సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌వైశాఖ శుద్ధ  అష్టమి – 09 మే 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అవాంఛనీయ ఘటనలు వరసగా జరిగిపోతున్నాయి. ఒక పథకం, భారీ  ఖర్చు ఉంటే తప్ప, ఇంత పకడ్బందీగా వాటికవే జరగవు. ఇంత పెద్ద దేశంలో, భిన్నత్వంలో ఏకత్వమే ప్రత్యేకతగా ఉన్న భూమి మీద విభేదాలు సహజం. కానీ ఇవాళ కనిపిస్తున్నవి దేశ సమగ్రతకూ, ఆ ఏకత్వానికి ముప్పు తెచ్చేవి. అందరినీ ఒకే గాట కట్టే ఉద్దేశం ఎవరికీ లేకున్నా, మైనారిటీలలో కొందరు సంయమనం, సయోధ్య అనే భావనలకు దూరంగా జరుగుతూ, మెజారిటీ వర్గాన్ని క్షోభకు గురి చేస్తున్నారు. అధికారమే పరమావధిగా, అందుకు బీజేపీని కూల్చడమే లక్ష్యంగా ఆ మైనారిటీల చర్యలకు విచక్షణా రహితంగా, అర్ధరహితంగా కొందరు వత్తాసు పలుకుతున్నారు. వాళ్లెవరు? ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటేనే భిన్నత్వంలో ఏకత్వం నిలబడుతుందన్న శాశ్వత సత్యాన్నీ, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, అందరికీ సమాన హక్కులు, మహిళల ఆత్మగౌరవం, సామాజిక భద్రతలకు భరోసా కూడా అదేనని గుర్తించడానికి నిరాకరిస్తున్న మూర్ఖులే.

కానీ మైనారిటీలను దూరం చేసుకోవడం భారత్‌ అనే భావనను పరిపూర్ణంగా విశ్వసించే వారి ఉద్దేశం కాదన్నది స్పష్టం. దొంగ ఉదారవాదులు, కుహనా సెక్యులరిస్టులు నిరంతరం ఆడిపోసుకునే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌, ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌మాటలు, చర్యలు ఎంత హుందాగా ఉన్నాయో దేశంలో చాలామందే గ్రహించారు. హిందువుల సామాజికోత్సవాలను హింసాత్మకం చేయడం, స్వమతమే స్పష్టతనివ్వని హిజాబ్‌ ‌వంటి అంశంతో శాంతిభద్రతల సమస్యను సృష్టించడం, పాఠశాలల్లో బాహాటంగా క్రైస్తవాన్ని రుద్దడం ఎవరు ప్రారంభిం చినవి? తాజాగా ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని విమర్శిస్తూ పంజాబ్‌ ‌శివసేన (బాల్‌ ‌ఠాక్రే వర్గమని చెప్పుకున్నారు) ప్రదర్శన నిర్వహిస్తే, దానిని ఖలిస్తాన్‌వాదులు హింసాత్మకం చేయడం ఏమిటి? దీనిని బట్టి అక్కడ రైతు ఉద్యమం పేరుతో మొదలైన అరాచకంతో మళ్లీ ఆవహించిన ఖలిస్తానీవాదులను కొత్తగా ఏర్పడిన ఆప్‌ ‌ప్రభుత్వం పోషిస్తున్నట్టేనా? కొందరు ముస్లింలకు భారత్‌ ‌ప్రశాంతంగా ఉంటే నచ్చదు. కానీ, క్రైస్తవులకు, సిక్కులకు కూడా ఈ వేడిలోనే సమస్యలన్నీ గుర్తుకు రావడం ఏమిటి? సందట్లో సడేమియాల్లా భాషా వివాదమూ ఇప్పుడే ఒళ్లు విరుచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ మధ్యలో లౌడ్‌ ‌స్పీకర్ల రణగొణ ధ్వని మరొకటి.

 ‘హింస ఎవరికీ లాభం చేకూర్చదు. ప్రస్తుత వాతావరణంలో అన్ని వర్గాల వారు కలసికట్టుగా ఉండవలసిన అవసరం ఉంద’ని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ఏ‌ప్రిల్‌ 28‌వ తేదీన పిలుపునిచ్చారు. దేశాన్ని కుదిపేస్తున్న ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకునే డాక్టర్‌ ‌మోహన్‌జీ ఈ పిలుపునిచ్చారని వేరే చెప్పనక్కరలేదు. మహారాష్ట్రలోని కన్వారామ్‌ ‌ధామ్‌లో జరిగిన ఉత్సవంలో డాక్టర్‌ ‌మోహన్‌జీ పాల్గొన్నారు. ఏ సమాజమైనా హింసను పోషించాలనుకుంటే దానికి చేటుకాలం దాపురించినట్టేనని కచ్చితంగా హెచ్చరిం చారు. మానవత్వాన్ని కాపాడుకోవడానికి మనం అహింసామార్గంలోనే ప్రయాణిం చాలని అన్నారు. ఇటీవల హిందీ కేంద్ర బిందువుగా మొదలైన వివాదం కూడా ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేదు. సింధి భాషనూ, సంస్కృతినీ రక్షించడానికి విశ్వవిద్యాలయం స్థాపించాలని చెబుతూ, ఈ దేశంలోని ప్రతి భాషకు ప్రత్యేకత ఉందనీ, మనది బహుభాషలు మాట్లాడేవారు నివసించే దేశమని  గుర్తు చేశారు.

మతాన్ని బట్టి, పార్టీని బట్టి విమర్శించే వారికి తప్ప, ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌సెక్యులర్‌ ఆచరణ మిగిలిన అందరికీ కనిపిస్తుంది. దేశమంతా  ఒక విధానం ఉండాలన్న ఆలోచన రాగానే ఆయనే  అన్ని ప్రార్థనా స్థలాల మీది లౌడ్‌ ‌స్పీకర్‌ల వినియోగానికి వెంటనే మార్గదర్శ కాలు జారీ చేశారు. మే1వ తేదీ వరకు 53,000 అనుమతి లేని లౌడ్‌ ‌స్పీకర్లు మౌనం దాల్చాయి. 60,000 స్పీకర్లు గొంతు తగ్గించుకున్నాయి. యోగిలోని నిష్పక్షపాత దృష్టికి మరొక నిదర్శనం- అయోధ్యలోని ఒక ఈద్గా మీద అభ్యంతరకర వస్తువులు విసిరిన (ఏప్రిల్‌ 26-27) ఏడుగురు హిందూ యోధ సంఘటన కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయించడం. దీనికి ప్రతిగా అన్నట్టు ఇతరులకు అసౌకర్యం కలిగించని రీతిలో రంజాన్‌ ‌మాసంలోని ఆఖరి శుక్రవారం (ఏప్రిల్‌ 29) అల్విదా నమాజ్‌ను మసీదులలో, లేదా ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని, లౌడ్‌ ‌స్పీకర్లను నియమాల పరిధిలోనే ఉంచాలని సున్నీ మతగురువు సుఫియాన్‌ ‌నిజామీ (దారుల్‌ ఉలుమ్‌ ‌ఫరాంగి మహల్‌) ఆదేశించారు. ఇటీవల పెద్ద సమస్యగా పరిణమిస్తున్న వీధులలో నమాజ్‌పై ముస్లింలకు మత గురువులు ఇలాంటి  పిలుపునివ్వడం ఇదే తొలిసారి. తాను ప్రాతినిధ్యం వహించే గోరఖ్‌పూర్‌ ఆధ్యాత్మిక కేంద్రం మీద దాడికి యత్నించిన ముస్లిం మతోన్మాదిని యోగి ప్రభుత్వం చట్ట ప్రకారం అరెస్టు చేయించిందే తప్ప, ‘లేపె’య్యలేదు.

సెక్యులరిజం, మత సహనం హిందువులకు నేర్పించనవసరం లేదు. మైనారిటీలు కొందరు అల్లర్లు చేస్తారు. కానీ  ఉదారవాదులు, మీడియా మత సహనం గురించి హిందువులకు సుద్దులు చెప్పడం అలవాటుగా మారింది. ఇంత వేడి వాతావరణంలో కూడా డాక్టర్‌ ‌మోహన్‌జీ పిలుపు, యోగి చర్య స్మరణీయమైనవి కావా? ఘర్షణలకు కేవలం హిందువులనే తప్పు పట్టే ధోరణే మైనారిటీలకు అలుసైన సంగతి ఇంకెప్పుడు గుర్తిస్తారు? ఎప్పుడు మత ఘర్షణలు జరిగినా, అన్ని సందర్భాలలోను ఇదే పక్షపాత ధోరణి. ఎప్పుడైనా, కనీసం వాస్తవాలు వెలుగు చూసిన తరువాతైనా ‘ఇది తగదు’ అని, మైనారిటీలకు, ముఖ్యంగా మతోన్మాదం తలకెక్కిన ముస్లింలకు ఒక్క ఉదారవాది, ఒక్క సెక్యులరిస్టు, ఒక్క కాంగ్రెస్‌ ‌నేత, ఒక్క కమ్యూనిస్టు ఇప్పటి వరకు చెప్పాడా?

About Author

By editor

Twitter
YOUTUBE