ఈ దేశంలో ముస్లిం మతోన్మాదులు వివాదాలు రేపడం, పెట్రేగిపోవడం, విధ్వంసం సృష్టించడం కొత్త కాదు. కానీ మహమ్మద్ ప్రవక్త పేరును కూడా ఇందుకు ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఇప్పుడు వివాదానికీ, రగడకూ కేంద్ర బిందువులైన ప్రవక్త పై వ్యాఖ్యలు లేదా దైవ దూషణ కొత్తవి కాదు. ప్రవక్త, ఆయేషా అనే బాలిక ఇతివృత్తం మీద గతంలోను వివాదాలు చెలరేగాయి. అయితే వారి బంధం మీద ఎవరు విపరీత వ్యాఖ్యలు చేసినా సబబు కాదు. అలాగే ఆయన పేరును తమ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ, మత ప్రత్యర్థి మీద విజయం కోసం ఉపయోగించుకోవడం మాత్రం ఏమాత్రం సబబు?
దేశంలో అయోధ్య హిందువులదేనని తీర్పు వచ్చిన నాటి నుంచి ముస్లిం మతోన్మాదుల వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ముస్లింలు తమ స్ధానాన్ని కోల్పోతున్నారన్న ప్రచారం, ఇస్లాం ప్రమాదంలో పడిందన్న అపోహలు ఎక్కువయ్యాయి. తరువాత అక్కడ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగడం కూడా వారికి రుచించడం లేదని వారి ప్రకటనలను బట్టే అర్ధమవుతుంది. తరువాత మధుర వివాదంలోను హిందువులకే అనుకూల సంకేతాలు రావడం ఇంకాస్త బాధించినట్టు ఉంది. చివరికి కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం బయటపడడం దేశంలో ముస్లింలను ఆత్మరక్షణలో పడేసింది. ఇలాంటి పరిస్థితిని కొందరు ముస్లిం రాజకీయ పార్టీ నాయకులే సృష్టించి పెట్టారు. మసీదులో దొరికినది శివలింగం కాదంటూ, ఫౌంటెన్ అంటూ కొందరు నాయకులు తిక్క వాదనలు చేసి, అభాసు పాలయ్యారు. కోర్టు కూడా శివలింగం ఉన్న ప్రాంతాన్ని అదుపులోకి తీసుకోమని ఆదేశించడం కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టయింది. అయోధ్య వివాదం హిందువులకు అనుకూలంగా ముగియడం, మధుర, కాశీ వివాదాలు ఆదిలోనే హిందూ అనుకూలంగా కనిపించడం కొందరికి దిక్కు తోచని స్థితిని తెచ్చి పెట్టింది. కశ్మీర్‌లో 370 అధికరణం రద్దుతో ముస్లింలు సర్వం కోల్పోయారన్న భావనను కొందరు తీసుకువచ్చారు. ఇప్పటికీ అక్కడ పండిత్‌ల మీద, హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిజాబ్ మీద ఒక వ్యర్థ వివాదం లేపి, భంగపడడం కూడా మనం చూశాం. తరువాత రామనవమికి, హనుమత్ జయంతి శోభాయాత్రల మీద రాళ్ల దాడి చేసి, మతోన్మాదులు మరొకసారి బోనులో నిలబడ వలసి వచ్చింది. ఈ స్థితిలోనే కిందపడినా విజయం తమదే అన్నట్టు ఒక కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. అదే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ వ్యాఖ్యల వివాదం.
ప్రవక్త మీద కువ్యాఖ్యలు చేయడం సబబు కాదనే బీజేపీ చెబుతోంది. నుపూర్ శర్మను, సరిగ్గా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్న నవీన్ జిందాల్ అనే మరొక నాయకుడిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నవీన్ ఢిల్లీలో పార్టీ అధికార ప్రతినిధి. ఆమె వ్యాఖ్యను జిందాల్ సమర్థించారు. నుపూర్ దిష్టిబొమ్మకు ఉరేసి మతోన్మాదులు తమ నైజాన్ని చాటుకున్నారు. కర్ణాటకలోని బెలగావిలో ఇది జరిగింది.
నుపూర్ వ్యాఖ్యల వివాదం జ్ఞాన్‌వాపి, ముస్లిం దురాక్రమణ వారసత్వాన్ని నిరూపిస్తూ అందులో దొరికిన హిందూ ఆధారాల నేపథ్యంలో వచ్చినదే. ఏ విధంగా చూసినా ఈ వివాదం ఒక పథకం ప్రకారం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు ఇదివరకు ఏనాడూ ఎవరూ చేయనివి కాదు. ప్రవక్త భార్య ఆయేషా గురించి చేసిన వ్యాఖ్యలవి. సరిగ్గా జ్ఞాన్‌వాపి వివాదం మీద టైమ్స్ నౌ చానల్ మే 27న ఏర్పాటు చేసిన చర్చలో ఆమె పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎందరో ఆయేషా గురించి అదే తీరులో ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అచ్చురూపంలో కూడా ఆ సమాచారం ఉంది. అప్పుడు ఎవ్వరికీ లేని అభ్యంతరం జ్ఞాన్‌వాపి వివాదం నేపథ్యంలో జరిగిన చర్చతో ఎందుకు వచ్చింది? అది బీజేపీ అధికార ప్రతినిధి చేసింది కాబట్టే ఈ వివాదమంటే అభ్యంతరం ఉండనక్కరలేదు. చానల్‌లో ఆ వ్యాఖ్యలు వెలువడిన కొంత సమయం వరకు వీటి మీద ఎలాంటి ఆందోళన జరగకపోవడం విశేషం. అల్ట్ న్యూస్ అనే నిజనిర్ధారణ వెబ్‌సైట్ సహ వ్యవస్థాప కుడు మహమ్మద్ జుబేర్ ఆ క్లిప్‌ను సామాజిక మాధ్యమాలలో ఉంచడంతోనే వివాదం మొదలైంది. వెంటనే ఆమెను చంపుతామని, లైంగిక అత్యాచారం చేస్తామని బెదిరింపులు మొదలైనాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. ఇంకా పలు పట్టణాలలోను ఆమెపై దైవ దూషణ ఆరోపణతో కేసులు నమోదయ్యాయి. పోలీసులు పావుగంట పక్కకు జరిగితే ఈ దేశంలో హిందువుల పని పడతాం అని బహిరంగంగా హెచ్చరించిన అక్బరుద్దీన్ ఒవైసీ ఇతడి సోదరుడే.
నుపూర్ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 3న కాన్పూర్ బంద్‌కు ఒక ముస్లిం సంస్థ పిలుపునిచ్చింది. ఆ తరువాతి పరిణామాలే ముస్లిం మతోన్మాదుల అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాయి. ఇక్కడే భారీ ఎత్తున విధ్వంసం, హింస జరిగాయి. 40 మంది గాయపడ్డారు. ఆ మరునాడే, అంటే జూన్ 4న ఇదొక అంతర్జాతీయ వివాదంగా మారిపోయింది. జూన్ 5 సాయంత్రమే నుపూర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. తరువాత నుపూర్ కూడా తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహ రించుకున్నారు. అయితే తాను వ్యాఖ్యానించడానికి కారణం శివలింగం గురించి ఆగకుండా వస్తున్న అవమానకర వ్యాఖ్యల వల్లనేనని ఆమె పునరుద్ఘా టించారు.
నుపూర్ మీద కేసులు వెల్లువెత్తాయి. వీటిని ఆధారం చేసుకుని మతోన్మాదులు ఉత్తర ప్రదేశ్ సహా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం ఇద్దరు సాధువులను అతి దారుణంగా నరికి చంపినా స్పందించని మహారాష్ట్ర పోలీసులు ప్రవక్త మీద వ్యతిరేక వ్యాఖ్యల కేసులో జూన్ 25న రాష్ట్రానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వవలసిందిగా తాఖీదులు ఇచ్చారు. నగరంలోని పైథోని పోలీసు స్టేషన్‌లో ఆమె మీద కేసు నమోదైంది. తరువాత మహారాష్ట్రలోనే బీడ్ పోలీసు స్టేషన్‌లో కూడా మరొక కేసు నమోదైంది.దాదాపు వారం పాటు ఈ గొడవ ఆధారంగా దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయి. వీటన్నిటికీ పరాకాష్ట అనదగిన పరిణామం బెంగాల్‌లో జరిగింది. ప్రవక్త మీద నుపూర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బెంగాల్ శాసనసభ జూన్ 20న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏడుగురు బీజేపీ శాసనసభ్యులను సస్పెండ్ చేసిన తరువాత సభ ఈ తీర్మానం ఆమోదించింది. రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు (నుపూర్ వ్యాఖ్యల నేపథ్యంలో) పాల్పడిన వారి మీద తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ, అయితే ఇప్పటికీ ఆ మహిళ (నుపూర్)ను ఎందుకు అరెస్టు చేయలేదని సభ సాక్షిగా ఆ మహిళా ముఖ్యమంత్రి మమత గుండెలు బాదుకున్నారు.
ప్రవక్త వ్యక్తిగత జీవితం మీద వ్యాఖ్యలు ఈనాటివి కావు. ఇవన్నీ ఇప్పటికీ రకరకాల మాధ్యమాలలో స్థిరంగానే ఉన్నాయి. అందులో ఆయేషా, ప్రవక్తల బంధం ఒకటి. నిజానికి జీసస్ మీద కూడా రాతలు ఉన్నాయి. జీసస్‌ను బ్రహ్మచర్యం పాటించిన వానిగా, మహ్మద్ ప్రవక్తను బహుభార్యత్వం కలిగిన వానిగా చూపుతారు. ఇవి వాస్తవదూరం కాదు. ప్రాచ్య భాషల నిపుణుడు, సామాజిక శాస్త్రవేత్త డబ్ల్యు మాంట్‌గోమరీ వాట్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్య ప్రముఖమైనది. ప్రపంచంలో పుట్టిన గొప్ప వ్యక్తులలో మహమ్మద్ ఒకరంటూనే, ఆయన మీద వచ్చినన్ని ప్రతికూల వ్యాఖ్యలు ఇంకెవరి మీద రాలేదని చెబుతాడు. నిజానికి ఆయేషా ఉదంతం మీద, పెళ్లి, కాపురాల మీద ముస్లింలలోనే ఏకాభిప్రాయం లేదు. ప్రవక్త అలా చేయరని, ఏడో శతాబ్దం నాటి అరేబియాలో యౌవనం వచ్చిన తరువాతే వివాహాలు జరిగాయని కొందరు చెబుతారు. ఆయేషాకు ఆరేళ్ల వయసులో ప్రవక్తతో వివాహం నిశ్చయమైందనీ, తొమ్మిదో ఏట వివాహం జరిగిందని నుపూర్ చెప్పడమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. కాబట్టే ఇదంతా దురుద్దేశంతో సృష్టించిన రగడ అని ఎక్కువ మంది విశ్వసించవలసి వస్తున్నది. ఆయేషా గాథను వామపక్ష భావాలకు చెందిన వారి కొన్ని మాధ్యమాలు కూడా పలుమార్లు ఇచ్చాయి. నేటి వివాదం నేపథ్యంలోను గుర్తు చేశాయి. అయినప్పటికి ఇలాంటి వ్యాఖ్యల విషయంలో ఎవరైనా కొంచెం సంయమనం చూపించడం అవసరమే.
నుపూర్ వ్యాఖ్యల మీద దాదాపు 16 ముస్లిం దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. తరువాత కొన్ని వెనక్కి తగ్గాయి అది వేరే విషయం. కానీ నుపూర్ వ్యాఖ్యల మీద రగడ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఆ దేశాల మత సామరస్యం మీద గౌరవంతోనే అలా మాట్లాడాయా? లేక ప్రవక్తకు అపచారం అన్న భావనతో మాట్లాడాయా? అదీకాక, 1990 నాటి కశ్మీరీ పండిట్లను ముస్లిం మతోన్మాదులు ఊచకోత కోసినప్పుడు ఈ దేశాలు ఎందుకు నోరు విప్పలేదన్న ప్రశ్న కూడా తీవ్రంగానే వినిపించింది. చార్లీ హెబ్డో కార్టూన్ ఉదంతంతో ఫ్రాన్స్‌ను అల్లకల్లోలం చేసిన విధంగానే, నుపూర్ వ్యాఖ్యలతో భారత్‌ను కూడా కల్లోల పరచాలన్న కుతంత్రం ఉందని కూడా అంతర్జాతీయంగా కొన్ని చానళ్లు వ్యాఖ్యానించాయి. అలాగే హిందూ ఫోబియా చూపించి, అంతర్జాతీయంగా భారత్ పరువు ప్రతిష్టలను దిగజార్చాలన్న కుతంత్రంలో తాజా అల్లర్లు కూడా భాగమేనని కొన్ని మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
కొన్ని పాత వ్యాఖ్యలను తీసుకుని సరికొత్త కల్లోలం సృష్టించిన సంగతి అర్ధమవుతూనే ఉంది. ఇందులో సెక్యులరిస్టులుగా చెప్పుకునే ఉదారవాదుల మౌనం ప్రమాదకరమైన పాత్రను పోషించింది. హిందువుల శోభాయాత్రల మీద రాళ్ల దాడి మొదలు, జ్ఞాన్‌వాపిలో శివలింగం వివాదం వరకు ఏ విషయం లోను ఉదారవాదులు మౌనం వీడలేదు. అమెరికా ఏ అంశాన్ని లేవనెత్తినా విరుచుకుపడే ఉదారవాదులు నుపూర్ విషయంలో ఆ దేశం కలగచేసుకోవడం గురించి కూడా మాట్లాడ లేదు. నుపూర్‌కు వచ్చిన బెదిరింపు సందేశాలు నీచంగా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడలేదు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకెన్ని విపరిణామాలు చూడవలసి వస్తుందో!