అందరూ ఆప్యాయంగా అప్పాజీ అని పిలిచే, పరిచయం అవసరం లేని చిరపరిచిత జ్యేష్ఠ ప్రచారక్‌ అప్పారావు (74) హాస్పిటల్‌లో చికిత్స పొందుచూ జూన్‌ 5‌న ఉదయం స్వర్గస్థులయ్యారు.  1948 ఆగస్టు 13న విజయ వాడలో జన్మించిన ఆయన హైస్కూల్‌ ‌విద్యార్థిగా ఉన్నప్పుడే స్వయంసేవక్‌ అయ్యారు. అప్పటి విజయవాడ విభాగ్‌ ‌ప్రచారక్‌ ‌భోగాది దుర్గా ప్రసాద్‌ ‌వాత్సల్యంతో సంఘ కార్యంలో క్రియాశీలమయ్యారు. విద్యాభ్యాసం తర్వాత ప్రచారక్‌గా కొనసాగారు. జగిత్యాల ప్రచారక్‌గా పనిచేసిన తర్వాత ప్రాంత కార్యాలయం కేంద్రంగానే చివరి వరకు పనిచేశారు. కార్యాలయం పనులతో పాటు సేవా కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించేవారు.

 అందరినీ ఆత్మీయంగా పలకరించే మృదు సంభాషి, అందరి హృదయాలలో స్థానం సంపాదించిన స్నేహశీలి అప్పాజీ. అందరి బాధలను తన బాధగా భావించి నివారణోపాయాలను సూచించే వారు. వివిధ ఆరోగ్య సమస్యలపై ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌నుండి భాగ్యనగర్‌కు వచ్చే స్వయంసేవకులకు, సంఘ అభిమానులకు చికిత్సకు సంబంధించి ఆయా ఆసుపత్రుల వివరాలు తెలియచెబుతూ మార్గదర్శనం చేసేవారు. ఆ సేవాభావంతోనే ఆసుపత్రుల్లో వైద్యులతో, ఆరోగ్య సిబ్బందితో సంఘానికి సత్సం బంధాలు ఏర్పడ్డాయి. స్వీయ ప్రేరణతో మొదలుపెట్టిన ఈ విధానం ప్రస్తుతం సేవాభారతి ఆరోగ్య సేవలకు స్ఫూర్తిదాయకమై, ఒక ప్రత్యేక విభాగంగా రూపు దిద్దుకుంది. వివిధ విభాగాల వైద్యుల వద్ద ఉన్న మందుల శాంపిళ్లను, స్వయంసేవకుల ఇళ్లలో వాడుతూ, మిగిలిన మందులను సేకరించి సేవాభారతి ఆధ్వర్యంలో ‘సంజీవని మొబైల్‌ ‌వ్యాన్‌’ ‌ద్వారా సేవా బస్తీలలో నిర్వహిస్తున్న చికిత్స కేంద్రాలకు పంపే ఏర్పాటును స్వయంగా చూసేవారు. సంజీవని మొబైల్‌ ‌మెడికల్‌ ‌వ్యాన్‌ ‌ద్వారా భాగ్యనగర్‌లోని అనేక సేవా బస్తీలకు వైద్య చికిత్సను అందించే యోజనను డాక్టర్‌ ‌సురేందర్‌రెడ్డి పర్యవేక్షణలో 1999-2005 మధ్య కాలంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది డాక్టర్లను, పారా మెడికల్‌ ‌సిబ్బందిని భాగస్వాములను చేశారు. డాక్టర్లతో నడిచే సంఘ మండలి పనిని స్వయంగా పర్య వేక్షించేవారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం లభించక అనేకమంది రోగుల ఇబ్బందు లను గమనించిన అప్పాజీ స్వయంసేవకులకు రక్తదాన ఆవశ్యకతను వివరించి రక్తదానాన్ని ప్రోత్సహించారు. క్రమేపి రక్త గట సూచిని తయారుచేసి రోగులకు అందించడాన్ని వ్యవస్థీకృతం చేశారు. వారి కృషి ఫలితంగానే రక్తదాన భారతి ప్రారంభానికి నాంది పడింది. భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో ఉన్న వారి స్వగృహాన్ని రక్తదాన భారతికి దానంగా ఇచ్చారు. అప్పాజీ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం వలన బయటకు రాలేక పోయినప్పటికీ కార్యాలయం కేంద్రంగానే రక్తదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించేవారు. కార్యాలయానికి వచ్చిన స్వయంసేవకుల యోగక్షేమాలను విచారించేవారు. పరిచయం ఉన్న స్వయంసేవకుల కుటుంబాలతో నిరంతరం టెలిఫోన్‌ ‌ద్వారా సంబంధాలు నడిపేవారు.

About Author

By editor

Twitter
YOUTUBE