‘‘దినయామిన్యే సాయం ప్రాతః శిశిర వసంతే పున రాయాతః’’ అని శంకర భగవత్‌పాదుల వారి వక్కాణం. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు ఎన్నో ప్రపంచంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జన్మను సార్థకం చేసుకొని ప్రజల హృదయాలలో పది కాలాల పాటు పదిలంగా నిలబడే ప్రత్యేకత ఉత్తమ పురుషులకే సాధ్యపడుతుంది. అటువంటి సత్‌ ‌పురుషుల కోవకు చెందినవారు త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం.

సహస్ర చంద్రదర్శనానికి చేరుగా వచ్చిన సుబ్రహ్మణ్యం వరంగల్‌ ‌పట్టణంలోని పండిత వంశంలో జన్మించారు. రజాకార్ల కాలం నాటి కష్టనష్టాలను, స్వాతంత్య్ర పోరాట కష్టాలను అనుభ వించారు. తదనంతరం ముదిమి వయస్సులో భారతీయ ఇతిహాసాలపై మక్కువతో సంప్రదాయ సాహిత్యా రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ఇటీవల ఆయన ‘భాగవత నామకోశము: బమ్మెర పోతన’ అనే ఎంతో విలువైన పుస్తకం వెలువరించారు. ఈ గ్రంథం ఎంత విలువ కలిగి ఉంటుందో తెలుసుకోవాలంటే ఇంతకు ముందు ఆయన చేసిన కృషిని గురించి క్లుప్త పరిచయంతో సాధ్యమవుతుంది.

ప్రస్తుత సమాజంలో 18 పర్వాల కవిత్రయ మహాభారత గ్రంథాన్ని చదివే తీరిక, అవకాశం లేక కొన్ని భాగాలే చదివి చాలామంది తృప్తి పడుతు న్నారు. ఇటువంటి తరుణంలో మహా భారతంలోని అన్ని పాత్రలను వాటి పూర్వాపరాలను అకార క్రమంలో మహాభారత నామ కోశ నిఘంటువులను లిఖించారు. 13 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ చేసి ప్రథమ భాగం 690 పేజీలు, ద్వితీయ భాగం 577 పేజీలతో వెలువరించారు. ఈ రెండు గ్రంథాలు చదివితే మూల వ్యాస భారతం చదివినట్లే. ప్రతి నామ సంగ్రహ చరిత్రను విశదీకరిస్తూ అది ఎక్కడ ఏ పర్వంలో వస్తుందో సంఖ్యా సూచకంగా వివరించారు. ఈ గ్రంథాలు పరిశోధక విద్యార్థులకు, ఇతిహాసాలపై మక్కువ ఉన్న వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఈ రచనలను త్రోవగుంట వారు ఒక తపస్సుగా, జన్మ చరితార్ధ మహస్సుగా భావించి చేశారు.

భారతీయ ఇతిహాసాల్లో ఇద్దరు స్త్రీ మూర్తులను మహోన్నతంగా పేర్కొంటారు. వారు ఒకరు సీత, రెండవ వారు ద్రౌపది. సీతాదేవి సౌమ్యమూర్తి. ద్రౌపది వీరనారి. మహాభారతంలో ఎన్ని పాత్రలున్న ప్పటికీ అన్నింటికీ కథా బీజం ద్రౌపది పాత్రే. అగ్ని సంభూత. ఈమె కన్యారాశికి ప్రతీక. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని పతివ్రతా శిరోమణిగా వెలుగొందిన పుణ్యవతి. లోగడ కొందరు ఆధునిక, వామపక్ష లౌకికవాద రచయితలు, రచయిత్రులు తమ విశృంఖల స్వేచ్ఛా ముసుగులో నిరంకుశంగా ద్రౌపది పాత్రపై తమ నీచ నికృష్ట స్వభావ ఆలోచనలను బహిర్గతం చేస్తూ మానవీయ విలువలను మంటగలిపారు. వారు పెట్టిన క్షోభ నుంచి, ఆ పాత్రకు చేసిన అన్యాయం నుంచి సాంత్వన పొందడానికి త్రోవగుంట వ్యాఖ్యానం చదవాలి.  ద్రౌపది పాత్ర ఔనత్యం చెడకుండా నిబద్ధతో ఆనాటి సమాజంలో ఉన్న నీతి నియమాల సారంగా ధర్మబద్ధంగా జీవనం నడిపే రాజమాతగా, చైతన్య సాహసమూర్తిగా ద్రౌపదిని తమ ‘యాజ్ఞసేని’ (నవల) గ్రంథంలో త్రోవగుంట వారు తీర్చిదిద్దారు. ఈ నవలా రాజం మొత్తం 370 పేజీలు. సుబ్రహ్మణ్యం గారికి మహాభారతం కథ కరతలామలకం. అందుకే ఈ యాజ్ఞసేని నవల చదివితే ద్రౌపది దేవిపై ఉన్న ఆపోహలన్నీ తొలగిపోతాయి.

మహాభారతంలో నలదమయంతుల ఉపాఖ్యానం ఉంది. దీన్ని సంస్కృతంలో శ్రీహర్షుడు, తెలుగులో శ్రీనాథుడు శృంగార నైషధం పేరిట కావ్యాలుగా రచించారు. బ్రహ్మశ్రీ వేంకట సుబ్రహ్మణ్యం నలదౌత్యాన్ని వచనంలో నవలా రూపంగా 183 పేజీల గ్రంధాన్ని ‘నైషధం’ పేరుతో రచించి వెలువరించారు.

ఇది పరిమాణంలో చిన్నదయినా పరిగణనలో గణనీయమైనది. ఈ నవల యాజ్ఞసేని లోగడ ధారావాహికగా ‘ఆంధ్రభూమి’  దినపత్రికలో ప్రచురితమైనది. ఈ నవలలోని పాత్రలు, కథాగమనం ఆసక్తిదాయకంగా నిర్మించి సామాన్య పాఠకులు సైతం ఐతిహాస నవలలకు దగ్గర అయ్యే త్రోవ చూపించారు త్రోవగుంట. పాశ్చాత్య పోకడలతో, వికృత ధోరణులతో మనం ఎంతో అపురూపంగా చూసుకునే వివాహ వ్యవస్థ బీటలు వారుతున్న తరుణంలో సుబ్రహ్మణ్యం ‘నైషధం’ రూపంలో భార్యాభర్తల అనుబంధాలను, హిందూ సనాతన సంప్రదాయాలను ఎంతో గొప్పగా చిత్రీకరిస్తూ తనదైన పాండిత్య శైలిలో నేటి సమాజానికి మార్గదర్శనం చేశారు.

ఇప్పుడు భాగవత పదకోశాన్ని 796 పేజీలలో ఎంతో శ్రమకు ఓర్చి రచించి విడుదల చేశారు. లోగడ భాగవతంపై ఇలాంటి ప్రయత్నాలు కొందరు రచయితలు చేశారు. కాని అవి క్వాచిత్కములు. అసంపూర్ణములు.

వీరు వయోవృద్ధులైన కూడా ఎంతో శ్రమించి భావితరాలకు భాగవత నామకోశాన్ని అందించారు. ఇలాంటి రచనా విధానంలో విసుగు, అలసట కలగటం సహజం. కాని అలాంటి వాటిని దరికి రానీయకుండా అన్ని పాత్రలకు ప్రాణం పోశారు. మరీ ప్రత్యేకంగా వివిధ మహర్షుల రాజవంశాల క్రమణికను అనుబంధాలు అనే అధ్యాయంలో విపులంగా పొందుపరచారు.

ఇందులో ఒక ఒక పదంతో, ఒక వాక్యంతోనే పరిచయం చేసిన పాత్రల నుంచి, ఒకటిన్నర పుటతో చేసిన వివరణలు కూడా ఉన్నాయి. ఒక్క పాత్రలేకాదు, స్థలాలు, వస్తువులు, మంత్ర సంబంధ ముద్రలు, భాగవతంలో ప్రస్తావించిన ప్రకృతికి సంబంధించిన పదాలకు కూడా చక్కని వివరణ ఉంది. ఈ పుస్తకానికి ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌, ‌కుప్పా వేంకటకృష్ణమూర్తి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా. అక్కిరాజు సుందరరామకృష్ణ రాసిన ముందుమాటలు ఎంతో విలువైనవి.

ఇది నిజంగా నిష్కామకర్మ. ఈ రెండు నామకోశముల ద్వారా తెలుగువారికి, భరతజాతికి ఎంతో సేవ చేశారు. ఈ పుస్తకం చేతిలోకి వచ్చిన తరువాత, లేదా కొంత చదివిన తరువాత వచ్చే ధర్మసందేహం- ఈ వ్యాఖ్యాత రాధ పాత్ర గురించి ఏం చెప్పారు? రాధ లేని కృష్ణభగవానుని ఊహించ డానికి కూడా కొందరు ఇష్టపడరు. ఇన్ని పాత్రల గురించి చెప్పినప్పుడు రాధ పాత్రను పరిచయం చేయకుండా ఎలా? కానీ భాగవతంలో రాధాదేవి ఊసే లేదన్నారు. అంత అద్భుతమైన పాత్ర గురించి బ్రహ్మవైవర్తన పురాణంలోనే తప్ప, భాగవతంలో ప్రస్తావన లేదని తేల్చారు. అదొక కల్పిత పాత్ర అన్న వాదన మాటను కూడా ప్రస్తావించారు. అలాగే మనం ఎంతగానో ప్రచారం చేసుకున్న నరకాసుర వధ ఆంధ్ర మహా భాగవతంలోనే కనిపిస్తుందట. రావు సింగ భూపాలుడు అడిగినా పోతన భాగవతాన్ని అంకితం చేయకపోవడం, ఆ గ్రంథాన్ని పాతి పెట్టడం, దానితో శిథిలమైన కొన్ని భాగాలను ఆయన శిష్యులు పరిష్కరించడం వంటి అంశాలను గ్రంథకర్త త్రోవగుంట తన ముందుమాటలో చక్కగా విశదీకరించారు. పోతనామాత్యుల శైలీ విన్యాసాలు, కవికాలాదులు కూడా ఇందులో ఉన్నాయి. భాగవత పురాణంలో క్రీస్తుపూర్వం 340 నాటి చరిత్ర పరిచయం ఉన్న సంగతి విస్మయపరిచేదే. అదే చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుని విజయగాథ.

ఈ రెండు నిఘంటువులు పురాణ పాత్రల గురించి విషయాన్ని త్వరితంగా తెలియజేస్తా యనటంలో సందేహం లేదు. నేను రచయితను కనుక నా స్వీయ అనుభవంతో ఈ వాక్యం రాస్తున్నాను. కారణం నా కథా రచన వ్యాసంగానికి ఈ రెండు నామకోశాలు ఎంతగానో ఉపకరించాయి.

సామాన్యంగా ఇటువంటి నామకోశాలు నిర్మించే వారిలో సృజనాత్మక లక్షణాలు తక్కువ అని నానుడి. కాని వీరు అద్భుతమైన సాహిత్య శిల్ప అవగాహనతో బహుముఖమైన ప్రజ్ఞతో నవలలు కూడా రాస్తున్నారంటే చాలా అరుదైన విషయం. ఇలాంటి విలక్షణమైన రెండు విభిన్న సాహిత్య కోణాలు  త్రోవగుంట వారి ప్రత్యేకత.

‘‘యదిహాస్తి తదన్య త్రియన్నే హాస్తిన చత్‌క్వచిత్‌’’

అని ప్రతిజ్ఞ చేసిన వేద వ్యాస మహర్షిని తెలుగు వారికి పరిచయం చేసిన కవిత్రయం వారి సాహిత్య అడుగులలో నడచి గొప్ప సాధన చేసి సాఫల్యాన్ని పొందిన త్రోవగుంట సుబ్రహ్మణ్యం ధన్యజీవి. శ్రీకృష్ణ పరమాత్మ వీరికి ఆయురారోగ్యాలు అనుగ్రహించాలని మనసా వాచ కర్మణా కోరుకుంటున్నాను.

పైన ఉదహరించిన ఐతిహాస గ్రంధముల కొరకు సంప్రదించవలసిన ఫోన్‌ ‌నం 040- 24534210, 9491878082.

– జన్నాభట్ల నరసింహప్రసాద్‌, 8297263741

About Author

By editor

Twitter
YOUTUBE