ప్రపంచ పరిస్థితులు మారిపోతున్న ఈ తరుణంలో భారత న్యాయశాస్త్ర చరిత్రలో కొత్త పుట చేరబోతున్నది. గడచిన నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ ప్రజానీకం దృష్టిలో వస్తున్న మార్పు ఫలితమిది. ప్రధానంగా భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కులు, పాలకులు-పాలితుల మధ్య; ప్రభుత్వాలు, వ్యవస్థల మధ్య సంబంధాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వాలూ, రాజ్యాంగం, హక్కులూ; వాటి పరిధులు కూడా ఇప్పుడు లోతైన చర్చనీయాంశాలుగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో మన దేశాన్ని ఒక్కసారిగా ఒక అంశం కుదిపింది. అదే భారత శిక్షా స్మృతిలోని ‘124 ఎ’ పరిచ్ఛేదం. రాజద్రోహం ఆరోపణతో ఒక పౌరుడిని నిర్బంధించడానికీ, శిక్షించడానికీ అవకాశం కల్పించే పరిచ్ఛేదమిది. దీనిని పునస్సమీక్షించాలని కొందరు, కాదు పూర్తిగా రద్దు చేయాలని కొందరు బలంగా అభిప్రాయపడుతున్నారు. దీనిని రద్దు చేయడమే ప్రజాస్వామ్యానికి గీటురాయని కొందరు భాష్యం చెబుతున్నారు. సంస్కరించడం కాదు, భారత శిక్షా స్మృతి నుంచి దానిని కూకటివేళ్లతో పెకలించా లని ఇంకొందరు వాదిస్తున్నారు. వలసపాలకులు తెచ్చిన ఈ చట్టం అవసరం ఇంకా ఏమిటి? అన్నది అసలు వాదన. ఈ పరిచ్ఛేద దుర్వినియోగం హద్దులు మీరిందన్నది రెండో వాదన. ఈ నేపథ్యంలోనే మే 11, 2022న భారత అత్యున్నత న్యాయస్థానం ‘124 ఎ’ ప్రయోగం మీద స్టే విధించింది. 150 ఏళ్లుగా ఉన్న రాజద్రోహ నేరం, అందుకు సంబంధించిన పరిచ్ఛేదం ఇక కనిపించవు. ఇక్కడే దేశంలో చాలామంది ప్రశ్న- రద్దు చేస్తారు సరే, ఆ తరువాత? ఈ ప్రశ్న నిరర్ధకమైనది కాదు. అలా అని వలస ప్రభువులు తెచ్చిన చట్టాన్ని ఇంకా మోయాలని చెప్పడమూ కాదు. రాజద్రోహ చట్టం తెచ్చిన బ్రిటిష్ వలస ప్రభుత్వం పోయింది. కానీ స్వతంత్ర భారతంలో రాజద్రోహ చింతన పోయిందా? ఇదే ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహం.
మార్పును స్వాగతించవలసిందే. అందుకు ఇప్పుడు ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం సదా సంసిద్ధంగానే ఉంది. 2014-2015 మధ్య నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలదోషం పట్టిన 1500 వరకు చట్టాలను రద్దు చేసింది. తాజాగా 124 ఎ పరిచ్ఛేదం గురించి పునరాలోచించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దానికి కొనసాగింపే. భారత లా కమిషన్ కూడా ఆగస్ట్ 30, 2018న 124 ఎ వివాదం మీద కీలక ప్రకటనే చేసింది. ప్రజాస్వామ్యం సజీవంగా, శక్తిమంతంగా ఉండడానికి ప్రభుత్వం మీద చేసే విమర్శ, ప్రకటించే అసమ్మతి గురించిన చర్చలు చాలా అవసరమని లా కమిషన్ చెప్పింది. ఇది కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహా వ్యవస్థ కూడా. నాటి కమిషన్ అధిపతి జస్టిస్ బీఎస్ చౌహాన్ అందించిన ఒక పత్రంలో రాజద్రోహ నేరం ఆరోపించడానికి ప్రయోగించే సెక్షన్ 124 ఎ గురించి పునరాలోచించడానికీ, లేదంటే పూర్తిగా రద్దు చేయడానికీ ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. కాబట్టి 124 ఎ ఉనికి గురించి పునరాలోచన లేదా రద్దు అనే రెండు ప్రధాన కోణాలు కనిపిస్తున్నాయి.
భారత శిక్షా స్మృతిలోని 124ఎ ప్రకారం రాజద్రోహం అంటే ప్రభుత్వాన్ని ధిక్కరించేవీ, ప్రభుత్వం మీద ద్వేషం పుట్టించే తీరులో ఉన్న చర్యలు, ఇందుకు ప్రోత్సహించే రచనలు, ఉపన్యాసాలు వెలువరిస్తే ఈ కేసుతో నిర్బంధించ వచ్చు. ఇందుకు నేరం తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. కారాగారం, జరిమానా కూడా ఉండవచ్చు. ఇది వలస పాలకుల సృష్టి అని ముందే చెప్పుకున్నాం. థామస్ బాబింగ్టన్ మెకాలే రాసిన 1837 నాటి భారత శిక్షా స్మృతిలో రాజద్రోహం చట్టాన్ని 113 క్లాజ్‌లో చేర్చారు. కానీ ఇది 20 ఏళ్లు ఆలస్యంగా 1860లో అమలులోకి వచ్చింది. అయితే అప్పుడు అనూహ్యంగా రాజద్రోహానికి సంబంధించిన చట్టం అందులో చోటు చేసుకోలేదని ఒక అధ్యయనం చెబుతోంది. ఆ అధ్యయనం ప్రకారం 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టం తరువాత ఈస్టిండియా కంపెనీ ఇలాంటి రాజద్రోహ చట్టం అవసరమని భావించింది. అందుకు కారణం ఆ తరువాత పెరిగిన వహాబీ కార్యకలాపాలు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రేరణతో ఈస్టిండియా కంపెనీ పాలన మీద 1870 వరకు అడపా దడపా తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు నవంబర్ 25,1870న భారత శిక్షా స్మృతిలో 124ఎ ను చేర్చారు. ప్రభుత్వాల మీద ద్వేషం పెంచే ప్రయత్నాలు చేస్తే శిక్షార్హులను చేస్తూ 1898లో ఈ చట్టానికి సవరణ చేశారు. అప్పటి నుంచి దాదాపు అదే రూపంలో ఇది కొనసాగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1948లో రాజ్యాంగం నుంచి ‘రాజద్రోహం’ అన్న పదం తొలగించారు. అలా 19 (1)ఎ అధికరణతో పూర్తి స్థాయి భావ ప్రకటనా స్వేచ్ఛ వచ్చింది.
124ఎ దుర్వినియోగమవుతున్నదని చెప్పడానికి సుప్రీంకోర్టు స్టే విధించిన ఐదు రోజుల ముందు, అంటే మే 6న బెయిల్ పొందిన ఇద్దరు వ్యక్తుల ఉదంతం చాలు. అమరావతి (మహారాష్ట్ర) స్వతంత్ర లోక్‌సభ సభ్యురాలు నవనీత్ కౌర్, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాలన• ఏప్రిల్ 23న అరెస్టు చేసి, రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇంతకీ వారు చేసినది, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ఎదురుగా హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించడమే. మసీదుల మీద లౌడ్ స్పీకర్ల తొలగింపునకు ఎంఎన్‌ఎస్ నాయకుడు రాజ్ ఠాక్రే గడువు విధించడం, ఆ గడువులోగా వాటిని తొలగించకుంటే రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ చేసిన హెచ్చరిక రాష్ట్రమంతా వేడి పుట్టించిన నేపథ్యంలో ఇది జరిగింది. ఆ ఇద్దరి మీద రాజద్రోహం కేసు పెట్టవలసిన అవసరం ఏముందని కోర్టు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సాధారణ ప్రజానీకం కూడా హనుమాన్ చాలీసా చదివితేనే రాజద్రోహమా? అని ప్రశ్నించుకోవలసి వచ్చింది. కానీ ఇది రాజద్రోహం ఆరోపణకు ఒక పార్శ్వం మాత్రమే. మరొక పార్శ్వం కూడా ఉంది.
నిజానికి రాజద్రోహం నేరం ఆరోపిస్తున్న కేసులు మిగతా కేసులతో పోల్చుకుంటే దేశంలో చాలా తక్కువ. భారత శిక్షా స్మృతి ప్రకారం ఈ చట్టం కిందకు వస్తున్న వారు 0.01 శాతం కంటే తక్కువే. ఖలిస్తాన్ జిందాబాద్, ఖాల్సా రాజ్యం వస్తుంది వంటి నినాదాలు చేయడం రాజద్రోహం కిందకు రావని 1995లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రజత్ శర్మ, వినోద్ దువా, కిశోర్ చంద్ర వాంఘ్ కేమ్చా వంటి జర్నలిస్టులు కూడా ఈ కేసును ఎదుర్కొన్నారు. వినోద్ దువా తన టీవీ కార్యక్రమంలో ఉగ్రవాద చర్యలలో చనిపోయిన వారి ద్వారా మోదీ ఓట్లు సంపాదిస్తున్నారని ఆరోపించడంతో కేసు పెట్టారు. ఇక్కడ నుంచి విదేశాలకు పంపిన వెంటిలేటర్లను సరిగా స్టెరిలైజ్ చేయలేదని కూడా ఆరోపించారు. అవి అబద్ధాలని తేలింది. అయినా కూడా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అబద్ధాలతో విదేశాలలో దేశం పరువు పోగొట్టడం మాటేమిటి? 370 అధికరణకు చైనా మద్దతు ఉందంటూ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన కార్యక్రమానికి సంబంధించి రజత్‌శర్మ మీద ఈ కేసు నమోదైంది. రైతుల ఆందోళన సమయంలో టూల్ కిట్ వ్యవహారానికి సంబంధించి దిశా రవి అనే ఆమె మీద ఈ కేసు నమోదు చేశారు. ఎర్రకోట ముట్టడి వంటివన్నీ ఆ టూల్‌కిట్ మేరకే జరిగాయన్న ఆరోపణ ఉంది. లద్దాఖ్‌కు చెందిన జకీర్‌హుసేన్, నిసార్ అహ్మద్‌ల మీద ఇదే కేసు నమోదు చేశారు. భారతీయ సైన్యాన్ని కించపరుస్తూ ఈ ఇద్దరు జరిపిన సంభాషణ గురించి ఈ కేసు నమోదైంది. అస్సాంకు చెందిన రజీనా పర్వీన్ సుల్తానా అనే ఆమె ఈద్ రోజున కొందరికి విందు ఇచ్చింది. ఆ సమయంలో ఆ భోజనాల టేబుల్ మీద భారత పతాకం పరిచింది. ఇందుకు కేసు నమోదైంది. ఇటీవల ఎక్కువ కేసులు నమోదు చేసిన రాష్ట్రాలు అస్సాం, జార్ఖండ్. పౌరసత్వ సవరణ చట్టం గొడవలలో 3000 మంది మీద, ఢిల్లీలో రైతులు ఆందోళన చేసిన సమయంలో 3,300 మంది ఇదే కేసు నమోదైంది. 2015- 2020 మధ్య దేశంలో 124ఎ కింద 356 కేసులు నమోదైనాయి. 548 మందిని అరెస్టు చేశారు. 12 మందికి మాత్రమే శిక్షలు పడినాయి. అసలు ఈ కేసులో శిక్షలు పడినవారు తక్కువ. ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం అంటూ 2016లో జేఎన్‌యూ విద్యార్థులు నినాదాలు చేయడం వాస్తవం. దాని గురించి ఆనాటి విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్నారు.
కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం కొంత నిజం. కానీ ఆ చట్టం కింద తీవ్రమైన కేసులు నమోదవు తున్న సంగతి ఇంకా బలమైన నిజం. 124ఎ ను పునఃపరిశీలించే క్రమంలో దేశ భద్రతను ఫణంగా పెట్టబోమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పడం చాలామందికి సంతృప్తిని ఇచ్చింది. అలాగే ఇప్పటికే అరెస్టయిన వారి మీద 124ఎ మినహా మిగిలిన చట్టాల మేరకు కేసులు నమోదై ఉంటే కోర్టులు విచారణను కొనసాగించ వచ్చునంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కూడా సాంత్వనను ఇస్తుంది. చిత్రంగా 124ఎ గురించి పునరాలోచించా లన్న ప్రతిపాదన వచ్చిన మరుక్షణమే అన్ లా ఫుల్ యాక్టివిటీస్ చట్టాన్ని (యూఏపీఏ)ను కూడా సమీక్షించాలంటూ ప్రతిపాదనలు వస్తున్నాయి. అందుకే దేశ రక్షణ, పౌర హక్కులకు మధ్య సమతౌల్యం అనివార్యమని కూడా అత్యున్నత న్యాయస్థానం 124ఎ మీద స్టే విధిస్తూ చెప్పింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఒక చట్టం మీద న్యాయ వ్యవస్థలు వెనక్కి తగ్గాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం ఇదే మొదటిసారి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఒక చట్టం దుర్వినియోగం అవుతున్నదంటూ వచ్చిన వ్యాజ్యాన్ని విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం న్యాయ వ్యవస్థను నిలువ రించడం విశేషం. ఈ సందర్భంలో కర్తార్‌సింగ్ కేసును గుర్తు చేసుకోవాలి. ఉగ్రవాద వ్యతిరేక చట్టం టాడాకు ఉన్న రాజ్యాంగబద్ధత గురించి 1994లో వివాదం వచ్చినప్పుడు, అలాంటి ఒక వివాదం వచ్చింది కాబట్టి ఆ చట్టాన్ని నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. తరువాత ఆ చట్టం వినియోగం సబబేనని కూడా సుప్రీంకోర్టు చెప్పవలసి వచ్చింది. ఒక చట్టం దుర్వినియోగం అవుతున్నది కాబట్టి దానికి రాజ్యాంగబద్ధత లేదని చెప్పడం సాధ్యం కాదని 2003లో పీయూసీఎల్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.
కాబట్టి ఉగ్రవాదం, నక్సలిజం, ఇతర తీవ్ర నేరాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) ద్వారా అరెస్టయిన వారిని ఈ పేరుతో ఇప్పుడు వదిలిపెట్టే అవకాశం దాదాపు లేదు. నిజానికి వీళ్ల మీద రాజద్రోహం కేసు కాకుండా యూఏపీఏ, ఆయుధాలు, పేలుడు సామగ్రి కలిగి ఉండడం వల్ల కేసులు నమోదు చేశారు.
ఒక పార్టీ తరఫునో, ఒక దేశం తరఫునో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయం గానో ప్రభుత్వం మీద, దేశం మీద అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తే పరిష్కారం ఏమిటి? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలామంది మతం ప్రాతిపదికగా చేసుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మైనారిటీలకు రక్షణ లేదన్నది అందులో ఒకటి. రామజన్మ భూమి వివాదంలో తీర్పు రామునికి అనుకూలంగా వస్తే, దానిని అంగీక రించడం లేదని చెప్పిన ముస్లిం మతోన్మాదులు ఎందరో ఉన్నారు. ఈ దేశాన్ని మళ్లీ చీలుస్తామంటూ మాట్లాడినవారు ఉన్నారు. మోదీనీ, యోగినీ, అమిత్‌షాను చంపుతామని చెబుతున్న వాళ్లు ఉన్నారు. పంజాబ్‌లో ఖలిస్తాన్ నినాదాలు వినిపిస్తున్నాయి.
1980ల నాటి ఖలిస్తాన్ ఆందోళనల చరిత్ర తెలిసిన వారికి అవి ఆందోళన కలిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని పార్లమెంటు చేసిన ప్రతి చట్టాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న వారిని ఏ చట్టంతో అదుపు చేయాలి? రైతు చట్టాలు కొంతమందికి నచ్చలేదు. అందుకు ఎర్రకోట మీద దాడి చేశారు. ప్రధాని కాన్వాయ్‌ని దేశ సరిహద్దులలో అత్యంత ప్రమాదకర ప్రాంతంలో నిలిపి వేశారు. వీళ్లని ఏమనాలి?
ఒక చట్టం దుర్వినియోగమైనంత మాత్రాన దాని రాజ్యాంగబద్ధతను ప్రశ్నించలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో 124ఎ వినియోగాన్ని కోర్టులు పరిశీలించకపోవడం దురదృష్టకరం. అంటే తాము ఇచ్చిన తీర్పును తామే నిర్లక్ష్యం చేసినట్టే కదా! అయితే 124ఎ చాలా సందర్భాలలో దుర్వినియోగ మైన సంగతి వాస్తవమే. కానీ ఈ చట్టం ప్రయోగించేందుకు ప్రత్యేకంగా ఒక ఉన్నతస్థాయి ఉద్యోగిని నియమించాలని ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ఓపీ సింగ్ అంటున్నారు. ఏమైనా 124ఎ స్థానంలో కొత్త చట్టం రావడం ఖాయమైంది. అది ఎలా ఉండాలి? ఈ దేశభద్రత దాని మొదటి లక్ష్యమై ఉండాలి. సైలెంట్ మెజారిటీని ఆసరా చేసుకుని భారతీయ వ్యవస్థను శాసించాలని చూసేవారిని అది అదుపు చేయాలి. దేశ విభజన కుట్రలను తక్షణం ఛేదించి శిక్షించేదిగా ఉండాలి. ఈ దేశ సమైక్యతకు చేటు చేసేవారిని ఆలస్యం లేకుండా శిక్షించే విధంగా ఉండాలి. మానవహక్కులకు పరిధులు ఉండాలి. దేశాన్ని నాశనం చేసేటంత వాక్ స్వాతంత్య్రం ఎవరి కోసం? ఎందుకోసం? ఇకనైనా హక్కులకూ, దేశ రక్షణకూ మధ్య సమతౌల్యం సాధించే పని ఆరంభం కావాలి.