– సుధా మైత్రేయి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

సాయంసంధ్యవేళ రోడ్లన్నీ వీధి దీపాలతో కళకళ లాడుతున్నాయి. అడపా దడపా పక్షుల కూతలు ఉల్లాసాన్ని స్తున్నాయి. మెల్లగా ముసురుకుంటున్న చీకట్లు పనులు ముగించుకుని ఇంటిదారి పట్టమంటున్నాయి. అతి నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ వస్తున్న నిశికన్యలో, నిదుర పైటను నగరం తలపై ఎపుడెపుడు కప్పుదామా? అన్న ఆత్రం కనబడుతోంది. అప్పుడే అటుగా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి అలవాటుగా సుప్రియ భోజనశాలలోకి ప్రవేశించాడు మధుకర్‌.

అవడానికి భోజనశాలే అయినా, అన్ని రకాల తినుబండారాలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు ఏ సమయంలోనైనా దొరుకుతాయక్కడ. మరీ ఉన్నతవర్గపు ప్రజలు దీనిలోకి తొంగిచూడకున్నా, మధ్యతరగతి వారికి అనుకూలమైన భోజనశాల. ఉన్నంతలో పరిశుభ్రంగా వండి వడ్డిస్తారు. వ్యాపార కూడలికి దగ్గరగా ఉండటం వలన ఏ సమయంలోనైనా జనాలు తినడానికి వస్తూ, పోతూనే వుంటారు. కూలీనాలీ చేసుకు బతికే కార్మికులు కూడా చాయ్‌ ‌కొరకు వస్తారు. ఏదో ఒకటి తిని పోతూ వుంటారు.

తన ఇంటికి దగ్గరగా ఉంది కాబట్టి రోజు చీకటి కమ్మేవేళ ఇక్కడికి వచ్చి టీ తాగి, సమోసానో, పావ్‌ ‌బాజీనో తిని వెళ్లడం మధుకర్‌కు ఇష్టమైన దినచర్య. పనిలో పనిగా ఎన్నో రకాల మనస్తత్వాల మనుషులను గమనించడం కూడా భలేగా అనిపిస్తుంది అతడికి. వృత్తిరీత్యా కుటుంబాన్ని వదిలి ఒక్కడే ఈ ఊరిలో ఉండటంతో ఇలా రాక తప్పడం లేదు. భోజనశాల మేనేజర్‌ ‌కూడా అందరితో కలుపుగోలుగా ఉంటాడు. తనకంటే వయ సులో పెద్ద అనిపిస్తే అన్నా అని, చిన్న వారిని తమ్మీ అని పిలుస్తాడు. ఆడవారితో మర్యాదగా అక్కా చెల్లీ అంటూ ఆప్యాయంగా మాట్లాడటంతో ఆ హోటల్‌కు మంచి పేరు వచ్చింది.

తాను ఎప్పుడూ కూచునే మూల వైపు టేబుల్‌ ‌దగ్గర నింపాదిగా కూచొని టీ, సమోసా ఆర్డర్‌ ఇచ్చి, వచ్చి పోయేవారిని కనుకొసల నుండి గమనిస్తున్నాడు మధుకర్‌. ‌రెండు టేబుళ్ల ఆవల కూర్చున్న ఇద్దర బ్బాయిలు కాస్త గట్టిగానే మాట్లాడుకుంటూ, జబ్బలు చరుచుకుంటూ నవ్వుతుంటే అప్రయత్నంగా తన పెదాలు కూడా నవ్వుతో విచ్చుకుంటున్నాయి. అంతలోనే ఎవరైనా గమనిస్తున్నారేమో తనలాగే అన్న ఆలోచన రావడంతో మూతి బిగించి వేరేవైపు దృష్టి మరలుస్తున్నాడు.

ఇంకో టేబుల్‌ ‌దగ్గర భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో వచ్చి కూచున్నారు. పిల్లవాడు ఐస్‌ ‌క్రీమ్‌ ‌కావాలంటే, చిన్నది జ్యూస్‌ ‌కావాలంటోంది. వెయి టర్‌ ‌తెచ్చేలోపు ఆగకుండా గోల చేస్తూ, అటూ ఇటూ కుర్చీల మధ్యలో పరుగులు తీస్తున్నారు. ఆ తల్లి దండ్రులు ముద్దుగా విసుక్కుంటుంటే, మధుకర్‌కు మాత్రం చూడముచ్చటగా అనిపిస్తోంది. తన భార్యా పిల్లలు గుర్తొచ్చారు. హోటల్‌కు వెళ్తే తన కూతురు ఎంత చెప్పినా వినకుండా తన ఒళ్ళోనే కూచొని మాంగో జ్యూస్‌ ‌తాగుతుంది. అది గుర్తొచ్చి మధుకర్‌ ‌మనసు మూలలో బాధ కలుక్కుమంది. అంతలోనే సర్దుకున్నాడు. త్వరలోనే తన కుటుంబం అంతా ఒక్క చోట ఉండేలా ప్రణాళిక చేస్తున్నాడు.

మరో టేబుల్‌ ‌దగ్గర నలబై••, నలభై ఐదు ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు, యాభై పైబడి వయసున్న అతను..ముగ్గురు కలిసి పిచ్చాపాటి రాజకీయాలు మాట్లాడుకున్నారు కాసేపు. బహుశా ఒకే ఊరి వారనుకుంటా. ఏదో పని కోసం వచ్చి అయిపోయాక తినడానికి వచ్చినట్టున్నారు. తర్వాత వ్యవసాయం పనులు, పంట రాబడి, తోట నష్టాలు, వాన కష్టాలు, ఇంటి బాధ్యతలు ఏకరవు పెట్టుకుంటూ బాధతో కాసేపు, నవ్వుతూ కాసేపు, పగలబడి నవ్వుతూ మరి కాసేపు చాలా మందికి కొంచెం వినోదాన్ని ఇస్తున్నారు. రైతుల కష్టాలు ఏ ప్రభుత్వం తీర్చలేదేమో అనిపించింది.

కాసేపయ్యాక ఒకతను కూతురితో వచ్చి తన పక్క బల్ల దగ్గరే కూచున్నారు. అతన్ని చూస్తే రోడ్డు పనులు చేసే కార్మికునిలా వున్నాడు. చొక్కా మాసి పోయి ఉంది. చొక్కా మధ్యలో ఒక గుండీ, చివరి గుండీ ఊడిపోయి ఉన్నాయి. పాంట్‌ ‌కూడా కుడి మోకాలు దగ్గర చిరిగిపోయి ఉంది. అతని కూతురికి బహుశా ఆరు లేదా ఏడు ఏళ్లు ఉండొచ్చు. వేసుకున్న గౌను క్రొత్తగానే వున్నా, బహుశా ఆడుకుని అలాగే వచ్చిందేమో, కాస్త దుమ్ము అంటుకుంది. పోనీ టైల్‌కి వేసిన రబ్బర్‌ ‌బ్యాండ్‌ ‌కూడా ఎంతో కొత్తగా ఉంది. ఆసక్తిగా హోటల్‌ అం‌తా పరికించి చూస్తోంది. సన్నపాటి కుషన్‌తో ఉన్న కుర్చీ కాబట్టి చిన్నగా ఎగిరి కూచుంటూ సంతోషిస్తోంది. మేనేజర్‌ ‌దగ్గరున్న కంప్యూటర్‌ను ఆసక్తిగా చూస్తోంది. ఆ పాప చూపులు చురుగ్గా ఉన్నాయి. మొత్తానికి హోటల్‌కు రావడం  ఆ పాపకు ఇదే మొదటిసారి అనుకుంటా.

అతను వెయిటర్‌ను పిలిచి, ‘ఒక దోశ’ అని ఆర్డర్‌ ఇచ్చాడు. మీకేమి కావాలి? అడిగాడు వెయిటర్‌. ‌తనకేమీ వద్దు అన్నాడతను. కొన్ని నిమిషాల్లోనే వేడివేడి దోశ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ, సాంబార్‌తో తెచ్చి ఆ పాప ముందు ఉంచాడు. ఎంతో ఆనందంగా తినడం మొదలుపెట్టింది.

అప్పుడే అతని సెల్‌ ‌ఫోన్‌ ‌మ్రోగింది. ఆ ఫోన్‌ ‌కూడా ఎప్పటిదో పాతకాలపు మోడల్‌లో ఉంది. అటువైపు ఎవరోగానీ, అతనితో సంబరంగా చెప్తు న్నాడు ఇప్పుడు తన కూతురిని తీసుకోని హోటల్‌కు వచ్చానని, ఈరోజు అమ్మాయి పుట్టినరోజు అని. తాను చదివే తరగతిలో మొదటి ర్యాంక్‌ ‌వస్తే దోశ తినిపిస్తానని చేసిన వాగ్దానం మేరకు అక్కడికొచ్చారని అతని మాటల్లో మధుకర్‌కు అర్థ్ధమైంది. కూతురి సంతోషం, ఆ తండ్రి కళ్ళల్లో స్పష్టంగా కనబడు తోంది. ఏ తల్లిదండ్రులైనా పిల్లల సంతోషాన్ని తమదిగా భావిస్తారు అనడానికి ఇదే ఉదాహరణ.

ఇంతలో ఫోన్‌లో అటువైపు వ్యక్తి ఏమన్నాడో, ఇతని గొంతులో చిన్న బాధా వీచిక వినబడింది. నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. ‘ఇంటికెళ్లే సరికి నా భార్య ఉప్మా చేసి పెడుతుంది. ఇద్దరం ఇంట్లోనే తింటాం. కూతుర్ని మాత్రమే హోటల్‌కు తీసుకువచ్చా’అని చెప్పాడు.

ఇదంతా వింటూ చాయ్‌ ‌తాగడం ముగించిన మధుకర్‌ ఆలోచిస్తూ సమోసా తింటున్నాడు. డబ్బున్న వాళ్లయినా, పేదవాళ్లయినా కన్నవారి ఆనందం కోసం ఏదైనా చేస్తారు కదా అనుకున్నాడు. పేద ఇంట్లో పుట్టినా ఆ పాపను చదువుల తల్లి అను గ్రహించిందని మధుకర్‌కు చాలా సంతోషం అనిపించింది. వాళ్లకు ఏ విధంగా సాయపడగలను అని ఆలోచిస్తూ లేచాడు.

కౌంటర్‌ ‌దగ్గరకు వెళ్లి బిల్లు చెల్లించి, ఇంకో రెండు దోశలకు కూడా డబ్బిచ్చాడు. ఆ రెండు అతనికి ఇవ్వమని మేనేజర్‌కు చెప్పి వారిని చూపించాడు. మేనేజర్‌ ఆశ్చర్యపోయి వారి బిల్లు మీరెందుకి స్తున్నారని అడిగాడు. మధుకర్‌… ‌తాను విన్నదంతా చెప్పాడు.

‘డబ్బులు ఎవరిచ్చారని అతను అడిగితే, మీరు తన ఫోన్‌ ‌సంభాషణ మొత్తం విన్నానని చెప్పండి. ఈరోజు నీ కూతురి పుట్టినరోజు, తను తరగతిలో మొదటి ర్యాంక్‌ ‌వచ్చిందని తెలిసి సంతోషించి ఈ రెండు దోశలు పాపకు బహుమతిగా ఇస్తున్నానని చెప్పండి. అలాగే పాపను బాగా చదువుకొమ్మని కూడా చెప్పండి. మరీ ముఖ్యంగా పుట్టినరోజు ‘కానుక’ అని నొక్కి వక్కాణించండి. ఎందుకంటే, నేను అతన్ని గమనించిన మేరకు ‘స్వాభిమానం’ గల మనిషి. ఊరికే ఇస్తే తీసుకునే రకం కాదు. అతని ఆత్మాభిమానం దెబ్బతిని బాధపడతాడు. కూతురి సంతోషాన్ని ఆస్వాదిస్తున్న అతడిని చిన్న బుచ్చటం మనిద్దరికీ భావ్యం కాదు’ అని చెప్పి బయటకు వెళ్ళాడు. మధుకర్‌ ‌మాటలకు మేనేజర్‌ ఎం‌తో సంబరంగా, తప్పకుండా మీ మాటలు మన్నిస్తానని, మనిషితనం అంటే ఏంటో రుచి చూపారని కర చాలనం చేశాడు. వెయిటర్‌ను పిలిచి అతనికి ఒక దోశ ఇచ్చి ఇంకోటి ఇంటికి తీసుకెళ్లడానికి ప్యాక్‌ ‌చేయమన్నాడు.

దోశతో వచ్చిన వెయిటర్‌తో, నేను ఒక్క దోశనే ఆర్డర్‌ ఇచ్చాను కదా మరోటి ఎందుకు తెచ్చారు అడిగాడు అతను. ఇంతలో మేనేజర్‌ ‌వచ్చి నవ్వుతూ, ‘నువ్వు ఫోన్‌లో మాట్లాడినదంతా విన్నాను. ఈరోజు నీ కూతురి పుట్టినరోజే కాకుండా మొదటి ర్యాంక్‌ ‌కూడా వచ్చిందని తెలిసింది. అందుకే హోటల్‌ ‌తరఫున మీ ఇద్దరికీ మా కానుక ఇది. డబ్బులు చెల్లించాల్సిన పని లేదు’ అన్నాడు.

ఆనందం నిండిన మనసుతో అతను కూతురితో, ‘చూడు బిడ్డా! మంచిగా చదువుకుంటే ఇలాంటి కానుకలెన్నో వస్తాయి అన్నాడు. ఆ పాప మొహం వెన్నెల కురిసినట్టు వెలిగిపోతోంది. ఒక దోశను ఇంటికి తీసుకెళ్ళాచ్చా? అడిగాడతను. అలాగే.. కేక్‌, ‌చాకలేట్స్ ‌కూడా ప్యాక్‌ ‌చేసి ఇస్తున్నాను. మీ ఇంట్లో అందరూ సంతోషంగా పుట్టినరోజు జరుపుకోండి’ అన్నాడు మేనేజర్‌.

‌బయటినుండి ఇదంతా చూస్తున్న మధుకర్‌ ‌గుండెల్లో ఏదో తెలియని తృప్తి. ఒకరి కళ్లల్లో మనవల్ల ఆనందం నిండితే, అది మన మనసును ఇంత తృప్తి పరుస్తుందని ఇపుడే తెలుసుకున్నాడు. ‘ముహూర్తాలు పెట్టుకొని ఎక్కడికో వెళ్లి మంచిపనులు చేద్దాం అనుకునే బదులు మన చుట్టూ వున్న మనుషులకు కొద్దో గొప్పో సాయం చేస్తే కలిగే ఆనందం వేరు కదా’ అనుకుంటూ ఇంటిదారి పట్టాడు.

చేసిన సాయం ఎన్నటికీ వృథా పోదు. ఆవగింజంత చేసినా, పది రెట్లయి తిరిగి మనల్ని చేరుతుందని పెద్దలు చెబుతారు కదా! ఎన్ని కోట్ల డబ్బులు గుమ్మరించినా దక్కని ఆనందం, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నప్పుడు మాత్రం కలుగుతుంది. ఆత్మతృప్తి ముందు ఏదైనా చిన్నదే అవుతుంది. కొత్త ఉత్సాహమేదో నరనరాల్లో పాకుతున్న భావన. హుషారుగా ఇంటికి చేరి తన భార్యాపిల్లలతో సరదాగా కాసేపు ఫోన్‌ ‌లో మాట్లాడి ప్రశాంతంగా నిద్రపోయాడు మధుకర్‌.

About Author

By editor

Twitter
YOUTUBE