలు, ఎత్తి పొడుపులు భరించాడు. విమర్శలు, అవమానాలను, అపజయాలను ఎదుర్కొన్నాడు. అడుగడుగున గండాలన్నీ ఎదురీది నిలిచాడు, శ్యమంతకమణి విషయంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. సత్రాజిత్ పొరపాటు గ్రహించి మన్నింపు కోరాడు. నీలాపనింద తొలగించు కోవడంలో విజయం సాధించిన దేవకీనందనుడు ఆయన తెగడ్తకు కుంగలేదు. పొగడ్తకు పొంగలేదు. స్థితప్రజ్ఞతను ప్రదర్శించాడు. ఆ స్ఫూర్తితోనో ఏమో….
‘దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే’... కష్టాలు, దుఃఖం ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ఐశ్వర్యం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థితప్రజ్ఞతగా ఉండాలని బోధించాడు.
‘శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః’ (శోకం ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం వల్ల ఎన్నెన్నో అనర్థాలు సంభవిస్తాయి. శోకం చదువును, విజ్ఞానాన్ని వివేకాన్ని కూడా పోగొడుతుంది. శోకంతో సమాన మైన శత్రువే వేరొకరు లేరు) అని రామాయణోక్తి ఉద్బోధిస్తోంది.
‘గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం కచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం వారి సొంతమవుతుంది’ అని రామకృష్ణ పరమహంస,
‘కలకానిది విలువైనది బ్రతుకు
కన్నీటి ధారలలోనే బలిచేయకు
……………………..
అగాథమౌ జలనిధిలోన
ఆణిముత్యమున్నటులే
శోకానా మరుగునదాగి
సుఖమున్నదిలే….’ అని ప్రతి సమస్యను శోధించి సాధించాలని సినీ కవి హితవు పలికారు. జీవితం సముద్రం లాంటిది. సముద్రం అందరికి ఒకటే అనిపించినా కొందరికి ముత్యాలు లభిస్తే, కొందరికి మత్స్యాలు దొరకుతాయి. సంసార సాగరం కూడా అలాంటిదే. ఆశించినవన్నీ దక్కకపోవచ్చు. ఫలితం ఏదైనా సమదృష్టితో స్వీకరించగలగాలి. ముఖ్యంగా ఉజ్వల భవిష్యత్ ఉన్నవారు చిన్నపాటి కారణాలతో అర్ధాంతరంగా జీవనయాత్ర ముగిం చడం బాధాకరం. పిల్లల్లో ఆత్మస్థయిర్యం నింపేందుకు తల్లిదండ్రులు వారిలో ఆధ్యాత్మిక భావనను అలవరచాలి, యోగాభ్యాసాన్ని ప్రోత్సహించాలి. జీవితం సవాళ్లమయమని, పొరపాట్లు, వైఫల్యాలు, అవమానాలు, నిరాశ, నిస్పృహ, తిరస్కారాలు బతుకుబాటలో భాగమేనని, వీటిని ఎదుర్కోకుండా ఎవరూ ఏదీ సాధించలేరని అనుభవజ్ఞులు చెబుతారు. వారి ఆ మాటల్లోనే స్థితప్రజ్ఞత ప్రాధాన్యం, ఆవశ్యకత దాగి ఉంది. దానిని ఒడిసి పట్టుకోవడం పైనే విజ్ఞత ఆధారపడి ఉంటుంది.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్