ఆధునిక వ్యవస్థలో పత్రికా రంగానికి నాలుగో ఎస్టేట్ అన్న ఖ్యాతి ఉందని, దానికి తగ్గట్టే పత్రికా రచయితలు వ్యవహరించాలని శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, ‘పద్మభూషణ్’ డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. పత్రికారంగం రెండు శిబిరాలుగా చీలి పోవడం బాధాకరమని చెప్పారు. కొన్ని పత్రికలు అధికార పక్షం వైపు మొగ్గుతున్నాయి. ఇంకొన్ని ప్రతి పక్షాలను సమర్థిస్తున్నాయి. అయితే, ప్రజల పక్షాన నిలుస్తున్న పత్రిక ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నిం చారు. కేవలం వార్తాహరులుగా వ్యవహరించేవారు మంచి పత్రికా రచయితలు కాలేరనీ, నిజనిర్ధారణతో కూడిన వార్తా సేకరణతోనే ఆ వృత్తికి సార్థకత చేకూరుతుందని ఆయన చెప్పారు. ప్రపంచ పాత్రి కేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 8న సమాచార భారతి (తెలంగాణ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారకరామారావు సభామందిరంలో జరిగిన దేవర్షి నారద జయంతి కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పత్రికా రచయితలకు పురస్కారాలు అందించిన ఈ కార్యక్రమంలో ఆయన ఆవేదనా భరితంగా ప్రసంగించారు. పత్రికలు ఇస్తున్న మంచి వార్తలు, వ్యాసాలు తక్కువ అనీ, కానీ చెడుకు సంబంధించిన సమాచారంతో పత్రికలు నిండి పోతు న్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పారిశ్రామికవేత్తగా పత్రిక రచనలో తాను గమనించిన అనేక అవాంఛనీయ ధోరణులను వివరించారు.
పత్రికా రచయితలు అదేపనిగా అవినీతికి సంబంధించిన వార్తలను ప్రచురించడం వల్ల, అవి నీతికి వ్యతిరేకంగా ప్రజలలో ఉండవలసిన స్పృహను కోల్పోయేటట్టు చేస్తున్నారని, ఇలాంటి అంశం పట్ల ఉండవలసిన సున్నితత్వాన్ని నామ రూపాల్లేకుండా చేస్తున్నారని డాక్టర్ వరప్రసాదరెడ్డి అన్నారు. ప్రజల పక్షాన నిలిచే, ప్రజలకు ఉపకరించే నిర్మాణాత్మక కథనాలతో భారతీయ సమాజానికి నాల్గవ స్థంభంగా చిరస్థాయిలో నిలిచిపోవాలని పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు. నవతరం పాత్రికేయుల్లో వృత్తి నిబద్ధతను, చిత్తశుద్ధిని పరిరక్షించే క్రమంలో వారికి ఆయా రంగాల ప్రముఖులతో శిక్షణ తరగతులను నిర్వహించేలా పత్రికాధిపతులు ముందుకు రావాలని ఆయన అన్నారు. కుళ్లు రాజకీయాల బారి నుంచి వ్యవస్థను కాపాడి, ప్రజలు ఓట్లను అమ్ముకుని దుస్థితి నుంచి రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమాచారా భారతి ఉపాధ్యక్షులు జి.వల్లీశ్వర్ మాట్లాడుతూ దేవర్షి నారద ముని కొలమానంగా, దేశభక్తితో పాత్రి కేయులు పనిచేయాలని అన్నారు. ఈ మానవాళికి, విశ్వానికి శుభం చేకూర్చాలన్న గొప్ప సదాశయం తోనే భారత, భాగవత, అష్టాదశ పురాణాలు నారదుని ప్రేరణతో వెలువడి, భారతీయ సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. నారదుడు భారతజాతికి సంస్కారం ఇచ్చే మహా గ్రంథాలు వెలుగు చూడడానికి కారకుడయ్యాడని చెప్పారు.
సమాచార భారతి ఒక ప్రత్యేక సందర్భంలో ఆవిర్భవించిందని సీనియర్ జర్నలిస్ట్ వేదుల నర సింహం చెప్పారు. అయోధ్య ఉద్యమ సమయంలో నకిలీ వార్తలు, వక్రభాష్యాలు రాజ్యమేలుతున్న కాలంలో వాటిని ఎదుర్కొనడానికి సమాచార భారతి ఏర్పడిందని, వాస్తవాలు దేశ ప్రజల ముందు ఉంచే బాద్యతను నిర్వర్తించిందని తెలియ చేశారు.
కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గోవింద రాజు చక్రధర్, సుశ్రీరత్నచోట్ రాణి, సీనియర్ కాలమిస్ట్ వుప్పల నరసింహం, ఫోటో జర్నలిస్ట్ సి. కేశవులను విశిష్ట సేవా పురస్కారాలతో, జర్నలిస్ట్ గోపగోని సప్తగిరిని యువ జర్నలిస్ట్ పురస్కారంతో సమాచార భారతి సత్కరించింది. కాగా విశిష్ట సేవా పురస్కారానికి ఎంపికైన ప్రముఖ జర్నలిస్ట్ రాజనాల బాలకృష్ణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
సమాచార భారతి వ్యవస్థాపక సభ్యులు వేదుల నరసింహం, సమాచార భారతి కార్యదర్శి ఆయుష్ జీతో పాటుగా అనేక మంది పాత్రికేయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.