– సాయి, ఆర్థిక నిపుణులు
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం చర్చ సందర్భంగా కొంతమంది ఉన్నతాధికారులు మన ప్రధానమంత్రి ముందు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ఇస్తున్న ఉచితాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులను ప్రస్తావించి, పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని, సున్నిత హెచ్చరిక చేసినట్టు ప్రసార మాధ్యమాలు ప్రచారం చేశాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి వివరణ వెలువడలేదు. సమావేశ పూర్తి వివరాలు, చర్చ జరిపిన అంశాలు, అధికారులు చెప్పిన అంశాలు, పూర్తి వివరణ అందుబాటులో లేవు. కాబట్టి వాస్తవాలు ఏమిటి అనేది చెప్పటం కష్టమే. కానీ, శ్రీలంకలో ఉత్పన్నమైన సమస్యలు, వాటి వెనుక కారణాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన లేకుండా ఉన్నతాధికారులు దేశ ప్రధాని ముందు మాట్లాడతారని అనుకోవలసిన పనిలేదు. దీనికి తోడు ఒక ప్రముఖ తెలుగ దినపత్రికలో వచ్చిన వార్త ఉంది. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ అభిప్రాయం అందులో ఉంది. ఉచితాలతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదనే ఆయన అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాలకు ఉచితాలతో మరింత ముప్పు అని ఆయన చెప్పారు. తాయిలాల చుట్టూ తిరిగే రాజకీయం పెనుముప్పు అని తేల్చి చెప్పారు. అలాగే ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కూడా ఉచితాలు ఆర్థికవృద్ధికి చేటు తెస్తాయా అంటూ పెద్ద విశ్లేషణ ఇచ్చింది. గతం నుంచి ఉచితాల మీద ప్రజల దృష్టి మళ్లింది.
ప్రధాని మోదీతో సమావేశంలో అధికారుల అభిప్రాయాలు (ఒకవేళ వెళ్లబుచ్చి ఉంటే) వాటిని ప్రసారం చేసే క్రమంలో కొంత మార్పులు జరిగి ఉండవచ్చని అనుకోవలసి వస్తుంది. అలా ఎందుకు సందేహించవలసి వస్తుందంటే, శ్రీలంక సంక్షోభం స్థూలంగా విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, ఆ దేశం పెద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగినన్ని లేక పోవటంవల్ల, అక్కడి పాలకుల తప్పిదాలవల్ల క్రొత్తగా అప్పుపుట్టక, అక్కడి ప్రజలకి అవసరమైన వస్తువుల్ని దిగుమతి చేసుకోలేక, అనేక వస్తువుల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. మన విదేశీ అప్పు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. మన పరపతి కూడా అంతర్జాతీయ స్థాయిలో మెరుగుగా ఉన్నది, మన దిగుమతి ఎక్కువగా ఉన్నప్పటికి మన వాణిజ్యలోటు ప్రమాదకర స్థాయి లేదు కాబట్టి మనం కూడా శ్రీలంక వలె ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతామనే అపోహలు, ఉన్నతాధికారులకి కలుగుతాయంటే వారి అభిప్రాయాలు ప్రసారం చేయటంలో లోపం / పొరబాటు లేదా అసంబద్ధంగా, అసంపూర్ణంగా జరిగి ఉండవచ్చు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థికస్థితిని ప్రస్తావించారని అంటున్నారు కాబట్టి, పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక ప్రభుత్వం అప్పులు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక డిఫాల్ట్ అయినట్టుగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదాల చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం చెప్పి ఉండే అవకాశం ఉంది. దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా అప్పులు చేయటం, ప్రభుత్వ ఆదాయంతో పొంతన లేకుండా ఖర్చులు చేయటం చేస్తున్నాయి కాబట్టి వ్యయ నియంత్రణ ఆవశ్యకతను చెప్పే క్రమంలో శ్రీలంక అప్పులను చెల్లించలేని పరిస్థితిని అధికారులు ప్రస్తావించి ఉండవచ్చు.
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగింది. అప్పట్లో ప్రభుత్వాల ఆదాయం, అవి చేస్తున్న ఖర్చులు, చేస్తున్న అప్పులు, కల్పిస్తున్న సౌకర్యాలు, పెరుగుతున్న అవసరాలు, దేశ అవసరాలకు తగినంతా పెట్టుబడులు సమకూర్చటం, ప్రభుత్వాలు అవలంబించవలసిన ఆర్థిక క్రమశిక్షణ తదితర అంశాలపై చర్చ జరిగింది. ఆ చర్చవల్ల అనేక మార్పులు జరిగాయి. కొన్ని చట్టాలు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు చేసే అప్పులపై పార్లమెంటు, శాసనసభలు, చట్టాల ద్వారా పరిమితులు విధించాలంటూ చట్టం ఏదీ చేయలేదని కాగ్ తన నివేదికలో పదే పదే పేర్కొన్నది. అప్పట్లో దీనిపై కూడా చర్చ జరిగి అటువంటి పరిమితులు విధించటానికి Fical Responsibility and Budgetary Management (FRBM) చట్టాన్ని చేశారు. ఆ చట్టాల ప్రకారం దాదాపు అన్ని రాష్ట్రాలు తమ స్థూల ఉత్పత్తి +•ణలో 25శాతానికి మించకుండా అప్పులు చేసుకోవచ్చని, సాలీనా చేసే అప్పు GSDP 3 నుంచి 5 శాతం లోపు ఉండేటట్టు శాసనాల ద్వారా పరిమితులు విధిం చాయి. అయితే అనేక కారణాలవల్ల మన దేశంలో అనేక ప్రభుత్వాలు ఈ పరిమితులను దాటి అప్పులు చేస్తున్నాయి. 2014-15 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం చేస్తున్న అప్పులు వేగం పుంజు కున్నాయి. 2013-14లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు రూ. 2.47,650 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ నుంచి సేకరించిన అప్పు రూ.1,63,570 కోట్లు మిగిలింది. LIC, NABARD, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు, చిన్న మొత్తాల పొదుపు, ప్రావిడెంట్ ఫండ్లు వంటి మార్గాల ద్వారా సేకరించుకున్నాయి. 2014-15 నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పులు సాలీనా ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తూ, అలా చేసిన అప్పులను పెట్టుబడులకు మాత్రమే కాక ఇతర అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నాయి. 2012-13 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల మొత్తం రుణభారం ప్రతి సంవత్సరం (2014-15 మినహా) రెండంకెల స్థాయిలో పెరుగుతున్నది. 2020-21లో అప్పులూ ఎక్కువగా చేయవలసి వచ్చిందంటే అర్థం చేసుకో వచ్చు. ఎందువల్లనంటే ఆ సంవత్సరం కొవిడ్ మహమ్మారి వల్ల ప్రజల ఆదాయాలు తగ్గి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అందువల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గింది. కాని ఖర్చులు మాత్రం చేయవలసి వచ్చింది. కాబట్టి అప్పులు చేయక తప్పలేదని అర్థం చేసుకోవచ్చు. కాని 2016, 2017లో కూడా రాష్ట్రాల రుణభారం 19 శాతం, 18.4 శాతం వంతున పెరిగింది.
గత సంవత్సరం అంటే మార్చి 31, 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం రూ. 61,49,126 కోట్లు. ఆ భారాన్ని మన రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (GSDP)లో పోల్చినప్పుడు 31శాతం దాటింది. GSDP అంచనాలను సవరించి మదింపు చేసినా FRBM చట్టంలో నిర్దేశించిన 25శాతం పరిమితి దాటిపోయింది. 2005-2010 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ రుణాల కంటే, కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, ఇతర మార్గాల ద్వారా తమకు కావలసిన అప్పులు ఎక్కువగా సేకరించేవి. అందువల్ల అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాల అప్పులలో మార్కెట్ అప్పుల వాటా 43.5 శాతం ఉండేది. క్రమంగా ఆ పద్ధతి మారి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులలో 2021-22 నాటికి మార్కెట్ అప్పుల వాటా 65శాతం దాటిపోయింది. ఏదైనా అప్పే! ఎక్కడ నుంచి అప్పు తెచ్చారు అనే అంశానికి ప్రాధాన్యత ఏమి ఉంది అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. LIC, NABARD లేక ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకుంటే, ముందుగానే అప్పు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. అంటే అప్పుచేసిన నిధులను ఎక్కడ ఎట్లా ఖర్చు చేయ బోతున్నారో చెప్పాలి. వాటి నుంచి అప్పులు తీసు కుంటే ఆ నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడి, వ్యయానికి మాత్రమే వాడాలి. వాటిని ముందుగా చెప్పిన వాటి మీదే పెట్టుబడి వ్యయంగా మాత్రమే వాడినట్టు వినిమయ పత్రం సమర్పించాలి.
అప్పు ఇచ్చిన సంస్థల ప్రతినిధులు వచ్చినప్పుడు కల్పించిన సదుపాయాలు చూపించాలి. అదే మార్కెట్ నుంచి నిధులను అప్పుగా సేకరిస్తే వాటిని ఎలా వినియోగించారని ఎవరికీ చెప్పనవసరంలేదు. ఇతర ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన నిబంధనలే ఈ నిధుల వినిమయానికి వర్తిస్తాయి కాని, ప్రత్యేకంగా ఎవరి అజామాయిషీ ఉండదు. అంటే మార్కెట్ నుంచి సేకరించిన అప్పుల వినిమయానికి పాలకులకి అధిక స్వేచ్ఛ ఉంటుంది, కాబట్టి ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వాటివైపే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.
మార్కెట్ నుంచి సేకరించిన అప్పులను కేవలం పెట్టుబడి వ్యయానికే ఖర్చు చేయాలన్న నిబంధన లేదు. మార్కెట్ నుంచి నిధులను అప్పులుగా సేకరించటం చాలా తేలిక. రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ రిజర్వు బ్యాంకుకు నిధుల నిమిత్తం ప్రభుత్వ బాండ్ల వేతనానికి లేఖ రాస్తే చాలు రిజర్వు బ్యాంకు ప్రభుత్వ బాండ్లను వేలం వేసి నిధులు సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలి కాలంలో మార్కెట్ నుంచి నిధులను సేకరించటం పెంచింది. 2020-21 నాటికి కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ. 1,16,97,896 కోట్లు కాగా అందులో ఇలా మార్కెట్ల ద్వారా సేకరించింది రూ. 78,59,506 కోట్లు. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ల నుంచి నిధులు సేకరించటం వల్ల పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించటం కష్టమవుతుంది. దానివల్ల వారు తమ అవసారలకు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులు సేకరించవలసివస్తుంది. దాంతో పరిశ్రమలు, వ్యాపారవర్గాల పెట్టుబడుల భారం పెరుగుతుంది. వ్యాపారవేత్తల, పారిశ్రామికవర్గాల ఖర్చులు పెరిగితే వస్తు సేవల ఖరీదు పెరుగుతుంది. వర్తమాన కాలంలో అంతర్జాతీయ మార్కెట్లు మన మార్కెట్లతో సమీకృతమయ్యాయి కాబట్టి మన వస్తు సేవల ధరలు పెరిగితే మన ఉత్పత్తుల అమ్మకాలు తగ్గి, దిగు మతులు పెరగటంతోపాటు వాణిజ్యలోటు పెరుగు తుంది. మన ఉత్పత్తులకి గిరాకీ తగ్గితే మన దేశంలో ఉపాధి అవకాశాలు, ఆశించిన మేరకు పెరగవు. పేదరికం కూడా ఆశించిన మేరకు తగ్గదు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, ఉచితాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సంక్షేమ పథకాల వల్ల రాజకీయ లబ్ది, అధికార ప్రాప్తి ఉంటుంది. కాబట్టి, పాలక వర్గాలు ఇటువంటి ప్రజాకర్షక పథకాలపై ఎక్కువ ఖర్చు చేయటం అలవాటుగా మారింది. ఇలాంటి ఖర్చులను సమర్థించటానికి అనేక సిద్ధాం తాలు, నివేదికలు తయారవ్వటంలో పాలకవర్గాలకు మరింత బలం చేకూరి, ఆర్థిక క్రమశిక్షణ విస్మరించి కేవలం ప్రజాకర్షణే ధ్యేయంగా పథకాలను ప్రవేశ పెట్టటం జరుగుతున్నది. ప్రజాకర్షక పథకాలు పెరగటంవల్ల ప్రభుత్వ ఆర్థిక వనరులపై వత్తిడి పెరుగుతున్నది. అవసరాలకు తగినంత ఆదాయాన్ని సమకూర్చుకోలేక అప్పులు చేస్తూ, అయినా అవసరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు గతంలోవలె మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడి వ్యయం చేయడానికి ఆర్థిక వనరులు లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించటం పెరిగిపోయింది.
క్రమంగా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనను ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో వాటిని వ్యాపారంగా మార్చింది. సదుపాయాల కల్పనకు బదులుగా సంక్షేమ పథకాలు ఉచితాలపై ప్రభుత్వ పాలకులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ప్రజా సంక్షేమం పేరుతో అనేక రకాల ప్రజాకర్షక పథకాలను అమలు జరపటం పెరిగిపోయింది. మన సంప్రదాయంలో దానానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. అటువంటి పనే ప్రభుత్వాలు చేస్తుంటే మెచ్చుకోవలసిందిపోయి ఆక్షేపించటం దానిపై చర్చ జరపటం ఎంతవరకు సబబనే సందేహం కలగటం సహజం. ప్రభుత్వాలు తమకు పన్నుల రూపంలో కాని, పన్నేతర రూపంలోకాని సమకూరే ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతుంటే చర్చకు సహేతుక ఆధారం ఉండదు. అయితే అలా చేయ కుండా ఆదాయంతో పొంతన లేకుండా ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తూ వాటికోసం అప్పులు చేయటం, ఇతర వ్యవస్థలను ప్రభావితంచేసి ప్రజలపై అదనపు భారం మోపడం, ఆర్థిక స్థితిని ఇబ్బందికరంగా తయారుచేయటం, ప్రభుత్వం చెల్లించవలసిన చెల్లింపులు వాయిదాలు వేయటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ అంశాలపై చర్చ జరపవలసిన ఆవశ్యకత ఏర్పడినది. అలాగే సంక్షేమ పథకాలు ఎవరికి వర్తింపచేయాలి, ఏ వర్గాలకి అందించాలి, వాటిపై పరిమితులు ఉండాలా అనే అంశంపై కూడా చర్చ జరగవలసిన అవసరం వుంది. ప్రభుత్వాలు ఇన్ని దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా దేశంలో పేదరికం ఆశించినంత మేరకు తగ్గకపోవటానికి కేవలం పథకాల అమలలో లోపం, అవినీతి మార్గాలు కారణమా లేక మన పథకాలు, ప్రోత్సాహకాలు రూపకల్పనలోనే లోపం ఉన్నదా? అలాగే మన నిర్ణయించుకొంటున్న ప్రాధాన్యతలు సరైన లేదా అదే అంశాలపై కూడా చర్చ జరగాలి. ఏటేటా ప్రభుత్వ ఆదాయాలు జరుగుతుండటం దేశంలో పెరుగుతున్న వినిమయాన్ని సూచిస్తుంది కదా.
వినిమయం పెరిగిందంటే ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు పెరిగినట్టే కదా. ద్రవ్యోల్బణం జనాభా నిఖర పెరుగుదల కంటే ఎక్కువగా ప్రభుత్వా ఆదాయం పెరగటం, అందులో పన్ను రేట్లు పెరగకుండా స్థిరంగా ఉన్న సందర్భంలో కూడా ప్రభుత్వ ఆదాయాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతున్నాయంటే ప్రజల వినిమయం పెరిగినందువల్లనే అట్టి ఆదాయాలు పెరిగాయని భావించాలి. సహేతుకంగా ఆలోచిస్తే ఆ మేరకు ప్రభుత్వాల సంక్షేమ పథకాల వ్యయం క్రమంగా తగ్గాలి కాని, దానికి భిన్నంగా ప్రభుత్వాల రెవెన్యూ వ్యయం కూడా ఆదాయానికి మించిన వేగంతో పెరుగుతున్నది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వ్యయ నియంత్రణ విషయంలో కొంత మేరకైనా కఠినంగా వ్యవహరించలేకపోతున్నదని చెప్పవచ్చు.
దేశంలో ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ లోటు గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ వ్యయం వాటికి వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే అధికంగా ఉంటే రెవెన్యూ లోటు వస్తుంది. 2006-07 నుంచి 2015-16 వరకు మూడు సంవత్సరాలు మినహా మిగిలిన అన్ని సంవత్సరాలలో దేశంలో అన్ని రాష్ట్రాల రెవెన్యూ, ఆదాయ, వ్యయాలను పరిశీలించినప్పుడు స్థూలంగా రెవెన్యూ మిగులు నమోదైనది. అంటే దశాబ్దకాలంలో 7 సంవత్సరాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రెవెన్యూ మిగులు సాధించి FABM చట్టంలో నిర్దేశించిన లక్ష్యాలను దాదాపుగా చేరుకున్నాయి. FABM చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ రెవెన్యూ ఆదాయానికి మించి వ్యయం చేయకూడదు. అలా జరిగినప్పుడు ఆ సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పును పూర్తిగా పెట్టుబడి వ్యయానికి వినియోగించినట్టు అర్థం చేసుకోవచ్చు. 2015-16 తరువాత దాదాపు అన్ని రాష్ట్రాలు వ్యయ నియంత్రణలో సడలింపు ధోరణి అవలంబించి, ఆదాయానికి మించి ఖర్చులు చేయటం, రాజకీయ లబ్ధికి ఉచిత తాయిలాలు, సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేయటంవల్ల ఖర్చు పెరిగి ఆదాయం సరిపోక రెవెన్యూ లోటు పూడ్చటానికి అప్పులు చేస్తూ FABM చట్టాన్ని నిర్లక్ష్యం చేశాయి. 2015-16లో రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3,077 కోట్ల రెవెన్యూ మిగులు సాధించగా 2018-19 రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ లోటు రూ. 35,523 కోట్లుగా నమోదైంది. అదే 2019-20 నాటికి దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత అంటే రూ.1,36,702 కోట్ల రెవెన్యూ లోటు నమోదు చేశాయి. దీనికి కొంత కొవిడ్ కారణం అయితే మరికొంత సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక పథకాలను కారణంగా చెప్పక తప్పదు. కొవిడ్ ప్రభావం అధికంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు దెబ్బ తినటంవల్ల 2019- 20లో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రెవెన్యూ లోటును నమోదుచేసి సరిపెట్టుకొనే అవకాశం లేదు. ఎందు కంటే ఆ సంవత్సరం దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో సహా 16 రాష్ట్రాలు రెవెన్యూ మిగులు సాధించాయి. మిగిలిన రాష్ట్రాలు భారీగా లోటును నమోదు చేశాయంటే దానికి కొవిడ్ కారణమని ఎలా సర్దుకుపోగలం? ఈ 16 రాష్ట్రాలు సాధించిన రెవెన్యూ మిగులును కలపకపోతే మిగిలిన రాష్ట్రాలు ఆ సంవత్సరం నమోదు చేసిన రెవెన్యూ లోటు రెండు లక్షల కోట్ల రూపాయలు మించిపోయింది. FABM చట్టం వల్ల ఆ రాష్ట్రాల నిబద్ధత తగ్గిపోతున్న వైనం ఈ లోటు సూచిస్తుంది. 2016-17 నుంచి 2019-20 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల రూపంలో, ఇతర పన్నేతర మార్గాలలో సేకరించిన ఆదాయాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కేంద్రం అందించే గ్రాంట్లు వగైరాలు కలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా కనీసం లక్ష కోట్ల రూపాయలు సమకూర్చుకుంటున్నాయి. అయినా సరే ఇంకా రెవెన్యూ వ్యయానికి అప్పులు చేసే స్థితిలో ఉన్నాయంటే వ్యయ నియంత్రణ పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాయో అర్థం చేసుకో వచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో సగటున 9శాతంవరకు వడ్డీలు కట్టవలసిన స్థితికి చేరుకున్నాయి.
మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు తమ స్వంత ఆదాయం (కేంద్రం నుంచి వచ్చే నిధులను మినహాయించి)లో 15 శాతం వరకు వడ్డీలు కట్ట టానికే ఖర్చు అవుతున్నది. అనేక రాష్ట్రాలు గత ఎనిమిది సంవత్సరాలలో అప్పు వాయిదాలు చెల్లించ టానికి కూడా అప్పులు చేస్తున్నాయి. ఇదే కాక ప్రభుత్వ పూచీకత్తుపై తమ అధీనంలోని సంస్థల చేత అప్పు చేయించి ఆ అప్పును కూడా ప్రభుత్వాలు తమ అవసరాలకు వాడుకుంటున్నాయి. ఇది చట్టాల స్ఫూర్తికి విరుద్ధం అయినా వాటిని గురించి మాట్లాడే వారు తగ్గిపోయారు. ఒక్క FABM చట్టమే కాదు, ఇతర అనేక చట్టాలను సైతం సరిగా పాటించడం లేదు. ఉదాహరణ ఏ రాష్ట్రమైనా ఏ వర్గానికైనా విద్యుత్ ఉచితంగా కాని తక్కువ ధరకు కాని పంపిణి చేయమని తమ ఆధీనంలోని విద్యుత్ సంస్థలను ఆదేశిస్తే, విద్యుత్ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యుత్ సంస్థకు ఆ మేరకు నగదు రూపంలో పరిహారం చెల్లించాలి. అలాగే విద్యుత్ సంస్థలు కనీస లాభాలు ఆర్జించే విధంగా చర్యలు తీసుకోవాలి. కాని అనేక రాష్ట్రాలు ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయటంలేదు. రైతులతో సహా అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయించి సంస్థలకు ఆ మేరకు డబ్బు పూర్తిగా చెల్లించక పోవడంవల్ల దేశంలో చాలా విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులలో కూరుకు పోయాయి. విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల వల్ల తమకు బొగ్గు తదితర ముడిసరుకు సరఫరా చేసిన సంస్థలకు సరైన సమయంలో చెల్లింపులు చేయకుండా సమస్యలను ఎదుర్కొంటు న్నాయి. ఇలా అనేక ప్రభుత్వ సంస్థలు చెల్లింపులు సకాలంలో చేయలేకపోతున్నాయి. వాటి ఆర్థిక ఇబ్బందులకు ప్రభుత్వం, వారు అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
దేశంలో ఈ ఉచిత పథకాల అమలువల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల క్రింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు సకాలంలో చెల్లించక ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘిం చాయి. చాలా రాష్ట్రాలలో ప్రభుత్వ ఖజానాలో రాబడుల కొరతవల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించ వలసిన చెల్లింపు సకాలంలో చేయలేకపోతున్నాయి. ప్రభుత్వ బకాయిలను సాధికారికంగా పద్దులలో చూపే వ్యవస్థ, పద్ధతి లేకపోవడంవల్ల దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల స్థూల బకాయిల వివరాలు లభ్యం అవ్వవు. ఇంక కొంతమంది ఔత్సాహికులు అధ్యయనం జరిపి రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించవలసిన బకాయిలు 3.5 లక్షల కోట్ల మేరకు పేరుకు పోయాయని అంచనావేశారు. రాష్ట్రాల ఆర్థిక స్థితిపై అవగాహన ఉన్నందువల్లనే ఉన్నతాధికారులు మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కట్టవలసిన అప్పుల వాయిదా చెల్లింపులు డిఫాల్ట్ అయ్యే ప్రమాదం పొంచి వుందని సుస్పష్టంగా హెచ్చరించి ఉండవచ్చు. ప్రభుత్వాలు తమ ఆర్థిక స్థితితో పొంతన లేకుండా ఇంకా ఉచితాలు ప్రకటి స్తుండటం ఆందోళనకర స్థితికి చేరుకుంది. కొన్ని పథకాలలో లబ్దిదారులకు 25 లక్షలకు మించి సబ్సిడీలు ఇచ్చే ఆవశ్యకతను పునః పరిశీలించ వలసిన అవసరం ఉంది. అప్పులు చేస్తూ, వడ్డీల భారం మోయలేక, కల్పించవలసిన సదుపాయాలు కల్పించకుండా, రాజకీయ లబ్ధి కోసం ఉచిత పథకాల ప్రకటనలపై గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది గళం విప్పుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో హైకోర్టు న్యాయమూర్తులు కూడా వీటిపై తమ వాణి వినిపించారు. ఇప్పటికైనా పాలకులు స్వార్థం కొంత మేరకైనా వీడి ఉచితాలపై సమగ్ర సమీక్ష జరిపి ఆదాయానికి మించి ఖర్చు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలి. అవసరమైతే చట్టాలు చేయాలి.